// కలల గోదారి..//
- రచన : కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
ఏయ్.. ఏంటా చూపు....ఈరోజే ఇంత లేటైందనా..?
ఏం ఫస్ట్ నైట్ అయితే.. నాకేంటీ.. పెళ్ళైతే పార్టీ చేసుకుంటారని తెల్దా..!
ఏంటా లుక్కేంటి.. తాగితే తప్పేంటి.. ఆ..!
నువ్వీరోజొచ్చావ్ నాజీవితంలోకి . మందెప్పుడో.. ముందే వస్సింది తెల్సా.. రాజీ..!
మంచంపట్టుకోబోయి తూలి పడబోయిన భర్త సుందరాన్ని పట్టుకోబోయింది రాజీ..!
ఏయ్.. నేను స్టడీ.. నువ్వెక్స్పోజింగ్ చేసేత్తే.. మేం పడిపోతామనుకున్నావా..! షంషేర్..! అంటూ సుందరం పెడుతున్న కేకలకి భయం .. అందోళన.. అసహ్యం కలబోసిన చూపులతో బుక్కుబిక్కుమంటోంది.. రండి ..క్రిందెందుకు మంచం పై పడుకోండి.. నేను క్రింద పడుకుంటాలే..!అంటూ బ్రతిమాలుతున్న రాజీని ఒక్కవిసురు విసిరి తాను క్రిందపడి నిద్రోయాడు సుందరం.. రాజీకి కంటి నీటి సుళ్ళుతిరుగుతున్నాయి..
మూడురోజుల క్రితమే పెళ్ళైంది రాజీకి సుందరంకి.. చల్లని గోదారమ్మపై నుంచి తరలే పిల్లగాలిలా చంగు చంగు మంటూ తిరుగుతూ, అందరితో గలగల మాట్లాడే రాజీ అంటే ఆ ఊరందరికీ అత్యంత అభిమానం.. ఎక్కడో శ్రీకాకుళంజిల్లా లోని మారుమూల పల్లె రాజీది.. కానీ చదువంతా శ్రీకాకుళం, హైద్రాబాదులలో సాగింది.. బిటెక్ పూర్తయిన రాజీ కి చిన్నప్పటి నుండి గోవా, పూనా లాంటి ప్రాంతాలలో నివసించాలని కలలు కనేది.. ఆ కలలరాకుమారుడు రానే వచ్చాడు.. గోవాలో వికె కంప్యూటర్ సొల్యూషన్స్ అనే కంపెనీ చైర్మన్. అంతటి గొప్ప సంబంధం కావడం, తాను కలగన్న గోవా అవ్వడంతో తండ్రి దూరభారం వద్దంటున్నా... ఆ సంబంధమే ఓకే చేయించింది. తన అక్కలంతా ఎక్కడెక్కడో ఉంటే తాను మాత్రం ఏం తక్కువ తిన్నానా అని రాజీ పంతం.
అందుకే అంతదూరంలో వరుడున్నా , డబ్బున్న మారాజు అని పెళ్ళికి సిద్ధమైంది.. పెద్దలు ఎంచక్క బలమైన ముహూర్తం పేరుతో సిద్దాంతుల వద్ద రాద్దాంతాలు.. జ్యోతిష్యుల దగ్గర చక్రాలు.. వేయించి.. వేగించి .. మొత్తం మీద గట్టి బలమైన, ఘనమైన..ధృడమైన ఓ ముహూర్తాన్ని పెట్టారు. ఉదయం 8.10 నిమిషాలకి.. పురోహితుడొచ్చాడు.. పెళ్ళికొడుకు మండపానికి రాలేదు.. వరపూజన్నారు.. వరుడు లేడు.. గౌరీపూజ పూర్తయ్యింది.. సుందరుడులేడు.. ఏంచేయాలో ఎవ్వరికీ అంతుపటటం లేదు.. పెళ్ళికొడుకు తండ్రిని, పెళ్ళికూతురు తండ్రి సైగలతో అడిగాడు.. అప్పటిదాకా పెళ్ళికొడుకు గురించి గుసగుసలు కాస్తా బహిర్గతమైయ్యాయి.. ఎక్కడికెళ్లాడు..?? పీటలదాకా వచ్చిన పెళ్ళి ఏమౌతుందోనని అందరికళ్ళలో టెన్షన్,.. కళ్ళల్లో భయం.. పెళ్ళికుమార్తె రాజీకి ఇవేమీ తెలియకుండా జాగ్రత్త పడ్డా, "అత్త మామ రాలేదే " అని ఓచిన్నది చెవిలో విషయం ఊదెళ్ళింది.. దీంతో ఆమె కళ్ళల్లో కన్నీరు..
