ఓదార్పు యాత్ర
పెయ్యేటి శ్రీదేవి
స్వప్న అనే ఒక అందమైన అమ్మాయి కారులోంచి దిగింది. ఇంకా వెనకల ఇంకో కార్లోంచి మరి కొంతమంది వీడియో కెమేరాలతో దిగారు. అదంతా మురికివాడ ఏరియా. ఆ ఏరియాలోకి అడుగు పెట్టి అక్కడ వచ్చే దుర్వాసనల్ని ముక్కుకి తగలకుండడా రుమాలు చుట్టుకుని, గతుకులు, వర్షం పడి చిత్తడి చిత్తడిగా వున్న నేలపై వెడుతోంది. చిన్న పిల్లలు చింకి లాగూలతో బైట ఆడుతున్నారు. అన్నీ పూరిగుడిసెలు. ఇంటి బైట కొంతమంది గిన్నెలు తోముతున్నారు. కొంతమంది బట్టలుతుకుతున్నారు. అక్కడంతా మురికినీరు. పక్కనే పెద్ద మురిక్కాలవ. దోమలు, ఈగలు, ముక్కుపుటాలదిరేలా దుర్గంధాలు. స్వప్న ఒకచోట ఆగింది.అక్కడ ముసలమ్మ పొయ్యి రాజెసి అన్నం వండుదామని శతవిధాల ప్రయత్నించి విఫలమువుతోంది. వర్షానికి తడిసిన మూలాన పుల్లలు మండక మొండికేసాయి. ఐనా సరే, పట్టుదలగా పొగలో ఖళ్ళు ఖళ్ళు అని దగ్గుతూనే గొట్టంతో ఉఫ్ ఉఫ్ అని ఊదుతూ మంట రాజేస్తోంది. ఐనా మళ్ళీ ఆరిపోతోంది. మళ్ళీ మళ్ళీ గొట్టం ఊది మంట రాజేసింది. ఎలాగో అన్నం ఉడికించి మెతుకు ప ట్టి చూసింది. ఎల్లాగో అయిందనిపించి అన్నం కుండ దింపింది. ఈలోగా ' అమ్మా! బువ్వ పెట్టే.' అంటూ వచ్చాడు కొడుకు. ఒక సీమండి పళ్ళెంలో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసి అన్నం పెట్టి కొడుకు చేతికిచ్చి తినమంది.
స్వప్న మురికివాడంతా చుట్టి అక్కడ ఆగిపోయి చూస్తోంది. ఇదంతా వీడియోకెక్కుతోంది. ఓదార్పు ఛానెల్ యాంకర్ స్వప్న ఇంటర్వ్యూ చేస్తోంది.
' మామ్మా! రోజూ మీ అబ్బాయికిలాగే అన్నం పెడతావా? కూర నార ఏం చెయ్యవా?'
' మా అసుమంటోల్లు కూర నార ఏం కొనుక్కుంటామమ్మా? అన్నం ఉడకెయ్యడానికే ఇబ్బందిగా వుండాది.'
' అవును పాపం! పొయ్యి మీద వండుతూ పుల్లలు సరిగ్గా మండక పొగలో ఓ మూల దగ్గుతూ చాలా ఇబ్బంది పడుతున్నావు.'
ఇంతలో ఆ మురికివాడలో జనమంతా అక్కడికొచ్చారు. పిల్లలు ' టి.వి.వాళ్ళొచ్చారు, టి.వి.వాళ్ళొచ్చారు.' అంటూ ఎగబడ్డారు.
' ఏమ్మా! మీరందరూ వర్షానికి నేలంతా చిత్తడి చిత్తడిగా వుండి, ఓ పక్క మురికినీరు, దుర్వాసనలతో, మరోపక్క ఈగలు, దోమలు ముసురుతుంటే ఎలా వుండగలుగుతున్నారు? మీరు ప్రభుత్వానికి వెళ్ళి మీ సమస్యలు చెప్పుకోవచ్చు కదా?'
