నా చేతి వంట
- పెయ్యేటి శ్రీదేవి
' హాయ్ స్వాతిగారూ! బాగున్నారా?'' హాయ్ పద్మినిగారూ! మీరు బాగున్నారా? మీ అచ్చంగాతెలుగు మిత్రులకి వందనాలు.'' నేను చాలా బాగున్నా. ఈసారి మా ' అచ్చంగాతెలుగు ' కి ఏం వంట చెబుతున్నారు?' ఆమ్ చూర్ తో, అంటే షాపులో మామిడికాయ పొడి అమ్ముతారు కదా? దాంతో పులిహోర చెయ్యడం చెబుతాను.' ' ఆ, ఏముందీ. అన్నంలో పోపెట్టి, పసుపేసి, ఉప్పేసి, ఆమ్ చూర్ పొడి చల్లటమేగా? ఈ మాత్రం వంట చెప్పాలా ఏమిటి? అందరికీ తెలిసున్నదే.' ' నేనింకోలా చేస్తా. నా రూటే సెపరేటు. నా వంటా సెపరేటు.' ' చెప్పండి చూద్దాం.' ' ముందుగా అన్నం వండి వుంచుకోవాలి. పులిహోరకి అన్నం పదునుగా వుండాలి. కుక్కరులో గిన్నెలు పెట్టి వండడం కన్నా డైరెక్టుగా కుక్కరులోనే ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసుల నీళ్ళు పొయ్యాలి. పులిహోరకి ఇంకా బిరుసు కావాలనుకుంటే కొంచెం నీళ్ళు తగ్గించి పొయ్యచ్చు. కరెంటు కుక్కరులో కన్నా కూడా మామూలు కుక్కరులో అన్నం వండితేనే బాగుంటుంది. సరే, వండారు కదా?' ' ఆ!' ' ఇప్పుడు అన్నం పళ్ళెంలో వేసి చల్లారనివ్వండి. తరవాత మూకుడులో నూనె వేసి, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు, జీడిపప్పు లేక పల్లీలు, ఇంగువపొడి వేసి వేయించాలి. తరవాత కరివేపాకు చల్లి, అందులో ఆమ్ చూర్ పొడి పులుపుకి సరిపోయేలా వెయ్యాలి. కొంచెం పసుపు కూడా వేసి కొంచెం నీళ్ళు పొయ్యాలి. తరువాత ఈ ఆమ్ చూర్ పులిహోర పేస్టు.................... ఇప్పుడో చిన్న బ్రేక్....................'
**************************
' అచ్చంగాతెలుగు! అచ్చంగాతెలుగు! అచ్చంగాతెలుగు!' ' ఏమిటోయ్, అచ్చంగాతెలుగు....అచ్చంగాతెలుగు ....అంటూ కొత్తపాట మొదలుపెట్టావు? కొత్తగా పాట రాసి వరస కట్టావా ఏమిటి?' ' అబ్బే కాదండి. ఈ మధ్య అచ్చంగాతెలుగు అని అంతర్జాలమాసపత్రిక వస్తోందిగా? అబ్బ, ఎంత బాగుందనుకున్నారు! మా ఫ్రెండు స్వాతి లేదూ? ఆమె నన్ను అందులో చేర్చింది. అందులో వంటలు, కథలు, కవితలు, కార్టూన్లు, ఇంకా ఎన్నో ఆర్టికిల్సు వుంటున్నాయి. మాసపత్రిక చదువుతున్నట్టే వుంది. చాలా బాగుంటోంది. మీరు కూడా చేరండి. అవును. మీరూ చేరండి.................అచ్చంగా తెలుగు.........అంతర్జాలమాసపత్ రిక!'
****************************
' ఇప్పుడు చెప్పండి స్వాతిగారూ!'' అప్పుడేమో ఆమ్ చూర్ పేస్టు అన్నంలో కలపాలి. అంతే! ఆమ్ చూర్ పులిహోర రెడీ! టేస్ట్ చేసి చెప్పండి పద్మినిగారూ!'' అలాగే, తప్పకుండా. నాకు నోరూరి పోతోంది.'' ఏం, బాలేదా? అస్సలు బాగాలేదా? మొహం అలా పెట్టారేమిటి?' ' స్వాతిగారూ! ఆమ్ చూర్ పులిహోర చాలా చాలా చాలా బాగుంది. సూపర్! నిజంగా చింతపండు పులిహోర లాగే వుంది. నేను వెంటనే మా పిల్లలకి చేసి పెడతాను. అదివరకు ఒకళ్ళింట్లో ఆమ్ చూర్ పులిహోర తిన్నాను. ఏమీ బాగా లేదు. అందుకే అది గుర్తొచ్చి, ఇదీ అలాగే వుంటుందేమో అనుకుని మొహం అల్లా పెట్టాను. నిజ్ఝంగా మీరు చేసిన పులిహోర చాలా చాలా బాగుంది. ఇదిగో, మా అచ్చంగాతెలుగు మాసపత్రిక తరఫున మీకో చిన్న బహుమతి. ఈ ఏప్రాన్ వేసుకుని పట్టుచీరతో వంట చేసినా పట్టుచీర పాడవదు. అన్నట్టు అడగడం మరిచాను. మా అచ్చంగాతెలుగు పాఠకులకి ఒక చిట్కా చెబుతారా?' ' తలనెప్పి బాగా ఎక్కువగా వుండి మందులకి తగ్గక పోతే........... ఏం చెయ్యాలో తరువాతి సంచికలో!!!'
************
No comments:
Post a Comment