ఎక్కడికెళ్లాడు.. రాత్రే పెళ్ళివారితో వచ్చిన పెళ్ళికొడుకు పొద్దుటికల్ల ఏమయ్యాడో అర్ధం కాలేదు.. అప్పటికే అక్కడ వీడియో తీస్తున్న కుర్రాడికి పెళ్ళివారి మూగ భాష అర్ధమైంది. వెంటనే పెళ్ళికూతురు తండ్రి దగ్గరకెళ్ళి "అయ్యా రాత్రి పెళ్ళివాళ్ళు వచ్చాక వీడియో కవర్ జేసి పడుకున్నా.. ! మధ్య రాత్రి పెళ్ళికొడుకు ఫ్రెండ్స్ వచ్చి తీసుకెళ్లరయ్యా.. పెళ్ళికొడుకుని" అని చెప్పాడు.. అప్పటిదాకా ఏమయ్యాడో అర్ధం కాని పెళ్ళికొడుకు ఎక్కడో ఒక చోట అదీ ఫ్రెండ్స్ తో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న రాజీ తండ్రి సూర్యం కాస్త కుదుటపడ్డాడు.. ఇంతకీ ఎక్కడికెళ్ళరో ఏమైనా తెలుసా..? అడిగాడు సూర్యం..
తెలీదండి.. నేను నిద్రమత్తులో ఉన్నా మొత్తం మీద ఏదో లాడ్జి అన్నారు.. అని చెప్పాడు ఆ కుర్రాడు.. పెళ్ళి వారు ధనవంతులు కావడంతో కష్టమైనా విశాఖపట్నంలో ఆఖరి కూతురి పెళ్ళి తంతు జరిపించేందుకు సిద్దపడ్డాడు సూర్యం. వెంటనే సూర్యం మగపెళ్ళివారికి బుక్ చేసిన లాడ్జీ కి ఫోన్ చేశారు.. "ఏమో సార్ రాత్రి వచ్చినవాళ్ళు కొద్దిసేపటికే బయటికెళ్ళారు.. ఇంతవరకూరాలేదు".. అని సెలవిచ్చారు ఆ హోటల్ వాళ్ళు. దీంతో మళ్ళీ కథ మొదటికొచ్చింది.. ఒక వైపు ముహూర్త సమయం దగ్గరపడుతోంది.. చివరికి ఊరి చివర తాగి పడిపోయిన బ్యాచ్ ని గుర్తించి.. అందులో పెళ్ళికొడుకు సుందరాన్ని పెళ్ళిమండపానికి పెళ్ళిబట్టల్లో తెచ్చాడు సుందరం తండ్రి మేజర్ కాంత్. పెళ్ళికొడుకు నోటీలో వాసన రాకుండా కర్పూర తాంబూలం వేసి.. రెండు స్ప్రే బాటిల్లు దట్టించి కొట్టి తెచ్చి కూర్చో బెట్టారు పెళ్లి పీటలమీద.. కానీ ఎర్రజీర కళ్ళు మాత్రం అతని స్థితిని ఇట్టే పట్టిస్తున్నాయ్.