' ఎన్నోసార్లు చెప్పినామమ్మ. ఓట్లు అడుక్కుంటానికొస్తరు. తప్పకుండా చేస్తమంటరు. మళ్ళీ అగుపించరు. ఎండాకాలంలో ఎండ, వానాకాలంలో వాన మా ఇళ్ళలోనే వుంటాయి. ఇక వర్షమొస్తే ఇదిగో, ఇట్లాగే వుంటది. సుట్టూ మురికినీరు అలా పారుతూనే వుంటది. ఈగలు, దోమలు మమ్మల్ని పీడించుకు తింటాయి. బాత్ రూములు కూడా లేవు. తాగటానికి నీళ్ళు రావు. ఎక్కడికో వెళ్ళి తెచ్చుకుంటాము. ఆ నీళ్ళు కూడ మురిగ్గానే వుంటాయి. పెతీ పార్టీవోళ్ళూ వస్తారు. ఏదో కొంత డబ్బిస్తారు. ఓట్లు వేయించుకుంటారు. మళ్ళీ తిరిగి సూడరు. అసలు నాకు తెలకడుగుతాను. మాకు బైట పెపంచకంతో సంబంధం లేదు. ఈ మురికివాడల్లోనే మా బతుకులు. ఎవ్వరివల్లా ఎటువంటి ఉపకారమూ లేదు. అసుమంటప్పుడు మేం ఓటు ఎందుకెయ్యాలా?
' మరి ఆమాటే మంత్రుల్ని అడక్కపోయారా? అంది స్వప్న.
' అల్లా అడిగినప్పుడల్లా మేం తప్పకుండా మీకు అన్ని సౌకర్యాలూ కల్పిత్తామంటారు. బలవంతంగా లాక్కెళ్ళి ఓట్లు వేయించుకుంటారు. ఇలాగే టి.వి.వాళ్ళొత్తారు. మమ్మల్ని ఓదారుస్తారు. షూటింగ్ చేసుకుని ఆళ్ళ టి.వి.లల్లో మా గురించి అందరికి సూపిత్తారు.
అల్లప్పుడెప్పుడో ఇతర దేశపోళ్ళొచ్చారు. ఇండియాలో మురికి వాడలంటూ ఏదో సినీమా తీసుకొని ఆళ్ళ దేశంలో సూపించారు.
ఒకసారి అదేదో సినీమాకని మా మురికివాడ ఏరియాని, మా బతుకుల్ని సినీమా తీసారు. ఆ సినీమా సూపరు హిట్టయి అయేటో పట్టకారు, అట్లకాడ అవార్డులు ....'
' పట్టకారు, అట్లకాడ కాదే అమ్మా! నీకేం తెల్దు. ఆసకారు అవార్డులు.' అంది కూతురు.
' అదేలే, ఆ కార్ల పేర్లేంటో నాకు తెల్దు. ఏదో కారో, ఆటోయో - అవార్డులు చానా ఒచ్చినాయంట. మన దేశానికి ఆ కారు అవార్డులు వచ్చినోళ్ళని అందరూ ఈరలెవెల్లో ఆకాశానికెత్తేసి, ఆళ్ళకేటో బోలెడు సనమానాలు సేసి, ఇంకా డబ్బులు కూడా ఇచ్చినారంట.'
