అంతర్యామి - 6
- పెయ్యేటి రంగారావు
(రామదాసు అనే ఆస్తికుడు, లావా అనే నాస్తికుడు ఆప్తమిత్రులు. రామదాసు ఇంటికి అంతర్యామి అనే మహిమాన్వితుడైన స్వామీజీ వేంచేస్తారు. వారి దర్శనం కోసం నాగపూర్ నించి ద్వారక అనే యువతి వస్తూ రైలు ప్రమాదంలో గాయపడుతుంది. ఐనా పట్టుదలగా ఆస్పత్రినుంచి తప్పించుకుని నరసాపురం బయలుదేరుతుంది. ఇక చదవండి.)
ఆ వేళ అంతర్యామిగారికి ఆ ఊళ్ళో చివరి రోజు. ఆ మరునాడు వారు బెంగళూరు వెళ్ళి అక్కడ పూజాది కార్యక్రమాలు, ప్రవచనాలు నిర్వహిస్తారు. బెంగళూరులో కార్యక్రమాలు పూర్తి కాగానే, అంటే సుమారు ఇరవై రోజుల తర్వాత అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేసియా వెళ్తారు. వారి కార్యక్రమాలన్నీ దాదాపు రెండు సంవత్సరాల ముందునుంచే ఏర్పాటయిపోయాయి. దాదాపు తొమ్మిది నెలల తరువాత వారు తిరిగి తమ ఆశ్రమానికి చేరుకుంటారు. వారికి అన్ని దేశాలలోను అసంఖ్యాకంగా భక్తులు, అనుయాయులు, శిష్యులు వున్నారు. వారు దేశ విదేశ పర్యటనలన్నీ తమ స్వంత విమానంలోను, హెలికాఫ్టరు లోను, ఖరీదైన కార్లలోను మాత్రమే చేస్తారు. చివరి రోజు కావడం వలన ఆ రోజు ప్రశ్నోత్తరాల కార్యక్రమం వుండదు. సాయంత్రం చాలా భారీ ఎత్తున పూజలు, భజనలు జరుగుతాయి. ఆ కార్యక్రమాలు రాత్రి సుమారు ఒంటిగంట వరకు వుండవచ్చును. వారు నరసాపురంలో వున్నన్ని రోజులు, రోజు రోజుకు భక్తజనసందోహం విపరీతంగా పెరుగుతూ వస్తున్నారు. ఇక చివరి రోజు కావడంతో ఎంతో దూరాల నుంచి కూడా భక్తగణం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. భారీగా జనం తరలి వస్తుండడంతో ఆరోజు రోడ్డు మీద భారీ ఎత్తున షామియానాలు వేసారు. తూర్పు వైపు పెద్ద వేదికను నిర్మించారు. ఊరంతా వినపడేలాగు మైక్ సిస్టం ఏర్పాటు చేసారు. కళాశాల నుంచి సుమారు రెండువందల మంది విద్యార్థులు స్వఛ్ఛందసేవకులుగా బందోబస్తు నిమిత్తం వచ్చారు. పోలీసులను కూడా భారీగా మోహరించారు. సూపరెంటెండెంట్ ఆఫ్ పోలీస్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలను జాగ్రత్తగా కాపాడవలసిందిగాను, భక్తులకు ఏవిధమైన అసౌకర్యం కలగకుండా చూడవలసిందిగాను, పోలీసు శాఖకు ముఖ్యమంత్రి గారినుండి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ అయ్యాయి. రోడ్డంతా రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. అక్కడి వాతావరణం చూడడానికి చాలా కన్నుల పండువగా వుంది. ఆ రోజున అక్కడి కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూడలేని వారు దురదృష్టవంతులే అవుతారు. వస్తున్న జనసందోహానికి భోజనాదికాలు ఆ వూరి చైర్మను గారైన పొన్నపల్లి శివకామయ్యగారు, ఆ వూరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులైన