అమ్మ కళ్ళు - అచ్చంగా తెలుగు
 అమ్మ కళ్ళు

పెయ్యేటి రంగారావు


          గువ్వలచెన్నాకి రిజర్వేషను లేకుండా రైలు ప్రయాణం చెయ్యడమంటే చాలా చిరాకు.  ఎక్కడికి వెళ్ళాలన్నా పదిహేను రోజులు ముందుగానే ప్లాన్ చేసుకుని, ఆన్ లైన్ లో టికెట్ రిజర్వ్ చేసుకుని, తాపీగా, హాయిగా వెళ్తాడు.  అసలే సీనియర్ సిటిజన్!  దానికి తోడు, ' అరవై అయిదు సంవత్సరాలుగా నీ భారీ కాయాన్ని మోస్తున్నాం, ఇంక మా వల్ల కాదు ' అని మోకాళ్ళు మొరాయించడంతో, మోకాళ్ళకి ఆపరేషను చేయించుకున్న వాజ్ పేయి గారి పరిస్థితి టి.వి.లో చూసిన వాడు కనక, ఆపరేషనుకి దూరంగా వుండాలని నిర్ణయించుకున్న వాడు కనక, మూడు కాళ్ళతో నడుస్తున్నాడు.  అంతే కాకుండా, ఈ వార్థక్యంలో ఆయనకు తోడు నీడగా వుంటామని మంచి మనసుతో ఆయన శరీరంలోకి ప్రవేశించిన మధుమేహం, రక్తపు పోటులని ఆదరిస్తున్న వాడు కనక, బస్సులో ప్రయాణం చేసే ప్రసక్తే లేదు.  ఎందుకంటే మధుమేహం వల్ల వేళాపాళా లేకుండా ప్రకృతి ఎప్పుడూ పిలుస్తూనే వుంటుంది.  (Nature's call).  అందుకని ఎప్పుడూ రైల్లోనే, రిజర్వేషను చేయించుకునే ప్రయాణం చేస్తాడు.  కాని ఈసారి ఆయన ఆశయాలకి భిన్నంగా ప్రవర్తించ వలసి వచ్చింది.  లండను నించి వచ్చిన ఆయన మేనత్త మనవరాలికి అకస్మాత్తుగా వివాహం సెటిలవడం, అందుకు సంబంధించిన నిశ్చితార్థం హైదరాబాదులోని తాజ్ ట్రై స్టార్ హోటల్ లో వాళ్ళు ఏర్పాటు చెయ్యడం, తన్నిమిత్తం మొట్టమొదట అగ్రతాంబూలం ఆయనకిచ్చి, ఆశీస్సులందుకుని తీరాలని చెప్పడం వల్ల హడావిడిగా నరసాపురం నించి హైదరాబాద్ కి ప్రయాణం కావలసి వచ్చింది.ఐతే ఆయన బాల్యమిత్రుడు, ఆయన శరీరాన్ని గుత్తకి తీసుకున్న ఆయన శ్రేయోభిలాషి, డాక్టర్ పట్టాభి ఐదు గంటలకే తన కాంపౌండర్ని రైలు స్టేషనుకి పంపించి, రైలు ప్లాట్ ఫారం మీదకి రాగానే జనరల్ బోగీలో సింగిల్ సీటు ఆక్రమించుకోమని సలహా ఇచ్చి పంపడం వల్ల, తరవాత ఆయన్ని తన ఏ.సి.కారులో స్టేషనుకి తీసికెళ్ళి జాగ్రత్తగా రైల్లో కూచోబెట్ఘ్టడం వల్ల ఏవిధమైన ఇబ్బంది లేకుండా హైదరాబాద్ కి ప్రయాణమయ్యాడు.డాక్టర్ పట్టాభి, గువ్వలచెన్నా బాల్యస్నేహితులు.  అందువల్ల గువ్వలచెన్నాకి వైద్యం ఊరికేనే చేస్తాడు పట్టాభి.  ముందర గువ్వలచెన్నా కొంచెం మొహమాట పడ్డా, పట్టాభి చికిత్సావిధానం బాగుంటుంది కనక ఆయన దగ్గరే వైద్యం చేయించుకుంటూ వుంటాడు.  పట్టాభి భార్య బహుదొడ్డ ఇల్లాలు.  