నిజంగా ఇది సిగ్గు పడాల్సిన యిసయం. ఈ మురికివాడలు ఎప్పట్నించో వున్నాయి. మా తాత, ముత్తాతల కాడ్నించి ఈ మురికివాడల్లోనే మగ్గుతున్నాము. పెద్దోళ్ళందరూ అవినీతి పనులు సేసి, డబ్బులు సంపాదించేసి ఇంకా ఇంకా గొప్పోళ్ళవుతున్నారు. మా బతుకులు మాత్రం ఇట్టాగే వున్నాయి. ఎన్నో పెబుత్వాలు మారాయి. ఎందరో నాయకులొచ్చారు. ఏ ఒక్కళ్ళూ మాకు సాయం చేయలేక పోతిరి పేదరికం రూపు మాపుతామని అమ్మమ్మ కాడ్నించి అంటానే వున్నారు. అల్లప్పుడెప్పుడో ఎవరో మొరార్జీ దేశాయి గారంట, పదేళ్ళలో పేదరికాన్ని రూపు మాపుతామన్నారు. పేదరికం పోయి ఎప్పుడెప్పుడు గొప్పోళ్లమవుతామా అని, మ అమ్మ ఆసెతో ఎదురు చూస్తూ, ఇంక సూడలేక బెంగతో సచ్చిపోనాది. ఆ మంతిరిగారూ ఐదేళ్ళకి మించి సెయ్యలేదు. ఇందిరమ్మ గరీబీ హటావో అన్నది. ఇలా అందరూ పేదరికం రూపుమాపుతానని అంటానే వున్నారు. మేం మాత్తరం మా తాత ముత్తాతల కాడ్నించి ఈ మురికివాడల్లో ఇట్టాగే మగ్గిపోతా వున్నాం. ఇతర దేశపోల్లకి, సినీమా తీసేటోల్లకి, టి.వి. వోల్లకి, ఓదార్పు యాత్తరలు సేసేటోల్లకి, గిన్నీసోల్లకి, రాజకీయ నాయకులకి ఆల్ల ఆల్ల స్వార్థప్రయోజనాల కోసరం మాత్తరం మా బతుకులు బాగా ఉపయోగ పడతాయి. పేదోడి కోపం పెదవికి సేటనేది మా అమ్మమ్మ. ఏమన్నా అంటే మా మీద ఏ మాత్తరం దయలేకుండగా ఈ గుడిసెలు కాళీ సేయించేసి బవంతుల మీద బవంతులు కట్టేత్తారు. అల్లక్కడెక్కడో, మా బందువులుండే కాడ ఓట్లకొచ్చినప్పుడు, ఇల్లు కట్టించండయ్యా అని అడిగినారని, ఎన్నికలైనాక, గుడిసెలు కాళీ సేయించేసి, ఆ తలాలు ఎక్కు వ రేటుకి అమ్మేసారు. తరవాత అక్కడ అపారుటుమెంటులు లేసినాయి.'
' గిన్నీసోళ్ళంటే ఎవరు?' అడిగింది యాంకరు.
' అదేమ్మా.....అదేటే యాదమ్మా?' కూతుర్ని అడిగింది.
' గిన్నీసు బుక్కు.'
' అది మూడవ కళాసు సదువుకుంది. అందుకే దానికెరిక. నేనేటీ సదూకోనేదు. బాదొస్తే ఇలా వాగడం తప్ప.'
' అదే పనిగా వాగుతుండావనే గిన్నీసోళ్ళు నిన్నూ గిన్నీసు బుక్కులో పెడతానన్నారు. నువ్వు మాటలు టక్కున ఆపేస్తే అప్పుడు ఇంకోళ్ళని పెట్టేసుకున్నారు. తమ్ముడ్ని గిన్నీసులోకి ఎక్కించుకున్నారు.'
' తమ్ముడ్ని ఎక్కించుకున్నారా? ఏం గొప్ప పని చేసాడు?' అడిగింది యాంకరు.
' గొప్ప పనేం కాదు. ఎక్కువ రోజులు ఏ సెత్తపని సేసినా కూడా ఎవరెక్కువ సేపు సేత్తే ఆళ్ళు గిన్నీసు బుక్కులోకి ఎక్కచ్చు. మా తమ్ముడు ఏకధాటిగా ఇరవైఅయిదు రోజులు ఆపకుండా ఏడవడం మొదలెట్టినాడు. అది వొరకు పదేను రోజులు ఎవరో పిల్ల ఏడిసినాదంట. ఇప్పుడు ఆ రికారుడు సెరిపేసి, మా తమ్ముడు ఇంకా ఎక్కువ రోజులు ఏడిసినాడని గిన్నీసులోకి ఎక్కించుకున్నారు.'
