నలుగురితో కలవలేని వారిని ఓసారి కలవండి - అచ్చంగా తెలుగు

నలుగురితో కలవలేని వారిని ఓసారి కలవండి

Share This
నలుగురితో కలవలేని వారిని ఓసారి కలవండి
బి.వి.సత్యనగేష్

ఒక జాతి పక్షులు ఒక చోట చేరుతాయన్నట్లు, ఒక రకమైన ఆలోచనా సరళి వున్న వారంతా ఒక చోట చేరుతారన్నది నిజం. ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఒక థాట్ ఫ్రీక్వెన్సీ వున్న వారు ఒకరితో ఒకరు ఆకర్షింపబడతారనే అభిప్రాయం కూడా వుంది. 
పెళ్లి ఘనంగా జరుగుతుంది. అదొక అద్భుతమైన, ఖరీదైన కళ్యాణ మండపం. సుబ్బారావుకు తెలిసున్న వారి పెళ్లి. పైగా వాళ్ళు ప్రత్యేకంగా పిలిచారు కూడాను. కనుక తప్పదనుకుంటూ కళ్యాణ మండపంలోకి అడుగు పెట్టాడు. ద్వారం దగ్గర ఆహ్వానించే వారిని చూస్తూ అసంకల్పితంగా, అప్రయత్నంగా నమస్కారం పెట్టేడు. వాళ్ళిచ్చిన గులాబి పువ్వు అందుకుని మెయిన్ హాల్ లోకి అడుగుపెట్టాడు. అటూ.. ఇటూ.. చూడటం మొదలుపెట్టాడు. సుబ్బారావు దృష్టి ఒక వ్యక్తిపైన పడింది. అతడు మామూలు దుస్తుల్లో వున్నాడు. కుర్చీపై ముందుకు కూర్చుని అదోలా చూస్తున్నాడు. ఎవరి కోసమో ఎదురుచూస్తున్నట్లనిపించింది. సుబ్బారావు ఆ సదరు వ్యక్తీ ప్రక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు. కానీ పలకరించలేదు. కొద్ది సమయం తర్వాత ‘మీరు మగపెళ్లి వారి తాలూకానా?’ అని అడిగాడు సుబ్బారావు. ‘లేదండి. మేం ఆడ పెళ్లి వారి తరపున’ అన్నాడు ఆ సదరు వ్యక్తి. అక్షింతలు కార్యక్రమం చాలా మొహమాటంతో కానిచ్చి భోజనాలు చేయటం మొదలుపెట్టారు. సుబ్బారావు కొంచెం ముందుగా పూర్తీ చేసుకుని, చేతులు శుభ్రం చేసుకుని నెమ్మదిగా కళ్యాణ మండపం నుంచి బయటకు వచ్చాడు. ఇంటికొచ్చిన తర్వాత విషయమంతా భార్యకు చెప్పాడు ‘ఇంతకీ ఆ సదరు వ్యక్తి పేరేంటి?’ అని అడిగింది భార్య. ‘ఏమో! ఎవడో... వాడి పేరుతొ నాకేం పని... ఏదో కొద్దిసేపు కంపెనీ ఇచ్చాడంతే’ అన్నాడు సుబ్బారావు. ఇలాంటి సుబ్బారావులను ఎంతో మందిని చూస్తూ వుంటాం. దీనికి కారణం.. ఆత్మన్యూనతా భావం. మానసికంగా కృంగిపోతూ వుంటారు. నలుగురితోనూ కలవడం, మాట్లాడటం, కలివిడిగా వుండటం అనేవి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినంత కష్టం వీరికి. ఈ భావంతో కృంగిపోతూ ఎదుటి వారిని తప్పించుకు తిరుగుతారు. ఈ విధమైన ఆత్మన్యూనతా భావానికి గురైన వాళ్ళలో కొన్ని గాఢమైన మానసిక ముద్రలు లేదా అభిప్రాయాలు వుంటాయి. ఈ అభిప్రాయాలను పదేపదే పునశ్చరణ చేసుకుని, గాఢమైన ముద్రలుగా మార్చుకుంటారు. అవే భావాలను ప్రకటిస్తూ వుంటారు. ఉద్వేగంతో కూడిన భావాలను పదేపదే. గుర్తుచేసుకుని బాధపడుతూ వుంటే అవి మానసిక ముద్రలుగా మారతాయి. ఒక రెస్టారెంట్ లో చూసిన ఒక సంఘటనను విశ్లేషించుకుందాం. భార్య, భర్త రెస్టారెంట్లోని ‘ఫ్యామిలీ రూమ్’కు తమ ఇద్దరు కొడుకులతో వచ్చారు. పెద్ద కొడుక్కి