కారుమూరి బలరామయ్యగారు సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు. పత్రికా విలేఖరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ఆహ్వానాలు వెళ్ళాయి. అన్ని ఛానెల్స్ వారు విస్తృతంగా కవరేజి ఇవ్వడానికి సిబ్బందితో సహా వస్తున్నారు. ఆ నాటి కార్యక్రమం మొత్తం కొన్ని ఛానెల్స్ లో ప్రత్యక్షంగా ప్రసారం కూడా కానుంది. నరసాపురంలో అదివరకెన్నడూ అంత గొప్ప కార్యక్రమం బహుశా జరిగివుండదు. లావాకి చాలా అశాంతిగా వుంది. తను చాలామందికి ఫోన్లు చేసాడు. వారంతా వచ్చి అతడికి బాసటగా నిలబడతామని హామీలు కూడా ఇచ్చారు. కాని ఇంకా ఎవరూ రాలేదేమిటి? ఇంతటి మహత్తరమైన అవకాశం తనకి మళ్ళీ మళ్ళీ రావాలన్నా రాదు. అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితే, రేపు అన్ని వార్తాపత్రికలలోను తన పేరు, ఫొటో ఫ్రంట్ పేజీలలో వచ్చితీరుతుంది. టి.వి.ఛానెల్స్ లో కూడా రేపు రోజంతా తనే కనబడతాడు. ఈ దెబ్బతో తన కీర్తి దేశమంతా వ్యాపించి తీరుతుంది. తలచుకుంటేనే లావాకు చాలా ఉత్కంఠగా వుంది. అన్నీ తను అనుకున్నట్లుగా భగవంతుడి దయవలన జరుగుతే బాగుండును! ఆ ఆందోళనలో, అన్నీ అనుకున్న ప్రకారం జరిగేలా చూడమని వున్నాడో, లేడో తెలియని ఆ దేముడిని వేడుకుందామా అని కూడా ఒక్క క్షణం అతడికి అనిపించింది. మళ్ళీ తన ఆలోచనకు తనకే నవ్వు వచ్చింది. దేవుడు లేడు అని ఋజువు చెయ్యనిమ్మని తిరిగి దేవుడినే ప్రార్థించుకోవడమా? తన స్నేహితులంతా తప్పక వచ్చి తీరతారు. వాళ్ళకి మాత్రం ఇది మహత్తరమైన అవకాశం కాదూ! రామదాసుకి చాలా సంతృప్తిగా వుంది. ఈ ఒక్క రోజు ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోనిమ్మని ఆంజనేయస్వామికి మనసులో పదే పదే మొక్కుకుంటున్నాడు.
ఐనా తన పిచ్చిగాని, ఈ విషయం గురించి తను ఆందోళన పడడం ఎందుకు? ఇంతవరకు అంతా భగవన్నిర్ణయం ప్రకారమే జరిగింది. ఇకముందు కూడా అల్లాగే జరిగి తీరుతుంది.ఎవరో భక్తురాలు లోనికి వస్తూ కనిపించింది. ఆమె తలకు కట్టు వుంది. రామదాసు మర్యాదగా ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు.ఆమె లోనికి వస్తూ మర్యాదగా రామదాసుగారికి నమస్కరించింది.రామదాసు ఆప్యాయంగా అన్నాడు, ' నమస్కారమండీ. మిమ్మల్ని చూస్తే చాలా దూరం నించి ఎంతో ప్రయాస పడి వస్తున్నట్లుగా వుంది.'' నమస్కారమండీ. నా పేరు ద్వారక. నేను నాగపూర్ నించి కేవలం అంతర్యామి గారి దర్శనం కోసం వస్తున్నాను. వారు నరసాపురం వస్తున్నట్లు పేపరులో చదివాను. పైగా వారు కొద్దిరోజులలో విదేశీపర్యటనకు వెళ్తారని, మళ్ళీ తొమ్మిది నెలల దాకా రారనీ కూడా తెలిసింది. మళ్ళీ వారి దర్శనం లభించదని, ఇంక ఆత్రం అణచుకోలేక వెంటనే బయలుదేరి వచ్చేసాను.'' చాలా సంతోషమండీ. కాని