మళ్ళీ తల్లి చెప్పడం మొదలెట్టింది.
' అల్లప్పుడెప్పుడో ఎవరో మంతిరిగారు ఏదో పెమాదంలో పోతే, నాల్రోలు పోయాక జబ్బు పడి మా అయ్య, మా అమ్మ పోయారు. మా పక్క గుడిసెలో ముసలాయన గుండె నెప్పొచ్చి పోనాడు. ఆ పెమాదంలో పోయిన మంతిరి గారబ్బాయెవరో రోగన్ అట, ఓదార్పు యాత్రంటూ మమ్మల్ని ఓదార్చటానికొచ్చాడు. ఆ మంతిరిగారు పోయారన్న బాధతో మా వాళ్ళందరూ పోయారని ఓదార్చుతూంటే, ' లేదయ్యా, మీ అయ్య పోనాడని మా అయ్య పోలేదదు, మా అయ్యకి డబ్బుల్లేక, వైద్యం చేయించుకోలేక జబ్బు చేసి పోయాడయ్యా' అంటే నమ్మడే! అందరూ మమ్మల్ని షూటింగులు తీసుకుని ఎల్లినారు. టి.వి.లల్లో సూపించారు. సుట్టూ ఈగలు, దోమలు కూడా షూటింగుల్లో పడ్డాయి. మీరు సూసే వుంటారు.'
' అమ్మా, ఇంక రాయే. తమ్ముడేడుస్తున్నాడు. పడిపోనాడు.' అంటూ పిలిచింది ఏడేళ్ళ కూతురు తల్లిని.
ఆ పిల్ల చింపిరి జుట్టుతో, చిరిగిన బట్టలతో వుంది. తమ్ముడిని ఎత్తుకుని ఓదారుస్తోంది. ఆ పిల్ల ' ఓమ్మా, ఓమ్మా!' అంటున్న కొద్దీ ఆ పిల్లాడు బిక్కమొహం పెట్టి తలుచుకు, తలుచుకు ఇంకా ఇంకా ఏడుస్తున్నాడు.
ఆ పిల్లాడికి, ఆ పిల్లాడి అక్కకి తన బేగులోంచి చాక్లెట్లు తీసిచ్చింది యాంకరు స్వప్న.
వచ్చే ఏడుపుని పక్కన బెట్టి, మధ్య మధ్యలో ఎక్కుతూ చాక్లెట్ తింటున్నాడు ఆ పిల్లాడు.
స్వప్న అడిగింది, ' ఓమ్మా పడ్డావా? దెబ్బ తగిలిందా?'
స్వప్న అల్లా అడగ్గానే ఆ పిల్లాడు మళ్ళీ బిక్కమొహం పెట్టి ఏడవడం మొదలెట్టాడు. ఈసారి గట్టిగా లంకించుకున్నాడు. స్వప్న అతడికి బిస్కట్ ఇచ్చింది. ఆ బిస్కట్ తీసుకుని ఏడుస్తూనే నోట్లో పెట్టుకున్నాడు. వాడి ఒంటి నిండా చొంగ కారుతోంది. వాడి ముక్కు, మూతి వాళ్ళక్క తను కట్టుకున్న లంగాతో తుడిచింది.
' నీ పేరేంటి?' అడిగింది స్వప్న.
' యాదమ్మ.'
' తమ్ముడి పేరు?'
' సీతయ్య.'
' ఇదుగో, ఈ బిస్కట్ పేకెట్టు తీసుకో.'
ఓదార్పు యాత్ర పూర్తి చేసుకుని బయలుదేరింది స్వప్న.