ముక్కుమూసుకున్న పురోహితుడు మంత్రం చదువుచుండగా.. ఎండిన కళ్ళలోంచి భర్త కాబోతున్న సుందరాన్ని చూసింది.. తూలుతూ జిలకర్రా బెల్లం పెట్టి.. మూతి తుడుచుకుంటున్న సుందరం పరిస్థితికి ఉసూరుమంది రాజీ.. తడబడుతూ మూడు ముళ్ళు వేస్తుండగా,..." తాళి బొట్టూ పట్టుకోమ్మా" అని పురోహితుడు చెప్పినా... అన్యమస్తకంగా ఉన్న రాజీ తాళిని పట్టుకోవడం మరచిపోయింది.. అంతలో సుందరం తాళి బిగించేసేడు.. ఊపిరాడక గింజుకున్న రాజీ ని పురోహితుడు గమనించి సర్ధి చెప్పడంతో సమస్యలాగా కనిపించకుండా పెళ్ళి జరిగిపోయింది.. పెళ్ళిసమయంలో జరిగిన సందర్భం గుర్తురావటంతో కన్నీటి పర్యంతం అయ్యింది రాజీ..!
పెళ్ళిలో జరిగిన దానికి తనకు తాను సర్ధి చెప్పుకుంది.. "ఈ రోజుల్లో ఎవరు తాగరు.. అందరూ తాగేవాళ్లే పెద్దింటి కుటుంబం.. ఆమాత్రం చిన్న చిన్న అలవాట్లు ఉంటుంటాయ్ లే.." అని అనుకుంది.. ఆఫీస్ ఉంది కనుక వెంటనే వెళ్ళిపోవాలనడంతో నేరుగా సుందరంతో ఏడడుగులు వేసింది రాజీ గోవా వైపు. గోవా లో కారులో వెళ్తూ చూసి నంతసేపు కూడా నిలువలేదు ఆ ఆనందం.. ఇంట్లో ఉదయాన్నే వదిలి వెళ్ళిన సుందరం మరలా రాత్రికి వచ్చాడు.. వస్తూనే తూలిపడిపోయాడు.. రాజీ ఏమన్న తిన్నదో, లేదో కూడా పట్టించుకున్న పాపాన పోలేదు సుందరం..
రోజులు గడుస్తున్నాయ్.. సుందరం , రాజీలకు పండంటి బాబు పుట్టాడు.. గర్భవతిగా వున్న రాజీ పుట్టింటికి వెళ్ళి తిరిగి బిడ్డతో గోవా వచ్చింది.. వచ్చిన దగ్గర నుండి.. సుందరం ఎక్కువగా రాజీ తో మాట్లాడటం లేదు.. అంతా మెయిడ్ టర్కీ ని మాత్రమే ప్రతి పనికి పురమాయిస్తున్నాడు..ఆఖరికి బాత్రూంలో టవలు.. సోప్ కుడా మెయిడ్ నే అడుగుతున్నాడు. కొద్దిరోజులకి దగ్గరలోని వేణుగోపాలస్వామి దేవాలయంకి వెళ్ళి పూజచేయించుకుని తిరిగి వచ్చేసరికి.. బెడ్రూంలో చూడకూడని స్థితిలో మెయిడ్ ని, మొగుడ్ని ని చూసింది.. రాజీ... !
తన్నుకొస్తున్న కన్నీటిని కొంగులో పిండుతూ.. ఏడుస్తున్న బాబుకు చనుబాలందించి.. వారగా తీసున్న బెడ్రూం తలుపు వేసి.. వేరే గదిలోకి వెళ్ళింది .. కొద్దిసేపటి తర్వాత.. " ఏరా! చిట్టీ అప్పుడే వచ్చేశావా, గుడి నుంచి కమాన్ డాళింగ్.. త్వరగా బిఎఫ్ (బ్రేక్ ఫాస్ట్) రెడీ చెయ్.". అని రాజీ ని పలకరించి, " టర్కీ.. బాత్రూంలో టవల్ పెట్టూ.. " అంటూ రాజీని విసురుగా నెట్టి బాత్రూంలోకి వెళ్లాడు సుందరం వెనుకనే అతడిని అనుసరించింది టర్కీ..! మంచి మూడ్ లో ఉన్నప్పుడు చిటీ అని రాజీని ముద్దుగా పిలుస్తుంటాడు సుందరం. రాజీ పేరుపెట్టుకున్నంత మాత్రాన ఇంత జరుగుతున్నా. చూస్తూ రాజీ పడటానికి తన మనసు అంగీకరించలేదు.. ఆఫీసు కు సుందరం బయలుదేరడంతోనే మెయిడ్ టర్కీకి బుద్ధి చెప్పడానికి సిద్దమైంది.. అనుకున్నదే తడువు బయటికి వెళ్తున్న మెయిడ్ టర్కీని జబ్బ పట్టుకుని లోపలికి లాగింది.. టివి వాల్యూం పెంచింది..
