భళా !బాలల బొమ్మల 'బాబు' - అచ్చంగా తెలుగు
భళా !బాలల బొమ్మల 'బాబు' 
 - భావరాజు పద్మిని 


25 ఏళ్ళు చిత్రకళా రంగంలో ఉన్న రంగులన్నీ చూసిన కళ్ళు... అయినా ఆయనకు ఎటువంటి భేషజం లేదు. పిల్లలతో పిల్లాడిగా కలిసిపోతూ, కేరింతలు కొడుతూ ఉంటారు. పొగడ్తల్ని పాములా భావిస్తూ, ప్రతి రోజూ తనను తాను మెరుగు పరచుకుంటూ ఉంటారు. ‘ఇగో’ వంటి ఇజాలను వదిలి, హాయిగా నిజంలో ఆనందంగా బ్రతికే ఆ గొప్ప కళాకారుడు ఆర్టిస్ట్ బాబు గారు. వారితో జరిపిన ముఖాముఖి... ఈ నెల ‘తెలుగు బొమ్మ’ లో ప్రత్యేకించి... మీ కోసం... 
మీ బాల్యం గురించి చెప్తారా ?   
నా పూర్తి పేరు పాలెం సత్యబాబు. పి.ఎస్.బాబు గా ప్రతీతి. బాబు అనే ఆంగ్ల సంతకంతో బాలి, బాపు గారిలా ప్రసిద్ధి పొందాను. మా స్వగ్రామం నెల్లూరు.
నాన్నగారు అడ్వకేట్ గా చేసేవారు. మేము ముగ్గురు పిల్లలం, నేనే పెద్దవాడిని. చిన్నప్పటి నుంచి నాకు బొమ్మలంటే ఆసక్తి ఎక్కువ. రూమ్ లో దాక్కుని బొమ్మలు వేస్తూ ఉండేవాడిని. నాకు నేనే గురువు. కేవలం నిశిత పరిశీలన ద్వారా సాధన చేసి, నాకంటూ ఒక స్టైల్ ని ఏర్పరచుకున్నాను. కాని, ఫౌండేషన్ శిక్షణ లేని వెలితి అప్పుడప్పుడూ బాగా అనిపిస్తూ ఉండేది. చదువంటే ఆసక్తి లేకుండా నేను ప్రదర్శించే వైఖరి నాన్నగారికి నచ్చేది కాదు. తర్వాత మా తమ్ముళ్లలో ఒకరు అడ్వకేట్, మరొకరు బ్యాంకు ఉద్యోగిగా స్థిరపడ్డారు. వాళ్ళను అందరికీ గొప్పగా పరిచయం చేస్తూ... చివరికి నన్ను చూపి... ఎక్స్ప్రెషన్ మార్చి, వీడు ఆర్టిస్ట్ అండి... అనే వారు నాన్న దిగాలుగా. నన్నూ గొప్పగా పరిచయం చెయ్యమని గొడవ చేసే వాడిని. నన్ను పారిస్ పంపండి... ఆర్టిస్ట్ గా గొప్పగా ఎదుగుతాను, అని అడిగేవాడిని, వాళ్లకి అర్ధం అయ్యేది కాదు.
 మీ కెరీర్ ఎలా ప్రారంభమయ్యింది ? 
