గంగాధరశాస్త్రి గారి - సంపూర్ణ భగవద్గీత
- భావరాజు పద్మిని
“సంపూర్ణ భగవద్గీత “ ఆడియో గురించి ప్రఖ్యాత గాయకులు శ్రీ గంగాధరశాస్త్రి గారితో భావరాజు పద్మిని టెలిఫోన్ ముఖాముఖి... నమస్కారమండి. మీ కుటుంబ నేపధ్యం గురించి చెబుతారా ? మాది కృష్ణాజిల్లా విజయవాడ సమీపంలోని అవనిగడ్డ. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే చాలా ఇష్టం. అన్నమయ్య పాటలు , ఘంటసాల పాటలు, ఇష్టంగా వింటుండేవాడిని. వాటి ప్రభావం నాపై చాలా ఉంది. తల్లిదండ్రులు గాయకులు కావడంతో , వారి ప్రోత్సాహంతో , సంగీతం పట్ల అభిరుచి ఒక ఆస్తిగా సంక్రమించింది. మా ఊళ్ళో అన్ని పండగలకి, ఉత్సవాలకి పందిళ్ళు వేసి, హరికధలు, కచేరీలు పెట్టేవారు. సంవత్సరానికి ఒక్కసారైనా పీఠాధిపతులు మా ఊరు వచ్చేవారు. చిన్నతనంలో ఒకసారి కంచి పరమాచార్యులు మా ఊరు వచ్చారు. అప్పుడు ఆరోగ్యం బాగాలేని నన్ను ఆయన పాదాల వద్ద ఉంచగా, “ఆరోగ్యవంతుడై చాలా గొప్పవాడౌతాడు, లోకం ఇతని గురించి ఆలోచిస్తుంది, “ అని దీవించారు. అటువంటి మహానుభావుల ఆశీర్వాదం వల్ల తర్వాతి కాలంలో డాక్టర్ అవుదామనుకున్న నేను, దైవసంకల్పంతో ఇటువైపు వచ్చాను. అప్పుడు డిగ్రీ(B.A) వరకు నేను అక్కడే చదువుకున్నాను. తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం నేర్చుకోవాలన్న లక్ష్యంతో హైదరాబాద్ వచ్చాను. చిన్నప్పుడు శివతాండవ స్తోత్రానికి సంబంధించి, మీ తల్లిగారితో ఓ గొప్ప అనుభూతి ఉందని చెప్తారు... భగవద్గీత ‘ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం...’అన్నారు. శ్రద్ధ, పట్టుదల, ఇంద్రియనిగ్రహం, ఉన్నవారికే జ్ఞానం సంప్రాప్తిస్తుందని చెప్పారు. ఇక్కడ ‘జ్ఞానం’ అంటే ఆధ్యాత్మిక జ్ఞానమే అని గుర్తించాలి. ఏ వ్యక్తిపై అయినా పెంపకం ప్రభావం 99 % ఉంటుంది. చిన్నతనంలోనే అమ్మ, నానమ్మ, నేర్పిన శ్లోకాలు, పూజలు, నైవేద్యాలు, వీటన్నిటినీ చూస్తూ పెరగడం వల్ల, ఆ కుటుంబ నేపధ్యం ప్రభావం నాపై పడింది. మాటకు శక్తి చేకూరాలంటే, పరమాత్మ కరుణ కావాలంటే, దైవభాష నేర్చుకోవడం ముఖ్యం అంటూ, ఆ దిశగా వారు నన్ను ప్రోత్సహించారు. అలా డిగ్రీ వరకూ నేను సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ గా చదివాను. నాలుక తిరగడం కోసం నాకు శివతాండవ స్తోత్రం చదవమని అమ్మ చెప్పింది. వారం రోజుల్లోనే నేర్చుకుని వినిపించాను. శుభ్రమైన వాక్కు కు ఒక శక్తి ఉంటుందని, ఆ శక్తి లోకాన్ని ప్రభావితం చేస్తుందని, అమ్మ చెప్పేది. అలాగే మా నాయనమ్మ ‘విద్వత్ హాల్’ లో భగవద్గీత ప్రవచనాలు చెప్తుండేది. అదే చిన్నతనంలో నాలో ‘భగవద్గీత’ బీజానికి కారణమయ్యింది. నేను స్పష్టంగా పలకడానికి 40 ఏళ్ళ క్రితం అలా బీజం పడితే, సంగీత జ్ఞానం స్వరకల్పనకు ఉపయోగపడింది. అంతేకాక, సినిమాల్లోని పద్యాలను అనుకరిస్తూ చెప్పడంవల్ల, ఇప్పుడు భగవద్గీత శ్లోకాల భావం నాటకీయ విధానంలో చెప్పగలుగుతున్నాను. ఇదంతా పరమాత్మ అనుగ్రహంగా, సంకల్పంగా భావిస్తాను. గానపరంగా మీ కెరీర్ ఎలా ప్రారంభమయ్యింది ? ‘గాంధర్వం చ కవిత్వం చ శూరత్వం దానశీలత ... ‘ అన్న ఒక శ్లోకం ఉంది. ఇవన్నీ నేర్చుకుంటే రావని, ఆ శ్లోక భావం. పుట్టుకతోనే పూర్వజన్మ సుకృతం వల్ల కళలు సంప్రాప్తిస్తాయి. చిన్నతనం నుంచే పాట నాతో ప్రయాణిస్తోంది. నేను హైదరాబాద్ వచ్చాకా, సంగీతం నేర్చుకున్నాకా, ఇక్కడి వేదికలు, అవకాశాల ద్వారా పాక్షికంగా నా కెరీర్ మొదలైంది. నేను చివరగా చేసిన ఉద్యోగం ఈనాడు లో జర్నలిస్ట్ గా. ఆ సందర్భంగా అనేకమంది సినీ ప్రముఖుల్ని కలిసాను. సంగీతం నన్ను పూర్తిగా ఆక్రమించిన ఒక స్థితిలో, సంగీతానికి సమయం కేటాయించాలని నిర్ణయించుకుని, ఉద్యోగం వదిలేసాను. తర్వాత అనేక కచేరీలు ఇస్తూ ఉండేవాడిని. మీ గొంతు అలానే ఉండేదా ? అభిమానంతో అలా మార్చుకున్నారా ? నా పాటను నేను నా గొంతు తోనే పాడతాను. (శివపాదము నుంచ నే శిలనైనను కారాదా ... అనే పాట పాడి వినిపించారు...)అయితే, ఘంటసాల గారి పాటలు ఆయన గొంతుతో పాడతాను. (గుండె మంట లారిపే పాట వినిపించారు )ఒక పనిని అభిమానంతో చేస్తూ చేస్తూ ఉంటే, చివరికి ఆ పనే మనం అయిపోతాం. ఆయన గొంతులో ఉండే ఇన్వాల్వేమేంట్ తో, ఆయన ప్రభావంతో ,ఎందుకో నా ఆత్మ ఆయన గొంతుతో అనుసంధానమైంది. గాయకుడు గంగాధరశాస్త్రి, జూనియర్ ఘంటసాల గంగాధరశాస్త్రి... ఎలా పిలిపించుకునేందుకు మీరు ఇష్టపడతారు ? జనాన్ని ప్రభావితం చేసే గాయకుడు గంగాధరశాస్త్రి గానే పిలిపించుకునేందుకు ఇష్టపడతాను. నేను రేడియో లో A గ్రేడ్ సింగర్ ని. ఆయన పాటలతో నేను పాపులర్ అయ్యాను కనుక, ఆ ముద్ర పడింది. కాని, ఇప్పుడు నన్ను ఎవరు కలిసినా ‘భగవద్గీత’ గాయకుడిగానే గుర్తిస్తున్నారు. ఇది చాలా ఆనందదాయకం. జర్నలిజం నుంచి సంగీత ప్రస్థానం దిశగా అడుగులు ఎలా పడ్డాయి ? నేను సంగీతం నేర్చుకుంటూ ఉండగా – సంగీతం మనల్ని పోషిచే వరకూ, మనం సంగీతాన్ని పోషించాలి అనుకున్నాను. అప్పుడు హైదరాబాద్ లో ఉన్న మా మేనమావ గారు ఈనాడులో సినీ జర్నలిస్ట్ ల కోసం వెలువడిన ప్రకటన చూపి, అప్లై చెయ్యమన్నారు. అలా ఆ ఉద్యోగంలో సెలెక్ట్ అయ్యి, ఉద్యోగం చేస్తూ, సాయంత్రం సంగీతకళాశాల నేర్చుకునే వాడిని. అప్పట్లో మా గురువుగారు కోవెల శాంతి గారు, సినీ నటులు జె.డి.