‘బహు’ ముఖచిత్రాలు
- భావరాజు పద్మిని
ఒక్క బొమ్మ ... వందల పేజీల కధను చెప్పకనే చెప్పేస్తుంది...
ఒక్క బొమ్మ ... క్లిష్ట అర్దాలున్న పద్యభావాల సారాన్ని సులువుగా చెప్పేస్తుంది... ఒక్క బొమ్మ... ప్రధాన పాత్రల నైజాన్ని, ఆహార్యాన్ని కళ్ళకు కట్టినట్లు చూపుతుంది... ఒక్క బొమ్మకు ‘బహు’ ముఖాలు... ‘బహు’ అర్ధాలు... ఏకం అనేకమై భాసించినట్లు... ఏ అంశాన్నైనా అలవోకగా తన గీతల్లో చెప్పేస్తానన్నట్లు... కళను కళతో సవాల్ చేస్తూ ,దర్జాగా నిలబడుతుంది... అవును మరి... ఆ బొమ్మ వేసింది బొమ్మల బ్రహ్మ బాపు గారు కనుక. అసలు వందల పేజీల కావ్యాల్ని, నవలల్ని, పుస్తకాల భావాన్ని ఒక్క బొమ్మలో ఎలా చెప్తారు బాపు గారు ? అది ఆయనకు ఎలా సాధ్యం ? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే ముందుగా మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.... బాపు పుస్తక ప్రియులు బాపుకు బొమ్మలు వేయడం, వేస్తూ సంగీతం వినడం అలవాటు. పుస్తకాలు చదవటం ఆయన దినచర్యలో భాగం. బొమ్మలు వేయడం, చదవడం, సంగీతం, సినిమాలు, వెంకట్రావ్ ఇవి బాపు పంచప్రాణాలు. బహుశా బాపు గారు చదివినన్ని పుస్తకాలు వేరెవరూ చదివి ఉండరేమో ! హిందూ శిల్పాల మీద పుస్తకాలు (బొమ్మల్లో తనకు మొదటి గురువులు శిల్పాలే అంటాడు బాపు), ఓల్డ్ మాస్టర్స్ ఆర్ట్ పుస్తకాలు, పంచ్‌వాల్యూములు, బిఎఫ్‌ఐ సినిమా గ్రంథాలు, సంగీత, సాహిత్య విమర్శనాగ్రంథాలు, రామాయణ, భాగవతాలు, ఇటువంటి పుస్తకాలన్నీ ఆయన వద్ద ఉండేవి. ఇలా రోజూ పుస్తకాలు చదివే అలవాటు ఉండడం వల్ల, బాపు గారికి ఒక పుస్తకం చదువుతుండగా చయత దృక్పధంలో కధకు మూలవస్తువు ఏమిటి అన్నది గ్రహించడం సులువు అయ్యింది. అలా ఆలోచించి, వారి రచనకు, ఊహకు మించిన బొమ్మలు వెయ్యడం సాధ్యమయ్యింది. ఆ బొమ్మను చూసి ఆశ్చర్యంతో మాట రాక కాసేపు అవాక్కవ్వని రచయత ఉండరంటే అతిశయోక్తి కాదేమో ! “ఎవరండీ ఈ బాపు ?” రావిశాస్త్రి చమక్కు తెలుగునాట పత్రికల కథలకీ సీరియల్స్‌కీ బాపు బొమ్మలు తప్పనిసరి. ‘‘ఎవరండీ ఈ బాపు? మేం పది పేజీల్లో చెప్పిందాన్ని నాలుగ్గీతల్లో చెప్పి పైగా పైసంగతి వేస్తున్నాడు’’ అని రావిశాస్త్రిలాంటివారు నిందాస్తుతి చేయడం నాటి ముచ్చట. ఇక బాపు కుంచెతో క్రొక్విల్‌తో చేసిన చమక్కులు అన్నీ ఇన్నీ కాదు. చాలా ఏళ్ల క్రితం స్క్రిప్ట్ ఆర్ట్స్ వారు పండగలకీ పబ్బాలకీ గ్రీటింగ్ కార్డులు వేసేవారు. అవన్నీ బాపు తయారు