“బుడిగి కబుర్లు “ - అచ్చంగా తెలుగు
“బుడిగి కబుర్లు “
భావరాజు పద్మిని
ఓ కమ్మూనిస్టు ఖద

ఒలేయ్ బుడుగూ, ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే ఖాస్త ఎక్కువ సమానం ఖదా ! అందుకే ఈ బుడిగి చెప్పాలి, నువ్వు వినాలి. అందుకే నీకు భోలెడన్ని ధైర్నెం తెచ్చుకునే ఖదలు చెప్తాను, విను. నీకు కమ్మూనిస్తులు అంటే భయమని చెప్పావు ఖదా ! అందుకే నీకు ఇవాళ నీకు కమ్మూనిస్తులు ఖద చెప్తాను, ఏం ? అసలు ఈ కమ్మూనిస్తులు ఎలా పుట్టారంటే... రేపో మర్నాడో ఒక బుడుగు జంతిక తింటున్నాడట, ఏం. అప్పుడు ఒకరో పదహారో పిల్లలకు కూడా తినాలని అనిపిస్తుంది కదా. మరి బుడుగేమో పెట్టడు. అప్పుడు వాళ్ళలో ఖొందరు అలుగుతారు కదా. ఇదే నిరసన అంటే, వీళ్ళు నల్ల జండాలు పుచ్చుకుని, దీనంగా కూర్చుంటారు, అంటే ఏవిటో నాకు తెలీదు. పిన్ని చెప్పింది, ఏం. వీళ్ళతో మనకు ఫేద్దగా గొడవ లేదు. ఖాని ఆ పదహారు మందిలో ఏ ఇరవయ్యో వాడో అలా ఉండడు ఖదా. జంతిక పెట్టమని కూడా అడగడు. ఖోపంగా చూస్తూ, ఎర్ర జండా పట్టుకుని, ‘జంతిక జంతిక ఎన్నియల్లో, నాకు జంతిక ఖావా లేన్నీయల్లో...’ అని కనుబొమలు ఎగరేసి, ఝండా క్రిందికి పైకి ఊపుతూ, గిరగిరా తిరుగుతూ పాటపాడతాడు. ఏం. అయినా నువ్వు జంతిక పెట్టలేదనుకో, ఇంకో పది మందిని కలుపుకుని మళ్ళీ పాట పాడతాడు. “ఈ జంతిక మనదిరో... ఆ జీడి మనదిరా... ఈ చేగోడి మనదిరో... ఆ పకోడీ మనదిరా... జంతిక మనది, జీడి మనది, చేగోడి మనది, పకోడీ మనది... హ. ఈ బుడుగేందిరో వీడి తినుడు ఏందిరా ?” అప్పటికీ నువ్వు జంతిక పెట్టలేదే అనుకో,  ఊచి పుచ్చుకుని నిన్ను ఒక్కటి కొట్టి, జంతిక లాక్కుని, ఎంచక్కా తినేస్తాడు. వీడే కమ్మూనిస్తుడు  అంటే ! ఇదిగో బుడుగూ, సీ గాన పెసూనాంబ ఇంత గానం పంచిందని, నువ్వలా అల్లరి కళ్ళతో కొంటెగా చూసావనుకో, నాకు బోలెడంత సిగ్గేస్తుంది. అప్పుడు నేను ఘబుక్కున మా పద్మ(మా అమ్మలే !) కొంగులో దాక్కుని, నీకేసి ఖోపంగా చూస్తాను. మరి నా ఖోపం అంటే నీకు భయం కదా, అందుకే అలా చూడకు. ఏం. అలా కమ్మూనిస్తులు ఉంటారన్నమాట ! ఓ సారి తాంబూలం తింటుంటే ఈ ఎర్ర రంగు పుట్టిందట !అసలు ఈ ఎర్ర జండా మార్కు యెర్ర రంగు మన రక్తంలోనే ఉంటుంది. ఇంకా ఖారాలు మిరియాల్లో ఉంటుంది. అందుకే చిన్న పిల్లలు ఇవి నూరకూడదు. ఏం. అలా భాగా ఖోపం వచ్చే వాళ్ళు మన పక్కన కూర్చుని, పాట మొదలెట్టగానే, మన చేతిలో ఉన్నది వాళ్లకు ఇచ్చేసామనుకో, నీకు దెబ్బలు తప్పుతాయి. అప్పుడు నువ్వు వాళ్ళు పాట పాడుతుండగా ‘జాటర్ డమాల్ ‘ అని తిట్టేసుకుని, దర్జాగా వచ్చెయ్యచ్చు. తర్వాత వాళ్ళు ఎప్పుడైనా కనిపిస్తే, బామ్మతో చెప్పి, వాళ్లకు ప్రైవేటు చెప్పించెయ్యచ్చు ,అంతే, ఏం. ఇంక అలా చేస్తే నీకు కమ్మూనిస్తులు తో ఇబ్బంది లేదన్నమాట !
