స్వభాష
- చెన్నూరి సుదర్శన్
వృద్ధాప్యంలో పంతాలూ, పట్టింపులూ ఎక్కువ అనుకుంటాను. లేకుంటే నా ముద్దుల మనవరాలు వెన్నెలను చూడకుంటా రెండేళ్ళు గడపటమంటే మాటలా?. ‘రెండేళ్ళే కాదు రెండు యుగాలైనా చూడనంటే చూడను’ అని భీష్మించుకుని కూర్చున్నాను. మనసులో ఆవేదనాగ్ని జ్వాలలు అహర్నిశలు నన్ను దహించి వేస్తున్నా నా నిర్ణయం మార్చుకో లేదు. నేనే ఎందుకు మార్చుకోవాలి?.. వాళ్ళు ఎందుకు మార్చుకోరు?.. ఈ ముసలి తనంలో నాన్నను బాధ పెట్టొద్దని నా కూతురు శ్రావణికయినా ఉండొద్దా?.. అయినా నేను ఏమి అడిగానని?.. వెంట తీసుకు పోలేని ధన కనక వస్తు వాహనాలు ఏమైనా అడిగానా?.. వారికి అసాధ్యమైన పనులేమైనా చేసి పెట్టుమన్నానా?.. ఒకే ఒక షరతుతో కూడిన చిన్న కోరిక కోరాను. అది నా స్వభాషపై నాకు గల అభిమానం. దానిపై మమకారం చంపుకోలేక ఆ చిన్న కోరిక కోరాను. కాని వారి దృష్టిలో అది ఏహ్య భావం..! ఆభావమే నా మీద పెను ప్రభావం చూపింది. నాలో మరింత పట్టుదలను పెంచింది. అది తీరే వరకు అశాంతే నామనసుకు ఆహార్యం.. నా బాల్యం నుండి నాకు గ్రంథాలయమే ప్రథమ స్నేహితుడు. పుస్తక పఠనమంటే మక్కువ. తెలుగు భాషాపండితుణ్ణి కావాలనే కోరిక నాలో ప్రబలంగా ఉండేది. కాని మానాన్న తెలుగు చదివితే ఏమొస్తుంది?.. కవి వై పోతావా?.. అంటూ స్వభాషను వెక్కిరించే వాడు. నేను మా మాష్టార్లతో చెప్పించి నిద్రాహారాలు మాని నా పంతం నెగ్గించుకున్నాను. అలా నేను మన తెలుగు పండితుడినయ్యాను. నేను తెలుగులో పద్యాలు పాడుతుంటే పాఠశాల అంతా చెవులు తెరుచుకుని వినేది. “మా జీవితాలు ధన్యమయ్యాయి మాష్టారూ..” అంటూ నా సహ అద్యాపకలు నన్ను తెగ పొగిడేవారు. నేను ఏ పాఠశాల నుండి బదిలీ అయినా ఆ పాఠశాల కన్నీళ్లతో వీడ్కోలు పలికేది. నన్ను బదిలీ చేయవద్దంటూ విద్యార్థులు తరగతులు బహిష్కరించి సమ్మె చేసిన రోజులూ ఉన్నాయి. అయినా నా సేవలు అన్ని పాఠశాలలు అందుకోవాలి కదా అంటూ నేను సున్నితంగా నచ్చ చెప్పే వాణ్ణి. తెలుగులో వ్యాసాలు రాయడం, తెలుగు భాషాభి వృద్ధి చూసి ప్రభుత్వం నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాద్యాయునిగా అవార్డు ఇచ్చింది. నేను అధ్యాపకునిగా రెండు సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందాను. నా పదవీ విరమణ అనంతరం తెలుగులో కథానికలు రాయడం వేగవంతం చేసాను. ఒక సంవత్సరం తిరుగ కుండానే ఒక పుస్తకం కూడా అచ్చు వేయించాను. ఈ రోజు ఎందుకో వెన్నెల మరీ మరీ గుర్తుకు వస్తూంది. ప్రేమ పాశం అంటే అదేనేమో!.. కాని ఆ పాశానికి బంధీ కావద్దని పదే పదే హెచ్చరిస్తూ ఆనాటి మా వీడ్కోలు ప్రయాణాన్ని గుర్తుకు తెస్తోంది..