కనీసం నిన్నటికి చేరుకున్నా ఆయనను వ్యక్తిగతంగా కలుసుకుని మీ సమస్యలేమన్నా వుంటే పరిష్కార మార్గాలు తెలుసుకునే వారు. మరీ ఆఖరు రోజున వచ్చారేమిటి?' ' ఏం చెయ్యమంటారు? నాకింతే ప్రాప్తం అనుకుంటాను. నేను వస్తున్న రైలు పట్టాలు తప్పింది. చాలా మందితో పాటు నేను కూడా ఆస్పత్రి పాలయ్యాను. కొంతమందికి పెద్ద పెద్ద గాయాలే అయ్యాయి. నా అదృష్టం బాగుండి కొద్దిపాటి దెబ్బలతో బతికి బైటపడ్డాను. ఐనా దెబ్బలు చాలావరకు నెమ్మళించాయి లెండి.' ద్వారక తలకున్న కట్టుని తడుముకుంటూ మళ్ళీ అంది, ' నా అదృష్టం బాగుంది కనుక కనీసం ఆయన దర్శనానిైనా నోచుకోగలుగుతున్నాను.' రామదాసు నొచ్చుకుంటూ అన్నాడు, ' అయ్యొయ్యో, అలాగా? పేపరులో ఏక్సిడెంట్ గురించి చదివాను. మీరు చాలా అదృష్టవంతులే. ఆ భగవంతుడి దయ మీమీద వుండబట్టి బైటపడ్డారు. అరెరె, నన్ను క్షమించండి ద్వారకగారూ! మిమ్మల్ని నిలబెట్టే మాట్లాడేస్తున్నాను. నా పేరు రామదాసు. ఇక్కడ యర్రమిల్లి నారాయణ మూర్తి కళాశాలలో లెక్చరర్ గా పని చేస్తున్నాను. ఈ ఇల్లు నాదే. సరి, సరి. తరవాత మాట్లాడుకోవచ్చు. ముందు మీరు లోపలికి వెళ్ళి హాయిగా స్నానం చేసి, వేడి వేడిగా నాలుగు మెతుకులు నోట్లో వేసుకోండి. ప్రాణం కాస్త తెరిపిన పడుతుంది.' ' అబ్బెబ్బె! మీకెందుకండీ ఆ శ్రమంతాను?' రామదాసు స్నేహపూర్వకంగా అన్నాడు, ' అయ్యో! అలా మీరేమీ భావించకండి. మీరు భగవత్కార్యం మీద వచ్చారు. అదిన్నీపెద్ద గండం గడిచి వచ్చారు. మీరిక్కడేమీ మొహమాట పడవద్దు. ఇది మీ ఇల్లుగానే భావించండి. నేనున్నూ ఒకసారి మీలాగే కేవలం భగవదనుగ్రహం వల్ల మృత్యువు నోట్లోంచి బైట పడ్డాను.' ద్వారక కృతజ్ఞతగా నమస్కరించి ఆయనతో పాటు లోనికి నడిచింది. టికెట్ కలక్టర్ దగ్గర ద్వారక ప్రవర్తనకు, రామదాసు గారి దగ్గర ఆమె ప్రవర్తనకు ఎంత వైరుధ్యం! తిలక్ ఆమె పేరడిగినా ఆమె చెప్పలేదు. ఇక్కడ రామదాసుతో ఎంతో చనువుగా, తన ఆత్మబంధువు అన్నట్లుగా హాయిగా, గలగలా మాట్లాడేస్తోంది. ద్వారకను లోనికి తీసికెడుతున్న రామదాసుకు లావా ఎదురయ్యాడు. లావా ద్వారకను చూడగానే నిశ్చేష్టుడై నిలబడిపోయాడు. ఏమిటి? ఈమె.....ఈ సమయంలో.....ఇక్కడ.....? అతడి మెదడంతా మొద్దుబారి పోయింది. రామదాసు లావాకి ఆమెని పరిచయం చేసాడు, ' ఒరేయి లావా! ఈవిడ పేరు ద్వారక. పాపం ప్రత్యేకించి నాగపూర్ నించి స్వామివారి దర్శనం కోసం వచ్చారు. ముందు వీరి స్నానానికి, భోజనానికి ఏర్పాట్లు చూడు.' తిరిగి ద్వారకతో అన్నాడు, ' ద్వారరకకగారూ! వీడు నాకు చాలా ఆప్తమిత్రుడు. వీడి పేరు లావా. వీడో పెద్ద సంఘసంస్కర్త లెండి.' ద్వారక నిశ్చలంగా లావాకేసి చూస్తూ అంది, ' నమస్కారమండీ లావాగారూ! మీ పేరు చాలా గమ్మత్తుగా వుందే?' రామదాసు నవ్వుతూ అన్నాడు, ' అసలు పేరు అది కాదులెండి. వాడి పూర్తి పేరు చెప్పాలంటే పదమూడు నిముషాలు పడుతుంది. ఐనా అంత పొడుగు పేరు వాడు కూడా మర్చిపోయే వుంటాడు. ఏరా, అంతేనా? పెద్దలు పెట్టిన ఆ పేరు ఇష్టం లేక తన పేరుని లావాగా కుదించుకున్నాడు. అంటే అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ప్రవహిస్తుంది కదండీ, అదన్న మాట! వీడి స్వభావం కూడా ఇంచుమించు అంతే లెండి. పరమ నాస్తికుడు, పచ్చి హేతువాది. ఇక్కడేదో గొడవ చేద్దామని బైఠాయించాడు. కాని, నా పరువు దక్కించడానికి నిగ్రహించుకుంటున్నాడు.' ద్వారక నవ్వింది, ' బాగుందండీ. ఉత్తర దక్షిణ ధృవాల కలయిక అన్న మాట!' రామదాసు అన్నాడు, ' కరెక్టుగా అంతేనండి.' ద్వారక సంతోషంగా అంది, ' మిమ్మల్నిద్దర్నీ కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా వుందండి. ఇక్కడికొచ్చేటప్పుడు కొత్త ప్రదేశానికి వెళ్తున్నానే అన్న బిడియంతో ఎంతో సంకోచిస్తూ వచ్చాను. కాని ఇక్కడ మీ ఆప్యాయత చూస్తూంటే నా సంకోచమంతా ఎగిరిపోయింది.' రామదాసు అన్నాడు, ' లావా! నువ్వీవిడ గురించి శ్రధ్ధ తీసుకో. నేను ఇంకా చాలా వ్యవహారాలు చూడాలి. వెళ్ళండి ద్వారకగారూ! ఇంకేమీ బిడియపడకండి.' రామదాసు వెళ్ళగానే ద్వారక అంది, ' లావాగారూ! ఏమనుకోకండి. నాకింక చనువు వచ్చేసింది. నాక్కాస్త బాత్ రూము చూపించారంటే, ఒక్క క్షణంలో స్నానం చేసి వచ్చేస్తాను. ఆ తర్వాత దయ తలిచి కాస్త భోజనం కూడా పెట్టించారంటే, ఇంక మీతో కలిసి నేను కూడా ఇక్కడ పనులన్నీ చక్కబెడతాను.' లావా ఆమె మొహంలోకి పరిశీలనగా చూస్తూ అన్నాడు, ' ద్వారకగారూ! ఇంతకు ముందు మిమ్మల్నెక్కడో చూసినట్లనిపిస్తోందండీ.' ద్వారక అమాయకంగా అంది, ' కదూ? నాక్కూడా మిమ్మల్ని చూసినా, రామదాసు గారిని చూసినా ఇదివరరకెక్కడో చూసినట్లే అనిపించిందండీ. కొంతమందిని చూస్తే అంతేనండీ. ఎన్నాళ్ళ నుంచో పరిచయం వున్న మనుషుల్లా అనిపిస్తారు. అల్లా అనిపించడానికి కూడా కారణం పూర్వజన్మ బంధం అండీ. మీరు నమ్మినా, నమ్మకపోయినా ఇది మాత్రం నిజం.' లావాకి ద్వారక మాటలు విన్నాక కాస్త స్తిమితం చిక్కింది. తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు, ' అంతే అయుంటుంది లెండి. పదండి, స్నానం చేద్దురు గాని.' ద్వారక స్నానం చెయ్యడానికి వెళ్ళింది.
ద్వారకను చూడగానే లావా నిర్ఘాంతపోయాడు. కారణం? చూడగానే తనామెను గుర్తు పట్టాడు. కాని ద్వారక తనని ఏమాత్రం గుర్తు పట్టలేకపోయిందేం? తనని చూసి చాలా సంవత్సరాలైనందు వల్లనా? ఏమో! లేక, బహుశా ఆ రోజున కరెంటు లేని సమయంలో కొవ్వొత్తి వెలుగులో తనను చూసినందువల్లనా? ఏదేమైనేతేనేం, ఆమె తనను గుర్తు పట్టలేదు. ఇది నిజంగా తన అదృష్టం. ఒక విధంగా శుభసూచకం కూడానేమో!
