“ఆడపిల్ల -ఈడపిల్ల కాదేమో”
- సిరి లా బాల (సరిత )
“సృష్టికి” మూలం నీవని చెప్పి
కారుణ్య మూర్తివి నీవని బిరుదిచ్చి
సహనాన్ని పరీక్షిస్తారు కాబోలు ……….
“అమ్మానాన్నల” గారాలపట్టి ఐన ఆ “చిట్టితల్లి”
అమ్మ చేతిగోరుముద్దలు తింటూ
అప్యాయతానురగాలతో పెరిగి
“అత్తింట” అడుగు పెట్టిన నేరానికి
ఆడపడచుల ఆగడాలతో
అత్తమామల ఆరళ్ళతో
ఆయనగారి అధికారంతో
అనుమానాల అపహాస్యాల అపనిందలతో
అందంగా కట్టుకున్న
“కలలసౌధం” కుప్పకూలి కల్లోలం మొదలై
బార్యా భర్తల బంధం బగ్గున మండే
“అగ్నిగుండమే” అవుతుంది.
కారణం …………….
బహుశా! ఆడపిల్ల ఈడపిల్ల కాదాని కాబోలు
కంటి పాపలా కన్నారింట పెరిగిన “కారుణ్య మూర్తులు”
కన్నీటిని దాచుకుందుకు దిండునే హత్తుకొని
వెక్కి వెక్కి ఏడ్చిన సంఘటనలు ఎదుర్కొనేది “పడతులేగా” ?
కడుపు పండేందుకు కారణం తను కాదని తెలిసి
“గోడ్రాలివి” నీవని నిందలేసి వదిలేసినా
నోరు మెదపలేనిది “లలనామణులేగా”
“తాళి కట్టిన వాడు” తప్ప “తాగి” వచ్చి
తనువంతా హూనం చేసినా
తన కర్మ అని సరి పెట్టుకునేది “తరుణీమణులేగా”
ఇంటిల్లిపాదికి సపర్యలు చేస్తూ
ఇంటెడు చాకిరీ చేసినా చాలక
ఉద్యోగాలు చేసి అలసి సొలసి
ఇంటికి వచ్చి కాసిన్ని టీ నీళ్ళకోసం
నిస్సత్తువుగా నిస్సహాయంగా ఎదురు చూసేది కూడా “స్త్రీ మూర్తేగా”
ఉద్యోగం చేయమని ప్రోత్సహించేది
కాసులకోసమే కానీ
తనకు స్వేచ్ఛనిచ్చి కాదని
తెలుసుకోలేనిది “పిచ్చిమాతల్లులేగా”
వరకట్నపు వేదింపులతో విసిగి వేసరి
పసుపు తాడు వేసుకున్న నేరానికి
ఉరి తాడుకి వేలాడేది “పడతులేగా”
కొసరి కొసరి అడిగిన కానుకలను ఇవ్వలేని
కన్నతండ్రి నిస్సహాయతకు బదులుగా
కన్నీళ్ళతో “అమ్మానాన్నల” గుండెమంటలు ఆర్పలేక
“కిరోసిన్ మంటలకు” ఆహుతైన “అబలలు” ఎందరో?
No comments:
Post a Comment