 కాలేజీ లో బి.కాం చదువుతుండగా ,చదువు మీద శ్రద్ధ వహించక, నేను వెనుక బెంచ్ లో కూర్చుని, మిత్రులతో బాగా అల్లరి చేసేవాడిని. అది చూసిన ఒక లెక్చరర్ నన్ను ఒకరోజు చాలా గట్టిగా కోప్పడ్డారు. వెంటనే పౌరుషం వచ్చి, అప్పటి వరకూ నేను గీసిన బొమ్మలు తీసుకుని, మద్రాస్
పారిపోయాను. కాని, ఎక్కడకు వెళ్ళాలి ? వడపళని లో చందమామ (విజయా వాసవి – నాగిరెడ్డి గారి సంస్థ )ఆఫీస్ కనిపించింది. నాకు ధైర్యం చాలా ఎక్కువ. ఎక్కడికైనా చొచ్చుకు పోయి, పరిచయం చేసుకునేవాడిని . అలా చందమామ ఆఫీస్ లోకి వెళ్ళి, నా బొమ్మలు చూపించాను. వారు చూసి, ప్రస్తుతం వారికి అనుకరణ చిత్రకారుడు కావాలని చెప్పారు. అప్పట్లో అక్కడ ప్రసిద్ధ ఆర్టిస్ట్ లు ఇద్దరు – శంకర్ గారు, చిత్ర గారు. వీరిలో ఎవరో ఒకరిని అనుకరించమని కోరారు. వెంటనే ‘జై శంకర్’ అని ఒప్పుకున్నాను. అక్కడ ఎవరూ టీచర్ లేరు, నేను స్టూడెంట్ ని కాదు. కాని, ‘గుడ్ అబ్సర్ వేషన్ ఇస్ ద కీ ఫర్ ఎనీ గ్రేటర్ లెర్నింగ్ ‘ ఎప్పుడో చదివాను. అది నా మనసులో పాతుకుపోయింది. అదే తల్చుకుని, నాకిచ్చిన కంటెంట్ ని బట్టి బొమ్మలు వేసేవాడిని. అదే కంటెంట్ కి సీనియర్లు మళ్ళీ బొమ్మలు వేసేవారు. అవి చూసాకా, నాకు సీనియర్ సీనియరే ... జూనియర్ జూనియరే అని తెలుసుకున్నాను. ఎందుకంటే... నేను చూసే కోణం వేరుగా ఉండేది, కాని
వారు కంటెంట్ ని బట్టి, ఒక సన్నివేశాన్ని, చదువరుల కళ్ళకు కట్టినట్టుగా వేసే తీరు అద్భుతంగా ఉండేది. చందమామ నుంచి మీ ప్రస్థానం ఏ దిశగా సాగింది ? కొంత కాలానికి రాజు- రాణి బొమ్మలు వేసి, వేసి బోర్ కొట్టింది. అప్పుడు సినిమా పబ్లిసిటీ డిసైనర్ గా విజయా వాహిని ప్రొడక్షన్స్(ఇది కూడా చందమామ వారిదే!) సంస్థ లోకి అడుగుపెట్టాను. అప్పుడే సినిమా పోస్టర్స్ వేస్తుండగా, రామానాయుడు గారు, విజయ బాపినీడు గారు, ఈనాడు రామోజీరావు గారు వీరందరితో కలిసి పని చేసి, మంచి పోస్టర్ డిసైనర్ గా మంచి పేరు తెచ్చుకున్నాను... తర్వాత అది కూడా నాకు బోర్ కొట్టింది... చాలా ఆసక్తికరంగా ఉందండీ.
అప్పుడు ఏం చేసారు ? 
 ఏం చెయ్యాలా అని ఇంట్లో కూర్చుని ఆలోచిస్తుంటే, పిల్లల కంటెంట్ ఉన్న బొమ్మలు వెయ్యాలని అనిపించింది. నాకు పిల్లలకు సంబంధించిన అంశాలు మహా ఇష్టం. ఆ స్లాట్ ఖాళీగా ఉంది, ఎటువంటి గొప్ప పోటీలు లేవని, నిర్ణయించుకున్నాను. అప్పట్లో ‘మద్రాస్ పబ్లిషర్స్ ‘ అనే సంస్థ ఒక మంచి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించబడేది . ఆయన కాపీ రైటర్, ఆవిడ స్కూల్ టీచర్. వారితో కలిసి చాలా పుస్తకాలకు పని చేసాను. ‘ జాయ్ టు లెర్న్’ అనే పబ్లికేషన్ వారిది. అందులో 5-15 ఏళ్ళ వరకూ ఉన్న పిల్లలకోసం పుస్తకాలు వేసేవారు.  