***
నా పెన్షన్ తదితర లావేదేవీల తతంగం పూర్తికాగానే అమెరికా ప్రయాణం పెట్టుకున్నాను. పదవిలో ఉండగా అమెరికా వెళ్ళడంకంటే నరకం వెళ్ళడం సులువు. మా ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ‘అభ్యంతరం లేదనే ధృవపత్రాన్ని’ పొందాలాంటే మాటలు కాదు. అమెరికా వెళ్ళే వాళ్ళంతా ఏదో దోచుకు తింటారనే అపోహతో ఆఫీసు జలగలు పీక్కుతినడం నాకు సుతారమూ గిట్టదు. నరకంలో మన కష్టాలు చూసి యమదూతలు సహితం కాస్తా కనికరిస్తారేమో! కాని ఆఫీసులో గుమస్తాలకు ‘కనికరం’ అనే మాట వారి నిఘంటువులో కనబడదు. అందుకే నా ఒక్కగానొక్క కూతురు శ్రావణి ఎంత బతిమాలినా వినలేదు. పదవీ విరమణ అనంతరం నాకు అమెరికా రాలేనని చెప్పడానికి సాకులూ మిగులలేదు. నా మనవరాలు వెన్నెల కోసం నా సతీమణి, నేను వెళ్ళక తప్పింది కాదు. కాలిఫోర్నియా రాష్ట్రంలో మౌంటేన్ హౌజ్ జిల్లాలోని ‘క్వెస్టా’ గ్రామంలో స్వంతంగా ఒక ఇల్లు ఈ మధ్యనే కొన్నాడు మా అల్లుడు శ్రీనివాస్. అతడు సాఫ్ట్వేర్ ఇంజనీర్. నా కూతురు శ్రావణి ఫార్మసీలో డాక్టరేట్ పట్టా పుచ్చుకుంది. ఇరువురూ ఆఫీసుకు వెళ్లిపోతే నా మనవరాలు వెన్నెల ఐదేళ్ల ప్రాయం. ఆశ్రయం.. పిల్లల సంరక్షణ ఆశ్రమం. మేము ఉన్నంత కాలం వెన్నెలను మాకనుసన్నల్లోనే ఉంచుకోవడం మాకు మరుపు రాని మధురాను భూతి. కాని నా మనసులో రేగిన అశాంతి మాత్రం వర్ణణాతీతం. నా మనవరాలు తెలుగులో మాట్లాడక పోవడమే దానికి కారణం. తెలుగులో చెబితే తాను అర్థం చేసుకుంటుంది కాని తెలుగు మాట్లాడటం రాదు. ఇంట్లో మా అల్లుడూ కూతురూ ఆంగ్లంలోనే మాట్లాడుతూ ఉంటే వెన్నల ఎలా తెలుగులో మాట్లాడుతుంది?.. ఇదే విషయాన్ని ఒక రోజు ప్రస్తావించాను.. మా అల్లుడు వింటూ ఉండగా.. “చూడు శ్రావణీ.. మనమంతా తెలుగులోనే మాట్లాడుకుంటున్నాం కదా.. మరి మీరు వెన్నెలతో ఆంగ్లంలోనే ఎందుకు మాట్లాడుతున్నారు?. అలా అయితే వెన్నెలకు మన స్వభాష తెలుగు ఎలా వస్తుంది?.. నాకు మాత్రం చాలా బాధగా ఉంది.” అంటూ నా మనసులోని మాటను బయట పెట్టాను. కూతురూ అల్లుడూ అమితాశ్చర్యంగా చూశారు నావంక.. నేనేమైనా అడగగూడనిది అడిగానా? అన్నట్లు వారి వంక నా మరో ప్రశ్న సంధింపు రీతిలో చూశాను. “తెలుగుతో అవసరమేముంది నాన్నా!. ఇంగ్లీష్ ఒక్కటే చాలు యిక్కడ. అందుకే నేర్పించడం లేదు.” అంది శ్రావణి. నా మనసు చివుక్కుమంది. “తెలుగు