ఎల్లుండో మర్నాడో ఇంకో ఖద చెప్తాలే... **************************************************************************************************************************
“బుడిగి కబుర్లు -2 “
(భావరాజు పద్మిని- 4/7/14 )
 వురేయ్ బుడుగు... అదేంటి అలా చూస్తావ్ ? నేనే బుడిగి ని... అంటే సీ గాన పెసూనాంబని. నీ రెండు జల్లమ్మాయిని. నా జల్లు ఎక్కడికి ఫోయాయని అలా హాచ్చర్యపడిపోకు. నీకు అసలు రెండు జల్ల ఖద చెప్పి గ్నానోదయం కలిగిత్తా. గ్నానోదయం అంటే నాకు తెలీదు. బామ్మ చెప్పింది.
రెండు జల్ల ఖద

రేపో నిన్నో ఆధిమానవులు ఉండేవారు కదా. ఏం. వాళ్లకు జల్లు వేసుకోడం రాదుగా పాపం. దువ్వెన కూడా లాపోతే   అలాగే తిరిగేసేవాల్లట. మరేమో అప్పుడు వాళ్ళ జుట్టు జడలు కట్టి, ఒకళ్ళని చూసి ఒకళ్ళు బయపడిపోయేవాల్లట. వాళ్ళ జుట్టులో పిచుకలు గూడు పెట్టేవట. అసయంగా వేలాడే జుట్టు చూసి, చిన్న కోతులు మర్రి ఊడలనుకుని, పుచ్చుకు ఊగేవట. అలా వాళ్ళ జుట్టు అడవిలో కొమ్మలకి, పట్టుకుని, వాళ్ళు బరబరా జారి పడేవారట. ఏం. ఒక రోజు ఆది బుడిగి వెనుక ఆది బుడుగు నడుస్తుంటే, ఆది బుడిగి జుట్టులో కాలు పడి, ఆది బుడుగు ధబ్బున పడిపోయాడు. వెంటనే ‘ఓసి నీ జుట్టు దొంగాల్తోల ‘, అని గాట్టిగా ప్రైవేటు చెప్పేసాడు. ఆది బుడిగికి మాత్తరం ఖోపం రాదు. ‘ముందు నీ జుట్టు మీద ఉన్న ఈగలు తోలుకో...’ ఘబుకుని కోప్పడేసింది. అప్పుడు ముగుడు బుడుగుకు అనుమానం అనిపించి, ఘాట్టిగా ఆదిబుడుగు జుట్టు పట్టుకుని, అటూ ఇటూ అల్లేసాడట. అలా ఫెషల్ గా జడ పుట్టిందన్నమాట. ఓ ప్ఫదిసార్లు బుడుగులు, బుల్లి బుడుగులు పుట్టకా, జటకాలు పోయి జెట్ లు వచ్చాకా, మద్దెలో ఒక బుడబుడకల వాడు వచ్చి, ‘హుష్ మాంకాలి ఆడవాళ్ళ జల్లు ఎగిరిపోవాలి ‘ అన్నాట్ట. అప్పటినుంచీ బుడిగిలు జల్ల గ్నాపకం మర్చిపోయారు. మరి బామ్మ ‘జుట్టు విరబోసుకు తిరిగితే ఘబుక్కున దెయ్యం పట్టుకుంటుందే...’ అని బయపెడుతుందా ,అప్పుడు నేను ‘పొ బామ్మ, ఇంతమందికి పట్టడానికి దెయ్యాలు సరిపోవు,’ అని చెప్పాను. ఇగో మరి నేనేమి చిన్నదానినా చితకదానినా ? అందుకే  ‘బామ్మా, గుండు ఉంటేనే డేంజర్ అని, ఉట్టిపున్యానికి అంతా మొట్టికాయలు కొడతారని, బుడుగు  పుట్టించిన ముళ్ళపూడి రమణ చెప్పారే... అందుకే నువ్వు కూడా పిలక  పెంచుకో,’ అనేసి పరుగేట్టేసాను. భామ్మ ‘ఓసి పిడుగా,’ అని ప్రైవేటు చెప్పేసింది. అలా మహామహ అందరితో పాటు నేను కూడా ఫీడుగా జల్లు వేసుకోవడం మానేసాను. ఇప్పుడు నేను కూడా ఫైటింగు చేసి, నిన్ను రష్చించుతాలే. ఏం. ఇంక వెళ్లి భోం తిని, బబ్బోవాలి. లేకపోతే ఇంట్లో టెంకిజెల్ల కొట్టుతారు.
ఫెద్ద బుడుగులు జుట్టు ఫెంచుకుని , పిలకలు వేసుకోడం ఇప్పుడు ఫాషన్. ఫాషన్ అంటే నాకు తెలీదు. ఒకళ్ళని చూసి ఒకళ్ళు తిక్క వేషాలెయ్యడం అని పిన్ని చెప్పింది. నువ్వు కూడా ఇప్పుడు బుడుగుల్లా కుంచెం జుట్టు పెంచుకుని, పిలకేస్కో ఏం ? రేపో మర్నాడో ఇంకో ఖద చెప్తా... *************************************************************************************************************
“బుడిగి కబుర్లు -3 “
భావరాజు పద్మిని
“బూటీ పార లల్ల “

వురేయ్ బుకు డుకు గుకు ... నేనెలా... సీ గాన పెసూనాంబని. చాలా పెషల్ గా ఉన్నానని గురుపట్టలా. మలి బూటీ పార లల్ల కి వెళ్లి వచ్చాగా . అంచేత ఇలా ఉన్నా. దా, నీకీవాల బూటీ పార లల్లా అంటే ఏంటో చెప్తా. ఇప్పులు మీ రాధ వంటింట్లో వంట చేస్తూ మొహానికి మసి పూసుకుంది అనుకో. ఆలాగ అందంగా ఉండదుగా మరి. ఏం. మళ్ళి మసి తుడిపేసుకుని వస్తే, కుంచెం అందంగా అవుతుంది కదా. అలా అసయ్యంగా ఏదైనా పూసుకుని తుడిపేసుకుంటే, ఝామ్మని అందంగా అయిపోడానికి రాధలు, పద్మలు వెళ్లేదే బూటి పార లల్ల. ఇగో మరే ఇక్కడ బట్టలకి పెట్టే క్లిప్పులు నెత్తికి, జుట్టుకి పెడతాలు తెల్సా. అవన్నీ పెట్టాకా అద్దంలో చూసుకుంటే, నెత్తిన పిచ్చుగ్గూడు పెట్టినట్టు ఉంటుంది కదా, అందుకే అవి తీసేయ్యగానే వాళ్ళ మొహం