భైరవ కోన-7 (జానపద నవల ) - అచ్చంగా తెలుగు
భైరవ కోన-7  (జానపద నవల )
-      భావరాజు పద్మిని

(జరిగిన కధ: సదానందమహర్షి గురుకులంలో శిక్షణ పూర్తి చేస్తాడు భైరవపురం రాకుమారుడు విజయుడు. భైరవారాధన విశిష్టతను తెలుసుకుని, గుహ్యమైన గుహలోని భైరవ-భైరవి శక్తుల కృపను పొందడానికి వెళ్తున్న విజయుడిని అడ్డగిస్తాడు కరాళ మాంత్రికుడు. అతడిని జయించి, భైరవ కృపతో ఒక దివ్య ఖడ్గం, వశీకరణ శక్తి  పొందుతాడు విజయుడు. ఆశ్రమానికి తిరిగి వెళ్ళే త్రోవలో ఒక కోమలిని చిరుతపులి నుంచి రక్షించి, ఆమె ఎవరో తెలీకుండానే ఆమెతో ప్రేమలో పడతాడు విజయుడు. ఆమె కూడా అదే భావానికి గురౌతుంది… ఆమె కుంతల దేశపు రాకుమారి ప్రియంవద అని, ఆమెను తీసుకువెళ్లేందుకు వచ్చిన చెలుల ద్వారా తెలుసుకుంటాడు విజయుడు. విజయుడికి కరాళుడి గురించి చెప్పి, ఇక రాజ్యానికి తిరిగి వెళ్ళమని అనుమతిస్తూ,కర్తవ్య బో ధ చేస్తారు మహర్షి. రాజగురువు ప్రజ్ఞాశర్మ వద్ద చండీయాగం చేస్తుంటుంది రాకుమారి చిత్రలేఖ. శ్వేతాశ్వంపై వెళ్తున్న విజయుడిని ఏదో శక్తి అడ్డగించేందుకు ప్రయత్నిస్తుంది  ...) ఉన్నట్టుండి నల్లటి పొగ కమ్మి, భూమి రెండుగా చీలి, ఏవో విచిత్రమైన అరుపులు వినిపించడంతో బెదిరింది శ్వేతాశ్వం ! గిట్టలు బలంగా నేలకేసి కొడుతూ సకిలించసాగింది. అదంతా ఏదో రాక్షస మాయ అని గ్రహించాడు విజయుడు. ఇంతలో ఎదురుగుండా ఒక ఊడల మఱ్ఱి చెట్టు విజయుడి వైపే నడుస్తూ రాసాగింది... దాని నోటి నుండి మంటలు వెలువడుతున్నాయి. దాని కళ్ళు నిప్పు కణికె లా వెలుగుతున్నాయి... ఊడలు చాచి, దిక్కులు పిక్కటిల్లేలా అరుస్తూ అది విజయుడిని సమీపిస్తోంది. భయపడవద్దు అన్నట్లు, శ్వేతాశ్వం భుజం తట్టి, వెనక్కు నెట్టి, ఊడల మఱ్ఱి పై తన కరవాలం ఝుళిపించాడు విజయుడు. ఒక్కో ఊడని నరికేస్తుంటే... అది మరింత వికటాట్ట హాసం చేస్తూ ఊడలతో అతన్ని చుట్టి, మింగెయ్యలని చూస్తోంది. ఎన్ని ఊడలు నరికినా, మళ్ళీ కొత్తవి పుట్టుకు వస్తున్నాయి దానికి... విజయుడు సందిగ్ధంలో ఉండగా... అది ఒడుపుగా ఒక ఊడతో విజయుడిని చుట్టి, మింగబోయింది. భైరవుడిని మనసులో స్మరించుకుని, దాని నోటిపై గట్టిగా వేటు వేసాడు విజయుడు... వెంటనే పెద్దగా ఆర్తనాదం చేస్తూ చెట్టు నేలకు ఒరగసాగింది. దాని కళ్ళలో పొడిచి, మరో