“దీపం జ్యోతి పరబ్రహ్మ” - అచ్చంగా తెలుగు

“దీపం జ్యోతి పరబ్రహ్మ”

Share This
“దీపం జ్యోతి పరబ్రహ్మ”
-      కొంపెల్ల శర్మ

బలి చక్రవర్తిని బంధించి పాతాళమునకు వామనుడు పంపినది నేడె! రావణుంబరిమార్చి రాముడర్ధాంగితో నను జన్ము భరతు గాంచినది నేడె! క్రూరుడౌ నరకాసురుని సత్యభామ కృష్ణుని వెంట జని వధించినది నేడె! విక్రమార్కుడు శత్రు విజయంబు గావించి తన పేర శకము నిల్పినది నేడె!   శ్రీమహావీర జిను డహింసా మహస్సు దెసల బ్రసరింప సిద్ధి పొందినది నేడె! వచ్చె నిదిగొ సౌవర్ణ శోభాప్రపూర్ణ సర్వజనము దీపావళి పర్వదినము.  (కరుణశ్రీ - విజయ దీపావళి) ఆంధ్రుల ఆరాధ్య పండుగ దీపావళి గురించి, సూక్ష్మంలో మోక్షంగా ప్రముఖ కవి, కరుణశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు వర్ణించిన తీరు అనూహ్యం. అలతి పదాలతో అనల్పార్ధరచనను కావించడంలో కరుణశ్రీ సిద్ధహస్తులు.   దీపావళి అంటే సూక్ష్మంగా సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు చేసిన నరకాసుర సంహారానికి పరమానంద భరితులై జరుపుకునే పండుగ దీపావళి. ఆశ్వయుజమాసంలో అమావాస్య ముందుగా వచ్చే చతుర్దశిని నరక చతుర్దశిగా వ్యవహరిస్తారు. టపాకాయలు కాల్చి ఆచరించుకునే పండుగ కాబట్టి పిల్లలు ఈ పండుగలో ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. ఈ పండుగ సందర్భంగా కాల్చే బాణాసంచా కారణంగా వర్షాకాలంలో పుట్టుకు వచ్చిన క్రిమి కీటకాలు నశిస్తాయనే విశ్వాసం వల్ల ఇది ఆరోగ్యకరమైన ఆచారం అనే వాదన వుంది. 'దిబ్బుదిబ్బు దీపావళీ అంటూ సాయంత్రం కాగానే ప్రమిదలలో వత్తులు వేసి, నూనె పోసి ఇంటిముందు, వరండాలలో దీపాలు వెలిగిస్తారు.   దీపావళి అందరికీ దసరాకంటె ఎక్కువగా దేశమంతటా ఆనందంతో ఆచరించే పండుగ దీపావళి. దీపాలపండుగగా ప్రసిద్ధిచెందిన ఈ ఉత్సవం రెండు మూడు రోజులు వైభవంగా జరుపుకునే ఆచారం కూడ ఉంది. దీపావళిని జానపదులు, శిష్టులు అనే భేదం లేకుండా అందరూ ఆచరిస్తారు. దీపావళి గురించి రెండు మూడు కధలున్నాయి. మొత్తంమీద సత్యభామ సహకారంతో శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి సంహరించాడనేది మాత్రం అందరికీ తెలిసిన కధ. నరక చతుర్దశినాడు తెల్లవారుఝామున లేచి తలంటుస్నానం చెయ్యాలని, ఈ స్నానంతో నరకాసురుని పీడవదలిపోతుందని చాలామంది విశ్వాసం. దీపావళి అమావాస్యరోజు వస్తుంది కాబట్టి, ఆ రోజు చాలామంది కొత్తగుడ్డలు కట్టుకోరు. వాళ్ళు నరకచతుర్దశి రోజునే కట్టేసుకుంటారు. కొత్త అల్లుళ్ళు ఇంటికివచ్చి ఉంటేమాత్రం, తప్పక అత్తవారింట్లో దీపావళికి తిష్ఠవేసేస్తారు. దీపావళికి ఎంతలేని వాళ్ళయినా సరే, కొత్తగా పెళ్ళయిన కూతురికి, అల్లుడికి బట్టలు పెడ్తారు. పండుగ, బట్టల సంబరమంతా చతుర్దశినాడే ముగిస్తారు కూడ. దీపావళినాడు టపాకాయలతో ఊరూవాడ అంతా మార్మోగుతుంది. ఈ చప్పుళ్ళు దీపావళి తర్వాత కూడ కొన్ని రోజులవరకూ వినిపిస్తాయి. దీపావళినాడు దీపాలను పెట్టి అమావాస్యనాడు వెలుగును కొని తెచ్చుకుంటారు. దీపావళి అంటే దీపముల బారు. ఊరికి దీపం బడి - మనిషికి దీపం నడవడి అంటారు.   