చిత్ర బ్రహ్మ బాపు
- ఎం. వి.అప్పారావు(సురేఖ )
బాపుగారి గీతను చూడగానే మనకు వెంటనే ముళ్లపూడి వారు గుర్తుకొస్తారు. ముళ్లపూడివారిని రాత చదవగానే మనకు బాపుగారు గుర్తుకు వస్తారు. 1945 లో "బాల"తో ప్రారంభమయిన వారిద్దరి గీతరాతలు దినదిన ప్రవర్ధమానమై "స్నేహం" అనే మాటకు విలువను పెంచి "స్నేహమేరా జీవితం-స్నేహమేరా శాశ్వతం" అని యుగళగీతాన్ని పాడుకున్నారు. అన్నట్టు బాపురమణలు ఆ స్నేహాన్ని సినిమాగా. తీసి చూపించారు. ఓ తెలుగింటి ఆడపిల్లని ఇప్పుడు చూడగలమా ?! మీకు ఇప్పుడు మీకు తెలుగమ్మాయి ఎట్లా వుంటుందో చూడాలంటే బాపూ బొమ్మాయిని చూడాల్సిందే. నయనతారలాంటి పొదుపు దుస్తుల అమ్మాయిని సీతా మహాలక్ష్మిలా చూపించిన ఘనత బాపుగారికే సాధ్యమని నిరూపించాడాయన. నేను చేసుకున్న పూర్వజన్మ సుకృతం ఆ మహానుభావులిద్దరి పరిచయ భాగ్యం కలగటమే కాకుండా నా పై అమితమైన ప్రేమాభిమానాలు చూపించేవారు. ఐనా నా అమాయకత్వం కానీ వాళ్ల ప్రేమాభిమానాలు పొందిన నాలాటి అదృష్టవంతులు ఎందరో వున్నారు. భారతదేశంలో, కాదు కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రతిభా వంతుడైన చిత్రకారుడు బాపు ఒక్కరే! అంత ధైర్యంగా ఎట్లా చెప్పగలుగుతున్నానంటే ఓ చిత్రకారుడు ఓ కధా చిత్రకారుడు కావొచ్చు, మంచి పోట్రయిట్ గీయగలిగేవాడు కావొచ్చు, వర్ణ చిత్రకారుడు కావొచ్చు, వ్యంగ్య చిత్రకారుడు కావొచ్చు. కానీ బాపుగారిలో ఇన్ని ప్రతిభలూ కలగలసి వున్నాయి. ఆయన కధారచయిత కూడా! "మబ్బూ వానా-మల్లె వాసనా-" అనే కధను 28-08-1957లో ఆంధ్రపత్రిక వీక్లీలో లక్ష్మీనారాయణ పేరుతో వ్రాశారు. ఆ కధను మీరు ఇప్పుడు చదవాలంటే "నవ్య" వీక్లీ సెప్టెంబరు 17 సంచిక లో చూడండి. బాపు కార్టూన్లను చూసే నాకు కార్టూన్లు గీయాలనే ఆసక్తి కలిగింది. ఆయన కొన్ని బొమ్మలకు "రేఖ" అని సంతకం చేసేవారు. ఆ రేఖకు "సు" చేర్చి నేను "సురేఖ" అనే కలం పేరును తగిలించుకున్నాను. ఆయన వేసిన కార్టూనలగురించి సూక్షంగా చెప్పి ముగిస్తాను. ఆయన కార్టూన్లలో సంసార పక్షంవీ, శృంగార పక్షంవీ,దేముళ్ళవీ దేవతలవీ, ముక్కుమూసుకొని జపం చేసుకొనే మునులవీ, రాజులవీ,రాణులవీ, ఆనాటి ఈనాటి కవులవీ, చిన్నారి బుడుగులవీ, సీగాన పెసూనాంబలవీ, రాజకీయనాయకులవీ, డాక్టర్లవీ వాళ్ల పేషెంట్లవీ,కారులవీ, కళాకారులవీ ఇట్లా ఎన్నో అప్పుడూ, ఇప్పుడూ ఎప్పుడూమనల్ని నవ్విస్తూ పలకరిస్తూనే వుంటాయి. రిమోట్ నొక్కగానే మాయమైపోయే టీవీ, ఇంటిల్లిపాదీ టీవీకి అతుక్కుపోతే బుద్ధిగా క్లాసుపుస్తకాలకు అతుక్కుపోయిన చిట్టాణ్ణి చూసి బెంగపడే కుటుంబం, ఇంటికొచ్చిన "అతి" అతిధులు గంటలకొద్దీ కదలకపోతే ఒక వేళ వీళ్ళే వాళ్లింటికి వచ్చామేమో అని లేవ బోతున్న భర్తకు ఇది తమ ఇళ్ళేనని గుర్తు చేస్తున్న భార్యామణి ఇలా ఎన్నని చెప్పను, వేలాది బొమ్మలు. గుర్తుకొచ్చినప్పుడల్లా నవిస్తూనే వుంటాయి. ఆయన గీసీంది కార్టూనయినా అందులో ఓ చక్కని పకృతి దృశ్యం వుంటుందనడానికి ఈ కార్టూనే ఓ ఉదాహరణ. ఇందులో పలెటూరి అందాన్నంతా గీతల్లో చూపించారు శ్రీ బాపు. బాపు రమణులు మన మధ్యే వున్నారు. సదా నవ్విస్తూ కవ్విస్తూనే వుంటారు.
No comments:
Post a Comment