అంతర్యామి-5 - అచ్చంగా తెలుగు
అంతర్యామి-5
- పెయ్యేటి రంగారావు

జరిగిన కధ : రామదాసు గారు నరసాపురం కాలేజి లో లెక్చరరు ,ఆస్తికుడు. ఆయన మిత్రుడు లావా నాస్తికుడు,స్థానిక హేతువాద సంఘం అధ్యక్షుడు. వారిద్దరి మధ్య భగవంతుడు ఉన్నాడా ,లేడా అన్న విషయమై వాదోపవాదాలు తరచుగా జరుగుతూ ఉంటాయి. రామదాసుగారి ఇంటికి అంతర్యామి అనే స్వామీజీ తన  శిష్యులతో రాబోతున్నారు. ట్రైన్లో టికెట్ లేకుండా ఎక్కుతుంది ఓ అందమైన యువతి. ఎలాగైనా ఆమెను తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నిస్తుంటాడు టి.టి. తిలక్. అంతర్యామి గారికి తమ సమస్యలను విన్నవించుకోవడం కోసం జనం వచ్చారు.)' కోతికి కొబ్బరికాయ దొరికినట్లు ' అన్న సామెత గుర్తుకు వచ్చి నవ్వుకున్నాడు లావా.లావా బైటకి వెళ్ళన సమయంలో టప్పున హాలు పై కప్పులోంచి అందరూ చూస్తుండగా గంగసింధూరం పులిమి వున్న కొబ్బరికాయ కింద పడి భళ్ళున పగిలింది!అందరూ జయజయ ధ్వానాలు చేసారు.లావా లోపలికి వచ్చి, జరిగింది తెలుసుకుని, ఆ సమయానికి తను అక్కడ లేనందుకు నెత్తి మొత్తుకున్నాడు. అంతర్యామిగారు లోపలి గదిలో కూర్చుని వున్నారు. ప్రశ్నలు అడగడానికి వచ్చినవారు ఒక్కొక్కరే గదిలోకి వెళ్తున్నారు.  దానికి ముందుగా ప్రశ్న చీటీ భగవంతం గారికి ఇచ్చి రెండేసి వందలు సమర్పించుకుంటున్నారు. ఐతే ఆ ప్రశ్న చీటీ మాత్రం భగవంతం గారి దగ్గరే వుంటోంది కాని అంతర్యామి గారి దగ్గరకు పంపబడటల్లేదు.  ఐనప్పటికీ భక్తులు అడగదల్చుకున్న ప్రశ్నలు అంతర్యామిగారు కళ్ళు మూసుకుని చెప్పెయ్య గలుగుతున్నారు. ఒక పట్టు పంచె, పట్టు కండువా ఆసామీ, నాలుగు వేళ్ళకీ నాలుగు ఉంగరాలతో దర్జాగా లోనికి వెళ్ళి స్వామివారికి పాదాభివందనం చేసాడు.  అంతర్యామి గారు కళ్ళు మూసుకునే మాట్లాడుతున్నారు. ' మీ శ్రీమతిగారికి ఎన్నాళ్ళ నుంచో తరచుగా కడుపులో నెప్పి వస్తోందని, నివారణోపాయం తెలపమని అడుగుతున్నారు.  ఔనా?' ' ఔను స్వామీ!' ' జఠరాగ్ని రగిలినప్పుడల్లా ఆర్పడానికి అతిగా ప్రయత్నాలు జరుగుతున్నందు వల్లనే ఇది సంభవిస్తున్నది కోటేశ్వర రావు గారూ!' ' ఐతే ఇప్పుడేం చెయ్యాలి స్వామీ?' ' అష్టోత్తర శత సువర్ణ కుసుమాలు స్వామికి సమర్పించండి.  ఆ నూటెనిమిది బంగారు పూలతో స్వామి వారికి పన్నెండు శనివారాలు అర్చన జరగాలి.  ఈ పన్నెండు శనివారాలు ఆమె పూర్తిగా ఉపవాసం ఉండవలసి వుంటుంది.  