కావ్యనాయిక
- పూర్ణిమ సుధ
వింటి నుండి వీడిన శరము నారి వీనులవిందైన శ్రావ్యమగు పాట నారి రోజంత అష్ఠావధానమొనరుచు నీకమర్చును అన్నీ, నీ క్షేమమ్ము కోరి నీ అందెల సవ్వడి నీ మాటల ఒరవడి నీ గుండెల్లోని తడి ఓదార్పే నీ ఒడి... ముద్దు మురిపాల తోడ తాను నట్టింట లక్ష్మియై పరిఢవిల్లు దినదిన ప్రవర్థమానమగు శుక్ల పక్ష చంద్ర శోభ రీతి వన్నెల కుసుమమంటి కన్నె మనసు వాడిపోని ’వాడి’ చూపు వేడి దురితదమనమిక తప్పదని చాటు కలకంఠి కన్ను రువ్వు చూపు కరుణ కూడ చూపు, లలన సుమన కల్మషమెరుగని స్వాతిముత్యంలా స్వచ్చమైన స్వేచ్చా విహంగం లా అరవిరిసిన పువ్వులా పసిపాల నవ్వులా చల్లని వెన్నెల్ని తడినేల నుండి చీల్చుకు, తలపైకెత్తి చూచు చిగురులా... ఆకాశం చీల్చుకు వచ్చే చిరు వాన చినుకులా చినుకుతో సంగమించిన పుడమికి పుట్టిన వనిలా గుండె తలుపును తట్టే ఆమనిలా ఉంటుంది అమ్మతనం అలంకారమయిన అమ్మాయిలా... ఒక హిమ బిందువులా ఒక క్షీర మహి సింధువులా ఏవో లోకాలలో ధ్యానించే తపస్వినిలా మది ఎరిగి, మసలే మనస్వినిలా క్షీరసాగర మథన పాలసంద్రము నీవు పాలపుంతలు వెలయు పడతి నీవు ఇన్ని వర్ణలలేల ? ఒక్క మాటయె చాలు బాపు కుంచె ప్రసవించిన అతివ నీవు... అని కావ్యనాయకి స్థాన మినుమడింప జేయుచు కావ్య రచనమ్ము చేసె బాపుబొమ్మ..!
No comments:
Post a Comment