***************************
రిమోట్ చేత్తో పట్టుకుని, సోఫాలో కూచుని, ఆ మురికివాడలో జరిగిందంతా టి.వి.లో చూస్తోంది జయలక్ష్మి. ఆ ఓదార్పు కార్యక్రమం అయ్యాక మరో ఛానెల్ కి మార్చింది. ఆ మురికివాడల్లో తిరిగిన యాంకరు స్వప్నే కొంచెం పొట్టి డ్రస్సు వేసుకుని, ఫేషనుగా జుట్టు విరబోసుకుని, ప్రఖ్యాత సినీహీరో చౌహాన్ ని ఇంటర్వ్యూ చేస్తోంది. ఆ రోజునే చౌహాన్ నటించిన ఒక పిచ్చి సినిమా రిలీజైంది. ఆ సినిమా ఇంకా రిలీజవకుండానే, ఆ సినిమా నిండా పచ్చి బూతులున్నాయని, రోత పుట్టే డైలాగులున్నాయని పత్రికలలో విమర్శలొచ్చాయి. అంతేకాక ఆ సినిమాలో ఒక కులం వారిని కించపరుస్తూ చాలా దృశ్యాలున్నాయని, ఆ కులం వారు ఆందోళనలు కూడా చేపట్టారు. అది సినిమా బాగా ఆడడానికి వాళ్ళాడుతున్న స్టంటేమో తలీదు. ఎందుకంటే చాలా సార్లు ఇలా ఏవో ఆందోళనలు జరగడం, ఆ తర్వాత ఆ సినిమాలు బాగా డబ్బులు చేసుకోవడం, తర్వాత ఆ ఆందోళనలు చప్పగా సద్దు మణగడం జరుగుతున్నదే. ఆ పిచ్చి ఇంటర్వ్యూ చూడడం ఇష్టం లేక జయలక్ష్మి మరో ఛానెల్ కి మార్చింది. అందులో మరో ఓదార్పుయాత్ర!అప్పు తీర్చలేక ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కుటుంబంలో సభ్యులు ఏడుస్తున్నారు. చుట్టూ ఈగలు ముసురుతున్నాయి.
ఆ మంత్రిగారబ్బాయి వాళ్ళ దగ్గరకెళ్ళి ఓదారుస్తున్నాడు. అతడిని గట్టిగా పట్టుకుని వాళ్ళింకా ఏడుస్తున్నారు.' ఈ ప్రభుత్వం మీ కొరకు ఏమీ చెయ్యటల్లేదు. నేను ముఖ్యమంత్రి అయ్యాక మీకు అన్నీ చేస్తాను. ఊరుకోండి.' అంటూ ఓదారుస్తున్నాడు.
' అమ్మా, తమ్ముడు పడ్డాడే.' అంటూ జయలక్ష్మి ఏడేళ్ళ కూతురు రాధిక తమ్ముడ్ని తీసుకుని తల్లికిచ్చింది. జయలక్ష్మి వాడికి ఫ్రిజ్ లోంచి కేక్ తీసి ఇచ్చింది. వాడి నోట్లోంచి వచ్చే చొంగని, నోటికంటుకున్న కేక్ ని టిష్యూ పేపరుతో తుడిచింది.
వాడు బాగానే నవ్వుతున్నాడు.
' ఏరా కన్నా! పప్పోయావా?' అంది వాళ్ళక్క రాధిక.
అంతే! వాడు బిక్కమొహం పెట్టి ఏడుపు లంకించుకున్నాడు.
జయలక్ష్మి కూతుర్ని కేకెలేసింది. ' ఎందుకే ఊరుకున్న వాడ్ని ఓమ్మా, ఓమ్మా అంటూ ఓదార్చుతావు? చూడు, ఏమీ లేనిదానికి ఏదో కష్టమొచ్చేసిందనుకుని ఏడ్చేస్తున్నాడు.'
తల్లి కేకలేసేసరికి రాధిక ఏడుపు లంకించుకుంది. ' నువ్వెప్పుడూ నన్నే తిడతావు. తమ్ముడంటేనే నీకిష్టం. నేనంటే నీకు ప్రేమ లేదసలు.' వెక్కి వెక్కి ఏడుస్తూనే కళ్ళు నులుముకుంటూ అమ్మమ్మ దగ్గరకెళ్ళింది. ' చూడమ్మమ్మా! మమ్మీ నన్ను కేకలేస్తోంది.'
