"జడల కోలాటం, కోలాహలమ్"
- నవదవన (కృష్ణకుమారి )
"గంటలు అంటే బెల్స్ (bells) కదా!? అవి మన ఇంట్లోనే ఉన్నాయా,ఏవి? ఎక్కడ? చూపించు ఆమ్మా!!" భారతరాజధాని నుండి చెల్లెళ్ళు ఇద్దరు, తమ తమ సంసారములతో వచ్చారు. వారి పిల్లలు సుషుమ్న, సభిక్, ధావళ్య, ఆజ్ఞేష్, పుడమి, కల్హార, సుత్రామ్ లు. హిందీ, ఇంగ్లీష్ లను నాలికపై రంగరించి నాకించినట్లున్నారు.జన్మదాతలు, బొత్తిగా మాతృభాషను మరిచిపోయారు. అచ్చతెలుగు పదాలను - నేర్పాల్సిన బాధ్యత - ఆమ్మ అని పిలువబడుతూన్న దొడ్డమ్మ అండ్ కో భుజస్కంధాల పైన ఉంచుకున్నారు. 'ఈ ఆర్భాటం; ఎందులకీ 'మోత బరువు బాబు!" అని వీరికి అనిపించడం లేదు. ఈ నూతన బంధు ఆగంతకుల బృందానికి బోధించేటప్పుడు- అందరికీ కొత్త వాతావరణం వినోదభరితం ఔతూన్నది. "అమ్మా! సుషుమ్న - కుంకమ్మ - అంటే ఏమిటో తెలుసా?" "ఊహు! నువ్వే చెప్పు!"" సుషుమ్న డిక్షనరీ ప్రకారం -'కుంకుమ 'అంటే 'కుంకమ్మ ' అన్న మాట." తమ పిల్లలు, ఊళ్ళోని తమ స్నేహితులతో కలిసి, 'ఈ ఢిల్లీవాసులను ఎగతాళి చేస్తున్నారు ' అని ఆమ్మకు అర్ధమైంది. "తప్పు!- అట్లాగ హేళన చేయొచ్చునా!?" కోప్పడింది. "అబ్బే! మేమేమీ ఎగతాళి చేయట్లేదమ్మా! ఊరికనే ఆట పట్టిస్తున్నాము, అంతే!" సుషుమ్న బృందాన్ని చనువుగా పిలుస్తూ, తమబృందం లోకి చేర్చేసుకున్నారు. వాళ్ళందరూ తాము ఎరిగిన క్రీడలు, కోతీకొమ్మచ్చి, నేలబండ, గిల్లీదండ, కప్పగంతులు, లాంటి ఆటల్ని కాపిటల్ బిడ్డలకు నేర్పారు. అదే స్పీడుతో క్రికెట్ట్, హాకీ, ఫుట్ బాల్ వంటి క్రీడల్ని నేర్చుకున్నారు. ++++++++++++++++++++ "పెన్నాన్నా!" పిల్లల పిలుపు, వాళ్ళ సంబోధనలో - పెదనాన్న- కాస్తా - పెన్నాన్నగా పరిణామం చెందింది.ట్రంకుపెట్టెను గాలిస్తున్నారు. బొత్తిగా భయమనే ఊసే లేదు కదా! అటకమీదినుండి అంత పెద్ద పెట్టెని దించేసారు. ఈ వానరమూకకే అది సుసాధ్యమైంది. "దేవుళ్ళాడుతున్నారు?" మొదటి వాస్కోడిగామా క్వశ్చన్ "ఇదేంటి పెన్నాన్నా! ఇందులో ఉన్నవాళ్ళెవరు?" "అసలు ఇదేంటి?" "ఆ మాత్రం తెలీదా? దాన్ని ఫొటో అంటారు, మొహమా!" పెద్దవాళ్ళు బూతుల్ని నిషేధించినారు, కాబట్టి కొత్తరకం "విసంబోధనల"ను- సుత్తివీరభద్రరావు టైపులో కనిపెట్టేస్తున్నారు పిల్లకాయలు. ద్వితీయ వాస్కోడగామా కెలుకుడు ప్రశ్నార్ధకముతో పెన్నాన్న వాళ్ళ చేతుల్లోని దీర్ఘచతురశ్రముగా ఉన్న శాల్తీని తన హస్తకమలములలోకి తీసుకున్నాడు. అప్పటికే భర్త వెనకాల వచ్చి నిలబడి ఉన్నది ఆమ్మ. "ఓర్నీ ఇల్లు బంగారం అగును! ఇది నా భామామణి వేషం!" గతకాలపు తీపి జ్ఞాపకములలో మునకలు వేస్తూన్న పతిదేవుని చూస్తూన్న ఆమ్మ బుగ్గలు కెంపులైనవి. "అప్పటికి