కాని ఏమిటీమె పిచ్చి? ఎక్కడో నాగపూరు నించి ప్రత్యేకం అంతర్యామిని చూడడానికి రావడమా? ప్రజలెంత మూర్ఖులు! వాళ్ళ సమస్యలని వాళ్ళే పరిష్కరించుకోవాలని ఎందుకు ఆలోచించరు? ఆ సమస్యలని పరిష్కరించుకోడానికి కావల్సిన విజ్ఞత చూపించరు. పోనీ, స్నేహితులతోను, శ్రేయోభిలాషులతోను చర్చించి, సలహాలు తీసుకుంటారా? అదీ వుండదు. వెంటనే కనిపించిన ప్రతి రాయికీ మొక్కెయ్యడం, లేకపోతే ఎదురయ్యే ప్రతి స్వాములవారికి సాష్టాంగ ప్రణామాలు చేసి, వాళ్ళిచ్చిన విభూతితో సంతృప్తి పడడం! ఆ విభూతి వల్ల గుణం కనిపిస్తుందా అని వివేకంతో ఆలోచించరు. మంచి జరుగుతే ఆ విభూతి మహిమ. లేకపోతే వాళ్ళ ఖర్మ అనుకుంటారు!లావా ఇలా ఆలోచిస్తూండగానే ద్వారక స్నానం చేసి మల్లెపూవులా తయారై వచ్చింది. ఆమె అందాన్ని చూస్తూ లావా గుటకలు మింగాడు.ద్వారక కొద్ది క్షణాలలోనే లావాకి సన్నిహితమై పోయింది.లావా తన గొప్పతనాన్ని చాటుకోడానికా అన్నట్లు అన్నాడు, ' ద్వారకగారూ! మీ లాంటి ఆడాళ్ళు ఈ స్వాములని, వారు చూపే మహిమలని నమ్ముతున్నారంటే అర్థముంది. కాని ఈ మామాబెడ్ గాడు చూడండి!'' మామాబెడ్ ఎవరండీ?' లావా హేళనగా నవ్వుతూ అన్నాడు, ' వీడేనండీ, ఈ రామదాసుగాడు! వీడు ఎం.ఏ ఇంగ్లీషు లిటరేచర్, ఎం.ఏ. తెలుగు, బి.ఇడి. చేసాడు. ఇంత చదువుకుని కూడా వీడికి అంత మూఢనమ్మకమేమిటండీ?' ద్వారక లావా కేసి ఓరగా చూస్తూ అంది, ' మీరన్నది నిజమే లావాగారూ! నాకు జీవితంలో తోడూ నీడా ఎవరూ లేకపోవడం వలన ఒక రకమైన బెంగ, భవిష్యత్తు అంటే చాలా భయం ఏర్పడిపోయాయి. అందుకే దేవుడున్నాడని, ఆయన తోడు నాకుంటుందని ఊహించుకుంటే, అదో సంతృప్తిగా వుంటుంది. అదే మీలాంటి వారెవరన్నా తోడున్నారనుకోండి, అప్పుడు ఏ దేముణ్ణీ ప్రార్థించవలసిన అవసరమే నాకుండదనుకుంటాను. అంతే కాదు, అప్పుడైతే నేను కూడా మీలాగే దేవుడు లేడని వాదిస్తానేమో!' ఇద్దరి కళ్ళూ క్షణం సేపు కలుసుకున్నాయి. ద్వారక కళ్ళు సిగ్గుగా కిందకి వాలిపోయాయి. లావా హుషారుగా ఈల వేసాడు. ద్వారక చలాకీగా కళ్ళు తిప్పుతూ అంది, ' ఐతే లావాగారూ! మీరు నిజంగా దేవుడ్ని నమ్మరా?' ' చచ్చినా నమ్మను.' ద్వారక అతడి కేసి ఆరాధనగా చూస్తూ అంది, ' స్వశక్తి మీద పైకి వచ్చిన వాళ్ళకి భగవంతుడంటే నమ్మకముండదు. మీరు అంత దీక్ష కలవారని, స్వశక్తి మీద పైకి వచ్చిన వారని తెలిసినప్పుడు మిమ్మల్ని ఆరాధించాలనిపిస్తోంది.' లావా ఆమె కేసి కోరికగా చూసాడు. ' కాని ద్వారకా! నేను పరమ నాస్తికుడినని నీకు తెలుసు. నువ్వా, ఆస్తికురాలివి! మనిద్దరి మధ్య స్నేహం కలుస్తుందంటావా?' తనని అప్పుడే చనువుగా ' నువ్వు ' అని సంబోధించినందుకు ద్వారకకు నవ్వు వస్తోంది. ' లావాగారూ! అభిరుచులు, వ్యక్తిత్వాలు వేరై వుండచ్చు. ఐనంత మాత్రాన ఒకరినొకరు గౌరవించుకోకూడదా?' ' ఔను ద్వారకా! చాలా కరక్టుగా చెప్పావు. నీ అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను.' ' నాకు మీ వ్యక్తిత్వం మీద గౌరవం పెరుగుతోంది లావాగారూ!' ' ఐతే ద్వారకా, నాదో కోరిక. మన్నిస్తావా?' ' మీరేం కోరినా ఇవ్వడానికి సిధ్ధంగా వున్నాను లావాగారూ!' ' థాంక్స్. కాస్త ఏకాంతం దొరికాక నీతో మాట్లాడతాను. సరేనా? కాని తీరా అడిగాక నువ్వు కాదనవు కదా?' ' నాదేముంది లావాగారూ? నీళ్ళలాంటి దాన్ని. ఏ గ్లాసులో పోస్తే, ఆ ఆకారం దాలుస్తాను.' ' నాకు చాలా సంతోషంగా వుంది ద్వారకా! నువ్వు రావడం నిజంగా నా అదృష్టం.' ద్వారకకి చాలా ఆనందంగా వుంది. ఇక్కడికి వచ్చేటప్పుడు భగవంతుడ్ని ప్రార్థించుకుంది. తనకేదైనా దారి చూపించమని, తరుణోపాయాన్ని సూచించమని. ఇప్పుడు లావాని చూస్తే ఆమెకి చాలా ధైర్యం వచ్చేసింది. లావాని భగవంతుడే ఇక్కడికి తీసుకు వచ్చి తనతో కలిపాడు. ఖచ్చితంగా తన కోరిక నెరవేరుతుందన్న నమ్మకం కలిగిందామెకు. ' లావాగారూ! ఇవాళ పూజలు ఎప్పుడో సాయంత్రం గాని మొదలవవు కదా? అందాకా కాసేపు గోదావరి ఒడ్డున తిరిగి వద్దామా?' లావా ఒక్క క్షణం సందేహించాడు. తను ఫోన్లయితే చేసాడు గాని, వాళ్ళందరూ వస్తారో, రారో? తీరా వాళ్ళు వచ్చేసరికి తనక్కడ వుండక పోతే ఎలా? వాళ్ళతో కలిసి భవిష్యత్కార్యక్రమం నిర్ణయించుకోవాలి కదా? ఊహు! ఈ అందాలరాశి పొందు ముందు మిగతా విషయాలన్నీ బలాదూర్! ఇంత చక్కని అవకాశం ఎదురైనప్పుడు కాళ్ళతో తన్నుకునేంత మూర్ఖుడు కాదు తను. ఈ అద్భుత సౌందర్యరాశితో తనకు లభించే ఒక్క క్షణపు ఆనందం కోసం తనను, తన ఆదర్శాలను, తన సిధ్ధాంతాలను శాశ్వతంగా పణంగా పెట్టెయ్యమన్నా పెట్టెయ్యడానికి సిధ్ధంగా వున్నాడు. లావా హుషారుగా లేచాడు, ' పద ద్వారకా. నీ సరదా తీర్చడం కన్న నాకు కావల్సిందేముంది?'
*****************************
లావా, ద్వారక గోదావరి ఒడ్డున సిమెంటు బెంచీ మీద కూర్చున్నారు.జనం నాటుపడవల మీద సఖినేటిపల్లి నించి నరసాపురానికి, నరసాపురం నించి సఖినేటిపల్లికి వెళ్తున్నారు. రేవులో అంతా హడావిడిగా వుంది. మోటారుసైకిళ్ళు, స్కూటర్లు, కార్లు కూడా ఈ రేవునించి ఆ రేవుకి, ఆ రేవునించి ఈ రేవుకి అవలీలగా తీసుకుపోతున్నారు. ద్వారక అదంతా విడ్డూరంగా చూస్తోంది.నరసాపురం గోదావరిని వశిష్టగోదావరి అని, రాజమండ్రి దగ్గర గోదావరిని గౌతమి గోదావరి అని అంటారుట. దానికేదో పురాణ కథ వుండే వుంటుంది. ఈ సారి తీరిక దొరికితే రామదాసు గారిని అడగాలి.నరసాపురంలో గోదావరి నీళ్ళు చాలా ఉప్పగా వుంటాయి. అక్కడికి సముద్రం ఏడు మైళ్ళ దూరం లోనే వుంది. సముద్రతీరాన అంతర్వేదిలో లక్ష్మీనరసింహస్వామి వారు వెలిసారు. ఆ స్థలానికి చాలా మహత్తు వుంది. ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి నాడు అక్కడ రథోత్సవం జరుగుతుంది. మొగల్తూరు రాజు గారు రాచరికపు దుస్తులలో వచ్చి, రధం మీద చెయ్యి వేసిన తరువాతే రథాన్ని బయలుదేర దీస్తారు. అది అక్కడి సంప్రదాయం.