ఎందుకు అవసరం లేదురా?. తెలుగు నేర్చుకుంటే అదేమైనా నేరమా?.. పాపమా?.. నేను వెన్నల మాట్లాడుకుంటుంటే నాకు మనవరాలుతో మాట్లాడుతున్న అనుభూతి కాని ఆప్యాయత గాని కల్గడం లేదు. ఏదో విదేశీయ అమ్మాయితో మాట్లాడుతున్నట్లుగా ఉంది. నేను మాత్రం వెన్నెలతో తెలుగులోనే మాట్లాడుతున్నా... కాని వెన్నెల నాకు సమాధానంగా మూగ దానిలా సైగలు చేసి చెబుతోంది. నాకు నవ్వొస్తూంది. నాకు మాత్రం నచ్చడం లేదురా.. మన హైద్రాబాదులో అయితే తెలుగుతోబాటు ఆంగ్లం, ఉర్దూ భాషలు కూడా వచ్చేవి. మీరంతా తెలుగు మీడియంలో చదువుకొని ఇక్కడ కొలువులు చేయడం లేదా?.. ” అంటూ నా ఆవేదనను వెళ్ళగక్కాను. అయినా నాపని ‘చెవిటి వారి ముందు శంఖమూదినట్లే’ అయ్యింది.
***
ఆవాళ శనివారం.. ఉదయం.. మా శ్రీనివాస్‍కు ఒక ఆహ్వాన పత్రిక వచ్చింది.. కుమారి ప్రియ తోటకూరు, కూచిపూడి రంగప్రవేశానికి సంబంధించిన ఆహ్వాన పత్రిక అది. అదే రోజు సాయంత్రం నాల్గు గంటలకు ఫ్రీమాంట్ లోని ఓలోన్ కళాశాల ఆవరణ స్మిత్ సెంటర్ థియేటర్లో కార్యక్రమం. శ్రీమతి హైమావతి సల్లా, సదానంద కూచిపూడి నృత్య పాఠశాల డైరక్టర్. ఆమె శిష్యురాలే కుమారి ప్రియ. ముఖ్య అతిధి ప్రముఖ కూచిపూడి నృత్య గురువు అయిన పద్మభూషణ్ డాక్టర్ చిన వెంపటి సత్యం గారి ప్రియ శిష్యురాలు ప్రముఖ కూచిపూడి నర్తకి సుమేధ.. ఇండియా నుండి వస్తున్నారు. నాకు ఎక్కడ లేని సంతోషం కల్గింది. మా అల్లునితో తప్పకుండా వెళ్దామని కోరగానే ‘సరే!’ అన్నాడు శ్రీనివాస్. మా ఇంటి నుండి దాదాపు రెండు గంటల ప్రయాణం. సరిగ్గా నాలుగింటికి చేరుకున్నాం. కాలేజీ చిన్న కొండ మీద ఉంది. థియేటర్ హైద్రాబాదులోని మన రవీంద్రభారతి లాగే ఉంది. జనం చాలా మంది వచ్చారు. దాదాపు అంతా తెలుగు వాళ్లే.. మన దేశపు వాళ్ళే. అంత మందిని చూడగానే నాకు ప్రాణం లేచి వచ్చినట్లైంది. మా అల్లునికి పరిచయం ఉన్న రెండు కుటుంబ సభ్యులను పరిచయం చేశాడు. అంతా తెలుగు వాతావరణం.. నా హృదయంలో ఆనందపు కెరటాలు కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాయి. ‘గణేశ’ కౌత్వంతో కార్య క్రమం ఆరంభమైంది. రాగం అరభి.. తాళం మిస్ర చాపు, ఆది.. స్వరకర్త శ్రీ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ, నృత్య సంయోజనం పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన సత్యం... కుమారి