పదారేళ్ళే, అంటే మీ అంత వయసునాటి ఫొటో అది!" "మరీ నల్లగా మరకలు మరకలుగా ఉంది. "ఇప్పుడు కదా కలర్ ఫొటోలు, ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్ వే, ఒక్క ఫొటో తీయించుకోడం కూడా ఘనం. చుక్కలు కనబడేవి అందరికీ." "ఈ ఆడపిల్ల ఎవరు?" "అది నేనే!" ఈ మారు పెన్నాన్న సిగ్గులమొగ్గ అవుతూంటే అందరి నవ్వులతో ఇల్లు మార్మ్రోగింది "హ్హ హ్హ హ్హ." ++++++++++++++++++++ 12 ఏళ్ళ నాటికే నాటకములలో వేషాలు వెయ్యాలని బుద్ధి పుట్టింది పురుషోత్తానికి, అదే పెదనాన్న అన్న మాట. రంగమెక్కి ఆడాలని అనిపించగానే డ్రామా కంపెనీల చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగాడు. ఓ రోజు సత్యభామ పాత్రధారుడు రాకపోయే సరికి మన లేత దిగ్గజం పురుషోత్తానికి అవకాశం వచ్చింది. పూసగుచ్చినట్లు భార్యాభర్తలు వంతులవారీగా అలనాటి సంగతులను వివరిస్తూ చెప్పారు. "పెద్దనాన్న అప్పట్లో బుల్లినాన్న అన్న మాట!" బృందంలోని అల్లరి బుడుగు గొప్ప విజ్ఞానం పూల గొడుగును అందరికీ ఎత్తి పట్టుకున్న విరించిలాగా చిరునవ్వుల్ని చిందిస్తూ చెప్పాడు. "ఔనురా! అప్పుడు మా నాన్న నాలాగే తాళ్ళు, బొందులూ ఉన్న నిక్కరునే వేసుకునేవాడు." పేద్ద అర్ధమైనట్లు తక్కిన వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఒప్పకోలు - ఓటును వేసేసారు. "అట్లాగ మీ మానాన మీరు చెప్పుకుంటూ పోతే పెదనాన్న ఇంకేమీ చెప్పరు, అంతే!" అన్నం పెళ్ళల్ని పెద్దబేసినులో వేసి, కమ్మసున్ని, పెసరపచ్చడిలను కలిపింది ఆమ్మ. వేడి వేడి అన్నం మీద ఆవునెయ్యి వేయగానే ఆవిరులతో ఘుమఘుమలు మిళాయించి, అందరి ముక్కుపుటాలు అటు వైపు పరుగులు తీసేలా చేసినవి. పెన్నాన్న, చిన్నాన్నలు, మామయ్యలు, కొసాకి తాతయ్యకూడా 'తాము పెద్దోళ్ళ్మని మర్చిపోయారు కామోసు, బేసిన్ చుట్టూ చేరిన పిల్లల బంతిలోకి చేరారు. "హన్నా! ఈ పెద్దోళ్ళు మనకు అస్సలు అర్ధం కారు." కించిత్తు సందేహం రంగరించిన విసుగును ప్రదర్శించాడు ఓ గడుగ్గాయి. ++++++++++++++++++++ బేసిను పంక్తి భోజనాల దగ్గర చెప్పిన పెన్నాన్న వాక్కుల టీకా, టిప్పణీ - తిప్పుడు తిరుగుళ్ళ తిప్పలు ఇవిగో! అవధరించండి చదువరులారా! "అప్పటి కాలంలో......." "అంటే బి. సి. నాటి రోజుల్లో నన్నమాట." "ష్! గప్ చుప్ గా ఉంటారా, లేకపోతే ఇప్పటికిప్పుడు నా కథకి ఏకంగా ఫుల్ స్టాప్ పెట్టేస్తాను" "వద్దు! వద్దు! మేం బుద్ధిగా కూర్చుని వింటాం" బాలబాలికలు ఆ విధంబుగా చేతులు కట్టుకును కూర్చొనగా ఆనక ఈ కొనసాగింపు ఈ రీతిగా జరిగెను: "అప్పట్లో డ్రామాలాటలంటే అందరికీ చిన్నచూపు......" "చిన్నచూపు - అంటే 'మెల్లకళ్ళు, మెల్లగా చూట్టం ' అనా?" ఈ సారి సాఫ్టు బాయ్ జాగ్రత్తగా తన పక్కన ఉన్న 'పుడమి ' చెవిలో గుసగుసలను వెళ్ళ కక్కాడు."