పూజలు మొదలు పెట్టిన ఐదవ శనివారం నుంచి ఆమెకు గుణం కనిపిస్తుంది.' ' ధన్యుణ్ణి స్వామీ!  రేపే ఆ బంగారు పువ్వులు తీసుకు వస్తాను.' ' మంచిది, వెళ్ళి రండి.' మరొక మాసిన బట్టల ఆసామీ లోనికి వెళ్ళి దీనంగా వారి పాదాలకు మ్రొక్కాడు. ' చూడు బిచ్చాలూ!  నీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు.  దానికి తోడు నీకీ భయంకరమైన గొంతు కేన్సరు వచ్చింది.  అందువల్ల నువ్వు చాలా క్రుంగిపోయావు.  ఏమీ బాధ పడకు.  నీకు నేను విభూతి ఇస్తాను.' ' దీనితో నా రోగం పూర్తిగా నయమై పోతుందా స్వామీ?'  ఆశగా అడిగాడు బిచ్చాలు. ' దీనితో నీ మనసుకు ప్రశాంతత లభిస్తుంది.' అంటూ గాలిలో చేతిని అటూ ఇటూ తిప్పి అతడి చేతిలోకి వంచాడు. బిచ్చాలు చేతిలో విభూతి పడింది! ' ఈ విభూతి నిత్యం ధరిస్తూ వుండు నాయనా.' ' అలాగే స్వామీ.' ' మంచిది, ఇక వెళ్ళు.'
************************
          రైలు దడదడ మంటూ సాగిపోతోంది.  ఆమెకు మాగన్నుగా కునుకు పట్టింది.కోలవెన్ను తిలక్ కి చాల తిక్కగా వుంది.  ఇవాళ తను నిర్దేశించుకున్న రెండు లక్ష్యాలలో ఏ ఒక్కటీ సాధించలేదు.  బోణీయే బెడిసి కొట్టింది.' అసలు తన గురించి ఆ పిల్ల ఏమనుకుంటోంది?  కాస్త గట్టిగా మాట్లాడినంత మాత్రాన తను బెదిరి పోతాడనుకుంటోందా?  దానికి తన తడాఖా చూపించి తీరాలి.  వచ్చే స్టేషనులో దానిని బలవంతంగా కిందకి దింపి, కేసు బుక్ చేసేయాలి.  అప్పుడు అందరి ముందూ ఏమని వాగుతుంది?  తను డబ్బు లంచం అడిగానని చెబుతుందా?  నో ఛాన్స్.  తను స్ట్రిక్ట్ ఆఫీసరు కనకనే అది లంచం ఇవ్వబోయినా తీసుకోకుండా కేసు బుక్ చేసానని అంటాడు.  అందరూ నమ్మి తీరాల్సిందే.లేక, తనతో వెకిలిగా ప్రవర్తించాడని గొడవ చేస్తుందా?  చెయ్యనీ.  సాక్ష్యమేం లేదుగా!  తను టికెట్ అడిగాడని ఆమే వెకిలిగా ప్రవర్తించ బోయిందంటాడు.  అందుకే మర్యాదగా ఊరుకుని, స్టేషను రాగానే కేసు బుక్ చేసానంటాడు.  దెబ్బకి ఊచల వెనక్కి పోవలసిందే.  అక్కడ ఏ పోలీసో దాని తాట తీస్తాడు.  అప్పుడు కుదురుతుంది దాని తిక్క.  ' అయ్యో!  రైల్లో ఆ టి.సి.గాడి కోరిక తీర్చినా ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా!' అని కుమిలి కుమిలి ఏడుస్తుంది.  అంతే కావాలి.  లేకపోతే తనంత వాడు ఏరి కోరి దాని దగ్గరకి వెళితే, కాదు పొమ్మంటుందా?  