గువ్వలచెన్నాని స్వంత అన్నయ్య కన్న ఎక్కువగా ఆదరిస్తుంది.  రైల్లో ఆయనకు ఏ విధమైన అసౌకర్యం కలగకూడదని నాలుగేసి పూరీలు, అల్లం వేసి వండిన వంకయ కూరతో ఒక్కొక్క పొట్లం చొప్పున రెండు పొట్లాలు, అరడజను చక్రకేళీ అరటిపళ్ళు, అన్నీ నీట్ గా పేక్ చేసి ఒక సంచిలో పెట్టి ఆయనకిచ్చింది.  ఆయనకు స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అన్న పాట గుర్తుకు వస్తుంది.  పట్టాభి గాని, అతడి శ్రీమతి గాని మనీషులు.  వారి ఆప్యాయతి తలుచుకుంటే ఎప్పుడూ ఆయన కళ్ళు చెమరుస్తాయి.  కొందరు డాక్టర్లకుండే వ్యాపార దృక్పథం పట్టాభిలో  కంట్లో కలికమేసుకుని వెతికినా మచ్చుకైనా కనిపించదు.పాలకొల్లు వచ్చేసరికి రైలు కిటకిటలాడి పోయింది.  పట్టాభి పుణ్యమా అని ఆయనకు సింగిల్ సీటు దొరకడం వల్ల నిబ్బరంగా కూర్చున్నాడు.  రైలు భీమవరం దాటి గుడివాడ చేరుకునే సరికి బాగా చీకటి పడింది.  అదేం దౌర్భాగ్యమో కాని, అన్ని దూర ప్రయాణపు రైళ్ళలోను డైనింగ్ కార్లు వుంటాయి.  కాని ఇది వెనకబడిన రాష్ట్రపు రైలేమో, నరసాపురం-హైద్రాబాద్ రైల్లో మాత్రం ఏ సౌకర్యాలు వుండవు.  అందరూ భోజనాలకి, టిఫిన్లకి ఆదరా బాదరాగా పరుగులు తీస్తున్నారు.  గువ్వలచెన్నా నెమ్మదిగా తన సంచిలోంచి ఒక పూరి పొట్లం తీసి తెరుస్తున్నాడు.  ఇంతలో ఒక డెభ్భయి ఏళ్ళ వృధ్ధురాలు కర్ర సాయంతో కుంటుకుంటూ ఆ కంపార్ట్ మెంట్ లోకి జొరబడింది.' అమ్మా!  మూడు రోజుల్నించి తిండి లేదమ్మా.  ఆకలితో శోషొస్తోందమ్మా.  నాకు డబ్బులు అక్కర్లేదు తల్లీ.  ఒక రొట్టె ముక్కో, నాలుగు మెతుకులు అన్నమో దానం చెయ్యండమ్మా.  ముసలిదాన్ని.  కనికరించండమ్మా.  ఆకలితో ప్రాణం పోయేలా వుందమ్మా.' అని అరుచుకుంటూ, అందరూ ఛీ కొడుతున్నా తమాయించుకుంటూ, గువ్వలచెన్నా దగ్గరకొచ్చి, అదే పాత పాట పాడుతూ చెయ్యి చాపింది.  ఆయనకు కడుపు రగిలిపోయింది.  బ్లడీ బెగ్గర్స్!  అసలు వీళ్ళని రైళ్ళలోకి అలౌ చేస్తున్న ఈ భ్రష్టు పట్టిన ప్రభుత్వాన్ని లాగి తన్నాలి అన్నంత కోపం వచ్చింది.  ' పోవే ముసలిదానా!' అని కసురుతూ ఆమె కళ్ళలోకి చూసాడు.  ఎందుకో గుండె కలుక్కుమంది.అదే అలసటతో కూడిన చూపు!!అదే అలసటతో, నిస్త్రాణతో కూడిన చూపు!!! చిన్నప్పుడు వాళ్ళ ఉమ్మడి కుటుంబంలో, వంటింట్లోనే మ్రగ్గుతూ, నాలుగు గింజలు ఉడకేసి, అందరికీ పెట్టి, వాళ్ళు తృప్తిగా తిన్నాక, తనకంటూ గిన్నెలో ఏమీ మిగలక పోతే, కుండలో నించి గ్లాసుడు మంచినీళ్ళు తీసుకుని తాగి, తృప్తిగా తేన్చే తన తల్లి కళ్ళలోని అలసట ఆ బిచ్చగత్తె కళ్ళలో ఆయనకు కనిపించింది. గువ్వలచెన్నాకి తన చిన్నతనం గుర్తుకు వచ్చింది.  