దీపావళి రోజుకు ముందు-వెనుకలు   దీపావళికి ముందు రోజు నరకచతుర్దశి, అంతకు ముందు కొందరు “ధనత్రయోదశి” అని ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాత రోజును కొన్నిచోట్ల “బలిపాడ్యమి” గా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. బలి చక్రవర్తిని మించిన దానశూరులుండరు అంటారు. వస్తువులను దానమివ్వడం కాక, తన్ను తానే శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి. బలిని, ఆయన భార్య విద్యావతిని పూజించే సంప్రదాయం కూడ వుంది. కేరళలో బలిచక్రవర్తి తమను పరిపాలించాడని నమ్మి, వారు తమ జాతీయ పర్వమైన “ఓనం”ను బలి ప్రీత్యర్ధం జరుపుకుంటారు. దక్షిణభారతదేశంలో దీపావళి మూడునాళ్ళ పండుగగా జరుపుకుంటే, ఉత్తరభారతదేశంలో, మొత్తం ఐదు రోజులపాటు దీపావళిని జరుపుకోవడం పరిపాటి. “ధనత్రయోదశి” లేక “ధన్-తేరస్” లేక “యమత్రయోదశి” (మొదటిరోజు), నరకచతుర్దశి (రెండవరోజు), దీపావళి (మూడవరోజు), బలిపాడ్యమి (నాల్గవరోజు), భ్రాతృద్వితీయ లేక యమద్వితీయ (ఆఖరుగా ఐదవరోజు) జరుపుకుంటారు.   మరో ఆచారం   దీపావళి జరుపుకోవడం, మూడు, ఐదు రోజులపాటు జరుపుకోవడం ఒక పద్ధతి అయితే, పండుగను ఆచరించడంలో మరియొక పద్ధతి కూడ దర్శనం అవుతుంది. ప్రధానంగా, నరకాసుర వధ, బలిచక్రవర్తి రాజ్య దానం, శ్రీరాముడు రావణ సంహారానంతరం అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమేవేశమగుట (భరత్ మిలాప్ అని పిలుస్తారు), విక్రమార్క చక్రవర్తి పట్టాభిషేకం, ప్రధానేతివృత్తాలుగా గోచరిస్తాయి.   “దీపం” దైవస్వరూపం   యమదీపం - త్రయోదశి నాటి సాయంకాలం, యింటి వెలువల యమునికొరకు దీపం వెలిగించడంవల్ల అపమృత్యువు నశిస్తుంది అని అంటారు. అలాగే, అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోషసమయాన దీపదానాన్ని చేస్తే, మానవుడు యమమార్గాధికారంనుండి విముక్తుడవుతాడని అచంచల విశ్వాసంగా వస్తూంది. “దీపోత్సవ చతుర్దశి” రోజున యమతర్పణం చేయాలని, ధర్మశాస్త్రాల్లో వివరించినట్లు కూడ తరచు చెప్తారు. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని 'కౌముదీమహోత్సవం' అని నిర్వచించినట్లుగాను, నరకచతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేయాలని చెప్పాడని వివరించారు. అలాగే, దీపావళినాడు కౌముదీ మహోత్సవాన్ని జరిపేవారని, ముద్రారాక్షసం గ్రంధంలో వివరించినట్లు కూడ తెలుస్తూంది. బౌద్ధజాతక కధల్లో లక్షదీపోత్సవం, దీపదానం కూడ జరిపినట్లు అనేక కధలు వివరించాయి. బుద్ధుని చుట్టూరా దీపాలను పెట్టి పూజించినట్లు చెప్పబడింది.   