వాళ్ళకే చాలా కుంచెం బాగుందనిపిస్తుందన్నమాట ! ఇంకా ముగ్గు ‘బుట్ట’ ల్లా ఉండే జుట్టు మీద రంగు ‘పార’ బోసి,’ లల్ల లల్ల’ అంటూ మన దగ్గర బోల్డు డబ్బులు కొట్టేస్తారు కనుక దీన్ని బూటి పార లల్ల అంటారు. ఏం. మలి మన చిన్నప్పుడు పెద్దవాళ్ళు మనం గాఠిగా యేడుస్తున్నా వినకండా నలుగు పెట్టి, తలంటే వాళ్ళు కదా. మరి పెద్దవాళ్ళకు లాల ఎవరు పోస్తారు ? కుంచెం మంది వాళ్ళే పోసుకుంటారనుకో. అందుకే... ఒళ్ళు రుద్దుకుందుకు ఒళ్ళు బద్ధకం ఉన్నవాళ్ళు వెళ్లి, చేతులూ, ఒళ్ళు, కాళ్ళు ఇక్కడ పారబోస్తే, వాళ్ళు డబ్బిచ్చుకుని, లల్ల, లల్ల అంటూ రుద్దుతారన్నమాట ! ఇంకా పార లల్ల వాళ్ళ ఇంట్లో చెక్కేసిన దోసకాయ తొక్కలు, ముక్కలు, పళ్ళ తొక్కలు, కుల్లిపోబోయే పళ్ళు ,పూల రెక్కలు ఉంటాయ్ కదా... అవన్నీ తెచ్చి దొరికిన మొహానికి దొరికినట్టు పూసి పారేస్తారు. దానికి ఫ్రూట్ ఫేషిఅల్ అని, అదనీ ఇదనీ పేర్లు పెడతారు. చెప్పొద్దూ, అలా తెల్లటి ఇడ్లీ పిండి మొహాన పూసుకుని, రెండు దోస్కాయ్ చెక్కలు కళ్ళ మీద పెట్టుకున్న మొహాలు చూస్తే, మనక్కొంచెం భయం వేస్తుందనుకో. అయినా ధైర్నెం తెచ్చుకోవాలి. అసలు ఒళ్ళు తీసుకెళ్ళి ఇక్కడ పారేస్తే, అలాగే బోల్డు డబ్బులు పారేస్తే, తల వెంట్రుక నుంచి, కాలి గోరు వరకు ఏది కావాలంటే అది దిద్దేస్తారు వీళ్ళు. ముందు పారబోస్తారు, తర్వాత తుడిచేస్తారు. అంతే. ఇవాళ నేను కూడా మా పద్మతో పార లల్ల కి వేల్లోచ్చా. ఏం చేయించుకోలేదనుకో. కాని వెల్లోత్తేనే అంతా ‘నేను బాగున్ననా’ అని ఇలా మొహెం పెట్టుకు అడుగుతారు కదా ! అందుకే నేనూ బాగున్నా మహామాహ .
ముందు రాధాలకే ఉండే ఈ పార లల్ల లు ఇప్పుడు గోపాళాలకు కూడా తెరిచారు. ఈ మాటు నువ్వు కూడా మీ గోపాళం తో పారలల్ల కి వెళ్ళొచ్చి, అందంగా అయిపో ఏం ? *****************************************************************************************************************
 
బుడిగి కబుర్లు -4
రచన : భావరాజు పద్మిని.