మరి ఇంకా బోర్ కొడితే ఏం చేస్తారు ? 
2 మినిట్స్ స్కెచ్ లు వేస్తాను నేను. మరీ బోర్ కొడితే షాపింగ్ మల్ల్స్, మొదలైన వాటికి వెళ్లి, వాటికి నామమాత్రపు రుసుము పెట్టి, బొమ్మలు
గీసిచ్చి, అక్కడే ఉన్న కాఫీ షాప్ లో కాఫీ తాగి, ఇంటికొచ్చేస్తాను.
మీకు ఇష్టమైన చిత్రకారుడు ఎవరు ? ప్రత్యేకించి ఎవరి శైలినైనా అనుకరించేవారా ? 
కంటికి ఇష్టమైన ప్రతీదీ అనుకరించేవాడిని. MAD మగజైన్ లో బొమ్మలేసే వెస్ట్రన్ చిత్రకారులైన మార్క్ డక్కేర్, జాక్ డేవిస్ మొదలైన వారి ప్రభావం నా మీద ఎక్కువ. హనుమంతుడు రాముడిని జపించినట్టు, వీరి పేరు, బొమ్మలు తలచుకోగానే గొప్ప బలం వస్తుంది నాకు. ప్రతి చిత్రకారుడు, ఎవరో ఒక ఓల్డ్ మాస్టర్ ని గురువుగా ఎంచుకుని, అనుకరిస్తూ ముందుకు వెళ్ళాలి. మైకేల్ అంజిలియో, వేమ్బ్రాండ్ (విండో లైటింగ్ ఆర్ట్ కు ప్రసిద్ధి) ఇలా ఎవరి బొమ్మలనైనా స్పూర్తిగా తీసుకుని, అనుకరించవచ్చు. ఇంటర్నెట్ ఉన్న ఈ రోజుల్లో విషయం వేరు. కాని, అప్పట్లో మన వద్ద రిఫరెన్స్ కోసం ఆర్ట్ బుక్స్ లేకపోతే చాలా కష్టంగా ఉండేది. అందుకే నా వద్ద ఉన్న ప్రతి రూపాయిని వెచ్చించి, ఒక మంచి ఆర్ట్ లైబ్రరీని తయారు చేసుకున్నాను. అందులో ఉన్న పుస్తకాలలోని ఫారెన్ టెక్నిక్స్, ఐడియాస్, ఔట్పుట్స్ వంటి వాటిని గమనిస్తూ, నాకు నేనే తర్ఫీదు ఇచ్చుకున్నాను. ఎం.ఎస్.హుస్సేన్ స్టైల్ ని కూడా అనుకరించాను. కాని, అనుకరించేటప్పుడే ఆర్టిస్ట్ మరింత జాగ్రత్త వహించాలి. మీ సొంత శైలిని
పోగొట్టుకుని, వారి శైలిగా మారిపోకూడదు ! ఈ విషయంలో ఒక ఆర్టిస్ట్ చెప్పిన మంచి ఉదాహరణ చెప్తాను. ఒక్కోసారి, కాలికి దెబ్బతగిలి నడవలేనప్పుడు, మనిషి స్త్రేచేస్ వాడతాడు. కాని, మళ్ళి మామూలుగా కాలు మోపి నడవగలిగినప్పుడు ఇక ఆ స్త్రేచేస్ తో పని లేదు. విసిరేస్తాం. అలాగే, అనుకరించి, మెరుగుపరచుకుని, ఆ శైలిని వదిలేసి, సొంత శైలిని ఏర్పరచుకోవాలి. చాలా బాగుందండి.
మీ బొమ్మలకు పిల్లలే జడ్జిలట... ఎందుకని ? 