నాగానందం లో సదాచారం - కూతురు-అల్లుడికి రాజయోగాలు దీపావళినాటికి కూతురిని, అల్లుడిని పిలిపించే సంప్రదాయం నాగానందం లో వర్ణించినట్లు తెలుస్తోంది. విశ్వవసు అనే రాజు తన కూతురు మలయవతికిని, అల్లునకును, దీపప్రతిపది ఉత్సవానికి (కార్తీక శుక్ల పాడ్యమి) బహుమతి యిచ్చేందుకు తన పుత్రునిద్వారా ఏర్పాట్లు చేస్తాడు.   మహావీరునికి నివాళి తో “దీపావళి” ప్రారంభం   మహావీరుడు ఈ అమావాస్యనాడే మరణం చెందినట్లు, ఆనాడు దేవతలు ఆయన్ని పూజించి, 'పావా' నగరమంతా దీపాల్ని వెలిగించారని, అప్పటినుండి దీపావళి పండుగ ఏర్పాటయిందని జైన హరివంశంలో వివరించినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.   విజయనగరకాలం నాట దీపావళి సకల కళాసంస్కృతులతో విరాజిల్లిన విజయనగరసామ్రాజ్యపు కాలంనాడు, దీపావళిని వైభవేపోతంగా జరుపుకునే పద్ధతి వుందని తెలుస్తూంది. దీపావళిని తెలుగువారు “దివ్వెల” పండుగగా జరుపుకోవడం, నేటికీ తెలంగాణాలో కనిపిస్తుంది.   చరిత్ర-భూగోళం మధ్యలో దీపావళి   ప్రపంచం వసుధైవకుటుంబంగా మారడం ఆనాడే గమనిస్తాం. కళ, సంస్కృతి రంగాల్లో ప్రముఖంగా ఈ విధానాన్ని గమనిస్తాం. సుప్రసిద్ధ అరబ్ యాత్రికుడు “అల్ బెరూనీ” 11 శ. లో దీపావళి మనదేశంలో ఎలా జరుపుకుంటామో వివరించాడు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవాల్లో దీపదానం ఆచారం వున్నట్లు ఎక్కువ దేశాల్లోని చారిత్రక ఆధారాలు కనిపిస్తాయి. ఈజిప్ట్, యమన్ లో జరుపుకునే సూర్యదేవత జన్మదినోత్సవం క్రైస్తవుల్లో నడుస్తూంది. ఈజిప్టులో దక్షిణాయనం ప్రారంభ సూచకంగా, మరణించినవారిపై గౌరవసూచకంగా, దీపోత్సవాన్ని జరుపుకునే ఆచారం, మరణించిన వారి ఆత్మ తమ యిళ్ళకు తిరిగివస్తుందనే విశ్వాసంతో, సమాధులనుండి యిళ్ళ వరకు దీపాలని వరసగా వెలిగించి, బారులు కడ్తారు. చైనాలో, ఏటికి రెండుసార్లు దీపోత్సవాలు జరుపుకుంటారు. అమెరికాలో మన దీపావళి లాంటిది, 'హోలోవీణ్’ ను నవంబర్ 1 న జరుపుకుంటారు. ఈ పండుగను క్రీ.పూ. కు కొన్ని శతాబ్దాల క్రితమే యిప్పటి ఆంగ్లేయుల పూర్వీకులు కెల్ట్ (డ్రూయిడ్) జాతివారే ప్రారంభించారట. రోమనులు 'పామోనా' పండుగ కూడ అలాగే వుంటుంది. ఫలితంగా క్రైస్తవులు, యితర పండగల్ని, 'ఆల్ హోలోణ్, 'ఆల్ సెయింట్స్ డే' గా జరుపుకుంటారు. నేటికీ క్రైస్తవులు జరుపుకునే 'కాండిల్ ఫెస్టివల్’ దీపావళితో పోల్చదగ్గదే. ముస్లింల్లోనూ దీపావళి లాగ, మహమ్మద్ పైగంబర్, కొత్త సంప్రదాయంగా, మక్కాకు తిరిగివెళ్ళిన రోజు రాత్రికి సూచకంగా దీపోత్సవాన్ని జరుపుకునే ఆచారానికి శ్రీకారం చుట్టి, ఈ పద్ధతికి 'షబే బరాట్ (రాత్రి ఊరేగింపు) అని పిలుస్తారు. ఈరోజున, బాణసంచా కాల్చి, మతాబాలు వెలిగిస్తారు. దీపావళి రోజున మతాబాలని కాల్చడం మనకు ముస్లింలతో సంబంధాలను ఏర్పరచుకున్న తర్వాతే మొదలయ్యింది అని తిరుమల రామచంద్రగారు అభిప్రాయపడ్డారు. చారిత్రాత్మకంగా దేశవిదేశాల్లో వివిధ మతస్తులు దీపావళిని ఎలా జరుపుకుంటున్నా, మన భారతదేశంలో మాత్రం - దీపావళిని దివ్వెల పండగ, దివిలి పండగ, పితాళ్ళ పండగగా - జరుపుకోవడం సదాచారంగా, అనుశ్రుతంగా వస్తోంది.   