చేసినవే! ఉదాహరణకి సంక్రాంతికి ముందు ఒక సెట్ విడుదలయేది. అందులో సంక్రాంతి సంబరాలన్నీ బాపు వర్ణచిత్రాల్లో పలకరించేవి. ఇలా ప్రత్యేక పర్వాలకు పండగలకు నిజానికి నగరాలకే పరిమితమైన ఈ గ్రీటింగుల సంస్కృతి గ్రామాలకు పాకింది ఈ స్క్రిప్ట్ ఆర్ట్స్ తోనే. తర్వాత అభినందన వారివి వచ్చి అలరించాయి. ఎన్నో పత్రికలకు లోగోలు బాపు డిజైన్ చేసినవే. పుస్తకాలకు ఆయన వేసే బొమ్మలు ఎంత గొప్పగా ఉండేవంటే, విజయవాడలో ‘నవోదయ పబ్లిషర్స్’ రామ్మోహనరావు ప్రచురణలు ప్రారంభించాక, ఆ పుస్తకాల ముఖచిత్రాలన్నీ ఆయనవే. పుస్తకం బొమ్మ చూసి అద్భుతం అని కొనుక్కొని, తీరా పుస్తకం అంత గొప్పగా అనిపించక ,‘బొమ్మ బాగుంది కానీ, పుస్తకం అంత లేదండీ’ అంటే బాపు నవ్వేసేవారు. ఆయన బొమ్మల గొప్పదనం అది. బాపు 1945 నుంచి బొమ్మలు, కార్టూన్లు, తెలుగు మ్యాగజైన్లకు కవర్ డిజైన్లు వేసేవారు బాపు. సృజనాత్మకతతో వైవిధ్యభరితమైన అందమైన బొమ్మలను గీయడంలో బాపుకు ఎవరు సాటిరారు. ఎందరో రచయతలు తమ రచనలకు బాపు బొమ్మలు వెయ్యాలని ఉవ్విళ్ళూరే వారు. ఆయన పట్టుదలతో సాధనతో బాపు మొదటి స్థానాన్నే కాదు రెండూ మూడూ స్థానాల్ని కూడా సొంతం చేసుకున్నారు. దీనికి ఆయనకు తెలిసిన అడ్డదారి సదా సాధన. దాదాపు ముఫ్ఫై ఏళ్లపాటు ఏ తెలుగు పుస్తకమూ బాపు ముఖచిత్రం లేకుండా రాలేదు. బుక్‌షాప్‌కి వెళితే బాపు బొమ్మల ప్రదర్శనలా ఉండేది. బాపు బొమ్మ చూడ్డానికే కాదు అమ్మకానికి సైతం ఆకర్షణ. ఎన్ని బొమ్మలు వేసినా బాపు ఏనాడూ తన బొమ్మ అద్భుతమని చెప్పుకునేవారు కాదు. వేసిన బొమ్మ ఆయన మనసుకు తృప్తి కలిగిస్తే... ‘లకీగా బొమ్మ బాగా కుదిరింది’ అని మాత్రమే అనడం బాపు శైలి. ‘రామ’ భక్త హనుమాన్ బాపు గారికి శ్రీరాముడన్నా, ఆంజనేయుడన్నా ఎక్కడలేని భక్తి ప్రపత్తులున్నాయి. ఈ విషయం పలు సందర్భాలలో తేటతెల్లం అయ్యింది. తాను గీసిన ఒకానొక పెయింటింగ్లో కూడా శ్రీరాముడు సీతమ్మ వారికి పర్ణశాలలో ఉన్నప్పుడు కుంచెతో పారాణి దిద్దుతున్నట్లు బాపు చూపించారు. అందులోనూ.. ఆంజనేయుడి వేషంలో తాను స్వయంగా ఉన్నట్లు చూపించుకుంటూ తానే స్వయంగా రంగులను శ్రీరాముడికి అందిస్తున్నట్లుగా అందులో చిత్రీకరించారు. ‘ఆది చిత్రకారుడైన మా గురువుగారు’ అంటూ.. శ్రీరాముడిని తన గురువుగాను, ఆది చిత్రకారుడి గాను ప్రస్తావించారు. 