“బజ్జేట్ ఖధ”
వురేయ్ బుడుగు, దా, ఇవాళ నీకు బజ్జేట్ ఖధ చెప్తా ! అసలు ఈ బజ్జేట్ అంటే ఏవిటో నాకు తెలీదనుకో. అయినా పిన్ని చెప్పింది. డబ్బులు వత్తాయని ఊహిస్తూ,ఎలా ఖర్చు పెట్టుకొవాలో బోల్డంత ఆలోచించి, ముందే రాసుకోడం బజ్జేట్ అని. ఈ పెద్దవాళ్ళేం ఎప్పుడూ ఏమిటీ సరిగ్గా చెప్పరు. దీన్నే లోపం అంటారట. అలాగంటే వాళ్ళకు ఖోపం వస్తుంది. రేపో నిన్నో పక్కింటి పిన్ని గారి గుండు చుట్టాలాయన నా పుట్టిన్రోజుకి వంద రూపాయిలు ఇచ్చాడా. ఏం. అందుకే నేనూ అవెలా కర్చు పెట్టాలో బజ్జేట్ రాసుకున్నా, చూడు. ఇగో మరి, నువ్వు బూమి పుట్టక ముందు ఎప్పుడో పుట్టవా... అందుకే నీకు ప్రపంచకంలో బజ్జేట్ గానం పెసాదిస్తా, ఈ పెసూనాంబ పెసాదించే గానం విని తెల్సుకో. ప్ఫది : ఆ మజ్జెన మా స్కూల్ లో ఉండే ఆర్తికి వాళ్ళ నాన్న పాడిల్ పాప్ ఐస్ క్రీం కొనిస్తే, అది కావాలని నన్ను చూస్తూ, ఉడికిస్తూ తింది. నేను మాత్తరం దాన్ని రేపే ఉడికించాలి, అంతే. ఇదో ప్పది రూపాయిలు ఉంటుందిలే. డబ్భై : ఓ రోజో ప్పది రోజులకో మా పక్కింటి టింకు గాడికి ఎవరో చూయింగ్ గం లాలిపోప్ కొనిచ్చారు. అది తింటూ యెంత గొప్ప పోయాడని. వెంటనే అది కొనుక్కోపోతే నాకు ఇంసల్టు. అదో ముప్పై రూపాయిలు ఉంటుందేమో. యైటి : గేమ్స్ జోన్ లో బోలెడన్ని ఆటలు ఉంటాయిలే. ఊగేవి, లాగేవి, గిర గిరా తిరిగేవి... ఇంకా వీడియో గేమ్స్. ఇవన్ని ఓ రెండో మూడో వేలు ఉంటాయి. ఏం. అవన్నీ ఆడాలి. ఇంకో కబురు చెప్తా విను. ఏది కొనుక్కున్నా ముందస్తుగా డబ్బు ఇవ్వకూడదు. పెద్దవాళ్ళు ఆలాగ ఇవ్వరు. పెద్దవాళ్ళు మన జేబులు తమిడి ‘ఈ డబ్బులు ఎక్కడివి ?’ అని అనుమానం చేసేస్తారు. మనక్కావాల్సి అడిగితే లేదు అంటారు. లేదు అంటే ఇవ్వను అని అర్ధం. ఫిఫ్టీ : హాలిడే కి సింగపూర్ వేల్లోచ్చిందని మా క్లాస్ లో సుబ్బలచ్చ్మి చెప్పింది. దానికి వెళ్ళొస్తా. విమానం లో వెళ్లి రావాలంటే... కుంచెం ఖర్చే అనుకో.... అయినా పర్లేదు, పెషల్ గా వెళ్ళాలి. ఏంటి బుడుగు... డౌట్ వచ్చిందా చెయ్యేత్తావ్, అడుగు. బుడుగు : ఇదిగో బుడిగీ, నేనేమన్నా చిన్నవాడినా చితకవాడినా. నీ దగ్గర వంద రూపాయిలు ఉంటే, విమానం ఎక్కుతావా... పెద్ద పెద్ద కర్చులు చెప్పి, నన్ను అనుమానం చేస్తావా ?
