బచ్చలికూర పప్పుకూర
- ఉషారాణి నూతులపాటి
ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. సాధ్యమైనంత ఎక్కువగా ఆకుకూరలు తినడం అవసరం కూడా. ఎక్కువ న్యూట్రిషన్ విలువలు , పీచు పదార్ధాలు , తక్కువ కాలోరీలు కలిగివుంటాయి. ఆకు కూరల్లో కాల్షియం , మెగ్నీషియం ,ఐరన్ ,మరియు పొటాషియం వంటి ఖనిజ లవణాలు లభిస్తాయి. వీటిని పప్పులతో కలిపి వండితే ప్రోటీన్ కూడా లభిస్తుంది . కందిపప్పు ,శనగపప్పు ,పెసరపప్పులతో కలిపి ఆకు కూరలను వండుకోవడం అనాదిగా వస్తున్నదే. ఎక్కువ ఆకుకూర ఉపయోగించి చేసే బచ్చలికూర పప్పుకూర ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
కావలసిన పదార్ధాలు: 1.శుభ్రం చేసి ,బాగా కడిగి ,తరిగిన బచ్చలికూర (6 కట్టలు ) ,2.కందిపప్పు 150గ్రా.,3.ఉప్పు,కారం తగినంత ,4. వెల్లుల్లి రెబ్బలు10, 5. నూనె 100గ్రా., 6.పోపు దినుసులు ( శనగ పప్పు 2 sp ,మినపప్పు 2 sp, ఆవాలు 1 sp, జీలకర్ర 1 sp,ఎండుమిర్చి 4, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు ). చేయువిధానం: శుభ్రం చేసి ,కడిగి ,తరిగిన బచ్చలి కూర + కడిగిన కందిపప్పు కుక్కర్లో పెట్టి(పొడిగా మెత్తగా వుండటం కోసం కాపర్ బాటమ్ గిన్నెలో కూడా వుడికిన్చుకోవచ్చు) ,కొద్దిగా నీళ్ళు చల్లుకుని 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. కుక్కర్ చల్లబడిన తరువాత మూత తెరిచి ,పొడిగా ,మెత్తగా వుడికిన కూరని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.కొంచం విశాలంగా వున్న కడాయి తీసుకుని ,నూనె వేసి వేడి చేయాలి.పోపు దినుసులు + ఎండు మిర్చి + కరివేపాకు +ఇంగువ+ వెల్లుల్లి రేకలు దోరగా వేయించాలి. తరువాత వుడికి౦చిన పప్పు +ఆకు ను పాన్ లో వేసి బాగా కలపాలి. చిటికెడు పసుపు ,తగినంత ఉప్పు,కారం వేసి బాగా కలిపి చిన్నమంట మీద వేగనివ్వాలి.పప్పుకూర పొడిగా ,మెత్తగా వేగుతుంది. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ,రుచికరమైన పప్పుకూర రెడీ. ఇదే విధంగా, మెంతికూర తో కూడా చేయవచ్చు. ఎక్కువ ఆకుకూర వుపయోగించి చేస్తే రుచి ఆరోగ్యం కూడా.. దీనికి చక్కని అనుపానం ఉల్లిపాయ పచ్చి పులుసు లేదా మెంతి మజ్జిగ. ఉల్లిపాయ పచ్చి పులుసు : నిమ్మకాయంత చింతపండు వేడినీళ్ళలో నానబెట్టి ,పిప్పి తీసేసి ,పల్చని రసం తయారుచేసుకోవాలి .అందులో చిటికెడు పసుపు ,తగినంత ఉప్పు , సన్నగా
తురిమిన ఉల్లి + పచ్చి మిర్చి+ కొత్తిమిర తరుగు కలుపుకోవాలి. బాణాలి వేడి చేసి 1 sp నెయ్యి/నూనె వేసి ఆవాలు, జీలకర్ర,పావు చెంచా మెంతిపొడి , చిటికెడు ఇంగువ, నాలుగు కరివేపాకులు వేసి ..పులుసులో తిరగమోత వెయ్యాలి. ఘుమఘుమ లాడే పచ్చిపులుసు ..వేడి అన్నంలో పప్పుకూరతో కలిపి తిని చూడండి. మళ్ళీ మళ్ళీ వాయలు,వాయలుగా కలుపుతూనే వుంటారు..నాదీ గారంటీ.. మెంతి మజ్జిగ : ఇది మజ్జిగ పులుసు కాదు. మెంతి మజ్జిగ. ఎలాచేయాలంటే..అదే చెప్తున్నా మరి.. చిక్కటి మజ్జిగ తీసుకోవాలి..ఎక్కువపులుపు వుండకూడదు. దానికి పసుపు ,తగినంత ఉప్పు, బాగా సన్నగా తరిగిన ఉల్లి +పచ్చిమిర్చి+అల్లం+కొత్తిమిర తరుగులను కలిపి , 1 చెంచా నెయ్యి వేడిచేసి..ఆవాలు,జీలకర్ర, కరివేపాకు,ఇంగువ,(ఇష్టమైతే నాలుగు వెల్లుల్లి దంచి వేసుకోవాలి..),అర చెంచా మెంతి పొడి వేసి ..మజ్జిగ పులుసుకు కలపాలి. మజ్జిగ కాస్త ఎక్కువ పుల్లగా వున్నా ,చిక్కగా లేకపోయినా ఒక బంగాళా దుంప ఉడికించి, మెత్తగా చేసి మజ్జిగలో కలిపి చూడండి. మామూలుగా (పప్పుకూరలే కాకుండా ,ఉత్తపప్పు కి కూడా సూపర్ కాంబినేషన్ ఇది...) ఒక ఆధరువులా చేసినా..పిల్లలు కూడా ఇష్టం గా లాగించేస్తారు. చెప్పాగా..నాదీ గారంటీ..!!!
No comments:
Post a Comment