సంసారం...ప్రేమసుధాపూరం
- సుసర్ల నాగజ్యోతి
ఆ రోజే కాంచన, శరశ్చంద్ర ల నూతన గృహప్రవేశం...చుట్టాలను మాత్రమే కాక...కొత్త ఇంటి చుట్టుపక్కల వాళ్లని కూడా ఆహ్వానించారు ఆ ముందు రోజు....అలా పిలవటానికి వెళ్ళినప్పుడు తమ ఇంటి ఎదురుగా ఉన్న ఆవిడేమో నిర్మొహమాటము గా తను రాలేనని చెప్పేశారు....అలా ఆవిడ మొహాన చెప్పటం తో నిర్ఘాంతపోయిన కాంచన...సరేనండీ...రానంటున్నకా రణము ఏమిటో తెలుసుకోవచ్చా? అంటూ నెమ్మదిగా అడిగింది...ఆవిడ ఏమీ లేదమ్మా...నేను సాధారణముగా ఎక్కడికీ వెళ్ళను...అయినా వెళ్ళిన ప్రతి చోటా మన వాళ్ళు మా అబ్బాయి పెళ్ళి గురించి అడుగుతారు...వాడేమో పెళ్ళీ, గిళ్ళీ ఏమీ వద్దని భీష్మించుకు కూర్చున్నాడు...నాకేమో ఎవరైనా ఆ విషయం ఎత్తంగానే బాధగా ఉంటుందంటూ చెప్పారు...ఓహో అదావిషయము అని తేలిక పడ్డ మనసుతో ....సరే అండీ మీ ఇష్టం ..నేను మీతో తరువాత మాట్లాడతాను అయితే అంటూ వచ్చేసింది కాంచన.
కొత్త ఇంట్లో సర్దుకున్నాక నాలుగు రోజులకు ఎదురింటి ఆవిడ గురించి ఆలోచించటము మొదలుపెట్టింది కాంచన. మొదటి పరిచయం లోనే ఆవిడ అలా మాట్లాడారంటే ,పాపం వాళ్ళబ్బాయి పెళ్ళివద్దంటున్నాడని ఆవిడెంత బాధ పడుతోందో కదా అనుకుంది.
ఇంకో రెండు రోజుల తరువాత ఆవిడ వాకిట్లో కనిపిస్తే పలుకరించి...రండి పిన్నిగారూ ,ఇప్పుడైనా మా ఇల్లు చూద్దురు ...అంటూ ఇంట్లోకి ఆహ్వానించింది ...ఆవిడ వచ్చాక కాఫీ ఇచ్చి నెమ్మదిగా మాటలు కలిపింది. ఆవిడ ఆ సంగతులూ , ఈ సంగతులూ చెపుతూ..మధ్యలో తనూ తన భర్తా తరచూ మాటా మాటా అనుకునే వాళ్ళమనీ, అలాగే తమ అమ్మాయిని సొంత మేనల్లుడికే ఇచ్చి పెళ్ళి చేసినా ఇద్దరి అభిప్రాయాలు కలవక ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారనీ...వాటిని చూస్తూ వాళ్ళబాయి ఏమిటమ్మా పొద్దుగూకులూ ఈ గొడవలు అంటూ విసుక్కుంటాడని చెప్పింది..అంతే కాక వాళ్ళబ్బాయి ప్రాణ స్నేహితుడొకరు పెళ్ళైన ఆరు నెలలకే భార్యతో సరిగ్గా పడక విడాకులు తీసుకున్నాడనీ చెప్పారు..ఇప్పుడు కాంచనకు అర్ధము అయిపోయిందీ అబ్బాయి పెళ్ళి ఎందుకు వద్దంటున్నాడో .ఆ తరువాత ఒక శనివారము నాడు వాళ్ల కాలనీ అసోసియేషన్ మీటింగ్ లో ఆ అబ్బాయిని కూడా కలిశారు...అతని పేరు అర్జున ప్రసాద్...చూడ చక్కగా ఉన్నాడు ...మంచి ఉద్యోగము కూడా చేస్తున్నాడు. ....అతనితో కాంచన దంపతులు ....మీ ఇంటి ఎదురిల్లేనయ్యా ప్రసాదూ! ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు నువ్వు అంటూ ఆప్యాయం గా ఆహ్వానించారు.వారిద్దరూ చక్కగా నవ్వుతూ పలుకరించటం చూసిన ప్రసాద్ కూడా మొహమాటం తగ్గి వారితో మాట్లాడాడు.
