గాడిద నవ్వింది - అచ్చంగా తెలుగు
గాడిద నవ్వింది
-     బి.ఎన్.వి.పార్ధసారధి

“ లేరా గాడిదా. స్కూల్ కి టైం అవుతోంది. ఇంకా పందిలా పడుకున్నావు.” తండ్రి విశ్వనాధం అరుపుకి వెంటనే పక్క మీంచి లేచి బాత్ రూం వైపు పరుగు తీసాడు బాలు. గబగబా సిద్ధం అయేసరికి సమయం ఎనిమిది అవనే అయ్యింది. “ఒరేయ్ గాడిదా, స్కూల్ బస్సు వచ్చే వేళయింది. త్వరగా తెమిలి తగలడు.” మళ్ళీ తండ్రి కేక వినగానే “ రెడీ అయిపోయాను నాన్నా . వచ్చేస్తున్నా “ అని బాలు స్కూల్ బాగ్ భుజాన వేసుకుని వాకిట్లోకి వచ్చి షూస్ తోడుక్కోసాగాడు.  సరిగ్గా అప్పుడే చాకలి రాములు గాడిద తోపాటు వీధులో వెడుతూ కనిపించాడు. “ఈ రాములు గాడు ఒక్కరోజన్నా కనిసం నాకన్నా కాస్త ముందో వెనకో వెళ్ళచ్చు కదా. రోజూ సరిగ్గా నేను స్కూల్ కి వెళ్ళే సమయానికే రావాలా” అని మనస్సు లోనే చాకలి రాములుని తిట్టుకున్నాడు బాలు. బాలు ఇంటి గేటు తేసుకుని వీధి లోకి రావటం, చాకలి రాములు, వాడి వెంట వీపు మీద బట్టల మూట మోసుకుంటూ గాడిద నడుస్తూ వెళ్ళటము ఒకేసారి జరిగాయి. బట్టల మూట బరువుకి భారంగా అడుగులు వేసుకుంటూ గాడిద నెమ్మదిగా నడుస్తోంది. స్కూల్ బస్సు బాలు వాళ్ళ ఇంటిదగ్గర వంద గజాల దూరంలోని మెయిన్ రోడ్ మీద వచ్చి ఆగింది. స్కూల్ బస్సు డ్రైవర్ హారన్ మ్రోగించే లోపు బాలు పరుగెట్టుకుంటూ బస్సు ఎక్కాడు. “ నాకన్నా రాములుగాడి గాడిద అదృష్టవంతురాలు. బట్టల బరువు మోస్తున్నా నెమ్మదిగా నడిచి వెడుతోంది. నాకు ఆ అదృష్టం కూడా లేదు. ఉదయం సాయంత్రం రెండు పూటలు బస్సు వెనకాల పుస్తకాల బరువు వీపున మోసుకుంటూ పరుగెత్తడం తోనే సరిపోతోంది. “ అని మనసులో అనుకున్నాడు బాలు. ఒక్కో తరగతి పాస్ అవటంతో క్రమేపి బాలుకి స్కూల్ పుస్తకాల బరువు పెరగసాగిందే కానీ తగ్గలేదు. దాంతో బాలుకి చాకలి రాములు గాడిదని చూస్తే రోజు రోజుకి అసూయ వేయసాగింది. “ మా చిన్నప్పుడు ఇన్ని పుస్తకాలు లేవు. ఆడుతూ పాడుతూ బడికి వెళ్ళే వాళ్ళం. “ అప్పుడప్పుడు అనేవాడు తండ్రి విశ్వనాధం  బాలుతో. ‘ అందుకే కాబోలు నాన్న ఎప్పుడు నన్ను గాడిదా అని తిడతాడు కానీ గాడిద కొడకా అని ఒక్కసారి కూడా అనడు.’ తన మనసులోనే నవ్వుకున్నాడు బాలు . జూనియర్ కాలేజీ చదువు ముగిసి ఇంజనీరింగ్ లో చేరాడు బాలు.  