పైగా తనని కోతి అని వేళాకోళం చేస్తుందా?' కోతియే లంఖిణిని జంపెరా, కోతియే లంకనూ గాల్చెరా' అన్నట్లు ఈ కోతిగాడు ఎంత వరకు వెళ్ళగలడో దానికి చూపించి తీరతాడు.' తిలక్ జేబులోంచి బ్రాందీ బాటిలు తీసి ఒక పెగ్గు బిగించి కసిగా పళ్ళు నూరుకున్నాడు. కాని అతడి దురదృష్టం!  ఆ రైలు తరవాత స్టేషను చేరుకోనే లేదు.  ఎవరో విద్రోహకారులు చేసిన పనికి వేగంగా వెళ్తున్న రైలు కాస్తా పట్టాలు తప్పింది. డోరు దగ్గర నుంచుని రెండో పెగ్గు బిగిస్తున్న తిలక్ రైలు ఒరిగిపోతుండడం గమనించాడు.  వెంటనే ప్రాణభయంతో పడిపోతున్న రైలు లోంచి దూకేసాడు.  అదే అతడు చేసిన ప్రాణాంతకమైన పొరపాటు.  రైలు లోంచి దూకగానే అతడి తల విద్యుత్ స్థంభానికి కొట్టుకుంది. అతడు చేసిన పాపాలన్నీ పండి, అక్కడికక్కడే దిక్కు లేని చావు చచ్చాడు. ఇంజను డ్రైవరు స్టేషను రాబోతోందనో, ఇంకా సిగ్నలు ఇవ్వలేదనో రైలు వేగం కొద్దిగా తగ్గించాడు.  అదే ప్రయాణీకులకు శ్రీరామరక్ష అయింది.  అందువల్ల రైలు యొక్క మొదటి బోగీ మాత్రం పట్టాలు తప్పింది.  మిగిలిన రైలు పట్టాల మీదనే నిలబడి వుంది. ఐతే చుట్టూ చిమ్మచీకటి.  ఎవరు పోయారో, ఎందరు మిగిలున్నారో తెలియని పరిస్థితి! మాగన్నుగా నిద్ర పట్టిన ఆమెకు ఎవరో బలంగా కిందకు నెట్టినట్లు అనిపించడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. అంతా గోల గోలగా వుంది.  ఏమీ అర్థం కావటల్లేదు.  ఎవరివో హాహాకారాలు వినిపిస్తున్నాయి.  ఆమెకు తలంతా దిమ్ముగా వుంది.  తల మీద చెయ్యి వేసుకుంటే తడి తడిగా తగిలింది.  రక్తంలా వుంది.  ఏమయిందో అర్థం చేసుకునే లోగానే  ఆమెకు స్పృహ తప్పింది.
**********************
          ' లావా!  ఇక కొద్ది రోజులు ఓపిక పట్టు.  ఇది సిధ్ధాంతాలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు.  నా పరువుకు కూడా సంబంధించిన విషయం.  ఇప్పుదు నువ్వేమైనా అల్లరి చెస్తే, అంతర్యామి గారి మాటెలా వున్నా, నేను మాత్రం ఇంక రేపటి నుంచి నలుగురిలో తలెత్తుకు తిరగలేను.  నీచేత కావాలని నేనే ఇల్లా గొడవ చేయించానని అందరూ నన్నాడి పోసుకుంటారు.  దయ చేసి నా పరువు బజార్న పడేయకు.'' దాసూ!  మరోలా భావించకు.  నీ రికార్డే నేను తిరగేస్తాను.  ఇది కేవలం పరువు, ప్రతిష్టలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు.  ఇంత వరకు నేను గాఢంగా నమ్ముకుంటూ వచ్చిన సిధ్ధాంతాలకు సంబంధించిన విషయం.  