మిధ్యాబంధుత్వాలు - అచ్చంగా తెలుగు
మిధ్యాబంధుత్వాలు
- సుసర్ల నాగజ్యోతి

అది రామాపురం గ్రామం, ఆ గ్రామం లో ఒక చక్కని పూతోట...ఆ తోటలో అందమైన పొదరిల్లు...తోట పక్కనే శ్రీ సీతారామ స్వామి కోవెల..ఆ గుడి పూజారి కృష్ణమూర్తి గారు...ఆ పొదరిల్లు పూజారి కుటుంబపు ఆవాసం . ఆయనకు భార్య, ముగ్గురు ముచ్చటైన కూతుళ్ళు....వారితో పాటు ఆ తోటలో రెండు ఆవులూ వాటి దూడలూ, కొన్ని బాతులూ,చిలుకలూ గోరొంకలూ రక రకాల ఫల పుష్ప వృక్షాలూ, చిన్న కొలను, దానిలో కొన్ని కలువలూ ఇంకాసిని చిన్నా చితకా నేస్తాలూ సహజీవనం చేస్తున్నాయి. ఇంతకీ ఆ తోట ఆ ఊరి MLA సుబ్బరాజు గారిది ...ఆయన జిల్లా కేంద్రం లో ఉంటారు. ఆయన దయవల్లే తమకు చాలీ చాలని ఆదాయమైనా...తమ నోట్లోకి నాలుగు వేళ్ళూ పోతున్నాయని పూజారి గారి విశ్వాసం.ఆయనకు ఆ సీతారామ స్వామి తరువాత సుబ్బరాజే తమ పాలిటి దేవుడు. నిజమే మరి ఆ గుడిలో ఆదాయం నామ మాత్రం.ఆ గుడికి ధర్మకర్త MLA గారే మరి...వారు తమ తోటకి కాపలా కాస్తూ ఉండేలా ఒక పూరి గుడిసె వేయించి ఇచ్చారు ..దాన్ని పూజారి కుటుంబం పొదరిల్లు గా మార్చుకున్నారు...ఇంటికి అద్దె లేకపోవటం, గుడిలో వచ్చే పదీ పరకా , ఆవులపైన వచ్చే ఆదాయం.... పూజారి గారి కుటుంబానికి ఉరామరికగా సరిపోతోంది. సుబ్బరాజు గారి ధర్మ పత్ని సుశీల. నిజం గానే పేరుకు తగిన ఇల్లాలు .వారికిద్దరు కొడుకులు పెదబాబూ, చిన బాబూ... పెద బాబు పాతిక ఏళ్ళవాడు...చినబాబు ఇరవై ఏళ్ళవాడు పెదబాబు కు పెళ్ళయ్యింది...భార్య పురిటికి పుట్టింటికి వెళ్ళింది. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు....చిన బాబు డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు . ఒక రోజు సుశీలకు BP ఎక్కువై కళ్ళు తిరిగి పడిపోయింది ...ఉన్నట్టుంది అలా జరగటానికి కారణం లేకపోలేదు....ఎంతో చక్కగా పెంచుకున్న తమ పెద్ద కొడుకు ఆగడాలు మితిమీరి..చిలక్కొట్టుడు వ్యవహారాలు కూడా మొదలయ్యాయని తెలిసింది ఈ మధ్యనే....సరే డాక్టర్ రావటం,మందులివ్వటం అన్నీ అయ్యాక కాస్త మనశ్శాంతి గా ఉంటుందని తమ ఊరు రామాపురం వెళ్ళి సీతారామస్వామి దర్శనం చేసుకొద్దామని బయలుదేరారు. పూజారి గారి కుటుంబం ,సుబ్బరాజు గారి కుటుంబాన్ని సాదరంగా ఆహ్వానించి, బాగా గౌరవించి నెత్తిన పెట్టుకుని పూజించినంత పని చేశారు .పూజారి గారి పెద్ద కూతురు సీత 10 వ తరగతి పాస్ అయ్యింది...