పూలదారులు - అచ్చంగా తెలుగు
పూలదారులు
- పెయ్యేటి రంగారావు

జీవా!  ఓ జీవా! 
ఎన్నెన్ని దారులో - అన్ని పూల దారులే 
ఏ దారికే గమ్యం - తెలుసుకొనుట నీ ధర్మం ||

1. ఇదో ఇదో ఓ దారి - సంపంగి పూదారి 
ఈ దారి సాగేవో కామమ్ము కలిగేను - కోర్కెలెన్నొ రగిలేను 
ఈ దారికంతు లేదు - నీ యాత్ర ఆగబోదు 
ఇహమందు మోజు పోదు - ఇక శాంతి నీకు రాదు ||

2. ఇదో ఇదో ఒక దారి - మందార పూదారి 
ఈ దారి సాగేవో క్రోధమ్ము కలిగేను - తామసము పెరిగేను 
ఈ దారి సాగినంత - కలిగేను నీకు 
చింత నీకిట్టి దారి వెంట - తోడెవ్వరుండరంట ||

3. ఇదో ఇదో ఓ దారి - గులాబి పూదారి 
ఈ దారి సాగేవో లోభమ్ము కలిగేను - క్షోభలెన్నొ పెరిగేను 
ఈ దారి నడచినంత - కలిగేను నీకు వంత 
ఆవంత సుఖము లేదు -కడకైన దుఖము పోదు ||

4. ఇదో ఇదో ఒక దారి - దవనాల పూదారి 
ఈ దారి సాగేవో మోహమ్ము కలిగేను - తాపమ్ము పెరిగేను 
ఈ నడక ముగియబోదు - స్మృతి ఇంక కలుగ బోదు 
ఇహమందు దుఖము మిన్న - పరమన్న ధ్యాస సున్న ||

5. ఇదో ఇదో ఓ దారి - ఇప్పపూవుల దారి 
ఈ దారి సాగేవో మదమది కలిగేను - అహమది పెరిగేను
 ఈ దారి మాదకమ్ము - ఉన్మాద ప్రేరకమ్ము 
ఈ మత్తు వదలబోదు - గమ్యమ్ము చేరనీదు ||

6. ఇదో ఇదో ఒక దారి - మొగలిపూవుల దారి 
ఈ దారి సాగేవో మాత్సర్యమొదవేను - మిన్నాగులెదురౌను 
ఈ దారి భీకరమ్ము - అశాంతి కాకరమ్ము
 సంతృప్తి కలుగనీదు - ఉన్ముక్తమవగ నీదు ||

7. ఇది వేరొక దారి - రాలు రప్పల దారి 
ఈ దారి సాగేవో భక్తిభావ మొదవేను - వైరాగ్యమేర్పడును 
తాపసులు నడచు దారి - సాధకుల దిదియె దారి
 జ్ఞానమ్ము నిచ్చు దారి - మోక్షమ్ము నిడెడు దారి ||

8. ఎన్నెన్ని దారులొ - అన్ని పూల దారులే 
అన్ని దారుల గమ్యం - అంతా అయోమయం 
ఇది వేరొక దారి - రాలు రప్పల దారి
 కాని గమ్యమున్నది - ఆత్మైక్య సారమిది ||

జన్మమో, జన్మరాహిత్యమో - గమ్యమును 
ఎంచుకో ఆత్మను పరమాత్మలో ఐక్యమొనరించుకో || **************************

No comments:

Post a Comment

Pages