1979 లో శ్రీవేంకటేశ్వరుడు కరుణించి, తన ఆస్థాన చిత్రకారుడిని చేశాడు. అన్నమయ్య పదాలకు బాపు బొమ్మలు... బంగారానికి తావి లాంటివి. ఉషశ్రీ “ఎవరితో ఎలా మాట్లాడాలి (రామాయణంలో హనుమంతుడు)?” అనే పుస్తకానికి, రమణ గారి మేలుకొలుపులు- మేలుపలుకులు (తిరుప్పావై) పుస్తకానికి ముఖచిత్రాలు, లోపలి బొమ్మలు అద్భుతంగా వేసారు. రమణ రాయగా బాపు సచిత్ర పరచిన ‘శ్రీకృష్ణలీలలు’ పుస్తకాన్ని బాలసుబ్రహ్మణ్యానికి అంకితం ఇచ్చారు. బాపు అద్భుతమైన చిత్రాలు కూర్చిన ‘లీలా జనార్థనమ్’ పుస్తకాన్ని బాలు భరించి ప్రచురించారు. కందుకూరి రుద్రకవి రచించిన అష్టకాలకి బాపు వర్ణచిత్రాలు చాలా అతిశయంగా ఉంటాయి. ఆయన బొమ్మ వెయ్యనని తిప్పి పంపిన పుస్తకం ఒకేఒక్కటి... తాను రాసిన ‘రామాయణ విషవృక్షం’ పుస్తకానికి కవర్ పేజీ బొమ్మ వేయాల్సిందిగా ప్రముఖ రచయిత్రి ముప్పాళ్ల రంగనాయకమ్మ బాపు గారిని కోరుతూ.. ముందస్తుగానే ఒక చెక్కు కూడా పంపించారట. అయితే, ఆ చెక్కు వెనకాల ‘రామ.. రామ’ అని రాసి బాపు గారు తిప్పి పంపారట. ఈ విషయాన్ని స్వయంగా రంగనాయకమ్మే చెప్పుకొన్నారు కూడా. ఇలా రామభక్తి విషయంలో బాపు ఎలాంటి తరుణంలోనూ వెనుకాడలేదు. ముఖ చిత్రాలు శంకరమంచి సత్యం ‘‘అమరావతి కథలు’’, అందునా బాపు బొమ్మల్ని గుర్తు చేసుకుంటారందరూ. ప్రముఖ చిత్రకారుడు సత్యం సంకరమంచితో కలిసి 101 చిత్రాలను అమరావతి కథల కోసం గీశారు. ఒక్కో కథ కోసం ఒక బొమ్మను ఆయన రూపొందించారు. ఇక బాపు గారు అందరికంటే ఎక్కువ బొమ్మలు, ముఖచిత్రాలు వేసినది సినీ దర్శకులు, రచయత వంశీ గారికే ! గోకులంలో రాధ తో మొదలు పెట్టి, ఆకుపచ్చని జ్ఞాపకం, మా పసలపూడి కధలు, గాలికొండ పురం రైల్వే గేటు, దిగువ గోదావరి కధలు, మన్యం రాణి నవల, వంశీ కి నచ్చిన కధలు వంటి అనేక పుస్తకాలకు అద్భుతమైన ముఖచిత్రాలు అందించారు బాపు. కధావస్తువు మొత్తం ఆ బొమ్మల్లో ప్రతిబింబించి, ఆ కధలు చదువరుల మనసుకు హత్తుకుపోయేవి. గిరీశం, బుడుగు, బారిష్టర్ పార్వతీశం లాంటి తెలుగు ప్రముఖులకు రూపకల్పన చేశారు బాపు. ఎమెస్కో వారు ప్రచురించిన బాపు కార్టూన్ సంకలనాలు(2 భాగాలు), కొంటె బొమ్మల బాపు, బొమ్మాబొరుసు, బాపురమణీయం, బాపు బొమ్మల కధలు, బాపు బొమ్మల రామాయణం వంటి పుస్తకాలకు బాపు బొమ్మలు, ముఖచిత్రాలు వేసారు. ఇక కోతికొమ్మచ్చి, ఇంకోతి కొమ్మచ్చి, ముక్కోతి కొమ్మచ్చి పుస్తకాలు ముళ్ళపూడి రాత – బాపు గీత కలిసి చదువరులను బాగా ఆకట్టుకున్నాయి. తన ప్రాణ స్నేహితుడైన బి.వి.ఎస్.