సంపఁగిమన్న శతకము - పరమానంద యతీంద్రులు
- దేవరకొండ సుబ్రహ్మణ్యం
సంపగిమన్న శతకకర్త శ్రీపరమానందయతింద్రులు. వీరు 16 శతాబ్దాంత్యకాలము వారు. వీరిగురించి మనకు ఎక్కువ సంగతులు తెలియకపోయినా వీరి అన్ని రచనలు మనకు ప్రస్తుతం లభ్యం అవుతున్నాయి. వీరి శతకలలో నీతి, అద్వైతము, యోగము మొదలైన విషయాలు అధికంగా ప్రతిబింబిస్తాయి.
వీరి రచనలు:
1. సంపఁగిమన్న శతకము
2. పరమానంద శతకము
3. దత్తాత్రేయ శతకము
4. శివజ్ఞానమంజరి (ద్విపదకావ్యం)
5. ఉత్తరగీతావ్యాఖ్య
శివజ్ఞానమంజరిలో తాను దత్తాత్ర్తేయుని ప్రియ శిష్యుడనని చెప్పుకొన్నాడు. ఈతని రచనలను బట్టి చూడగా ఇతను అద్వైతమత ప్రతిపాదనకే తనరచనలను వినియోగించినట్లు తెలుస్తున్నది. ఇంతకంటే ఈ కవి గురించి గాని కులగోత్ర కాపురస్థలము గురించినటువంటి ఎటువంటి విశేషములు దొరకటం లేదు. వీరిరచనగా భావిస్తున్న మరొకగ్రంధం "ఉపదేశక్రమము" ఒక చక్కని గురుశిష్యం సంవాదరూపంలో ఉన్న వేదాంత గ్రంధం.
శతక పరిచయం
సంపఁగిమన్న శతకము ముఖ్యంగా తత్త్వజ్ఞానబోధనా శతకం అని చెప్పవచ్చును. చక్కని సులువైన భాషలో అందరికి అర్ధమయ్యేలా వ్రాసిన కందపద్య శతకం.
తత్త్వజ్ఞానానందమ
హత్త్వము రచియింతు నీదయన్ భువిఁ గృతకృ
త్యత్త్వము నిత్యత్వముగా
సాత్త్వికపరయోగు లెన్న సంపఁగిమన్నా!
అని శతకకర్త తన శతకాన్ని గురించి తనే నిర్ణయం చేసారు. ఐతే ఈశతకంలో నీతిపద్యాలకు కొదువ లేదు. క్రింది పద్యాలు చూడండి.
బూటకములు వేషంబులు
నాటకములు మంత్రతంత్ర నటనలు నిధ్యా
పేటికలవి యోగికి జం
జాటము లివి యేటికన్న సంపఁగిమన్నా!
అనుభవము లేనిగురుచే
వినునతనికి సంశయంబు వీడునె చిత్రా
ర్కునివలనఁ దమము వాయునె
సనకాదిమునిప్రసన్న! సంపఁగిమన్నా!
నేరనిగురుబోధలు సం
సారములై కూనలమ్మసంకీర్తనలై
దూరములై ముక్తికి ని
స్సారములై పోవునన్న సంపఁగిమన్నా!
కల్ల యగుజ్ఞాన మేలా
చెల్లనికా నెచటనైనఁ జెల్లని కానే
తెల్లమిగఁ దెలుపునాతఁడు
సల్లలితజ్ఞాని యెన్న సంపఁగిమన్నా!
బూటకపుయోగులన్నా, గురువులన్నా ఈ కవికి బహుచిరాకు అనుకుంటా. వారి గుట్టు బయటపెట్టటంలో ఏమాత్రం వెకాడలేదు.
బూటకపుయోగి నెఱుఁగక
పాటింతురు డబ్బుఁ జూచి పసలేకున్నన్
డాటోటని జగమెల్లను
జాటింతురు లోకు లెన్న సంపఁగిమన్నా!
గురువఁట యెవరికి గురువో
హరిహరి తనుఁ దెలియలేనియాతఁడు గురువా?
గురువనఁగా సిగ్గుగదే
శరణాగతసుప్రసన్న! సంపఁగిమన్నా!
గాడిదవలె బూడిదఁ జె
ర్లాడుచుఁ గొక్కెరయుఁ బోలె ధాన్యమునేసే
బేడిదపుఁగపటయోగుల
జాడలు ఘను లెంచరన్న సంపఁగిమన్నా!
అంగం బెఱుఁగరు ముక్తితె
ఱం గెఱుఁగరు కపటధూర్తరావణవేషుల్
దొంగలగురువుల వారల
సంగతి దుర్బోధ లెన్న సంపఁగిమన్నా!
ఇతని ధోరణి-మతము - భావప్రకటన మొదలైన విషయాలను గమనిస్తే కొంతవరకు ఈ కవి వేమన కవీంద్రుని అనుకరించినట్లు తోస్తున్నది. ఈ క్రిందిపద్యం చూడండి.
వేసాలెల్లయు భువిలో, గ్రాసాలకె కాక, ముక్తికాంక్షకునేలా
వాసిగలుగు యోగియు యోగియ
ధేఛ్చాసంచారుడు గదన్న ఘనసంపన్న
ఈ సంపంగి మన్నుడెవరనే సందేహం మనకి తప్పక కలుగవచ్చును. వివిధపద్యాలలోని సంభోదన పరంగా చూస్తే విష్ణువని అనిపించక మానదు. క్రింది సంబోధనలను చూడండి
1. నీలమణీశ్యామా (1)
2. సనకాది సన్నుతప్రసన్న (3, 32, 78)
శరణాగతప్రసన్న (2)
సలలితకాంతి ప్రసన్న (4)
ఈతని కవిచౌడప్ప యనుకరించిన పోలిక ఒకటి
వానలుపస పైరుల కభి
మానము పస వనితలకును మఱియోగులకున్
ధ్యానము పస యామీదట
జ్ఞానముపస సుప్రసన్న! సంపఁగిమన్నా!
మరికొన్ని సంపఁగిమన్న శతకంలోని పద్యరత్నాలు
తాటాకులలో వ్రాసిన
మాటలనా ముక్తి పాడిమర్మముఁ దెలియున్!
సూటి యగురాజమార్గము
సాటియగునె యెచట నున్న సంపఁగిమన్నా!
తామరసాక్షునకైనన్
శ్రీమించినసురలకైన సిద్ధులకైనన్
నీమాయఁ దెలియ వశమా
సామాన్యమె! కఠినమెన్న సంపఁగిమన్నా!
బూటకములు వేషంబులు
నాటకములు మంత్రతంత్ర నటనలు నిధ్యా
పేటికలవి యోగికి జం
జాటము లివి యేటికన్న సంపఁగిమన్నా!
నావ యగున్ భవజలనిధికి
ద్రోవ యగున్ ముక్తికాంతతోఁ గూడుటకున్
గేవలనిజదేశిక ర
క్షావహ మగు యోగమెన్న సంపఁగిమన్నా!
నిత్యానిత్యము లెఱుఁగక
నిత్యముఁ జేపట్టుబుధుల నిందించినచో
మృత్యువుపాలౌ మార్త్యుఁడు
సత్యం బిది వినఁగదన్న సంపఁగిమన్నా!
ఇంతచక్కటి శతకం చదవటమేకాక అనుసరిస్తే ఎంతో మంచిది. మీరు చదవండి మీ మిత్రులతో చదివించండి.
No comments:
Post a Comment