తమది ఉమ్మడి కుటుంబం.  ఉమ్మడి కుటుంబం అంటే అసలు సిసలు అర్థంలో ఉమ్మడి కుటుంబం కాదు.  ఆయన తండ్రి గారైన శివరావు గారు కలెక్టరాఫీసులో గుమాస్తా.  ఆయన భార్య పేరు అన్నపూర్ణమ్మ.  పేరుకు తగ్గట్టు ఆవిడ సాక్షాత్తు అన్నపూర్ణమ్మే.  వారి కుటుంబంతో పాటు, వారి తమ్ముడు,  వారి చెల్లెలి కుటుంబం, మరదలి కుటుంబం కలిసి వుండేవి.  ఆయన చెల్లెలి పేరు నాగలక్ష్మి.  ఆవిడ భర్త ఒక రైస్ మిల్లులో గుమాస్తాగా పని చేసేవాడు.  వారికి ముగ్గురు పిల్లలు.  ఒక సారి మిల్లు యజమని ఏదో అన్నాడని పౌరుషం తన్నుకొచ్చి, ' ఛస్!  ఒకళ్ళ చేతికింద నేను పని చెయ్యడమేమిటి?  వాళ్ళ మోచేతి కింద నీళ్ళు తాగి నెను బతకాలా?' అనుకుని వెంటనే ఉద్యోగం మానేసాడు. నాగలక్ష్మి అన్నగారి కాళ్ళ మీద పడి, ' అన్నయ్యా!  అమ్మ, నాన్న చనిపోయాక, ఇంక నాకు నువ్వు తప్ప వేరే దిక్కెవరన్నయ్యా?  ఆయన ఉద్యోగం ఊడిపోయింది.  పిల్లలు పస్తులతో మాడిపోతున్నారు.  ఈ కష్టకాలంలో నువ్వు ఆదుకోకపోతే ఇంక మాకు గోదారే దిక్కన్నయ్యా.' అంటూ బుడి బుడి ఏడుపులు ఏడిచింది. శివరావుగారికి చెల్లెలి కుటుంబం మీద జాలి తన్నుకొచ్చింది.  ' సరేలేమ్మా.  ఆ భగవంతుడికి అనుగ్రహం కలిగి, తిరిగి మీ ఆయనకు ఉద్యోగం వచ్చేదాకా మా ఇంట్లోనే వుండండి.' అన్నాడు. ఇక శివరావు గారి తమ్ముడు శ్రీహరి!  చిన్నప్పుడు చదువు సంధ్యలొదిలేసి, జులాయి తిరుగుళ్ళు తిరుగుతూ ఎందుకూ పనికిరాని వాడిగా తయారయ్యాడు. (ఖర్మ!  ఇప్పటి సినిమాల్లో హీరోలకి జులాయిలుగా, పోకిరీలుగా, ఇడియట్స్ గా వుండడమే కళాత్మకమైన అర్హత!  తల్లిని పేరు పెట్టి పిలవడం, తండ్రిని చులకనగా వెటకారం చెయ్యడం అదనపు అర్హతలు!)  శ్రీహరి థర్డ్ ఫారం తోనే చదువుకు మంగళం పాడేసి పేకాట, మేజువాణీలే పరమార్థంగా వుండేవాడు.  అతడి పోషణభారం కూడా శివరావు గారే తీసుకున్నారు. శివరావుగారి మరదలు శ్రీలక్ష్మి చిన్నప్పుడే పక్కింటబ్బాయి కామేశంతో ప్రేమలో పడి, పెళ్ళి కాకుండానే తల్లి కాబోతే, ఇంట్లోవాళ్ళు గుట్టు చప్పుడు కాకుండా ఆమెకు కామేశంతో వివాహం జరిపించారు.  అతడికి ఉద్యోగం, సద్యోగం లేదు.  చిల్లర మల్లర పనులు చేస్తూ కాలం నెట్టుకొస్తున్నాడు.  