ప్రతి మనిషిలోనూ ఒక పసిపాప ఉంటుంది. అలా నాలో ఉన్న చైల్డ్ ని సంరక్షించుకుంటూ,పోషిస్తూ ఆనందంగా ఉంటాను. పిల్లల కంటెంట్ కి సంబంధించిన బొమ్మలు ఎక్కువగా వేస్తుంటాను. నాకు పిల్లలంటే మహా ఇష్టం, నిష్కల్మషమైన జీవులు వాళ్ళు. అందుకే ప్రతి బొమ్మ ముందుగా
పిల్లలకు చూపిస్తాను. వాళ్ళు నా బొమ్మల్ని ప్రేమించేస్తారు. వేసిన బొమ్మలు వాళ్ళకే కానుకగా ఇస్తాను. ఎందుకంటే... ఆ పుస్తకాలలోని వివరం అంతా వాళ్ళ కోసమే ! వాళ్ళు నా భావాన్ని గుర్తిస్తే, నేను సక్సెస్ అయినట్లు ! లేదా, మళ్ళి వెయ్యాలని తెలుసుకుంటాను. నా టార్గెట్ ఆడియన్స్ వాళ్ళే ! ఇవన్నీ నేను అడ్వర్టైసింగ్ ఏజెన్సీ లో పని చేసినప్పుడు నేర్చుకున్న మెళకువలు. ఈ రోజుకు కూడా నన్ను నేను విమర్శించుకుంటాను. ఇతరులకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా, ముందుగానే అనేక కోణాల్లో విశ్లేషించుకుంటాను. మళ్ళీ వెయ్యాల్సి వస్తే, ఆలోచించకుండా, తిరిగి వేస్తాను.
మీకు బాగా ఇష్టమైన చిత్రం ఏది ? 
పాశ్చాత్య చిత్రకారుల ప్రభావం నా మీద ఎక్కువ. నార్మాండ్ రాక్వే అనే ఆయిల్ పెయింటింగ్స్ వేసే అమెరికన్ చిత్రకారుడు “గాసిప్” అనే చిత్రం వేసారు. అందులో ఒకడు మరొకడి చెవి కొరుకుతూ ఉంటాడు. చివరికి ఆ వార్త తిరిగి, తిరిగీ, మొదట చెప్పిన వాడికే చేరుతుంది. ఈ బొమ్మ నాకు చాలా ఇష్టం. ఇదే కాక, అతను వేసే బొమ్మలన్నీ చాలా సహజసిద్ధంగా ఉంటాయి. డీటెయిల్స్ బాగుంటాయి. ఇక బాపు గారు నా మానసిక గురువు. శంకర్, చిత్ర, బాలి గారి వంటి వారి బొమ్మలన్నీ చూసి, గమనించి, రీసెర్చ్ చేస్తుంటాను. ఎవరినీ విమర్శించను.  
చెన్నై వదిలి విజయవాడ ఎందుకు వచ్చారు ? 
నేను బాబు – మేడ్ ఇన్ చెన్నై అని సరదాగా చెప్తుంటాను. నేను వృత్తి నైపుణ్యాలు, వైవిధ్యం, గుర్తింపు, అన్నీ చెన్నై లోనే తెలుసుకున్నాను. ఎక్కడ
పేరు, గుర్తింపు వస్తే అక్కడే నిలబడతాం. కాని ఎందుకో, ఒక మార్పు కావాలనిపించింది. అదే ఆకాశం, అదే భూమి, అదే తెలుగు మీద మక్కువ. ఎస్.పి. బాలు నాలుగు భాషల్లో పాడినట్లు, నేను అన్ని రకాల స్టైల్స్ అనుకరించి తెలుసుకుంటాను. 25 సంవత్సరాల నుంచి చిత్రకళా తపస్సు చేస్తూ, దొరికిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉంటాను.
మీ కుటుంబ వివరాలు చెప్తారా ? 