నరసాపురంలో ఎంబెరుమన్నార్ కోవెల వుంది. అక్కడ ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. తమిళనాడు లోని సిరిపెరుంబుదూరులో వున్న కోవెలకు నరసాపురం లోని కోవెల రెప్లెకా అంటారు. నరసాపురం లోని కోవెలలో కూడా తమిళ సంప్రదాయం ప్రకారమే అర్చనలు జరుగుతాయి. ధనుర్మాసంలో భక్తులు తెల్లవారు జామునే కోవెలకు వెళ్ళి అర్చనలు చేయించుకుంటారు. ద్వారకకు గోదావరి ఒడ్డున కూర్చుంటే చాలా హాయిగా వుంది. ఆమెకు కూడా గోదావరిలో ప్రయాణం చెయ్యాలనిపించింది. లావా కేసి చూస్తూ అడిగింది, ' ఏమండీ! మనం కూడా సరదాగా పడవలో అవతలి రేవు దాకా వెళ్ళి, మళ్ళీ తిరిగి అదే పడవలో ఇక్కడికి వద్దామా? నేను ఎప్పుడూ పడవ ఎక్కలేదు.' లావా అన్నాడు, ' అల్లా ఎందుకు? నీకంత సరదాగా వుంటే, మనం సెపరేట్ గా ఒక పడవ మాట్లాడుకుని ఒక అరగంట గోదావరిలో షికారు చేద్దాం.' ద్వారక సంబరంగా అంది, ' అబ్బ! అల్లాకూడా వెళ్ళచ్చా? అల్లా ఐతే ఇంకా బాగుంటుంది. ఐతే పదండి, వెళదాం.' లావా లేస్తూ అన్నాడు, ' నాకు పడవ ప్రయాణం ఎప్పుడూ అలవాటే. కాని నీతో పడవలో ప్రయాణం చెయ్యడం అంటే, ఇది నాకు అరుదైన, మహత్తరమైన అనుభూతి. పద, వెడదాం.' లావా వెళ్ళి ఒక బోటు మాట్లాడాడు. ముందు అందులోకి తనెక్కి, తర్వాత ద్వారకకి చేయి అందించాడు. ద్వారక నెమ్మదిగా అతని చేయి పట్టుకుని పడవ ఎక్కింది. పడవ నెమ్మదిగా గోదావరిలో పైకి, కిందకి ఊగుతూ సాగిపోతోంది. ద్వారక చిన్నపిల్ల లాగ గోదావరి నీళ్ళలో చెయ్యి పెట్టి ఆడుకుంటోంది. లావా నెమ్మదిగా ద్వారకతో అన్నాడు, ' ద్వారకా! నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి.' ద్వారక గోదావరి నీళ్ళతో ఆడుకుంటూనే తలెత్తకుండా అంది, ' మాట్లాడండి.' లావా కొంచెం అసహనానికి గురయ్యాడు. ' ద్వారకా! బి సీరియస్. ఇది నాకు జీవన్మరణ సమస్య. నువ్వు శ్రద్ధగా వినకపోతే ఎలాగు?' ద్వారక నొచ్చుకుంది. ' ఐ యాం సారీ అండీ. ఈ గోదావరిని చూస్తూంటే నన్ను నేనే మరిచిపోతున్నాను. సరే, నౌ అయాం సీరియస్. చెప్పండి.' పడవ గోదావరిలో చాలా దూరం వెళ్ళింది. వాళ్ళిద్దరూ చాలా సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు. (ఐతే వాళ్ళు మాట్లాడుకుంటున్నది ఈ రచయితకు వినబడటల్లేదు. రచయిత తన ఏ.సి.గదిలో కూర్చుని వున్నాడు. ఎదర టేబులు మీద కాగితాల దొంతరలున్నాయి. వాటి పక్కన ఎం.పి.3 ప్లేయర్ లోంచి మంద్రంగా ఈమని శంకరశాస్త్రి గారి వీణా వాదనం వస్తోంది. చెవులు రెండూ ఆ సంగీతాన్ని హాయిగా ఆస్వాదిస్తున్నాయి. చేతులోని పార్కర్ పెన్ను అలవోకగా కాగితాల మీద వ్రాసుకుంటూ పోతోంది. పాత్రలు రెండూ, అంటే ద్వారక, లావా గోదావరిలో దూరంగా వెళ్ళకుండా మాట్లాడుకుంటున్నంత వరకు అతడికి వినబడ్డాయి. కాని వాళ్ళు పడవలో దూరంగా వెళ్ళిపోయే సరికి, వాళ్ళ మాటలు వినపడక, కలం టేబులు మీద వుంచేసి, తన ఊహకి పదును పెట్టాడు. అందుచేత వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో రెండు రకాలుగా ఊహించుకుంటున్నాడు. ఐతే గియితే