జీవితపర్వంలో దీపావళి   భారతీయతలో భాగంగా, దీపావళి పండగ ఒక పర్వదినంగా, జీవితంతోపాటు, జీవితంలో భాగంగా వస్తోంది. అందుకే, ఒక సినీమాకవి, దీపావళిని, “చీకటి వెలుగుల రంగేళీ, జీవితమే ఒక దీపావళి” అని బహు సమంజసంగా వివరించాడు. వెలుగుతోపాటు, చీకటినీ తెస్తుంది అని చాటి చెప్పాడు. దీపం ఎంతో వెలుగును విరజిమ్మినా, తన చుట్టూ మాత్రం చీకటిని తొలగించుకో లేదు అన్నది సత్యమే కదా. చెంత దీపం లేకుండా చీకటి పోదుకదా. దీపం పేరు చెబితే చీకటి పోతుందా అనే సామెత ఎలాగూ వుందికదా. అందుకే చీకట్లో చేసిన పనులను దుష్కార్యాలుగా జమకడ్తారు. ఈ భావాన్నే, చీకటి మనసులతో చేసిన పాపాలను గురించి అర్పేసిన దీపం వాంగ్మూలం యిస్తుందని చెప్తారు. చీకటి బజారు అన్న పదం కూడ చాలా ప్రతికూలంగా చెప్పుకోవడం కూడ పరిపాటేగదా.   అజ్ణాన తిమిరాన్ని పారద్రోలేది 'దీపం'   కామ క్రోధ లోభాలు నరకానికి కారణాలు అయి గీతాచార్యుడు వివరించాడు. ఈ మూడింటినీ జయించాలంటే, అజ్ణానాంధకారాన్ని జయించాలి. ఈ అంధకారాన్ని జయించేందుకు జ్ణానదీపాన్ని వెలిగించాలి. జీవితాలను నరకప్రాయం నుంచి రక్షించేందుకు మనందరకు కావలసినది జ్ణానదీపం ఒక్కటే. ఆ దీపం యిలా ఉండాలి అని పురాణాలు చెప్తున్నాయి.   'వైరాగ్య తైల సంపూర్ణే, భక్తివర్తి సమన్వితే, ప్రబోధపూర్ణ పాత్రేతు, క్షిప్తిదీపం విలోకయేత్”.   నిండైన ప్రమిద ప్రచోదమైతే, ఆ ప్రమిదను వైరాగ్యమనే నూనెతో నింపి, భక్తి అనే వత్తిని జ్ఞానమనే దీపాన్ని వెలిగించాలి. ఇలా భక్తి వైరాగ్యాలతో అజ్ణానాంధకారాన్ని ఎదుర్కొని జ్ణానజ్యోతిని వెలిగించాలనే విశిష్టమైన సందేశాన్ని ఈ దీపావళి మనకు నిత్యం అందిస్తూనేవుంది.   దీపం వెలిగించిన పిదప -   'దీపం జ్యోతి పరబ్రహ్మ: దీపం సర్వ తమోపహం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యా దీప నమోస్తుతే''   దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన:, దీపేన హరతే పాపం, సంధ్యాదీప నమోస్తుతే'   దీపాన్ని వెలిగించిన తర్వాత దీపాన్ని స్తుతించడం సంధ్యాసమయంలో దీపాన్ని దర్శించడం, దీపాన్ని నమస్కరించడం మనకు సదాచారం, సత్సంప్రదాయం.   " చుట్టూరా ఆవరించుకుని వున్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవడంకంటె, ప్రయత్నించి ఎంత చిన్నదీపాన్నయినా వెలిగించడం మంచిది" అన్న సూక్తిని ఊపిరిగా భావిస్తూ, దీపావళి పండుగ శుభసందర్భంగా తెలుగురథం శుభాకాంక్షలను తెలియజేస్తోంది.  
కొంపెల్ల శర్మ - తెలుగురథం.

No comments:

Post a Comment

Pages