మహాకవి - అచ్చంగా తెలుగు
మహాకవి 
- డా.వారణాసి రామబ్రహ్మం

తన కవితలలో నిండి జీవించి ఉండును                           
మహాకవి తానున్నను లేకున్నను 
కదలికలాగి ఒడలు కట్టెగా మారినను 
మరణము లేదు ఆతని భావ శరీరమునకు 
క్షణ భంగురమైన దేహముననే 
ప్రభవించును చిరముగ నిలచు స్ఫురణలు 
ఊపిరి ఆగునది తోలుతిత్తికి 
ఊహల ఉయ్యాలలూగి ఊసులుగ 
మార్చు ఉత్తమునికి కాదు 
నిశ్శబ్దమున జనించు తలపులు 
అగును శబ్ద అర్థ భరిత కావ్యములు 
పవళించినను తాను దీర్ఘ నిద్రకై 
శయనించి ఉండును తన కవితా శాయిపై 
నిలిచి ఉండును ఆడిన పలుకులు 
లేకపోయినను పలికిన పెదవులు 
ప్రకృతి ఆతని చెలి 
సలుపును పదములతో కేళి 
ప్రవహించు  గోదావరి 
పొంగు నీలి సంద్రము 
ఇముడునాతని గురులఘువుల 
అవ్యక్త ఆత్మజనిత 
చైతన్య దీప్తి కవీశ్వరుడు 
సాహితీ తాతల తండ్రుల 
మించు మనుమడు 
రసికులైన నాగరికులు 
స్మరింతురు ఆతని కమ్మని కవితలు 
ఇంపార గానము చేతురు 
కవి హృత్ కమల దివ్య వికాసములు 


No comments:

Post a Comment

Pages