రాత్రి తూలుతూ వచ్చిన సుందరం.. వస్తూనే.. "టర్కీ ఎక్కడ.. అప్పుడే ఇంటికెళ్ళిందా.". అనుకుంటూ నేరుగా తన గదిలోకి వెళ్ళి బెడ్ పై అడ్డంగా పడిపోయాడు. వెంటనే పిల్లాడిని ఉయ్యాలలో వేసి సుందరం కాళ్లకున్న షూ విప్పి.. టై తీసి .. కాస్త గాలి వచ్చేలా గుండీలు తీసి.. తలుపు వేసి కొడుకు దగ్గరకు వెళ్ళింది.. రాజీ.
"ఉద్యోగం చేస్తానంటే నీకేం ఖర్మ అని అంత చదువుకున్న తనను వంటింటి కుందేలు చేశాడు .. ఎంటెక్ చేస్తానంటే.. అదేంకుదరదు.. పిల్లడిని ఎవరు చూసుకుంటా"రంటూ అడ్డంకొట్టడంతో కోర్కెల పేకలు ఒక్కొక్కటిగాకూలిపోయాయ్ రాజీకి.. కానీ తన తల్లిదండ్రులకి ఇక్కడి విషయాలు తెలిస్తే.. తట్టుకోలేరని అన్నీంటినీ తన మనసులోనే పెట్టుకుని కాస్త తెలివిగా.. కాస్త తెలివి తక్కువగా జీవితంతో రాజీ పడిన, రాజీ నిత్యం మానసిన క్షోభకు గురైంది.. దిగులు, సిజేరియన్, జీన్స్ అన్నీ కలిపి అలా,అల చాలా లావెక్కింది రాజీ. అది కూడా ఒక నేరంలా రోజూ "బండదానా " అంటూ అసహ్యించుకునేవాడు సుందరం.స్లిం ఫిగరని చేసుకుంటే .. బానలా తయారైందని అందరితో చెప్తుండేవాడు.. ఆ మాటలు చెవిన పడ్డప్పుడల్లా.. రాజీకి ఆత్మహత్య చేసుకోవాలన్నంత కసి పుట్టేది.. కానీ కన్న బిడ్డ గుర్తొచ్చి ఆ ప్రయత్నాన్ని విరమిస్తూ వచ్చేది రాజీ.. అలా పదిసార్లకు పైగా జరిగింది..
అయినా మొండిగా జీవితాన్ని కొడుకు కోసం నెట్టుకొస్తోంది. పిల్లాడు ఇంజనీరింగ్ కు వచ్చాడు.. ఇంట్లో పరిస్థితులు చూస్తూ పెరగడం వల్ల రాజీ కొడుకు సుఖ్ దేవ్ కి చదువంతగా అబ్బలేదు. ఏదో చదవాలి కాబట్టి చదువుతుంటాడంతే.. ! కేవలం నాన్న మీద కసి పెంచుకున్నాడే కానీ, చదువును, ప్రేమను పెంచుకోలేకపోయాడు.. వాడికి రాజీ అంటే ప్రాణం.. కేవలం సుందరం అంటేనే మండి పోతుంటుంది .. అనుకోకుండా కాలేజీలో చెడు స్నేహాలు అలవాటయ్యాయి.. వారితో కలిసి కాలేజ్ ఎగ్గొట్టి బలాదూర్ తిరుగుతూ బార్లకి అలవాటయ్యడు రాజీ కొడుకు సూఖ్ దేవ్. ఒకరోజు రాజీ షాక్ తినింది.. తలుపు దబదబ బాదుతుంటే సుందరం ఫుల్ గా తాగొచ్చుంటాడని తలుపు తీసిన రాజీ గుండెలదిరి పోయాయ్..