ఒకసారి శ్రీలక్ష్మి దీనంగా అక్క అన్నపూర్ణమ్మకి సుదీర్ఘమైన ఉత్తరం వ్రాసింది.  తమకి పూట గడవడం లేదని, తమ పరిస్థితి ఏమీ బాగా లేదని, వచ్చే ముక్కోటి ఏకాదశి లోగా తన భర్తకు ఏ ఉద్యోగమూ దొరక్కపోతే ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకోవడానికి నిర్ణయcచుకున్నామని ఆ ఉత్తరం సారాంశం. అన్నపూర్ణమ్మ ఆ ఉత్తరం చదువుకుని గాబరాగా భర్తతో అంది, ' ఏమండీ!  మీరు విశాలహృదయంతో చెల్లెలు కుటుంబాన్ని, తమ్ముడిని ఆదరిస్తున్నారు.  మా చెల్లెలు రాసిన ఈ ఉత్తరం చదవండి.  ఇది చదివినప్పటి నించి నాకు మనసు మనసులో లేదు.  మా చెల్లెలు, వాళ్ళాయన ఎప్పుడే అఘాయిత్యం చేసుకుంటారో, ఎప్పుడే వార్త వినాల్సివస్తుందో అని బెంబేలెత్తి పోతున్నాను.  కలిగిన దాంతో అలాగే సర్దుకుని బతికేద్దాం.  వాళ్ళకి ఏదన్నా ఆథరువు దొరికేదాకా మనతోనే వుంచుకుందామండీ.' శివరావుగారు కాదనలేక మరదలిని, ఆమె భర్తని తమ ఇంటికి తెచ్చుకున్నారు. అప్పట్నించి ఆయన ఒక్కచేతి సంపాదనతోనే అందరి ఆలనా, పాలనా జరిగేవి.  ఇక ఇంటిపని విషయానికొస్తే ఎవరూ అన్నపూర్ణమ్మ గారికి వీసమెత్తు సాయం చేసేవారు కాదు.  అందరూ హాల్లో కూచుని సరస సల్లపాలు ఆడుకుంటూ పైలాపచ్చీసు, పేకాటలు ఆడుకునేవారు.  అన్నపూర్ణమ్మ సహనంతో ఇంటెడు చాకిరీ తనే చేసుకుంటూ వంటింట్లోనే కాలక్షేపం చేసేది.  అందరి భోజనాలు అయినాక గిన్నెలు చూసుకుంటే ఆవిడకు తినడానికి ఒక్కొక్కసారి ఏమీ మిగిలేది కాదు.  గంపెడాకలిని దాచిపెట్టుకుని,  గ్లాసుడు మంచినీళ్ళతోనే కడుపు నింపుకుని, ఆ వంటింట్లోనే చెంగు పరుచుకుని, కృష్ణా రామా అనుకుంటూ కునుకు తీసేది.  అల్లా వారంలో నాలుగైదు రోజులు ఆమె పస్తులే వుండేది.  కాని తన బాధ ఎవరికీ తెలియనిచ్చేది కాదు. ఐతే చిన్నవాడయినా అన్నపూర్ణమ్మగారి కొడుకైన గువ్వలచెన్నా అమ్మని గమనిస్తూనే వుండేవాడు.  ఆవిడ ఆకలిని జయించడానికి అలసి, సొలసిన కళ్లతో నీరసంగా కుండలోంచి గ్లాసుడు మంచినీళ్ళు తీసుకుని తాగుతోంటే గువ్వలచెన్నా ఆవిడ కళ్ళలోకి చూస్తూ విలవిలలాడి పోయేవాడు.  అలా ఆవిడ ఆకలితో నీరసంగా చూసే చూపులు అతడి హృదయంలో చెరగని ముద్ర వేసేసాయి.  అప్పటినించి ఎవరి కళ్లలో ఆకలి చూపులు కనిపించినా అతడి గుండె బాధతో గిలగిల కొట్టుకుంటుంది. ఆ బిచ్చగత్తె కళ్ళలో గువ్వలచెన్నాకి తన తల్లి కళ్ళు కనిపించాయి.  తన తల్లి కళ్ళలో వారంలో నాలుగైదు రోజులు కనిపించే అలసట, నిస్త్రాణతో కూడిన చూపు గుర్తుకు వచ్చింది. ఆయన కళ్ళు చెమరించాయి.  