ప్రియ అభినయం అమోఘం.. మరో రెండు గీతాల అనంతరం స్వల్ప విరామం.. విరామ సమయంలో ఇడ్లీ, వడ, సాంబారు, దోసెలు, చట్నీలు సిద్ధం చేశారు. వడ్డించే వారంతా తెలుగులోనే మాట్లాడుతున్నారు. నాకు వీనులవిందుగా ఉంది. ఆనంద డోలికలో నా హృదయం నాట్యం చేయ సాగింది. కార్యక్రమం థిల్లానా గేయం, రాగం ధనశ్రీ, ఆది తాళం, నృత్య సంయోజనం స్వాతి తిరునాళ్ ప్రదర్శనతో ముగిసింది. నృత్య ప్రదర్శన అనంతరం సన్మాన సభా కార్యక్రమం ఆరంభమైంది. ముఖ్య అతిథి సుమేధగారిని వేదిక పైకి ఆహ్వానించారు. అలాగే సల్లా హైమావతి గారిని, వాయిద్య కళాకారులను తదితర పెద్దలను వేదిక పైకి ఆహ్వానించారు. అందరినీ సుమేధ శాలువాలతో పుష్పగుచ్చాలతో సన్మానించింది. ఆహ్వానితులంతా కుమారి ప్రియను అభినందించారు. ఇక ముఖ్య అతిథి సుమేధ గారి సన్మాన కార్యక్రమం.. ఒక పెద్ద శోభాయమైన సింహాసనం వేదికపైకి తీసుకువస్తూ ఉండగా ఉన్నఫళంగా సుమేధ తన కుర్చీలో నుండి లేచి వారించింది. సభ మ్రాన్పడిపోయింది. క్షణకాలం అలజడి.. ప్రేక్షకుల్లో ఉత్కంఠ.. సుమేధ గొంతు సవరించుకుంటుంటే సభలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడింది. “సభాసదులు.. ఆహ్వానితుల అంతా నన్ను మన్నించాలి.. ఈ సన్మానం నాకు ఇష్టం లేదు” అనగానే సభలో ఏదో జరిగిందని అంతా ఎవరికి తోచినట్లు వారు మనసుల్లో అనుకుంటున్నట్లు గమనించాను. నాకూ ఆశ్చర్యమేసింది... “నేను మొదటి నుండి గమనిస్తూ ఉన్నాను. ఇక్కడ నిర్వహిస్తున్నది తెలుగు సంప్రదాయ కార్యక్రమం. తెలుగు జాతి గర్వించ దగ్గ కూచిపూడి నృత్యం.. ఒక కొత్త నృత్యకారిణి కుమారి ప్రియ తెలుగు కూచిపూడి రంగ ప్రవేశం చేస్తుందని హృదయపూర్వకంగా ఆహ్వానించాలని, ఆశీర్వదించాలనీ మీకోరికపై మన భారత దేశం నుండి ఈ పరాయి దేశం వచ్చాను. అమెరికాలో కూడా మన దేశ తెలుగు సంస్కృతిని ప్రచారం చేస్తున్నారని గర్వించాను. కాని మీరు చేస్తున్నది ఏమిటి?” అని ప్రశ్నించగానే ‘గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు’ అంతా బిత్తరపోయి చూడసాగారు. సుమేధగారు మళ్లీ మాట్లాడడం మెదలు పెట్టారు.. “కూచిపూడి ఆంధ్ర ప్రదేశ్ క్రిష్ణా జిల్లా దివి తాలూకాలో ఒక కుగ్రామం. ఆ గ్రామంలో పుట్టిన ఆ నాట్యానికి కూచి పూడి అని పేరు రావడం.. నాట్యకళాకారులకు కూచిపుడి ఇంటి పేరుగా కీర్తించడం మనకెంతో