ఆ మర్నాడు ఆదివారం రోజు కాంచన, శరశ్చంద్రా, వారి పిల్లలిద్దరూ కలిసి ...నవ్వుతూ తృళ్ళుతూ వాళ్ళ కారు కడగటం మొదలెట్టారు పొద్దున్నే. ఎదురింటి మేడపైన తన గదిలో ఉన్న ప్రసాద్, నవ్వులూ కేరింతలూ వినపడి కిటికీ లోంచి తొంగి చూశాడు ...శరశ్చంద్రా...పిల్లలూ ..కారు మీద కంటే కాంచన మీద నీరు పోసి తడిపేస్తున్నారు., అంతా కలిసి చేస్తున్న అల్లరికి అతనికి అప్రయత్నం గా పెదవుల మీదకు చిరునవ్వొచ్చేసింది...ఇహ అదిమొదలు వీలు చిక్కినప్పుడల్లా వీరి కుటుంబాన్ని గమనించటం నిత్యకృత్యమైపోయింది.
అలా గమనిస్తున్నప్పుడే ఒక రోజు కాంచన వాళ్ళమ్మాయిని వరండా లో కూర్చో పెట్టి పాదాలకూ చేతులకూ గోరింటాకు పెట్టి...తను కూడా ఒక చేతికి మాత్రమూ పెట్టుకుని కూర్చుంది. ఈ లోపల లోపలనుండి వచ్చిన శరశ్చంద్ర కాంచన రెండో చేతికి కూడా గోరింటాకు పెట్టాడు కబుర్లు చెప్తూ..అది గమనించిన ప్రసాద్ ఆశ్చర్యపోయాడు ...అంతే కాదు కాసేపయ్యాక కంచం లో అన్నము కలుపుకొచ్చి భార్యకూ పిల్లలకూ చక చకా తినిపించాడు ...అది చూసి ప్రసాద్ భలే ముచ్చట పడ్డాడు .
ఆ తరువాత రెండు రోజులకు సాయంత్రం పూట కాంచన వంట చేసేసి స్నానానికి వెళ్ళింది...కాంచన వచ్చేలోపల శరశ్చంద్రా పిల్లలూ కలిసి మేడపైన వెన్నెల లో డిన్నర్ కి సిధ్ధం చేసేశారు, శరశ్చంద్ర చక్కటి తెల్ల పైజమా లాల్చీ లో హుందాగా ఉన్నాడు...కాంచన కూడా ఆకుపచ్చ పూల డిజైన్ ఉన్న తెల్లచీర కట్టుకొచ్చి జాబిలమ్మ లాగా చక్కగా ఉంది...పిల్లలు ఇద్దరూ కడిగిన ముత్యాలే...అందరూ కలిసి మేడపైన వెన్నెల భోజనాలు చేశారు...కాంచన అక్కడంతా సర్దేలోపల శరశ్చంద్ర పిల్లల్ని కింద పడుకోబెట్టి వచ్చాడు....కాంచన తమలపాకులు చిలకలుగా చుట్టి నోటికి అందిస్తూ ఉంటే శరశ్చంద్ర కాంచన ఒడిలో పడుకుని కబుర్లు చెప్పటం మొదలెట్టాడు.... మధ్య మధ్యలో చిలిపిచేష్టలు చేస్తూ.....అదంతా చూడటం తప్పని తెలిసినా...ప్రసాద్ చూడకుండా ఉండలేక పొయ్యాడు...మరీ ఎదురిల్లు అవ్వటం వలన తలుపు తెరిస్తే చాలు అంతా కనపడుతూనే ఉంటుంది... భార్యా భర్తల మధ్య ఇంత అన్యోన్యత ఎలా సాధ్యం అనుకున్నాడు....
ఇలా ఒకటీ అరా ముచ్చట్లే కాదు ప్రతి పనిలోనూ ఇద్దరూ ఆనందం గా...ఆహ్లాదం గా పాలు పంచుకోవటమే కాకుండా...మురిపాలు పంచుకుంటారేమో అనిపించేది ప్రసాద్ కు వాళ్ళని చూస్తే..
ఒక రోజు ఉన్నట్టుండీ ప్రసాద్ వాళ్ళమ్మ గారు కాంచనా వాళ్ళ ఇంటికి వచ్చి ....అమ్మా కాంచనా మా అబ్బాయి పెళ్ళికి సుముఖత వ్యక్తం చేశాడమ్మా....నీ ఎరుకలో ఎవరైనా మంచి పెళ్ళి కూతురు ఉంటే చెప్పు కాస్త అంటూ అడిగారు. వాళ్ళ అబ్బాయి వివరాలు అన్నీ అడిగి...పిన్ని గారూ ఎవరి దాకానో ఎందుకండీ మా చిన్న ఆడపడుచే ఉంది ...ప్రసాద్ కి ఈడూ జోడూ చక్కగా ఉంటుంది...మీకిష్టమైతే పిల్ల ఫోటో జాతకమూ తెప్పిస్తానని చెప్పింది కాంచన...ఆవిడ ఆనందముగా సరే అమ్మాయ్ శుభస్య శీఘ్రం ...తొందరగా తెప్పించుతల్లీ అని చెప్పి వెళ్ళిపోయింది.