వెంటనే చేతిలో వున్న పూరీల పొట్లం ఆమె చేతిలో వుంచి, ' తినమ్మా!' అన్నాడు. అప్పుడు ఆయనకర్థమైంది.  ఈ ముష్టివాళ్ళు ఎంత నీచమైన వాళ్ళో!  ఆ దుర్మార్గురాలు ఆయనిచ్చిన పూరీల పొట్లం భద్రంగా తన చిరుగుల సంచిలో దాచుకుని, మళ్ళీ అడుక్కుంటోంది.  ఆయనకు తెలుసు.  ఆ ముసలిది ఇల్లా అడుక్కుని సంపాదించినదంతా తిరిగి పేదవాళ్ళకి అమ్ముకుని సొమ్ము చేసుకుంటుంది. ఆయన ఆమె చెయ్యి పట్టుకుని, ' ఏమ్మా!  నీకు నాలుగు పూరీలు ఇచ్చా కదా!  ఇంకా నీ కక్కుర్తి తీరలేదా' అని అరిచాడు. ఆ బిచ్చగత్తె ఏడుస్తూ, ' అయ్యా!  నేను కూడా బాగా బతికిన దాన్నేనండయ్యా.  పదిమందికి వండి పెట్టిన చేతులేనయ్యా నావి.  సునామీలో ప్రాణాలు పోగొట్టుకున్న నా కొడుకు, కోడలు మిగిల్చి వెళ్ళిన నలుగురు బిడ్డలు ఇంటిలో ఎండిన కడుపులతో బిక్కు బిక్కుమంటూ నా కోసం ఎదురు చూస్తూ వుంటారయ్యా.  ఆ బుల్లి కడుపులకి మీరిచ్చిన ఈ పూరీలే ఆదరువయ్యా. అందరికీ మీ అంత జాలి గుండె వుండదు కదయ్యా?  వాళ్ళు తిన్నాక, నేనడుక్కున దాంట్లో ఏమన్నా మిగిలితే నేను తింటానయ్యా.  లేకపోయినా గ్లాసుడు మంచినీళ్ళతో నాకు రోజు గదిచిపోతుందండయ్యా.' అంది. గువ్వలచెన్నాకి ఏడుపు తన్నుకొచ్చింది.  ' ఓ స్త్రీ మూర్తీ!  ఓ అమ్మ మనసా!  అందరి కడుపులూ తడివి తడివి తినిపిస్తావు.  నీ ఆకలి బాధ గురించి ఎప్పుడూ పట్టించుకోవు.  అందరికీ పెట్టాలనే ఉవ్విళ్ళూరతావు  నీకోసం ఏమీ మిగుల్చుకోవు.  నీకు శత సహస్ర నమస్సులమ్మా.' అని యావత్తు స్త్రీజాతికి మననసులోనే నమస్కరించుకుంటూ, సంచిలో మిగిలివున్న పూరీ పేకెట్టు, అరటిపళ్ళు గంగాభాగీరథీ సమానురాలైన ఆవిడ చేతుల్లో వుంచాడు.  ఆమె వంగి ఆయన కాళ్ళకి నమస్కరించ బోతుంటే గాబరాగా కాళ్ళు వెనక్కి లాక్కున్నాడు. అప్పుడాయనకి అనిపించింది. అవును!  మనం కాశీ వెడతాం.  మన పాపాలు ప్రక్షాళనం కావించుకోడానికి గంగాస్నానం చేస్తాం.  ఆ సమయంలో చేతిలో అరటిపళ్ళు, పసుపు, కుంకుమ, డబ్బు పట్టుకుని, గంగమ్మకి నమస్కారం చేసుకుని, అవన్నీ గంగార్పణం చేస్తాం  ఆ గంగమ్మతల్లి మన కాళ్ళు కడిగి, మన పాపాలన్నీ తను తీసుకుని, మనల్ని పవిత్రుల్ని చేస్తుంది.' ఇప్పుడు తను చేసిన పని గంగాస్నానమాచరించదం కన్న పవిత్రమైనది అన్న తృప్తి ఆయనకు కలిగింది.
**********************

No comments:

Post a Comment

Pages