సుమారుగా 12 సంవత్సరాల వయస్సు, చిన్న కొడుక్కి 8 సంవత్సరాలు వయస్సు వుంటాయి. ఏ టేబుల్ దగ్గర కూర్చోవాలి అనే విషయం చిన్న కొడుకు నిర్ణయించిన తర్వాత నలుగురూ కూర్చున్నారు. వెయిటర్ వచ్చి ‘మెనూ కార్డు’ను ఇచ్చాడు. తండ్రి చూస్తున్న సమయంలో ఆ కార్డును చిన్న కొడుకు తీసుకున్నాడు. ‘నువ్వు సెలెక్ట్ చెయ్యి’ అని తండ్రి చిన్న కొడుకును ప్రోత్సహించాడు. ఆర్డర్ ఇవ్వటం, ఆ పదార్ధాలు రావడం జరిగింది. అన్నీ చిన్న కొడుకు చెప్పినట్లు జరుగుతున్నాయి. పెద్ద కొడుకు మౌనంగా ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు. చివరల్లో ఐస్క్రీం ఆర్డర్ చెయ్యమని చిన్న కొడుకుకే చెప్పాడు తండ్రి. తల్లి మధ్యలో కల్పించుకుని పెద్ద కొడుకును ఆర్డర్ చేయ్యమంది. పెద్ద కొడుకు చెప్పెలోపుగానే చిన్న కొడుకు ఐస్క్రీం వెరైటీ పేరు సిద్ధం చేసుకుని అదే కావాలని పట్టు పట్టాడు. చిన్న కొడుకు చెప్పిన ప్రకారం అదే ఐస్క్రీం వచ్చింది. ఉన్నంతసేపు చిన్న కొడుకు ప్రశ్నలు, మాటలు, తల్లితండ్రులు సమాధానాలతో గడిచిపోయింది. పెద్ద కొడుకును కనీసం మాట్లాడించలేదు. దీనికి ఏదో కారణం వుండి ఉండవచ్చు. చిన్న కొడుకు చురుకుగా ఉండొచ్చు. అంట మాత్రాన పెద్ద కొడుకును పట్టించుకోకపోవడం అన్యాయం. ఇటువంటి సందర్భాలలో పెద్ద కొడుకులో ఆత్మన్యూనతా భావం పెరిగే అవకాసం వుంది. తనను తాను తక్కువగా ఊహించుకోవడంతో పాటు ఎదుటివారిని ఎక్కువగా ఊహించటం వలన ఈ సమస్య ఎక్కువవుతుంది. తనను తానూ తక్కువగా ఉద్వేగంతో పదేపదే భావించటం వల్ల గాఢమైన మానసిక ముద్ర ఏర్పడుతుంది. ఆత్మన్యూనతా భావంతో వుండే వారిలో కొంత మందికి ‘సూడో సుపీరియారిటీ’ వచ్చే అవకాసం ఉంటుంది. తనలోని ఆత్మన్యూనతను కప్పిపుచ్చుకోవడానికి అతిగా ప్రవర్తిస్తూ వుంటారు. లేని అధికారాన్ని, దర్పాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. ఇటువంటి సందర్భాలలో వారికి తృప్తి కలిగినా, ఎదుటి వారి దృష్టిలో చులకన అయ్యే అవకాశం ఉంటుంది. ఎదుటివారు నవ్వుకోవటం కాని, లేదా వీరికి గర్వం ఎక్కువ అని అనుకునే అవకాశం వుంది. ఆత్మన్యూనతా భావం పోవాలంటే తనపై తాన గౌరవం పెంచుకుని పదేపదే ఆత్మగౌరవాన్ని నింపే భావనలతో మార్పు తీసుకురావాలి. ఆలోచనలో మార్పు రావాలి. విజ్ఞానాన్ని, నైపుణ్యతలను పెంచుకుని, సానుకూల దృక్పధాన్ని అలవర్చుకుంటే తప్పకుండా ఆత్మవిశ్వాసం ఆత్మగౌరవం పెరుగుతాయి. ఆత్మన్యూనతా భావానికి ‘గుడ్ బై’ చెప్పొచ్చు. చీకటి పోవాలంటే దేపాన్ని వెలిగించాలి. చీకటిని తిట్ట్కుంటూ కూర్చుంటే వెలుగురాదు. కనుక విజ్ఞానం, నైపుణ్యతలు, సానుకూల దృక్పథం అనే దీపాలను వెలిగించినప్పుడే ఆత్మన్యూనతా భావమనే చీకటి మాయమవుతుంది. వ్యాసకర్త: హైదరాబాద్ లోని మైండ్ ఫౌండేషన్ సెంటర్ ఫర్ పర్సనల్ ఎక్సల్లెన్స్ డైరెక్టర్ బి.వి.సత్యనగేష్

No comments:

Post a Comment

Pages