తప్పతాగిన సుఖ్ దేవ్ ని అతని ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఇంటి ముందు వదిలి, తలుపు తీయగానే పరారైయ్యరు. ఎవరికోసం బ్రతుకుతుందో.. ఆ కొడుకే ఇలా.. తాను ఏ విధంగా చూడకుడదనుకుందో అదే పరిస్థితుల్లో కనిపించేసరికి రాజీ గొంతు మూగవోయింది. మనసు వెక్కి వెక్కి ఏడుస్తోంది.. ఏవిట్రా ఇది. నిన్ను ఇలా చూస్తాననుకోలేదు.. " ఎందుకు పట్టిందిరా నీకీ పిచ్చి..! మీ నాన్ననే భరించలేక ఛస్తుంటే, నువ్వేంటిరా ఇలా..! ఒళ్ళు బలిసిందా..! అని గర్జించింది. మాట్లాడుతుండగానే ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకుంది రాజీకి .
" యేయ్.. నన్నేమన్న అన్నావంటే నీ ఇష్టం.. నీ మొగుడ్ని ఆపమని చెప్పలేని నువ్వు నన్ను తాగొద్దంటావా.. !" అంటూ ఇంకా ఏదో బూతులు తిడుతూ క్రింద పడిపోయాడు.. కోపం రగిలి పోతోంది రాజీకి కన్న కొడుకుని ఇంత హీనస్థితిలో చూస్తానని ఊహించని రాజీ అస్సలు జీర్ణించుకోలేక పోతోంది.. అంతలో తలుపు చప్పుడు.." ఏయ్ రాజీ .. ఇంత సేపేంతే.. ఎవడితో.. ఏయ్.. తలుపుతీయ్.. నిన్నేనే.. నీ అంతు సూడాల్సిందే ఈ వేల.. తీయ్ తలుపు" తప్పతాగి వచ్చి తలుపు దబదబ బాదేస్తున్నాడు సుందరం... అంతలో అందుబాటులో ఉన్న అప్పడాల కర్ర తీసుకున్న రాజీ సర్రున తలుపు తీసింది.. 'చేతిలో అప్పడాల కర్రతో అపర కాళిలా' రాజీ ని మొదటి సారి చూసిన సుందరం.. ఒక్కసారిగా ఒణికి పోయాడు.. తాగిన మత్తంతా దిగిపోయింది. " ఏంటి రాజీ నాకోసం ఇప్పడిదాకా మేల్కొని .. చపాతీలొత్తుతున్నావా..?" అంటూ గజగజ ఒణికి పోతున్నాడు.. సుందరం మనసు ఏదో కీడు శెంకిస్తోంది. వెనక్కి పారిపోదాం అనుకున్నాడు. ఫుల్ గా తాగుండటంతో అడుగులు పడటంలేదు.. ఒకప్పుడు శరీరసౌష్టవంతో ఉన్న సుందరం ఇప్పుడు తాగి తాగి ఎండిన చేపలా తయారయ్యాడు.. .. అంతే తలుపు ప్రక్కన ఒణుకుతూ నిల్చున్న సుందరం చొక్క పుచ్చుకుని లోపలికి లాగి తలుపేసి.. టివి వాల్యూం పెంచేసింది రాజీ. (దేనితో అయినా రాజీ పడొచ్చు కానీ, జీవితంతో రాజీ పడితే సమస్యలు పెరుగుతాయే తప్ప తరగవు - కరణం)
No comments:
Post a Comment