వాళ్ళు ఆస్తికత, నాస్తికత గురించి వాదోపవాదాలు చేసుకుంటూ వుండి వుండాలి. లేకపోతే ఆ వయసు వారి మధ్య జనించే సహజమైన ఆకర్షణ గురించన్నా మాట్లాడుకుంటూ వుండి వుండాలి.) లావా గోదావరి కేసి చేయి చాపి ఏదో అన్నాడు. మళ్ళీ పైన సూర్యుడి కేసి, ఒడ్డు కేసి చూపించి ఏదో అన్నాడు. తరవాత చేయి గుండెల కేసి కొట్టుకున్నాడు. ఆ తర్వాత చేయి గాలిలోకి ఊపి ఏదో అన్నాడు. (రక్తి: 'ఈ పంచభూతాల సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీకు జీవితాంతం తోడుగా వుంటాను. మనిద్దరం ఈ క్షణం నించే భార్యాభర్తలం.' అంటున్నాడా?) (నాస్తి: 'ఈ భూమి, ఈ ఆకాశం, ఈ సూర్యుని చుట్టూ భూమి తిరగడం - ఇదంతా శాస్త్రీయంగా జరుగుతున్నదే కాని, ,పైన ఎవడో దేవుడనే వాడుండి జరుపుతున్నది కాదు. ఈ మాత్రం అర్థం చేసుకోకుండా ఎందుకు మూఢనమ్మకాల్లో పడిపోతున్నావు?' అంటున్నాడా?) ద్వారక అతడి కేసి తిరిగి చేతులు జోడించింది. పిడికిలి బిగించింది. మళ్ళీ చేయి చాపింది. అతడు ఆమె చేతిలో చేయి వేసాడు. (రక్తి: ' నీ భావాలు నీవి. నా భావాలు నావి. చేతికున్న ఐదు వేళ్ళూ సమానంగా వుండవు. కాని అవి కలిసే వుంటాయి. అలాగే నేను ఆస్తికురాలినే కావచ్చు. నీవు నాస్తికుడివే కావచ్చు. ఐనంత మాత్రాన మనం కలిసి జీవించలేమా? నాకు నువ్వు కావాలి. మనిద్దరం జీవితాంతం కలిసి వుంటామని ప్రమాణం చెయ్యి.' అంటోందా?) (భక్తి: భగవంతుడు కచ్చితంగా వున్నాడు. అతడి అనుగ్రహం వల్లనే పంచభూతాలు కలిసికట్టుగా ప్రపంచానికి సృష్టి, స్థితి, లయలు కలిగిస్తున్నవి. ఋజువు చూపిస్తే నా దారిలోకి వస్తానని ప్రమాణం చెయ్యి.' అంటోందా?) (రచయితకి అంతా అగమ్యగోచరంగా వుంది. అమ్మయ్య, పడవ ఒడ్డుకు వచ్చేస్తోంది. ఇంక వాళ్ళ మాటలు వినబడతాయి. ఇంక కథ కొనసాగించ వచ్చు అని దీర్ఘంగా నిశ్వసించి తిరిగి కలం చేతులోకి తీసుకున్నాడు.) పడవ ఒడ్డుకు చేరుకుంది. ముందు లావా కిందకి దిగి, ద్వారకకు చేయి అందించాడు. ద్వారక చిరునవ్వుతో అతడి చేయి అందుకుని చెంగున కిందకి దూకింది. లావా ఆమె చేతిని వదల్లేదు. ఆమె చేతిని మృదువుగా నొక్కుతూ ఆనందంగా అన్నాడు, ' థాంక్స్ ద్వారకా! నువ్వు ఇంత త్వరగా అంగీకరిస్తావని నేను అనుకోలేదు. అడిగితే ఏమనుకుంటావో అని భయపడ్డాను కూడా. నాకెంతో సంతోషంగా వుంది.' ద్వారక నవ్వుతూ అంది, ' లావాగారూ! మీరడిగిన తీరు చూసాక ఒప్పుకోకుండా వుండలేక పోయాను.' ఇద్దరూ చేతిలో చేతులు వేసుకునే రామదాసుగారి ఇంటికి చేరుకున్నారు. అప్పటికి దాదాపు నలభయి మంది లావా స్నేహితులు అక్కడికి చేరుకుని వున్నారు. వాళ్ళందర్నీ చూడగానే లావాకి ఎక్కడ లేని బలం వచ్చేసింది. అతడి మొహం సంతోషంతో వెలిగిపోయింది. వాళ్ళందర్నీ పేరు పేరునా పలకరించి, కవుగలించుకుని, వాళ్ళందర్నీద్వారకకు పరిచయం చేసాడు. ఆ తర్వాత ద్వారకతో సహా అందరూ ఒక పక్కకి వెళ్ళి మంతనాలు జరపసాగారు.
(ఇంకా వుంది)
No comments:
Post a Comment