ముఖానికి రంగులు పులుముకుని తైతక్కలాడ్తే అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఝాడించేస్తారు ఎవరైనా గానీ." నానమ్మ జనాంతికంగా - అందరికీ వినబడేలాగానే గట్టిగా అనేసింది మూడు పొళ్ళ ముక్కుపుడకను మిలమిలా మెరిసేలా సవరించుకుంటూ, మూతీ ముక్కూ విరుచుకుంటూ.కిసుక్కున కొందరు నవ్వారు. పెన్నాన్నపురుషోత్తమమ్ వాక్ ప్రవాహం వర్షఋతువులో పెన్నానది ప్రవాహానికి మల్లే బిరబిరా సాగిపోయింది. "నాకేమో వేదికపైన పద్యాలు ఆలపించాలని ఆశ. రహస్యంగా నా ప్రయత్నాలు నేను చేసాను. సత్యభామ వేషధారుడు డుమ్మా కొట్టాడు. అనుకోకుండా నాకు ఆ సువర్ణావకాశం దక్కింది. ......... ఆడవాళ్ళు ఇంటిగడప దాటితే పెద్ద నేరంగా పరిగణిస్తూండే వాళ్ళు." "థాంక్స్ గాడ్! మనం ఆ రోజుల్లో పుట్ట లేదు!" "ముందుగా సూత్రధారులు తెర పట్టుకునేళ్ళు. భామామణి తెర వెనక నిలబడాలి, ఆమె జడను మాత్రం ఈ తెఱ మీదుగా ఈవలికి వేసిఉంచుతారు. సత్యభామామణిగారి జడను తనివితీరా వర్ణిస్తారు. ఆ తర్వాత తెర తీయగా, వయ్యారంగా వస్తుంది శ్రీక్రిష్ణుని ముద్దుల భార్య సత్యాదేవి. ఇదిగో ఆ జడకి అంత ప్రాధాన్యాన్ని ఇచ్చారు. ఆ నాటి ప్రజలు. ++++++++++++++++++++ వలయంగా కూర్చున్న అందరి మధ్య, పాత్రలోని అన్నం కువలయ పుష్పాన్ని గుర్తుచేస్తున్నది..ఇన్నాళ్టికి ఇంత మంచి అవకాశం దొరికింది, పెదనాన్నకి. ఇక బాల్యస్మృతులనీ, సాంప్రదాయపు తీగన పూసిన పారిజాత, కల్పతరువు ప్రసూనాల పుప్పొళ్ళు ఆయన నుడువులలో వెదజల్లారు. చిన్నపిల్లాడిలా గడ్డపెరుగన్నం గుజ్జును జుర్రుకుంటూ "బ్రేవ్!" త్రేనుస్తూ, అంత పెద్ద పెదనాన్న, "భుక్తాయాసంగా ఉన్నది. చెయ్యి కడుక్కోవడానికి నీళ్ళు పెట్టండి." పురుషోత్తమ్ అన్నాడు. "అబ్బ! ఆశ దోశ వడ అప్పడం, ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి, తెల్సిందా," నిన్నెప్పుడో చెప్పిన తాతయ్య పాఠాన్ని ఆయనగారి కొడుకు, వురఫ్ పెదనాన్నకి అప్పజెప్పనేచెప్పాడు ఇంకో సిసింద్రీ. "ఆ కృత్రిమ జడ బోలెడు బావుంది." "బావ - కాదు, బాగా - 'గ , గా' అని చెప్పాలి." మూగమనసులు సినిమాలో నాగేసర్రావు మాదిరిగా కల్హార ఉచ్ఛారణని సరిదిద్దాడు బుజ్జి. అప్పటికే వచ్చి చేరిన ఇరుగు - పొరుగు వారితో బహు కోలాహలం గా మారిపోయింది వాతావరణం. పై నుండి కింద దాకా క్రమక్రమంగా వివరించారు. 