ఓరి బుడుగూ, మనది ఎప్పుడూ లోటు బజ్జేట్ రా ! ఇది కూడా తెలీదా ? నాకూ తెలీదనుకో, పిన్ని చెప్పింది ! ***********************************************************************************************************
 
బుడిగి కబుర్లు -5
భావరాజు పద్మిని

ఓ ఆరో బుర్ర కధ
    వురేయ్ బుడుగూ,   ఇలా రా. నీకు ఆరో బుర్ర ఖధ చెప్పుతాను. అంటే... ఇది పుత్తడిబొమ్మ పూర్ణమ్మ బుర్ర కద కాదులే ! అలాగని పూర్ణం బూరెల ఖద కూడా కాదు. అలా చదివే వాళ్ళ లాగా, నువ్వు అవమానంగా చూడకు. నే చెప్తా కదా !   నిజమేలా, తల ఒక్కింటికీ ఒక్కటే బుర్ర ఉంటుందని, బోడిగుండు బామ్మని చూస్తే తెలుస్తుంది కదా. ఐతే... ఇదంతా మన తెలుగుతో వచ్చిన తంటా కాదులే ! ఇంగిలీషు బాష లోది తెలుగులో ఇలాగే చెప్పాలట!   ఇగో మరి, ఇంగిలీషులో మనిషికి ఆరు బుర్రలు ఉంటాయ్ట. ఇందులో ఒకటి కన్ను బుర్ర, రెండు ముక్కు బుర్ర, మూడు మూతి బుర్ర, నాలుగు తోలు బుర్ర, ఐదు చెవి బుర్ర. ఇలా కాదు, ఉండు, అదేదో సినిమాలో సాయి కుమార్ లా చెప్తా !   కనబడే ఐదు బుర్రలు... కంట్లో, చెవిలో, ముక్కులో, మూతిలో, తోల్లో ఉంటే... కనబడని ఆ రిమోట్ బుర్రేరా ఆరో బుర్ర. సిక్స్త్ సెన్స్... ఆ...   ఆగాగు అలా బయపడి, బుర్ర గోక్కోకురా. బుడుగూ... పారిపోకు. నీకు అర్ధమయ్యేలా చెప్తా దా.   ఇప్పుడు నువ్వు బళ్ళో పంతులు గారు చెప్పే పాటం వింటూ ఉంటావా. ఎక్కడి నుంచో నీకు జంతికల వాసన వస్తుంది. 'అబ్బ, ఇవాళ మా రాద జంతికలు చేస్తే బాగుండు, ' అనుకుంటావ్. అలా ఇంటికి వెళ్ళంగానే రాద జంతికలు పెడుతుందనుకో. అప్పుడు నీకు హచ్చర్యం వేస్తుంది.  
అంటే ఏంటన్న మాట ! స్కూల్ లో నువ్వు అనుకున్న జంతికలు... నీ ఆరో బుర్ర వెళ్లి మీ రాధ కు చెప్పింది. రాధ చేసింది. ఈ ఆరో బుర్రనే కొందరు కృత్రిమ బుర్ర అంటార్ట. ఈ బుర్రెట్టి, అందరి బుర్రల్లోకి తొంగి చూసి, బూచోల్లని పట్టుకుంటార్త. మనకే కాదులా బుకు గుకు డుకు... ఈ ఆరో బుర్ర జంతువులకు కూడా ఇచాట్ట దేవుడు. అందుకే అప్పుడప్పుడూ ఇవి తుఫాన్లు, ఆపదలు వచ్చే ముందు అదోలా అరిచి, గాభరాగా పరిగేడతాయ్ ట. మరే బుడుగూ... నీకో ముక్కెమైన సంగతి చెప్పాలి. బుర్రల్లో చాలా పెమాదకరమైన ఒక బుర్ర ఉంది. దాని పేరు మురుగుదాసు. ఈయన బుర్రలో అవిడియా లు మురిగిపోతూ ఉంటాయ్. అలా మురిగిపోయినప్పుడల్లా క్రియేటివిటీ తన్నుకొచ్చి, ఓ సినిమా తీసి పారేస్తాడు. క్రియేటివిటీ అంటే నాకు తెలీదు. బామ్మ చెప్పింది... పేడని పిసికి, పిడక కొట్టి, పోయ్లో పెట్టినప్పుడే మనిషికి క్రియేటివిటీ వచ్చిందని. ఏం. ఈ మురుగుదాసు... ముందు అపరిచితుడు అనే సినిమా తీసేడు. ఇందులో హీరో కి రెండు బుర్రలు. తర్వాత ఘజిని అనే సినిమా తీసాడు. ఇందులో హీరో కి బుర్ర తక్కువ. ప్రతీ పావుగంటకి మర్చిపోతూ ఉంటాడు. ఈ మజ్జేనే, ఇంకో సినిమా తీసాడురోయ్. దాని పేరు ‘ఏడో బుర్ర – సెవెంత్ సెన్స్’. ఆ సినిమా చూసిన నా బుర్రకి ఏమీ అర్ధం కాలేదనుకో. పొరపాటున నువ్వు చూసేవు... నీ బుర్రలో గుంజంతా ఆవిరైపోతుంది. ఆ పై నీ ఇష్టం ! *****************************************************************************************************************
 