మై ఓన్లీ వైఫ్ అండ్ టూ చిల్ద్రెన్ - అని ఎవరో అన్నట్లు , నా భార్య సుభాషిణి , ఇద్దరు అబ్బాయిలతో సంతోషకరమైన జీవనం నాది. సుభాషిణి – సుమధుర భాషిని. నా బొమ్మలకు మంచి విమర్శకురాలు, నన్ను అన్ని విధాలా ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇక అబ్బాయిలు బాగా చదువుకుని, మంచి ఆర్టిస్ట్ లుగా ఒకరు ఆనిమేషన్ రంగంలో, మరొకరు పబ్లికేషన్ రంగంలో స్థిరపడ్డారు. లవకుశలు చెన్నై లో స్థిరపడగా, సీతారాములు విజయవాడ వచ్చేసారు. మీరు వేసిన బొమ్మల్లో మీకు బాగా నచ్చిన బొమ్మ ఏది ?0006 అలా చెప్పడం కష్టం కదమ్మా ! తల్లికి అందరి బిడ్డల మీద ఒకే ప్రేమ. అలాగే అన్ని బొమ్మలు నావే ! తృప్తి కలిగించినవే ! ముందుగా అది నా బిడ్డ అన్న భావంతో, ఇతరులకు కంటికి ఇంపుగా దాన్ని ముస్తాబు చేస్తాను. 
మీ బొమ్మలకు వచ్చిన ఒక మంచి ప్రశంస గురించి చెప్తారా ? 
అందరూ మెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఎవరైనా బొమ్మలు బాగున్నాయి, అంటే... వెంటనే అప్రమత్తం అయిపోతాను. ఎందుకంటే, పొగడ్త పాము లాంటిది. దానికి లొంగను, దీవెనలుగా భావిస్తాను. నేను లోకం చూసి, చాలా తెలుసుకున్నాను. ఎవరూ మనల్ని వెన్ను తట్టి ప్రోత్సహించరు. ఎవరో అన్నారు - ఇలాగే బొమ్మలు వేస్తూ ఉండు అని. అదేంటి ? ఇలాగే వేస్తూ ఉంటే ఎలాగ ముందుకు వెళ్ళడం... అనిపించింది. ప్రతి రోజూ ఒక కొత్త శైలి, భావం , పరిశీలన, అనుకరణ కోసం ప్రయత్నిస్తూ ఉంటాను. 
మద్రాస్ లో మీ ప్రస్థానం ఎన్నాళ్ళు సాగింది ? 
దాదాపు 25 ఏళ్ళు పనిచేసాను. తర్వాత విజయవాడలో ‘బాలజ్యోతి’ అన్న పత్రిక ప్రారంభించబోయే ముందు, వాళ్ళు ఆర్టిస్ట్ కోసం వెతుకుతూ ఉండగా, వాళ్ళ హిట్ లిస్టు లో మొదట నేనే ఉన్నానని, నాకు కబురు పెట్టారు. అది చాలా గర్వకారణంగా భావించి, చాన్నాళ్ళు అక్కడ పనిచేసి, ఆ బాలల పత్రికకు మంచి పేరు తీసుకు వచ్చాను. తర్వాత అదీ బోర్ కొట్టేసింది. మళ్ళీ బైటికి వచ్చేసి, చెన్నై వచ్చేసాను. చెన్నై నగరం నాకు అమ్మ లాంటిది. ఎప్పుడు వెళ్ళినా వెంటనే అమ్మలా ఆదరిస్తుంది. 
బాలజ్యోతి కాకుండా ఇతర పత్రికల్లో కూడా మీ కారూన్లు, బొమ్మలు వేసారా ? పత్రికారంగంలో ఎవరూ ఒక్కరినే ప్రోత్సహించరు. పత్రికల వాళ్ళు ఇచ్చే జీతం , పారితోషకం నాకు సరిపోయేది కాదు. అందుకే నెమ్మదిగా , సినిమా పోస్టర్స్, పబ్లిసిటీ డిసైన్స్ చేసాను. ఆడ్ ఏజెన్సీ లలో పని చేసాను. అప్పుడూ, ఎప్పుడూ, ఎప్పుడూ, నేను చాలా సంతోషంగా ఉన్నాను. నవ్వుతూ, నవ్విస్తూ ప్రతి రోజునూ ప్రత్యేకంగా భావిస్తూ, చిన్న చిన్న విషయాల్ని కూడా ఆస్వాదిస్తాను. వయస్సు , ముసలితనం అనేవి అన్నీ అంకెలే ! నేను ఎవరినైనా కలిస్తే... “ఐ ఆం 60 ఇయర్స్ యంగ్. హౌ ఓల్డ్ ఆర్ యు...” అని అడుగుతూ ఉంటాను. 