ఇప్పుడు నా విజ్ఞానాన్ని ప్రదర్శించి, జనాన్ని నేను జాగృతం చెయ్యకపోతే, ఎప్పటికీ వాళ్ళు చీకటిలోనే మ్రగ్గిపోయే ప్రమాదముంది.  ఈ స్వామి బండారాన్ని నేను బైట పెట్టగలిగితే అప్పుడు ఆ కీర్తి నాకు మాత్రమే దక్కదు.  నిన్ను కూడా అందరూ మెచ్చుకుంటారు.'' అది కాదురా లావా!  నీ దగ్గర ఏ విధమైన ఋజువులూ, సాక్ష్యాలూ లేకుండా ఒక మహాత్ముడిని అల్లరి పెట్టాలనుకోవడం హర్షించ దగ్గ విషయం కాదు.  '' నేను ఏ రుజువులూ, సాక్ష్యాలూ చూపించక్కర్లేదు.  అది ఆయన బాధ్యత.  అందుకని ఆ ఋజువులు, సాక్ష్యాలేవో ఆయన్నే చూపించమంటాను.'' ఆయన ఎన్నోసార్లు చూపించారురా.  నాకు విగ్రహాన్ని ప్రసాదించడం, మరొకరికి శూన్యం లోంచి విభూతిని తీసి ఇవ్వడం, ఇంటి చూరు లోంచి కొబ్బరికాయ పడడం, ఆ కొబ్బరికాయకు గంగసింధూరం వుండడం, ఇవన్నీ అతీంద్రియ శక్తులు కాక మరేమిటిరా?' ' అదే, ఆ బండారమే బైట పెట్టాలని నా తపన.' ' ఒరేయి లావా!  నీకు చేతులు జోడించి నమస్కారం చేసి వేడుకుంటున్నానురా.  అంతర్యామి గారు సగౌరవంగా ఈ ఊరినించి వెళ్ళేందుకు నాకు సహకరించరా.' లావా అన్నాడు, ' దాసూ!  నువ్వంత బెంబేలు పడకు.  నేను ఊరికే తొందర పడి ఏ విధమైన గొడవలూ లేవదీయను.  ఇదుగో, నీకు హామీ ఇస్తున్నాను.  నీ ప్రతిష్టకి ఏ విధమైన భంగం కలగనివ్వను.  సరేనా?' రామదాసు తేలిక పడ్డ మనసుతో అన్నాడు, ' హమ్మయ్య!  ఇప్పటికి నామనసు కాస్త కుదుట పడిందిరా.  థాంక్ యూ.' లావా దీర్ఘంగా ఆలోచిస్తూ బైటికి నడిచాడు.  బైటకి వెళ్ళి ఎవరెవరితోనో సుదీర్ఘంగా మంతనాలాడి సంతృప్తిగా తిరిగి ఇంట్లోకి వచ్చాడు.
******************
          ఆమె తలకు బ్యాండేజి గట్టిగా చుట్టబడి వుంది.  కొద్దిసేపు తనెక్కడున్నదీ ఆమెకు అర్థం కాలేదు.  జరిగిన రైలు ప్రమాదం గురించి కొద్ది కొద్దిగా గుర్తుకు వచ్చింది.ఆమె కళ్ళు తెరవడం చూసి నర్సు వచ్చి ఇంజక్షను ఇవ్వబోయింది.' సిస్టర్!  ఇవాళ తారీకెంత?'సిస్టర్ చెప్పింది.' ఇదే ఊరు?' సిస్టర్ చెప్పింది. ' ఇక్కడికి నరసాపురం ఎంత దూరం?' సిస్టర్ జవాబిస్తూ ఇంజక్షను చెయ్యబోయింది. ' సిస్టర్!  చాలా దాహంగా వుంది.  ముందు కాసిని మంచినీళ్ళిచ్చి ఆ తర్వాత ఇంజక్షను చెయ్యండి.' సిస్టర్ మంచినీళ్ళు తెచ్చేసరికి ఆమె బెడ్ మీద లేదు!
*******************
         (ఇంకా వుంది)
   

No comments:

Post a Comment

Pages