రామారావు గారి ‘గోదావరి కధలు’ కు బాపు వేసిన బొమ్మలు, ఆయన అక్షరాలకు తోడై, ఇప్పటివరకూ ఏడు మార్లు ముద్రించబడ్డాయి. తనికెళ్ళ భరణి గారి అబ్బూరి ఘాటువులకు, శ్రీరమణ ‘మిధునం’ కధకు, బ్నిం గారి మిస్సెస్ అండర్స్టాండింగ్ వంటి పుస్తకాలు కవర్ ఫోటోలు వేసారు బాపు. ఒకటా రెండా... కాని వేసిన ప్రతీ బొమ్మా ఒక మాట్లాడే సజీవ శిల్పం ! మొత్తం ఎన్ని బొమ్మలు వేసారు ? సినిమాలలో వత్తిడిగా ఉన్నా బొమ్మలు వేయడం ఎప్పుడూ మానలేదు. బాపు బొమ్మకి షష్టిపూర్తి ఎప్పుడో జరిగిపోయింది. బాపు షష్టిపూర్తి నాటికి అందాజ్‌గా లెక్కేస్తే లక్షాయాభైవేల బొమ్మలు వేశారని తేలింది. చిన్నాపెద్దా వెరసి ఇప్పటికి రెండు లక్షలు ఉండొచ్చు. అన్ని సంవత్సరాలుగా ఇన్ని రకాల బొమ్మలు వేశారు కదా. మీకు బాగా నచ్చిన చిత్రం ఏది’’ అని అడిగితే, ఆయన స్టూడియోలో పక్కనే ఉన్న ఒక వర్ణచిత్రాన్ని చూపిస్తారు. అది దువ్వూరి వెంకట రమణశాస్త్రిగారి వాక్ చిత్రం ‘‘జానకితో జనాంతికం’’ ఖండికకు బాపు వేసిన బొమ్మ. దాదాపు పదిహేనేళ్ల క్రితం ఒక పత్రిక వారు కోరగా, ముఖచిత్రంగా వేశారు.ఒక భక్తుడు సీతమ్మ సన్నిధికి వచ్చి, ఆమెని పొగుడుతూ, రాములవారి మీద విమర్శలు మొదలు పెడుతుంటాడు. దువ్వూరి వారి అద్భుతమైన రచన. అయ్యవారి నిలువెత్తు పాదాలు, చెంతనే భక్తుని మాటలు వింటూ అమ్మవారు. దూరంగా భక్తుడు. ఇదీ దృశ్యం. కాని అమ్మవారి ముఖ కవళికలు చూడాలి నిజంగా. రాముడి భావ ప్రభావాలు మనకి కనిపిస్తాయి. బాపు బొమ్మలు, కార్టూన్‌లు దేశ, విదేశాలకు చెందిన పలు మ్యాగజైన్‌ల కవర్‌పేజీలపై దర్శనమిచ్చి పాఠకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. యుఎస్‌ఎలో తెలుగువారి కోసం అక్కడి నుంచి వెలువడుతున్న తెలుగు నాడి అనే మ్యాగజైన్ బాపు అద్భుతమైన బొమ్మలన్నింటిని ప్రచురించింది. ఆ తర్వాత ఆ మ్యాగజైన్ సలహా మండలిలో బాపు సభ్యుడిగా చేరి తెలుగు పాఠకులను దృష్టిలో పెట్టుకొని మ్యాగజైన్ వెలువడేటట్టు చేశారు. బాపు గారి చిత్రకళాప్రభావం కూడా ఇంకో వందేళ్ళు తరువాతి చిత్రకారులపై ఉంటుంది. అది పైకి తెలిసేటట్లు కనిపించకపోయినా, తరువాతి తరాల వారి బొమ్మల్లో అంతర్లీనంగా ప్రతిఫలిస్తుంది. స్వచ్చమైన గోదావరి నీళ్ళలో కుంచెను ముంచి, తెలుగు మనసుల్లోని రంగులను కలిపి, మన ఊహల కాన్వాస్ పై బాపు వేసిన పసిడి బొమ్మలు ఎప్పటికీ పదిలం. ఆ మహానుభావుడికి, యుగపురుషుడికి తెలుగు మనసుల అభివందనం, ఆనంద నీరాజనం !
No comments:
Post a Comment