ఎనిమిది యొక్క విశిష్టత - అచ్చంగా తెలుగు

ఎనిమిది యొక్క విశిష్టత

Share This
ఎనిమిది యొక్క విశిష్టత
 - పెయ్యేటి రంగారావు

   
మన శాస్త్రాలలో ఎనిమిది సంఖ్యకున్న విశిష్టత గురించి ముచ్చటిస్తాను.భగవంతుడికి మనం సాష్టాంగ నమస్కారం చెయ్యాలి.  ' జానుభ్యా: తథా పద్భ్యాం పాణిభ్యా మురసా ధియా, శిరసా వచసా దృష్ట్యా ప్రణామోష్టాంగ ఈరిత: ' అంటే, మోకాళ్ళు, పాదములు, చేతులు, రొమ్ము, బుధ్ధి, తల, మాట, చూపు - వీనిచే చేయు నమస్కారం.అష్టదిక్కులు అంటే అందరూ ఎరిగున్నవే.  తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైఋతి, పడమర, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం. అష్టకష్టాలు అంటారు.  అవేమిటంటే దేశాంతరం, భార్యావియోగం, ఆపత్కాలంలో బంధు దర్శనం, పరుల ఎంగిలి భోంచేయడం, శత్రు స్నేహం, పరాన్న ప్రతీక్షణం, భంగం, దారిద్ర్యం. రాజుని అష్టగతికుడు అంటారు.  అంటే ఎనిమిది గతివిశేషములు కలవాడు అని అర్థం.  అవేమిటంటే, పన్ను పుచ్చుకోవడం, సేవకులకు జీతభత్యాల నివ్వడం, ప్రత్యక్ష కార్యాలలో కాని, అప్రత్యక్ష కార్యాలలో కాని మంత్రి మొదలగు వారిని నియమించడం, దృష్టా దృష్టములైన చెడు కార్యాలనుండి మంత్రి మొదలగు వారిని నిషేధించడం, సందిగ్ధ కార్యాలలో తన ఆజ్ఞ ప్రకారం అందరూ నడిచేలా చేయడం, ప్రజల వ్యవహారాలను తీర్చడం, ఓడిన వారినుంచి శాస్త్రోక్తంగా ధనాన్ని గ్రహించడం, జనులు పాపం చేసినప్పుడు ప్రాయశ్చిత్తాన్ని నిర్ణయించడం - ఈ ఎనిమిది పనుల మీద ఆసక్తి ఉన్నవాడిని రాజు అంటారు. యజ్ఞాలలో అష్టద్రవ్యాలను వాడతారు.  అవి - రావి, మేడి, జువ్వి, మర్రి యొక్క సమిధలు, నువ్వులు, అవలు, పరమాన్నం, నెయ్యి. ధాతువులు ఎనిమిది.  అవి - బంగారం, వెండి, రాగి, తగరం, తుత్తినాగం, సీసం, ఇనుము, పాదరసం. భోగాలు ఎనిమిది.  అవి - గృహం, శయ్య, వస్త్రం, ఆభరణం, స్త్రీ, పుష్పం, గంధం, తాంబూలం. శివుడిని అష్టమూర్తి అంటారు.  అష్టమూర్తులేవంటే గాలి, ఆకాశం, భూమి, నిప్పు, నీరు, సూర్యుడు, చంద్రుడు, యజ్ఞం చేసిన పురుషుడు. ధూపాలు ఎనిమిది.  అవి గుగ్గిలము, వేపాకు, వస, చెంగల్వ కోష్టు, కరక్కాయ, అవలు, యవలు, నెయ్యి.  ఈ ఎనిమిదింటితో ధూపం వేస్తే జ్వరం ఎగిరిపోతుందంటారు. యోగవిశేషంలో ఎనిమిది అంగాలున్నాయి.  అవి - యమం, నియమం, ఆసనం, ప్రాణాయామం, ప్రత్యాహారం, ధారణ, ధ్యానం, సమాధి. ఆయుర్వేదానికి ఎనిమిది అంగాలున్నాయి.  అవి - శల్యం, శాలాక్యం, కాయచికిత్స, భూతవిధ్య, కౌమారభృత్యం, అగదతంత్రం, రసాయన తంత్రం, వాజీకరణ తంత్రం. సూర్యార్ఘ్యానికి ఎనిమిది అంగాలున్నాయి.  అవి - నీళ్ళు, పాలు, తేనె, పెరుగు, కుశాగ్రాలు, నెయ్యి, ఎర్రగన్నేరు, ఎర్రచందనం. అష్టావధానం - కావ్యపాఠం, కవిత్వం, సమస్యాపూరణం, పురాణ ప్రవచనం, లోకవార్తలు ముచ్చటించడం, న్యస్తాక్షరి, చదరంగం ఆడడం, మీద పడిన పువ్వుల్ని లెక్క పెట్టడం. ఐశ్వర్యాలు ఎనిమిది.  అవి - అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం.
********************

No comments:

Post a Comment

Pages