ఇంక ఆ వూరిలో కళాశాల లేక చదువు ఆపేసింది. సీత పదహారు ఏళ్ళ పరువముతో ,చెంపకు చారెడు కన్నులతో, బారెడు జడతో , పచ్చని పసిమితో అచ్చూ బాపు గారి బొమ్మలా ఉంటుంది. సీత పిన్నీ,బాబాయ్, పెద్దన్నా,చిన్నన్నా అంటూ చక్కగా తమతో పాటే ఉండి అన్ని సేవలూ చెసింది...ఆ పిల్ల ఆప్యాయత చూసి సుశీల చాలా ముచ్చట పడింది....తనకు ఇంట్లో ఎంతమంది పని వాళ్ళు ,దగ్గరి వాళ్ళు ఉన్నా ఇంతలా మనసుకు తక్కువ సమయములో దగ్గరైన వాళ్ళు ఎవరూ లేరుకదా అనిపించింది. పైగా తాము చిన్న ఇల్లు ఉండటానికి ఊరికేఇచ్చినా మిగతా నిత్యావసరాలకు పూజారి గారి కుటుంబం తడుముకోవటం సుశీల గమనించింది . ఉభయతారకం గా ఉంటుందని భర్త తో మాట్లాడి సీతని తమతో పాటు కొన్ని నెలలు తమ ఇంటికి పంపేలా పూజారి గారినీ,వారి భార్యనీ ఒప్పించింది .ఆహారమూ,వ్యవహారమూ విషయాలలో వారి ఆచారానికి భంగం రాకుండా ఉండేలా చూస్తానని మాటిచ్చింది .పైగా ప్రతినెలా పూజారి గారి చేతికి పైకం నాలుగువేల రూపాయలు అందేలా అభయమిచ్చింది...పిల్ల పెళ్ళికి కూడా కాస్త కూడబెట్టవచ్చని హెచ్చరించింది..సీత కు పెళ్ళి తలపెట్టేనాటికి ఆ పిల్లను తిరిగి వారింటికి పంపుతామని చెప్పి హామీ ఇచ్చి సీతను వారితో పాటు వారి ఊరికి బయల్దేరదీశారు. పాపం సీత తనప్రమేయం లేకుండా చక చకా జరిగిపోయిన ఆ విషయానికి ఏమీ చేయలేక తనకెంతో ఇష్టమైన ఇద్దరు చెల్లెళ్ళనూ, అమ్మనూ,నాన్ననూ వదిలి...గోమాతలకూ, తనతో రోజూ ఆడే లేగదూడకూ, కొమ్మల్లో కూర్చుని పలకరించే తన చిట్టి పొట్టి నేస్తాలకూ వీడుకోలు చెప్పి MLA గారి కుటుంబం తొ పాటు బయలుదేరింది. మొదటి నెల రోజుల్లోనే సీత, వాళ్ళింట్లో అందరికీ తలలో నాలుకలా కలిసిపోయిది .ముఖ్యం గా సుశీల ,వంటమనిషే కాక కాసింత పెద్ద తలకాయ అయిన రంగయ్య తాత ..సీతను చూసి తెగ ముచ్చట పడేవారు.సీత చక్కగా చిన్న చిన్న పనుల్లో ఇంట్లో సహాయం చెయ్యటం, సుశీలకు తీరిక సమయాల్లో పిన్నీ అంటూ కూర్చుని తనకు తండ్రి నేర్పిన పురణాల్లో చిన్న చిన్న నీతి కధలు వినిపించటం, అన్నలిద్దరికీ కావల్సిన వస్తువులు అందించటం.....ఇలా సీతకు కూడా తోచుబాటుగా రోజులు గడుస్తున్నా ...తనవారు గుర్తొచ్చినప్పుడల్లా దిగులే...కానీ తను ఇక్కడ ఉండటం వల్ల తమ ఇంట్లో వారికి రోజులు హాయిగా గడిచిపోతాయని సమాధానపడుతూ ..గడిపేస్తోంది. వానాకాలం కావటం వల్ల, కాస్త వెసులుబాటు చిక్కి పెదబాబు ఇంటిపట్టునే ఉంటున్నాడు.