వేటు వెయ్యగానే, ఊడల మఱ్ఱి మాయమయ్యింది. భూమి మామూలు స్థితికి వచ్చి, పొగ, మంటలు అదృశ్యమయ్యాయి. మనసులోనే భైరవుడికి వందనాలు సమర్పిస్తూ, తిరిగి శ్వేతాశ్వంపై పయనమై భైరవపురం చేరాడు విజయుడు. విజయుడి రాక తెలిసి, నగరాన్ని పూలతో, తోరణాలతో, ముగ్గులతో అందంగా అలంకరించారు. కోటగుమ్మం వద్ద విజయుడిని హత్తుకుని స్వాగతించాడు మహారాజు మాణిక్య వర్మ. తల్లి అతడి నుదుట ముద్దాడి, ఇన్నాళ్ళకు కళ్ళబడిన కొడుకుని తనివితీరా చూడసాగింది. వారి పాదాలకు ప్రణమిల్లి, దీవెనలు అందుకున్నాడు విజయుడు. స్త్రీలు విజయుడికి యెర్ర నీళ్ళు దిష్టి తీసారు. పూలమాలలతో అలంకరించి, తిలకం దిద్ది, హారతి ఇచ్చారు. మంగళ వాద్యాలు మ్రోగాయి. ప్రజల జయజయ ధ్వానాలు మిన్నంటాయి... ఇంతలో బాణంలా ముందుకు దూసుకు వచ్చాడు చంద్రసేనుడు. అతడు మంత్రి కుమారుడు, విజయుడి ప్రాణ మిత్రుడు. ఆనందంతో మిత్రుడిని హత్తుకున్నాడు విజయుడు. అంతా అంతఃపురం లోనికి ప్రవేశించారు. “ అమ్మా ! చెల్లెలు ఎక్కడ ?” ఆతృతగా అడిగాడు విజయుడు... “ఉదయమే తిరిగి వచ్చింది విజయా !బహుశా తన మందిరంలో ఉందేమో !వెళ్లి చూడండి...” అంది మహారాణి దేవసేన. ఉత్సాహంగా చెల్లెల్ని కలవాలని ఆమె మందిరం వైపు పరుగు తీసాడు విజయుడు. అతడి వెనుకనే నెమ్మదిగా అనుసరించాడు చంద్రసేనుడు... ఆంతరంగిక మందిరంలో తదేక ధ్యానంతో ఏదో బొమ్మ వేస్తోంది రాకుమారి చిత్రలేఖ. అన్న రాకను కూడా గమనించకుండా ఆమె వేస్తున్న చిత్రం ఏమై ఉంటుందా అని, చప్పుడు చెయ్యకుండా, ఆమె వెనుకకు చేరి చూసాడు విజయుడు. అద్భుతమైన ఆ చిత్రం చంద్రసేనుడిది ! ఒక్క క్షణం కళ్ళప్పగించి అప్రతిభుడై చూస్తూ, ఆమె చిత్రకళా నైపుణ్యానికి అచ్చెరువొందాడు ! ఆమెను ఆట పట్టించాలని, వెనుక నుంచి ఆమె కళ్ళుమూసాడు... “అన్నయ్య ! వచ్చావా !” అంటూ విజయుడి చేతులను అడ్డు తీసి, ఉద్వేగంగా వెనుతిరిగింది చిత్రలేఖ . “అవునమ్మా, బాగున్నావా ? అంటూ చెల్లిని ప్రేమగా దగ్గరకు తీసుకుని, “అయినా చంద్రసేనుడికి త్వరలో కాబోయే ఇల్లాలివి, ఇక ఈ అన్నయ్య ఎందుకు గుర్తుంటాడు లే !