చక్రవర్తి తల్లి గారు. ఆ తర్వాత మిగతా 4 సంవత్సరాలు హరిప్రియ గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, రేవతి రత్నస్వామి గారు, వాసా పద్మనాభం గారు వంటి గురువుల వద్ద సంగీతం నేర్చుకున్నాను. ఇలా ఉండగా, సడన్ గా ఈనాడు లో సినిమాకు ఒక ప్రత్యేక పేజి పెట్టారు. పని ఎక్కువై, సంగీత అభ్యాసానికి సమయం దొరకని స్థితిలో ఉద్యోగం వదిలేయ్యాల్సి వచ్చింది. ఏ పని చేసినా చాలా సిన్సియర్ గా చెయ్యడం నా అలవాటు. సినీరంగంలో ఇప్పటివరకు ఎన్ని పాటలు పాడారు ? తెలుగు, కన్నడం లో దాదాపు 100 సినిమాలకు పైగా పాడాను. తెలుగులో అన్నమయ్య, మా బాపు బొమ్మకు పెళ్ళంట వంటి చిత్రాల్లో పాడాను. అసలు ఘంటసాల గారు మీ జీవితంలోకి ఎలా ప్రవేశించారు ? నాన్నగారు ఘంటసాల పాటలు పాడుతూ ఉండేవారు. నాకు ఇష్టమైన పాట ‘ఘనాఘన సుందరా...’. ఆయన ప్రభావం వల్ల నేను చిన్నప్పటి నుంచి ఘంటసాల గారి పాటలు పాడుతూ, దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను. నిజానికి ఆయనకు నేను ఆజన్మాంతం ఋణపడి ఉన్నాను. ఆయన గళం వల్లే నాకు ఒక గుర్తింపు లభించింది. ఉద్యోగం వచ్చే ముందు కూడా రామోజీరావు గారు ‘పాడుతా తీయగా’ అనే పాట విని అభినందించారు. అలా ఘంటసాల గారిపై ఉన్న అభిమానంతో, ఆయన్ని అనుసరించాను. సంగీతం దేని కోసం అంటారు ? జీతం కోసమా? జీవితం కోసమా ? ఆత్మసంతృప్తి కోసం. ముందుగా పిల్లలకు మనం ఏది నేర్చుకున్నా, ఏమీ ఆశించక, అది ప్రజలకు, లోకానికి ఉపయోగపడేందుకు అని చెప్పాలి. చదువును, కాలాన్ని డబ్బుగా మార్చుకునే నేటి సంస్కృతి వల్ల . నైతిక విలువలు పడిపోయి, సమాజం పతనం అవుతోంది. ఇలా విద్య, వైద్యం సామాన్యుడికి అందకుండా పోయాయి. డబ్బు సుఖాన్ని ఇస్తుంది కాని, శాంతిని ఇవ్వదు అని భగవద్గీత చెబుతుంది. శాంతి త్యాగం వల్ల వస్తుంది. భగవద్గీత కూడా నేను కోట్లు సంపాదించేందుకు చెయ్యట్లేదు. ఆత్మసంత్రుప్తితో పరమాత్మ సంకల్పంగా భావించి చేస్తున్నాను. విలువల్ని పిల్లలకు నేర్పినప్పుడే మంచి సమాజం ఏర్పడుతుంది. సంపూర్ణ భగవద్గీత చెయ్యాలన్న సంకల్పం ఎలా కలిగింది ? నేను చాలా దేశాలు తిరుగుతున్నప్పుడు, ఒక వ్యక్తి, ‘ఇంత మంచి గొంతుతో శాశ్వతంగా నిలిచిపోయే ఒక గొప్ప పని ఏదన్నా చెయ్యకూడదూ ... ‘ అని అడిగారు. ఆ దిశగా నిద్ర మాని ఆలోచిస్తున్నప్పుడు, కవి భారవి గారు ఈ ఐడియా ఇచ్చారు. గొప్ప వికాస సూత్రాలు కల ఈ శ్లోకాలు , వాటి భావాలు ఆంధ్రదేశంలోని పిల్లలకు చేరాలని సంకల్పం కలిగింది. అలా అనుకోకుండా దైవీకంగా ఈ ప్రయత్నం మొదలైంది. అలా చిన్న బావి లా మొదలైన సంకల్పం చెరువై, నదయ్యి, సముద్రమయ్యి, జీవితమయ్యింది. భగవద్గీత