ఆవిడ వెళ్ళిపోయాక కాంచన రెండు రోజుల క్రితం శరశ్చంద్ర చెప్పిన విషయం తలుచుకుని ఆనందం గా నిట్టూర్చింది... అసలు పెళ్ళేవద్దని భీష్మించుకు కూర్చున్న ప్రసాద్, శరశ్చంద్ర దగ్గరకొచ్చి ...గురువుగారూ మిమ్మల్ని ఒక విషయము అడగాలనుకుంటున్నానండీ మీరేమీ అనుకోనంటే అన్నాడు....ఏమిటయ్యా అడుగు మరేం ఫర్వాలేదంటూ అభయం ఇచ్చాడు శరశ్చంద్ర ...మీ భార్యాభర్తలు అంత అన్యోన్యముగా ఎలా ఉండగలుగుతున్నారండీ? నేను చాలా మందిని చూశాను ....ఒకరి అభిప్రాయాలు ఒకరితో కలవక గొడవలు పడుతూ ఉంటారు....ఎప్పుడూ ఏదో అసంతృప్తి తో నే జీవిస్తారేమో అన్నట్టు....మీ జంటను చూసేవరకూ దంపతులు ఇంత అన్యోన్యముగా ఉండొచ్చని నాకు తెలియనే లేదు....మీరు పాటించే రహస్యమేమిటొ చెప్పండి కాస్త అంటూ అడిగాడు ప్రసాద్....శరశ్చంద్ర నవ్వి..." ఏమీ లేదయ్యా! అభిప్రాయ బేదాలు అందరికీ ఉంటాయి. కానీ వాటిని పరస్పర ప్రేమానురాగాలతో అధిగమించవచ్చు. ఒకరినొకరు బాధ పెట్టొద్దనుకుంటే తగాదాలు రావు...ఎప్పుడూ నీ భార్యని నువ్వు నీలో సగమని భావించాలి...అలాగే తనుకూడా నిన్ను తనలో సగమని భావిస్తే ...ఎవరిని వారు బాధ పెట్టుకోలేరు కదా? అర్ధ నారీశ్వర తత్వం అర్ధం చేసుకుంటే చాలు సంసార జీవితం అతి మధురముగా ఉంటుంది . ఒక వేళ నిజం గానే నీ కొచ్చిన అమ్మాయి మొండిఘటమే అనుకో...నీ సాహచర్యం లో మారిపోతుంది ....కావల్సిందల్లా నీ పై నీకు నమ్మకం... నిన్ను నమ్మి సర్వస్వమూ ఇచ్చిన ఆ అమ్మాయి పై ప్రేమ ....అవి ఉంటే మీలో మీకే కాదు...మీ ఇద్దరి మధ్యా ఎవరైనా ఏమైనా కల్పించాలని చూసినా తీసి పక్కనపెట్టేసి ..మీరు ఒకటని నిరూపించుకోగలరు...మేము పాటించేది అదే సూత్రం అంటూ హితోపదేశం చేశాడు.....ఆ విషయము తలుచుకుని కాంచన నవ్వుకుంది...
మొత్తానికి అసలు పెళ్ళే వద్దు మొర్రో అనుకున్న ప్రసాద్ ఇప్పుడు శరశ్చంద్ర చెల్లెలిని కళ్ళకద్దుకుని మరీ పెళ్ళి చేసుకున్నాడనీ, అర్ధనారీశ్వర తత్వాన్ని ఒంటపట్టించుకుని సంసారం లో జంట జావళి పాడుతూ.....తనలాగా పెళ్ళంటే నూరేళ్ళమంట అని అలోచించే వారికి కనువిప్పు కలిగించే స్థితిలో జీవిస్తున్నాడని చదువరులకు ఈ పాటికి అర్ధం అయ్యేఉంటుంది.
అతనిని మార్చటం కోసం పడకగదిలో తమ ఇద్దరికే పరిమితమైన కొన్ని ముచ్చట్లను...వరండాలోకీ, మేడమీద కీ కొన్ని రోజులు ఆ దంపతులు మార్చారన్న విషయము ప్రసాద్ కి ఎన్నో రోజుల వరకూ తెలియనేలేదు..... తెలిశాక అతని కృతజ్ఞతకు అంతు లేదు...ఫలితం తన భార్యతో అరమరికలు లేని అద్భుతమైన దాంపత్యమే.....అదే ప్రతిజంటకూ కావల్సింది కదా.......
No comments:
Post a Comment