బాలుకి ఇంటర్ లో మంచి రాంక్ రావటంతో ఇంజనీరింగ్ సీట్ కూడా మంచి కాలేజీ లోనే వచ్చింది.  తన మీద ఇటు ఇంట్లో వాళ్ళు, అటు కాలేజీలో లేక్చెరర్స్  ఎన్నో ఆశలు పెట్టుకొని  ఇంజనీరింగ్ లో కాలేజీ టాపర్ తో పాటు  మంచి యూనివర్సిటీ రాంక్  తెచ్చుకోవాలని పదేపదే అంటూ వుండటంతో , పుస్తకాల బరువు కాలేజీ కి వచ్చాక ఇంకా పెరిగిందే కానీ తగ్గలేదు. అందరూ ఆశించినట్టు గానే బాలుకి ఇంజనీరింగ్ లో మంచి రాంక్ వచ్చింది. కాంపస్ ప్లేస్మెంట్ లో మంచి ఐ టీ కంపెనీ లో ఉద్యోగం కూడా వచ్చింది. బెంగుళూరు లో ముందుగా ఆరు నెలలు ట్రైనింగ్. తండ్రి నాలుగు జతల కొత్త బట్టలు కొనిచ్చాడు. ఉన్నవాటిలో అర డజను మంచి బట్టలు బాగా ఉతికి ఇస్త్రీ చేసుకురమ్మని చాకలి రాములుకి ఇచ్చారు. మర్నాడు బాలు బెంగుళూరు ప్రయాణమనగా ముందు రోజున చాకలి రాములు శుభ్రంగా ఉతికి ఇస్త్రీ చేసి బాలు బట్టలని తీసుకువచ్చాడు. చాకలి రాములు తో పాటు వాడి గాడిద కూడా వచ్చింది. ఎందుకో గాడిదని చూసిన వెంటనే బాలుకి దాని మీద ఈసారి జాలి కలిగింది. “ నాకు పుస్తకాల బరువు ఇహ మీదట వుండదు. కానీ పాపం ఈ గాడిదకి దాని బట్టల బరువునుంచి మోక్షం ఎప్పుడో “ అనుకున్నాడు బాలు సానుభూతిగా.  “ చిన్నబాబుకి చదువు భారం ముగిసింది. హాయిగా మహరాజులా ఉద్యోగం చేసుకోవచ్చు.” అన్నాడు చాకలి రాములు బాలుకేసి చూసి మెచ్చుకోలుగా. “ వాడు మహరాజులా ఎప్పుడు ఉద్యోగంలో చేరతాడా అనే ఇన్నాళ్ళు ఎదురు చూసాను. ఇహ  ఇంటి భారం వాడి భుజాల పైనే మోయాలి. నేను ఆరు నెలల్లో రిటైర్ అవుతాను. నా రిటైర్మెంట్ డబ్బులతో అతి కష్టం మీద కూతురి పెళ్లి చెయ్యాలి. ఇంత వరకు అప్పులు లేవు కానీ ఆస్తులు అస్సలే లేవు. కాబట్టి కుటుంబ భారాన్ని వాడే మోయాలి. “ అన్నాడు విశ్వనాధం. ఇన్నాళ్ళు పుస్తకాల బాగ్ తో వీపుమీద ఉన్న బరువు తొలగిపోయి దానికన్నా మరింతగా కుటుంబ భారం మరుక్షణమే తన భుజాలమీద పడ్డట్టు ఫీల్ అయ్యాడు బాలు. డబ్బులు తీసుకుని చాకలి రాములు వెడుతుండగా , రాములు వెనకాల బయలుదేరిన గాడిద ఎందుకో తనని చూసి నవ్వినట్టు అనిపించింది బాలుకి. 
 ****************

No comments:

Post a Comment

Pages