ఒక రోజు పొద్దున్నే కాఫీ ఇవ్వటానికి తన గదికి వచ్చిన సీత తో కాఫీ ఆ టేబుల్ మీద పెట్టు సీతా! అన్నాడు. టేబుల్ పై కాఫీ కప్పు పెడుతుంటే సీతవెనకాల ఆనుకుని నిల్చుని సీతా నువ్వెంత అందముగా ఉంటావో తెలుసా అన్నాడు...గిరుక్కున వెనక్కు తిరిగి అయోమయం గా చూస్తున్న సీతకు ఒళ్ళంతా తగులుతూ పెదబాబు అడ్డంగా నిల్చున్నాడు....సీత పెద్దన్నా ఏమిటిది నన్ను వెళ్ళనీయండి అంటూ పక్కనుంచి పరిగెత్తింది. అదిమొదలు సీతకు అక్కడ దిన దిన గండం నూరేళ్ళాయుష్షు ...మేడపైన బట్టలు ఆరేస్తుంటే ఎక్కడనించి వస్తాడో ,లంగా ఓణీ వేసుకున్న సీత సన్నని అనాచ్ఛాదిత నడుముపై చేయి పెట్టి గట్టిగా నొక్కేస్తాడు.పిన్నిగారి గదిలోంచి మధ్యహ్నం పురాణం చదివి బైటకు వస్తుంటే ఉన్నట్టుండి ఎదురొచ్చి గుద్దేస్తాడు ...నొప్పి తో అరవబోయిన సీత నోరు తెరిచె లోపల తనే ముందు కళ్ళు కనపడటం లేదూ? అని అరిచి ,సరిగా నడు అంటూ గదిమి నోరుమూయిస్తాడు.ఇదంతా ఎవరైనా గమనించి తనకు సహాయం చెయ్యాలని సీత తమ వూరి రాముల వారికి మొక్కుకుంటోంది. ఒకరోజు చినబాబు సీత గదిలోకి వచ్చి సీతా! అనిపిలిచాడు ...చెప్పు చిన్నన్నా అని అడిగిన సీతను మా అన్నయ్య నీతో ఎలా ప్రవర్తిస్తున్నాడో నేను గమనిస్తున్నా,నీకు తోడు నేనున్నాను భయపడవాకు అంటూ భుజం మీద చెయ్యేసి మరీ చెప్పాడు .అదిమొదలు చీటికీ మాటికీ ఓదార్పు పేరుతో భుజం మీద చేతులెయ్యటం ..భరించలెని చోట్లకు జార్చటం...ఒకడు కోపం నటిస్తూ లోబరచుకోవాలనుకుంటుంటే ,ఇంకొకడు సానుభూతి చూపుతూ లొంగదీసుకోవాలనుకుంటున్నాడు ....సీతకు వాళ్ళిద్దరూ వస్తున్నారంటేనే భయమెస్తోంది...కాళ్ళలో వణుకొస్తోంది ...అన్నా అని పిలిచినా కూడా అన్నతనం లేని కాలరాక్షసుల్లా కనిపిస్తున్నారు. ఒకరొజు ఈ విషయం అంతా రంగయ్యతాతకు చెప్పుకుని ఏడ్చింది. రంగయ్యతాత సుశీల చెవినేశాడు.ఆవిడ నివ్వెర పోయి రాత్రికి తన భర్త తో చెప్పి ఈ విషయముగా ఒక నిర్ణయం తీసుకోవాలి అని అనుకుంది. ఆ రాత్రి వారి గదిలో మంచినీళ్ళ సీసా ఇచ్చిరావటానికి వెళ్ళిన సీతను చూసి ,ఈ అమ్మాయి సమస్యను భర్తకు ఎలా చెప్పాలా అని అలోచిస్తూ భర్త వంక చూసిన సుశీల ఉలిక్కిపడింది ....ఆయన చూపులు ఆకలి గా సీతను ఆసాంతమూ తడుముతున్నాయి. ఆ ఆకలి చూపులు తనకు చిరపరిచయమే ...నిర్ఘాంత పోయింది సుశీల...తనకు చేదోడు వాదోడు గా ఉంటుందనీ,పూజారి గారికి ఆదాయ పరం గా ఊరటగా ఉంటుందని సీతను తమ ఇంటికి తెచ్చింది గానీ, ఇలా వేటకుక్కల మధ్యలోకి కుందేలు పిల్లను తెచ్చినట్టు అవుతుందని గ్రహించలేకపోయింది ...