బుడిగి కబుర్లు -6
భావరాజు పద్మిని
“భావుక బుడిగి”

‘వానా వానా వల్లప్ప, వాకిలి తిరుగు చెల్లప్ప...’ ఇవాళ నేను రగస్యంగా వానలో తడుస్తున్నా ! ఎవరికీ చెప్పకండే ! ముఖ్యంగా మా బోడిగుండు బామ్మకి తెలిస్తే, చప్పున కోప్పడేసి, మొట్టికాయ్ కొట్టి, ‘ఓసీ, వానలో తడిస్తే జలుబు చెయ్యదే !’ అంటుంది. ఇక్కడే నాకొక అవమానం వస్తుంది. మరి జంతువులన్నీ వానలో తడుస్తాయి కదా ! చిట్టి పిట్ట కూడా వానలో తడిసి నా ముందు వాలి దర్జాగా రెక్కలు టపటప లాడిస్తుంది కదా ! మరి వాటికి జలుబు చెయ్యదా ? ఏం ? నాకు దీని ఆన్సరు కూడా తెల్సు... అందుకే నాకు నేనే ఇలా చెప్పా ... ‘  బోడిగుండు మీద వాన పడీ, పడీ ఈ బామ్మకు బుర్ర బల్లకట్టేసింది, అన్నీ వద్దంటుంది. గాని, జంతువుల దగ్గర డబ్బులు, డాక్టర్ లు, నోరూ లేదు కనుక వాటికి జలుబు చేసినా చెప్పలేవు. నేనూ ఓ రోజు రగస్యంగా తడిసి నీకు చెప్పను పొ, ‘ అని. అంచేత ఇలా వానలో తడుస్తూ, ఇవాళ బుడుగ్గాడ్ని పిలవలా. మన దగ్గర భావుకత ఉన్నప్పుడు ఎవరూ తోడు అక్కర్లేదని పిన్ని చెప్పింది. భావుకత అంటే నాకూ తెలీదనుకో. మనకు అతిగా బాధ వేసినప్పుడు కాని, అతిగా ఆనందం వేసినప్పుడు కాని, మనలోంచి మన్లాగే ఉన్న వేరే వాళ్ళు బుడుంగున బైటికి దూకి, అదోలా మాట్లాడతారట ! అప్పుడు మనం భావుక బుడిగి అయిపోతాం ట. అంచేత, ఇప్పుడు హాయిగా వాన్లో తడుస్తుంటే... అదిగో ఇంకో బుడిగి దూకింది. అదిలా అంటోంది... “వుసేయ్ వానా ! చెట్లూ, పుట్టలూ అమ్మ లేనివని, పక్చ్చులు, పసూలు బొబ్బోసుకోవని, అందరికీ ఒకేసారి లాల పోయటానికి నువ్వోస్తావ్. వచ్చితివి పొ, నాకేల తడవాలనిపించవలె ... తడిస్తిని పో... నీళ్ళలో ఏల చెంగున గెంతాలనిపించవలె ... పించినది పో... నాకు పడవ ఏల చెయ్యాలనిపించవలె... అన్పించెను పో... నేను బుడుగ్గాడి బుక్కు ఏల చించవలె... చించితిని పో...  పడవ చేసినా, వేసినా, ఈ నీటి బుడగలు... ముత్యాల్లా వచ్చే ఈ వాన చినుకుల టపటపలు యెంత చూసినా... ఏల నాకు తనివి తీరకపోవలె... నేను నాని, నాని పద్మ చేతిలో ఏల జెల్లకాయ తినవలె... అహో... ఎంతటి అనుమానం... ఎంతటి సిగ్గుచేటు... ఎంతటి పరాభవం...” నేనలా బిక్క మొహం వేసి భావుక బుడిగిని చూస్తూ , అరె టీవీ లో ఎన్టిఓడి బుడిగి నాలోంచి దూకిందే... అని  హాస్చర్యపడిపోయేసానా... ఈ లోపు ‘ఒసేయ్ గాన పెసూనాంబా ... ఎక్కడ చచ్చవే...’ అంటూ బామ్మ గాఠిగా పిలుస్తోంది. హమ్మో. నే వెళ్ళాలి.