' రామ్మా, రా. మీ అమ్మంతేలే. ఉండు, మీ అమ్మ పని చెబుతా.' అంటూ రాధికని ఒళ్ళో కూచోబెట్టుకుని ఓదార్చింది అమ్మమ్మ.
రాధిక ఆ రోజంతా తల్లితో మాట్లాడకుండా కోపంగా వుంది. అన్నానికి కూడా రాలేదు. మళ్ళీ జయలక్ష్మి రాధికని ఓదార్చి అన్నం తినిపించేసరికి తాతలు దిగొచ్చారు. దాని ఫలితం రాధికకి మర్నాడు బట్టల షాపులో మంచి డ్రస్సు తీసుకుని, ఇంకా ఆ కోపం పోవడానికి ఆ సత్యభామకి అడిగినవన్నీ కొనివ్వాల్సి వచ్చింది.
జయలక్ష్మి బాధతో ఆలోచిస్తోంది.
వాళ్ళు ఓట్లకోసం, పదవుల కోసం వాళ్ళ వాళ్ళ ప్రచారం కోసం ఓదార్పుయాత్రలు చేస్తారు. వరదలొస్తే సుడిగాలి పర్యటనంటూ హెలికాప్టర్లలో తిరుగుతారు.
నిర్మాతలు సినిమాలు తీసి కోట్లు కోట్లు ఆర్జిస్తారు. అవార్డులూ తెచ్చుకుంటారు. మురికివాడల మీద సినిమాలు తీసి అవార్డులు తెచ్చుకోవడం గర్వించదగ్గ విషయం అనుకుంటారు. కాని కాదు. ఇండియాలో ఇంకా మురికివాడలు ఉన్నందుకు సిగ్గు పడాలి. ఇతరదేశాల లాగ మన దేశం ఇంకా ఎందుకు అభివృధ్ధి చెందటల్లేదు?
నాయకులు అన్యాయంగా లంచాలను తెగ మేసి మరింత కోటీశ్వరులవుతున్నారు. నీతికి గంతలు కట్టి భ్రష్టులే నాయకులౌతున్నారు.
మురికివాడల్ని పట్టించుకునే వాళ్ళు ఎప్పటికీ కానరారేమో అనిపిస్తోంది ఈనాటి దేశపరిస్థితి చూస్తోంటే. మురికివాడల్లో బతికేవాళ్ళ బతుకులు మురికివాడల్లోనే గడిచిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎన్ని శతాబ్దాలు గడిచినా, ఏ పార్టీవారు అధికారంలోకి వచ్చినా మురికివాడలు మురికివాడలు గానే మిగిలిపోతున్నాయి. ఆ మురికివాడల మీద సినిమాలు తీసి నిర్మాతలు మాత్రం ఆస్కార్ అవార్డులూ, కోట్లు కోట్లూ సంపాదిస్తున్నారు.
జయలక్ష్మికి అనిపించింది.
ఎవరికి వారు మనసులో ఇలా బాధ పడుతూ కూచుంటే దీనికి పరిష్కారం ఎక్కడ్నించి వస్తుంది? ఎవరో కవిగారన్నట్లు, ' ఎటు పోతోందీ దేశం? ఆలోచించు నేస్తం! చుట్టూ చీకటి, మదిలో చీకటి, వెలిగించు చిరుదీపం!'
ఔను! చీకటిగా వుందని, ప్రభుత్వంవారో, మరెవరో వచ్చి దీపం వెలిగించాలని అనుకుంటూ కూచునే కన్న ఆ బాధ్యతను ఈ దేశ పౌరురాలిగా నేనే ఎందుకు చేపట్టకూడదు అనిపించింది జయలక్ష్మికి.
వెంటనే నడుం బిగించి, నలుగుర్ని కూడగట్టుకుని ఆ ఆర్తులకి సహాయక చర్యలు చేపట్టే పనికి పూనుకుంది.
ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిదర పోకుమా.....
**************************
No comments:
Post a Comment