అందుకే ఇంక ఆయనతో కాకుండా మర్నాడు సీత తోనే మాట్లాడాలని నిర్ణయించుకుంది...మాట్లాడింది కూడా... ఒక రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి. సుబ్బరాజు గారితో వాటి గురించి చర్చింటానికి పెద్దలంతా వచ్చారు...ఆ సమయములో బట్టలు ఆరేసి మేడపైనుండి దిగుతున్న సీత కాలు జారి మెట్లమీదనుండి పడిపోయింది..పెద్దగా అరుస్తూ...లోపలున్న అందరూ ఒక్కసారి బైటకు పరిగెత్తుకొచ్చారు...బైట స్పృహ లేకుండా పడిపోయిన సీత కనిపించింది. మొహాన నీళ్ళు చల్లినా కూడా తెలివి రాలేదు...ఇంట్లోకి మోసుకొచ్చి, వెంటనే తన స్నేహితురాలూ కూడా అయిన తమ ఫామిలీ డాక్టరును పిలిపించారు సుశీల గారు . ఆవిడ వచ్చి సీతను పరీక్షించి ఒక ఇంజెక్షన్ ఇచ్చి...ఒక గంటలోపల తెలివివస్తుందని చెప్పి...బైటకు కనపడక పోయినా తలకు గట్టిగా కంకుదెబ్బ తగిలినందువల్ల......స్పృహ కోల్పోయి ఉంటుందని చెప్పి అందువలన ఒక్కోసారి కాస్త పిచ్చి ఎక్కినా ఎక్కవచు కాబట్టి ,తెలివిరాంగానె వాడాల్సిన మందులు కూడా ఇచ్చి వెళ్ళిపోయారు.కాస్త ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని నొక్కి చెప్పి మరీ వెళ్ళారు. ఆ సాయంత్రానికి సీత కు తెలివొచ్చింది ...అందరూ పరామర్శించారు...కానీ సీత ఎవ్వరినీ గుర్తుకూడా పట్టలేదు...అయోమయం గా దిక్కులు చూస్తోంది...సుశీల గారు సీతకు రెస్ట్ ఇద్దామని అందరూ బైటకు వెళ్దామంటూ బైటకు వచ్చేశారు...ఆ రాత్రికి పెద బాబు సీత గదిలోకి వెళ్ళి సీతా నొప్పి నిజమేనా? నాటకమా అంటూ సీత చెయ్యి గట్టిగా నొక్కి పట్టున్నాడు.....అంతే సీత శివంగిలా పెదబాబు పై విరుచుకు పడింది ..."ఏరా దొంగ వెధవా...నా బొమ్మ లాక్కుంటావా అంటూ పెద్ద పెద్దగా అరుస్తూ పెదబాబు మొహాన పిడిగుద్దులు గుద్దటం మొదలుపెట్టింది...ఆ అరుపులకు అంతా పరిగెత్తుకొచ్చారు...పెదబాబు తలవంచుకుని వెళ్ళిపొయ్యాడు....ఏం జరిగింది సీతా అంటూ అడిగిన సుశీల గారి వంక చూస్తూ సీత "ఏటివడ్డునా మావూరూ ఎవ్వరు లేరూ మావారు ఏరుదాటి అటువైపుకు వస్తే వెనక్కు పోలేరు ..." అంటూ నోటికొచ్చిన సినిమా పాట పాడటం మొదలెట్టింది. అందరికీ ఇంక అర్ధం అయ్యింది...పొద్దున గట్టిగా తగిలిన దెబ్బతో సీతకు పిచ్చిఎక్కిందని .....