'నల్లని పట్టు దారాలను తెచ్చి మేము చేసాము. మామూలుగా మీ పిన్ని, అమ్మమ్మ, స్త్రీలు మూడు పాయలు అల్లుకుంటారు కదా! కానీ నాలో నేనే ఆలోచించుకుని, ఐదు పాయలుగా ఈ కృత్రిమ జుత్తును అల్లాను. అందుకు ఒక కారణం ఉంది .......... " సస్పెన్సు కోసమని మాటల్ని ఆపి చుట్టూతా చూసాడు. "ఎందుకని? ఎందుకనీ?" "జడ వెడల్పుగా ఉంటే పూలజడ కుదురుతుంది. వీటిని తిలకించండి!" "ఆ! సమోసా పొట్లాల్లా ఉన్నాయి." "వెండిరేకులతో మొగలిరేకులనీ, బంతీ, చేమంతీ, పారిజాతం పువ్వులనీ నేనే దగ్గర ఉండి చేయించాను." గర్వంగా కాలరు ఎగరేసాడు. "అంతా బడాయి! ఈయనకేమీ తెలీదు. ఆ కంసాలి ఈశ్వరయ్య చేతి పనితనం." "మగాళ్ళ గాలి తుస్సున తీసేయడంలో ఈ వనితారత్నాలు ప్రజ్ఞాధురీణలు సుమీ!" అన్నాడు మామయ్య, వంత పాడారు తాతయ్యలు. "బంగారం పూత వెలిసిపోయింది గానీ, ఈ భామజడ ధగధగలు కళ్ళు జిగేల్ మనిపిస్తాయి." ఆమ్మ దాన్ని తన చేతుల్లోకి తీసుకుని అన్నది "దీనికి మెరుగులు పెట్టిస్తాను. మళ్ళీ వచ్చేవారానికి మీరు వేషం కడుదురుగాని! అప్పటిదాకా మీరు రిహార్సలు చేయండి, డైలాగుల్నీ, పద్యాల రాగవరుసల్నీ అన్నిట్నీ గుర్తూకు తెచ్చుకోండి." అంటూ హాండ్ బాగులో వేసుకుని, బైటికి ఉరికింది. "నేనా? ఇప్పుడా? ఈ వయసులోనా?" బెంబేలెత్తుతూన్న పురుషోత్తమరావుని "గుర్తుకు తెచ్చుకోండి ప్లీజ్ ప్లీజ్!" అంటూ పారాహుషార్ చేయసాగారు యావన్మందీ. "మరే! 'మంది మాట' వినక తప్పుతుందా?" అన్నారు ఆయన యొక్క పెద్దవాళ్ళు ఇజీక్వల్టు తాతయ్యలు, బహు ఈజీగా. ++++++++++++++++++ మరుసటి వారం విజయదశమి. "జడ కోలాటం పోటీల ఆటలు". దొడ్డమ్మ తెచ్చిన జడకుచ్చులు తళతళా మెరుస్తున్నాయి.ఇదీ అదీ అనే భేదం లేకుడా, పిన్నలూ పెద్దలూ అన్ని రకాల పోటీల్లోనూ పాల్గొన్నారు. రంగోలీలో ప్రైజు వచ్చింది, ప్రద్యుమ్న కుమారికి. కర్రముగ్గులు, పందిరి ముగ్గులలో నాన్నమ్మ, అమ్మమ్మలకు కన్సొలేషన్ ప్రైజులు వచ్చాయి. "ఏదో నడుం నొప్పులు, మోకాళ్ళ నొప్పుల మూలాన్న సరిగ్గా వంగలేకపోయాం. లేకుంటే మొదటి బహుమతి మాకే వచ్చేది, తెలుసునా?" కొంచెం గీరతనం వాళ్ళ నేత్రాలలో నుండి తొణికిసలాడుతూ జారి ముక్కపుడకలు, బేసరి మెరుపులీనాయి. "గంటలు కాని గంటలు అంటే ఏమిటి?" "జడగంటలు, అట్లాగే కుచ్చులు కాని కుచ్చులు- అంటే జడకుచ్చులు, మాష్టారుగారూ!" అంటూ సుత్రామ్ చటుక్కున పొడుపుకథలను విప్పి, ఫస్టుప్రైజుల్ని గెలిచి "జే జేలు" హర్షధ్వానాలతో గంతులేస్తూ, దసరా సరదాలకు సరైన నిర్వచనములై నిలిచినారు. మర్నాటి స్థానిక పేపర్లలో పురుషోత్తమ్ జడ కోపుకోలాటం ప్రత్యేక విశేషం ఐంది, పెద్దమ్మ కొత్త నోమునొకదాన్ని తానే సృష్టించింది, పేరంటాళ్ళు అందరికీ, వారి ఫ్యామిలీలకీ పేపరులో ప్రచురించిన తమ ఫొటోల్ని చూపించింది.
No comments:
Post a Comment