గర్వకారణం. దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం భరతముని రచించించిన నాట్య శాస్త్రమిది. దానిని పదమూడవ శతాబ్దంలో సిద్ధేంద్రయోగి అని పిలవబడే సిద్దప్ప దానిని ఆధునీకరించాడు. ఎందరో మహానుభావులు ఈ నాట్యకౌశలతని తీర్చి దిద్దారు. నా గురువు గారు అయిన చిన వెంపటి సత్యం గారితో ఈ నాట్యం మరింత శాస్త్రీయంగా బహుళ జనాదరణ పొందింది. ఇరవై ఆరు డిసెంబర్ మాసం రెండు వేల పదిలో రెండువేల ఎనిమిది వందల నాట్యకళాకారులు, రెండు వందలమందికి పైగా గురువుల నియంత్రణలో హైద్రాబాదులోని బాలయోగి స్టేడియంలో హిందోళన రాగంలో జరిగిన కూచిపూడి నృత్యం కార్యక్రమం ప్రపంచపు చరిత్రపుటల్లోకి ఎక్కింది.. అలాంటి వాసికెక్కిన మన కూచిపూడి నృత్య ఆహ్వాన పత్రికను తెలుగులో అచ్చు వేయలేదు. కీర్తనలు తెలుగు.. అభినయం తెలుగు.. వేదికపై ఉన్నవారంతా తెలుగు వారే.. ఆహ్వానితులూ దాదాపు అంతా తెలుగువారే. అలాంటప్పుడు ఏ ఒక్కరూ వేదికపై మన స్వభాష తెలుగులో మాట్లాడ లేదు. ఎందుకు?.. తెలుగు మాట్లాడడమంటే మీకు అగౌరవంగా తోచిందా?.. మీరు పరాయి భాషలో మాట్లాడుతుంటే మన కన్నతల్లిని అవమాన పరుస్తున్నట్లు ఆవేదన చెందాను. మన నోళ్లని మనమే నొక్కేసుకుంటున్నాం.. ఇంతకంటే ఘోర తప్పిదం మరొకటి ఏదైనా ఉందా?.. నేను చాలా విచారిస్తున్నాను... నాకు తెలుగు వారు సన్మానిస్తున్నారని వచ్చాను. కాని ఇలా పరాయి వాళ్లు సన్మానిస్తున్నారని తెలిస్తే వచ్చేదాన్ని కాదు. ఇక ముందు ముందు కార్యక్రమాలు మన స్వభాషలో జరిగితేనే వస్తాను. ఈ సారికి క్షమించండి.. నాకీ సన్మానం ఇష్టం లేదు” అంటూ వేదిక దిగి చకా చకా వెళ్తుంటే ఆదృశ్యం ఆందోళన రాగం.. తాళం చిరాకు.. నృత్య భంగిమలో వెళ్లిపోతునట్లుగా నాకు కనిపించింది. సభలో కలకలం.. సభాసదుల ముఖాలు పాలి పోయాయి. అందరూ సిగ్గుతో తలలు వంచుకున్నారు. నేను నా కూతురి అల్లుని ముఖాలు పరిశీలనగా చూడసాగాను. నాకెందుకో అలా చూడాలని అనిపించిందింది.. చూస్తుంటే ఆనందం కలిగింది. ఆ సంఘటన తరువాత నాలో ఆలోచనలు చెలరేగాయి. అంత దూరం నుండి వచ్చిన సుమేధ స్వభాష వ్యాప్తికై తన సన్మానాన్ని తృణ ప్రాయంగా తృణీకరించింది. మళ్లీ తెలుగు వినబడితేనే కార్యక్రమాలకు హాజరవుతానని ఆంక్ష పెట్టింది. అది నాకు బాగా నచ్చింది.. నేను కూడా ఎదో ఒకటి చేయాలి అని నిర్ణయించుకున్నాను.