ప్రస్తుతం మీరు పని చేస్తున్న ప్రాజెక్ట్ లు ఏవిటి ? 
krish mom-finalపిల్లల పుస్తకాలే ! చెన్నై నుంచి ఒక పబ్లిషర్ పుస్తకాలు పంపుతూ ఉంటారు. ఇదివరకు పరుగెత్తి పాలు తాగేవాడిని. ఇప్పుడు నిలబడి నీళ్ళు తాగుదామని విజయవాడ వచ్చేసాను. ఇక్కడి ఆర్టిస్ట్ లు నన్ను బాగా ఆదరిస్తున్నారు. అన్నయ్య, అన్నయ్యా అంటూ దగ్గరికి వస్తున్నారు. ఈ మధ్యనే ఒక ఎక్సిబిషన్ కు వెళ్లాను. అక్కడి పిల్లల బొమ్మలకి నన్ను జడ్జి గా పిల్చారు. నేను వాళ్ళ మధ్యకు వెళ్లి కూర్చుని, ‘ఒరేయ్ బాబు, నేను జడ్జి ని కాదురా. ఏదీ, మీ బొమ్మలు చూపించండి... అని అడిగితే... వాళ్ళు చిలకల్లా నవ్వుతూ వచ్చి, పెంపుడు పక్షులు చనువుగా భుజాల మీద, కాళ్ళ మీద, తల మీద కూర్చున్నట్టు, నా చుట్టూ చేరి, అల్లరి చేస్తూ, బొమ్మలు చూపారు. వాళ్లకు నేను చెప్పింది ఏమిటంటే...”గెలుపు ముఖ్యం కాదు, పాల్గొనడమే ముఖ్యం. ప్రైజ్ ఇస్తే మీ ప్రయత్నం ఆగిపోతుంది. ఇవ్వకపోతే, మరుప్రయత్నం చేస్తారు. అందుకని, చిన్నబుచ్చుకోకుండా, ఈ అనుభవం, జ్ఞానం మున్ముందు మీకు ఉపయోగపడతాయని గుర్తించి సాధన చేస్తే, మీకూ ప్రైజ్ వచ్చే రోజు వస్తుంది.” అని . ఆర్ట్ కెరీర్ ప్రస్తుతం చాలా కష్టంగా ఉంది. 
చాలా మంది ఆర్టిస్ట్ లు తమ ప్రస్థానంలో నిరాశకు గురై, ఈ వృత్తిని వదిలెయ్యాలని నిర్ణయించుకుంటున్నారు. ఇటువంటి వారికి మీరిచ్చే సందేశం ఏంటి ? 