నన్ను స్వాగతించేందుకు కూడా రాలేదుగా !” అంటూ బుంగమూతి పెట్టి వెనుతిరిగాడు విజయుడు. “అలా అనకు అన్నయ్యా ! రేపు మా కాబోయే అత్తగారు సువర్ణాదేవి పుట్టినరోజు. ఏ తల్లికైనా బిడ్డ చిత్తరువును మించిన గొప్ప బహుమతి ఏముంటుంది చెప్పు ? సమయం తక్కువ ఉండడం వల్ల, నా మనసులో కొలువున్న రూపాన్ని తలచుకుంటూ,వెంటనే చిత్రం వేస్తున్నాను. నాకు చంద్రసేనుడు అంటే యెంత ప్రాణమో నువ్వూ అంతే ! మీ ఇద్దరూ నా రెండు కళ్ళ వంటి వారు. మా మంచి అన్నయ్యవు కదూ ! ఇక అలక మాని నవ్వాలి...” అంది విజయుడి గడ్డం పట్టుకు బ్రతిమాలుతూ. ఆమె దూరాలోచానకు, సహృదయానికి మురిసి, నిండుగా నవ్వాడు విజయుడు. ఇంతలో చంద్రసేనుడి రాకను గమనించి, “రావయ్యా మిత్రమా ! ఇదిగో నీ బొమ్మ గీస్తూ, అన్నను కూడా మర్చిపోయింది... చాలా కాలమైంది కదూ, మీరిద్దరూ మాట్లాడండి... నేను కాస్త బడలిక తీర్చుకుని, మరలా వస్తాను...” అంటూ అక్కడి నుంచి నిష్క్రమించాడు విజయుడు. ఎందుకో సిగ్గు ముంచుకు వచ్చేసింది చిత్రలేఖకు. మనసు నిండా చంద్రసేనుడిని కళ్ళారా చూడాలని ఉన్నా, సిగ్గుతో బరువెక్కిన కనురెప్పలు వాలిపోతున్నాయి. ఆమె స్థితిని అర్ధం చేసుకుని, నెమ్మదిగా ఆమెను పొదివి పట్టుకుని, ఆసనంపై కూర్చోపెట్టాడు చంద్రసేనుడు.”ఎలా ఉన్నావు చిత్రా ! నీ చిత్రకళా నైపుణ్యం అద్భుతం !” అన్నాడు. “బాగున్నాను చంద్రా ! చండీయాగం ముగిసి, ఉదయమే ఇక్కడికి వచ్చాను... అంతా కుశలమా ?” నెమ్మదిగా అడిగింది చిత్రలేఖ. “అంతా బాగున్నాము. ముఖ్యంగా చిత్రా దేవి దర్శన భాగ్యంతో మనసునిండుకుని, నేను మరింత బాగున్నాను...” అన్నాడు ఆమెనే చూస్తూ... ఆమెకు దగ్గరగా జరిగి... నెమ్మదిగా అతని ఎదపై వాలి, “చంద్రా ! ఈ రోజు నీతో మనసు విప్పి మాట్లాడాలి... ఆపద ముంచుకు వస్తోందని రాజగురువు చెప్పారు... మళ్ళీ ఇటువంటి అవకాశం, మీతో ఏకాంతం దొరుకుతుందో లేదో...” అంటూ అర్ధోక్తిలో చూస్తూ ఆగిపోయింది... “చెప్పు చిత్రా ! సందేహించకు...” అంటూ నెమ్మదిగా ఆమె కురులు సవరిస్తూ మౌనం వహించాడు చంద్రసేనుడు. “చంద్రా ! ఒక స్త్రీకి ప్రపంచంలోనే అతి బలమైన, ప్రశాంతమైన స్థానం ఏమిటో తెలుసా ! తన పతి హృదయం...  ఈ కోటలు, బలమైన బురుజులు , ఇంత మంది సైన్యం ఇవ్వలేని ధైర్యం నాకు నీ వద్ద కలుగుతోంది. అందుకే అన్ని సంకోచాలు వీడి, ఇవాళ నా మనసును సముద్రంపై పున్నమి వెన్నెల పరచినట్లు... నీ ముందు పరుస్తున్నాను...” అంటూ ఇలా చెప్పసాగింది... (సశేషం...)    

No comments:

Post a Comment

Pages