***
ఆవాళ నేను నా శ్రీమతి తిర్గి ఇండియాకు ప్రయాణమయ్యాం. సాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో మా వీడ్కోలు సమయం రాగానే నామనసులోని ఆవేదనను బయట పెట్టాను. “చూడు శ్రావణీ!.. నువు అమెరికా వెళ్ళడమే నాకిష్టం లేదంటే నువ్వు నా మనసు నొప్పించి సాధించుకున్నావు.. అదీ మన స్వభాషను అమెరికాలో వ్యాప్తి చేస్తాన్న షరతు మీద. దాన్ని దృష్టిలో పెట్టుకొనే నేను ఆమధ్య ‘ముద్దుల మనవరాలికి’ అనే ప్రేమలేఖను అచ్చంగా తెలుగు మాస పత్రికలో రాశాను. నా మనవరాలు తెలుగు నేర్చుకొని మన దేశానికి వస్తుందని పాఠకులకు చెప్పాను. నేనూ కలలు గన్నాను. కాని మీరు చేస్తున్నది ఏమిటి?.. తెలుగు భాష వ్యాప్తి అటుంచి నీ కన్న కూతురుకే తెలుగు నేర్పించడం లేదు. ఇంతకంటే అవమానం నాకు మరొకటి లేదు.” అంటుంటే నా గొంతు కూరుకు పోయింది.. కాసేపు మౌనంగా ఉండిపోయాను.. నాకూతురు ఏమైనా అభయమిస్తుందో అని వేచి చూశాను. యిక లాభం లేదు చివరగా నా నిర్ణయం చేయాలనుకున్నాను. “వెన్నెల తెలుగు నేర్చుకుంటేనే నేను మళ్ళీ అమెరికా వస్తాను లేదా.. ఇదే నా అంతిమ కోరిక అనుకోండి..” అంటుంటే నా కళ్లు కన్నీళ్ళ ప్రవాహాన్ని ఆపలేక పోయాయి... వాతావరణం ఉద్వేగభరితమై పోయింది.. వేగంగా సామాను బండిని తోసుకుంటూ విమానాశ్రయంలోనికి వెళ్లిపోయాను.. వెను తిర్గి చూడలేదు... నా శ్రీమతి, నేను ఇండియా వచ్చేశాం.
***
ఇండియా వచేసామే గాని మామనసంతా మనుమరాలు వెన్నెల నిండుకుని ఉంది. తేప తేపలు వెన్నెల చేష్టలు గుర్తుకు రాసాగాయి. తేనెలూరే ఆ నోటి వెంట తెలుగు పదాల నాట్యం చూడాలని మనసు తహ తహ తహలాడిపోతోంది. అనవసరంగా ఆ షరతు విధించానా?.. అనిపించ సాగింది. నా మనసు వెన్నెలను చూడాలని ఆరాటపడ్తోంది. ‘నేను పోయేలోగా నా మనవరాలి తెలుగు మాటలు వినే అదృష్టం కలుగుతుందా’ అని హృదయంఆవేదన చెందసాగింది. ఏ ఫోన్ కాల్ వచ్చినా నా మనవరాలే అని నా సతీమణితో పోటీ పడి పరుగెత్తి ఫోన్ ఎత్తడం అలవాటై పోయింది.. నిరాశ మిగులుతోంది. అయినా అలవాటు మానుకోలేదు.. ఇంతలో నా ఆలోచనలను పారద్రోలుతూ ఫోన్ మ్రోగింది.. నా శరీరం సహకరించకపోయినా.. పరుగెత్తి ఫోన్ ఎత్తాను. “తాతయ్యా నేను వెన్నెలను.. మధురమైన మన తెలుగు భాషను నేర్చుకుంటున్నాను..” అంటూ అవతలి నుండి కోకిల స్వరం వినపడగానే నాలో వేయి వేణువులు వీనుల విందుగా మ్రోగాయి. నాతనువు పులకరించి పోయింది.
******************
No comments:
Post a Comment