వెన్నెల్లో లాంచీ ప్రయాణం - అచ్చంగా తెలుగు

వెన్నెల్లో లాంచీ ప్రయాణం

Share This
వెన్నెల్లో లాంచీ ప్రయాణం
---- వంశీ

“టైమెంత?” 
“ఏడవ్వస్తుందండి” 
“వచ్చే రేవేంటి?”
“కొరుటూరు” 
“మరైతే ఆ మధ్యనున్న తిప్ప మీద ఈ రాత్రికి లంగరేసేద్దామా?” అదడగడానికే వచ్చాను... 
“సరే... బాసరలోనూ భద్రాచాలంలోనూ చూసిన గోదారికి ఇక్కడి గోదారికీ ఇంత డిఫరెన్స్ ఉందేమిటి”. అంటా వచ్చిన గొట్టిముక్కల పద్మారావు గారిని వాళ్ళ ముద్దు కృష్ణా లాంచీ చూపు కర్ర దగ్గరకి దించి, పన్న (చుక్కాని ముందు భాగం) దగ్గర కూర్చోపెడుతుంటే ఆ వెన్నెల్లో గోదావరిని చూసిన పద్మారావు “గోదావరి ఇంత గొప్పగా ఉంటదా?” అడిగాడు. 
“రోజూ జూసే మాకేం తెలుస్తుందండి కొట్టగా వచ్చిన మీరే జెప్పాలి” అన్నాడు నా పక్కనే నిలబడ్డ మురళీ కృష్ణ లాంచీ ఓనరు మూర్తి. తక్కిన తోముంగ పక్షులన్నీ ముందే వెళ్ళిపోడంతో ఎక్కడో ఇరుక్కున్న ఆ పక్షి తన పక్షుల్ని వెతుక్కుంటూ అరుచుకుంటూ వెళ్తుంది. ఆకాశంలో చంద్రుడు చాలా లైట్లు పడ్డ వెండి బిందెలా వెలిగిపోతున్నాడు. గాలి వీయడానికి ఇష్టం వుండీ లేనట్టు పల్చ పల్చగా వీస్తుంది. వెన్నెల్లో గోదారి అందం గోదావరి పెట్టుకున్న పాపిట బొట్టులాంటి పొడుగాటి ఇసక తిప్ప మధ్యలో లాంచీ ఆపాడు మూర్తి. వరదొచ్చినప్పుడు మట్టి లాగేసుకోడం వల్ల పెద్ద జంతువు అస్తిపంజరంలా బయట పడిపోయాయా చింత చెట్టు వేళ్ళు. కొమ్మల్లో మీద నిద్ర రాని పూరీడు పిట్ట విచిత్రంగా విరుస్తూ కూస్తుంది. దూరంగా రేవులో ఒడ్డుకి లాగి తిరగేసిన నావని రిపేరు చేస్తుంటే పదేళ్ళ కుర్రోడు లాంతరు చూపిస్తున్నాడు. నిండు చంద్రుడు మీంచి పల్చని మబ్బు పాయ పల్చటి వాయిలు చీర అంచులా పాకుతా వెళ్ళిపోతుంది. నిద్రరాని కొందోడు ఒడ్డుమీంచి నడుస్తా పోతున్నాడు. ఆకాశంలో నక్షత్రాల మధ్య వెళ్తున్న జానా బెత్తెడు సైజు విమానం దీపాలు మిలుక మిలుకమంటున్నాయి. గాలి ముమ్మరం పెరిగేసరికి జూకోడు పక్షి విచిత్రంగా అరుస్తూ వెళ్తుంది. కూనవరం సంతనించోస్తున్న లాంచీ నిండా జనం. ఎవరికి తోచిందాడు మాటాడ్తుంటే ఎవడికనిపించిందాడు పాద్తున్నాడు. ఆ లాంచీ వెళ్ళాక అంతసీపూ ఏ చప్పుడూ చెయ్యకుండా వున్న గోదాట్లో భళక్కు భళక్కుమన్న నీళ్ళ చప్పుడుతో పాటు రెండు పాయల కింద విడిపోయింది గోదారి. ఈ చప్పుడుకి నీళ్ళలోంచి ఒక్కసారి పైకి లేచి మళ్ళీ లోపలికెళ్ళి పోయినియ్యి నాలుగు బొచ్చు చేపలు. ఆకాశంలో కనిపించని రెండు పక్షులు కీర్ కీర్ చప్పుళ్ళు చేసుకుంటా వెళ్లిపోయినియ్యి. దూరంగా వున్నా శివగిరి వూళ్ళో ఒక లాంతరు వెలిగి మాయమైపోయింది. ఆ వెన్నెల్లో ఈదుతూ ఇదే గోదాట్లో ముప్పయ్యేళ్ళ క్రితం పాత, వెన్నెల్లో గోదారి అందం గుర్తొచ్చింది. వెనక్కి చూస్తే వెన్నెల్లో వెలిగిపోతున్నాయి పాపికొండలు. కుడి పక్కనున్న కొండ మొదలు గ్రామంలోనూ ఎడం పక్కనున్న కొరుటూరు లోనూ మసగ్గా వెలుగుతూ కనిపిస్తున్నాయి దీపాలు. వంట చెయ్యడానికి నల్ల శ్రీను పొయ్యి వెలిగిస్తుంటే సాయం చేస్తున్నాడు కృష్ణ. చంద్రుడ్ని చూస్తా వెన్నెల స్నానాలు చేసిన మా కోసం ఇసుకలో పరుపులేసి దుప్పట్లు పరుస్తున్నాడు మల్లాది సాంబులు. మీ కోసం కోయదొర దగ్గర మాంచి చిగురు సంపాయించేనంటూ రెండు లీటరు బాటిల్స్ తో వచ్చిన మూర్తిగారు ఒరే పట్టాభీ మూడు గ్లాసులు కదిగాట్టుకురా” అంటూ అరిచాడు. గోదారి నీళ్ళలాంటి రుచిగల ఆ చిగురు పుచ్చుకుంటున్న మా ఆనందం ఇంతా అంతా గాదు మరెంత? .... పాపికొండల్లో ఓ కొండంత. ఇంత గొప్ప ఆనందం ఇంతకూ ముందెప్పుడూ అనుభావిన్చాలేదన్నాడు పద్మారావు. చక్రి అయితే కొత్త పాత కట్టేసి కొత్తగా పాడేశాడు. కారణం తెలీదు, వేటపడవ ఒకటి వెనక్కొచ్చేస్తుంది. “రారా కౌగిలి చేర” అని పాత పాడతా ఇసక తిప్ప మీదాడుతోంది ఎల్. విజయలక్ష్మి. ఆ పాత మనిషికి పోటీగా వచ్చిన హంసానందిని మిర్చిలో పాటందుకుంది. గోదావరి మధ్యన రకరకాల వెలుగులు. అలా ఎంతసేపు గడిచిందో వాళ్ళిద్దరి కలలూ యెంత సేపు పండాయో. ఓ ముప్పావు గంట తర్వాత వంట పనిగానిచ్చిన నల్ల శ్రీనూ, డ్రైవరు కృష్ణా, సరంగు పట్టాభితో పాటు ఇంకా తాతలూ, బుల్లబ్బాయి లాంటోళ్ళంతా మా చుట్టూ మూగిపోయి మరి ఊసులాడ్డం మొదలెట్టారు.... (మిగతా భాగం వచ్చే నెలలో...)   

No comments:

Post a Comment

Pages