ఆ రాత్రి సుశీల గారు తమ ఇంట్లో వాళ్ళతో సమావేశమై ఇంకో రెండు నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి....ఎంత నిజం తెలిసినా కూడా ప్రతిపక్షాల వాళ్ళు మనమే ఆ పిల్లను ఏదో చేశామని దుమ్మెత్తిపోస్తారు .అందుకని ఆ పిల్లను వాళ్ళ ఊరిలో దింపివస్తాను నెలభత్యం పోయీ, ఆ పిల్ల పిచ్చిది కూడా అయి పోయిందని పూజారి గారు గొడవపేడతారు అందుకని ఎంతోకొంత పైకం ఇచ్చి నోరుమూయించివస్తానంటూ ఉపాయం చెప్పారు. నోటకరుచుకోవాలనుకున్న మాంసం ముక్క దొరక్కుండా పోతోందని గుంటనక్కల్లా మనసులో ఏడ్చారు ఆ మగవారు...అయినా పదవి ముఖ్యం కాబట్టి ఒప్పుకున్నారు. మర్నడు పొద్దున్నే సుశీల, సీతనూ రంగన్ననూ తీసుకుని తమ కారు లో రామాపురం వెళ్ళారు....అక్కడ పూజారి గారింటిలో సీతను దించి ఒక పట్టు చీర, నాలుగు లక్షల రూపాయలూ చేతిలో పెట్టి దగ్గరకు తీసుకున్నారు...సీత కళ్ళనిండా నీళ్ళు నింపుకుని సుశీల గారి పాదాల మీద వాలి పోయింది.మెట్ల మీదనుండి పడిపోయినట్టు నటించేలా సలహా ఇచ్చి ,తమ డాక్టర్ తో కలిసి కాస్త నాటకమాడించి తనను వారింటినుండి బైటపడేలా చేసిన ఆవిడకు కృతజ్ఞతలు తెలుపుకుంది. ఇప్పుడు ఆవిడకు తృప్తిగా ఉంది సాటి ఆడదిగా ఒక అమాయకురాలి మాన, ప్రాణాలను తన ఇంటి తోడేళ్ళనుండి కాపాడగలిగింది. తరువాత పూజారి గారికి చెప్పింది తను ఇచ్చిన నాలుగు లక్షలూ సీత పేరుమీద ఫిక్సుడ్ డిపాజిట్ చేసి నెల నెలా వచ్చే ఆ వడ్డీని ఇంటి అవసరాలకు వాడుకొమ్మని చెప్పి ,తమ ఇంటిలో సీతకు జరిగిన అవమానానికి, జరుగ బోయిన ప్రమాదానికి క్షమించమని కోరి వెనుతిరిగింది. విషయం తెల్సిన తరువాత పూజారి గారి కుటుంబం ప్రపంచమంతానిండి ఉండి కాపాడుతున్న పరమాత్ముని సన్నిధి లో ఇంకొక పొదరిల్లుని వెతుక్కుంటూ ఆ వూరు విడిచి వెళ్ళిపోయింది .. ఆ కొత్త పొదరింట్లొ సీత తన చెల్లెళ్ళతో ,తమ ఇంటి పశువులతో....పక్షులతో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతోంది....అమ్మా నాన్నల సన్నిధిలో భయాన్ని మరచిపోయింది. అవును మరి అన్నా అని పిలిచినా,తమ్ముడా అని ఆదరించినా మిధ్యాబంధుత్వాలు కొందరు కాముకుల మనసుల్లో ఏపాటి జాలినీ కలిగించలేవు.....కామతృష్ణతప్ప. కానీ పశువులకు ,పక్షులకూ కుహనా బంధుత్వాలు తెలియవు...వాటికి వావి వరుసలతో పని లేదు...అయినా ...అవి ఉత్తపుణ్యానికే సాటి జీవికి హానిచేయని ప్రేమమూర్తులు....... ( బాపు - రమణ గార్లకు భక్తితో అంకితం.)

No comments:

Post a Comment

Pages