మనం ఆర్ట్ లో నిండా మునిగిపోయాం. అందుకే... అంతా అయిపొయింది అని, ఆశను చంపేసుకోకూడదు. ఆఖరి నిముషం దాకా ప్రయత్నం వదలకూడదు. ‘అల్ ఇస్ లాస్ట్...’ అనే సినిమాలో, సముద్రంలో చిక్కుకున్న హీరో, పక్కనే వెళ్తున్న ఓడను ఆకర్షించడానికి, తన ప్రాణం రక్షించుకోడానికి, చివరి నిముషం దాకా పోరాడినట్లు పోరాడాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని, ఎదురు చూడకూడదు. పరిస్థితులు విలన్ లాంటివి, అయినా చెడుకు గెలుపు లేదు. నేను ఎక్కడ, ఎందులో సరిగ్గా ఫిట్ అవుతానా అని ఆలోచించాలి. ఎడతెగని ప్రయత్నం లేకుండా ఏదీ సమకూరదు. నేను చాలా మంది ఆర్టిస్ట్ లతో ‘బ్రేవ్ ఆర్ట్’ అని చెబుతుంటాను. ఆర్టిస్ట్ అనేవాడు పెన్సిల్ అనే కత్తితో, ఎరేసేర్ అనే డాలు తో, యోధుడిలా పోరాడుతూ ఉండాలి. పరిస్థితులు అనుకూలించనప్పుడు , నిరాశపడకుండా, తన నైపుణ్యాన్ని పెంచుకోవాలి, ప్రేరణ కలిగించాలి. ఈ ప్రపంచం ఒక గ్లామర్ వరల్డ్, ఇక్కడ మన కళతో ఆకట్టుకోవాలి. మన బొమ్మలు ఇతరుల్ని పిలవాలి. అప్పుడే అమ్ముడౌతాయి. చాలా మంది ఇతర చిత్రకారుల్ని అనుకరిస్తూ, వారుగా మారిపోతారు. కాని, సినిమాల్లో ఒరిజినల్ హీరో కు ఉన్నంత విలువ డూప్ కు ఉండదు కదా ! అదే గమనించాలి. మీకు, మీ కళకు మీరే జడ్జి. లాండ్స్కేప్ బాలేదు, పోర్ట్రైట్ వెయ్యండి... ఇలా కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు సిద్ధంగా ఉంటారు. ఇటువంటి వారి మాటలు విని నిరుత్సాహ పడవద్దు. మీ వెన్ను మీరే తట్టుకుని, విశ్వాసంతో ముందుకు అడుగెయ్యాలి. నిజానికి ఆర్ట్ కి ఎవరూ విలువ కట్టలేరు. మాల్ల్స్ లో, నగలలో, ఇతర ఖరీదైన విషయాల్లో బేరమాడకుండా కొనే వారంతా, ఆర్టిస్ట్ వద్దకు వచ్చేసరికి మాత్రం, డబ్బు ఎగ్గోట్టి, బేరమాడి, పొగిడేసి వెళ్తూ ఉంటారు. పొగడ్తలతో కడుపు నిండదు కదా !అందుకని, ఆర్టిస్ట్ లు మొహమాట పడకుండా, తన కళకు తగ్గ విలువ నిర్ణయించుకుని, ముందే అడగాలి. భయం వదలాలి. ‘మే ఆర్ట్ బ్లెస్ యు అల్’ . 
జీవితంలో మీ ఫిలాసఫీ ఏమిటి ? 
ఉన్నదానితో ఉన్నతంగా బ్రతకాలి. నవ్వుతూ బ్రతకాలి, కాని నవ్వులపాలు కాకూడదు. జీవితం చాలా చిన్నది... ఎందుకు కొట్టుకోవడం, తిట్టుకోవడం... హృదయం చాలా విలువైనది ... ఎందుకు పగలగోట్టుకోవడం అని మొన్నే ఎక్కడో చదివాను. ‘ఎదిగే కొద్దీ ఒదగమనే... ‘ పాట లాగా... అలా ఎదిగినా ఒదిగి ఉండడమే నాకు ఇష్టం. అసూయ పడను, నాది టేక్ ఇట్ ఈజీ పాలసీ. అధికంగా పని దొరికితే, ఇతర ఆర్టిస్ట్ లతో షేర్ చేసుకుంటాను. అందరితో సఖ్యంగా ఉంటాను. ఇప్పటికీ నా పనిని ఉత్సాహంగా ఎంజాయ్ చేస్తూ, ఎప్పటికైనా ‘చిల్డ్రన్స్ బుక్స్ ఇల్లుస్త్రేటర్ గా స్థిరపడాలని ఆశిస్తున్నాను. 60 ల్లో 20 లా ఉంటూ, ఇతర ఆర్టిస్ట్ లకు స్పూర్తిదాయకంగా ఉండే బాబు గారిని సంప్రదించాలంటే... వివరాలు ... P.S.Babu, cartoonbabu@gmail.com mobile number : 9441892502

No comments:

Post a Comment

Pages