ఫౌండేషన్ ద్వారా భగవద్గీతను ఒక గాయకుడు, సంపూర్ణంగా, తాత్పర్య సహితంగా, కళ్ళు మూసుకుంటే భావం గోచరించే విధంగా, హై ఎండ్ టెక్నాలజీ తో రికార్డు చెయ్యడం అనేది చరిత్రలోనే మొదటిసారి. భగవద్గీత యూనివర్సిటీ ని నెలకొల్పాలని, తద్వారా అందరికీ గీత ను బోధించాలని అనుకున్నాము. గత 8 ఏళ్ళుగా ఈ ప్రాజెక్ట్ పై, అనేక దశల్లో, అనేక మంది దాతల ద్వారా సాయం పొందుతూ పని చేస్తున్నాము. అనేక మంది ప్రముఖులు, పీఠాధిపతులు విని అభినందించారు, మనస్పూర్తిగా ఆశీర్వదించారు. కురుక్షేత్రంలో కూర్చుని వింటున్నట్టుగా అనుభూతి చెందాము అని మెచ్చుకున్నారు. గీత నేర్చుకున్నాకా, ఇక నేర్చుకునేందుకు ఏమీ మిగలదు. అందుకే 5000 సం. బోధించిన క్రితం జగద్గురువు కృష్ణుడి గీతను ప్రపంచ వ్యాప్తంగా తీసుకు వెళ్ళాలనేదే మా సంకల్పం. ఈ మహోదాత్తమైన ఉపదేశాన్ని పాటిస్తే యెంత ఉన్నతంగా జీవించవచ్చో తెలుస్తుంది. భగవంతుడితో అనుసంధానమయ్యే విధానం తెలుస్తుంది. మీ ప్రాజెక్ట్ పూర్తయినట్టు ఉంది. ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది ? ఈ సంవత్సరం చివరికి, నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఆవిష్కరిస్తాము. 18 cd లు, ఒక పారాయణ cd, ‘ది మేకింగ్ అఫ్ భగవద్గీత’ అనే డాక్యుమెంటరీ ని తయారుచేసాము. ఇందులో ఈ 8 సం. ల్లో మేము పడిన కష్టం వివరించాము. యు ట్యూబ్ లో మా ప్రోమో చూడవచ్చు. అలాగే ఫేస్ బుక్ లో కూడా భగవద్గీత ఫౌండేషన్ అనే మా పేజి ను చూడవచ్చు. ఈ ఆడియో చెయ్యడం వెనుక ఆశిస్తున్నది ? చాలా కాలం నుంచి నేను పలు కాలేజీ లు దర్శించి, భగవద్గీత వ్యక్తిత్వ వికాసానికి ఎలా ఉపయోగ పడుతుందో, నేను శ్లోకాల ద్వారా వివరిస్తున్నాను. చిన్నతనం నుంచే ఇది అభ్యసించాలి. ఇది మరణ గీత కాదు, జీవన గీత అని తెలియచెయ్యాలి. కర్తవ్య బోధ చేసే ఈ గీతను అందరిలోకి తీసుకు వెళ్ళాలి అన్నదే మా లక్ష్యం ! మా 'అచ్చంగా తెలుగు' పాఠకుల కోసం భగవద్గీత నుంచి, ఒక మంచి సందేశం ఇస్తారా ?
అన్ని సందర్భాల్లో మనిషి యెంత ధైర్యంగా ఉండాలో చెప్పే శ్లోకం ఒకటి భగవద్గీతలో ఉంది.
దుఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్ప్రుహః
వీత రాగ భయ క్రోధః
స్థిత ధీర్ముని రుచ్యతే |
భావం :దుఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడు, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేని వాడు, రాగము, భయము, క్రోధము, తొలగిన ముని స్థితప్రజ్ఞుడు అని చెప్పబడతాడు.
వీరితో జరిపిన టెలిఫోన్ ముఖాముఖి ని, మధురమైన ఆయన గానాన్ని, క్రింది లింక్ లో వినండి.
No comments:
Post a Comment