ఇగో మరే... మీలో ఏ భావుక బుడిగి దాక్కుందో. వానలో తడిసి, బైటికి తియ్యండే.... బై బై. **************************************************************************************************************
బుడిగి కబుర్లు – 7
రచన : భావరాజు పద్మిని

“ఓ జోడు లేని మేజోడు “
వురేయ్ బుడుగు, ఇక్కడ, ఈ మేజోడు (సాకుసు)లో దాగుకున్నా ! ఇటు రా ! ఈ జోడు లేని మేజోడు గోడు చెప్తా ! మలేమో, ఇవాళ ఏమైందంటే, మా పద్మ సాకుసులు రెండూ ఉతికి, నా అలమార్లో ఓ పక్కగా పెడుతుంది ఖదా ! పొద్దుటే స్చూలుకి వెళ్ళే హడావిడిలో... హడావిడి అంటే నాకు తెలీదు. విడివిడిగా అంతా ఖంగారు పడిపోడం అని మా ప్రసాదు(మా నాన్నలే...) చెప్పారు.  అలా హడావిడిలో రెండు మేజోళ్ళు , డ్రెస్, బాడిజి లు... అన్నీ నా బుల్లి చేతుల్లో పట్టుకు వెళ్ళానా... ఓ మేజోడు చల్లగా ఎక్కడో జారిపోయింది. ఇక అంతా విడివిడిగా హాడావిడి... నాన్న మంచం కింద దూరారు, అమ్మ బట్టల బుట్టలో దూకింది, అక్క నా అరమారు తీసింది, బామ్మ మేజోడు జోడు ఏమయ్యిందా అని దాని దారాలు లాగింది. యెంత వెతికినా దొరకలా! నా స్కూల్ బస్సు వెళ్ళిపోయింది. నేనే ధైర్నం తెచ్చుకుని, పోన్లే, ఇవాళ వేరే మేజోళ్ళు వేసుకుంటా, అని చెప్పేసా. మా పెసాదు, అన్ని రాత్రే సర్దుకోమన్నానా ... అని ఖోప్పడుతూ, స్కూల్ లో దింపారు. మా పద్మ నాకు టీచర్ ప్రైవేటు చెప్పుతుందని బాధపడింది. నాకు బయమే అనుకో... ఆ బస్తా వాలా టీచర్ మొహం అదోలా పెట్టి, ‘ సాక్స్ కిధర్ హై’ అంటుంది, నేను వెంటనే బిక్క మొహం వేసి,  ‘బస్తా మే... సారీ రాస్తా మే గిర్గయా హై...’ అంటానా. అయినా ఆవిడ ఖోపంగా ‘ఫిర్ కభీ నై హోనేకా...’ అని ప్రైవేటు చెప్పేస్తుంది. ‘పిప్పళ్ళ బస్తా మీద ఒట్టు హై. కభి నహిన్ హోగా...’ అంటాననుకో. అస్సలు ఈ చిన్న పిల్లలకి ఎన్ని కష్టాలు రా బుడుగూ ! బెల్ట్, షూస్ లు, సాకుసులు, బుజ కీర్తుల్లా బాడిజి లు, టై, మెళ్ళో కుక్క గొలుసు లా ఓ ఐ.డి కార్డు. ఇవి గాక అన్ని పుస్తకాలు, ఆ రోజు ప్రాజెక్ట్ లు, డైరీ, స్విమ్మింగు డ్రెస్, స్కేటింగ్ షూస్ అన్నీ సర్దుకోవాలి. ఏం. ఇవన్నీ కాక బాక్స్, వాటర్ బాటిల్... అన్నీ కలిపి గాడిద బరువు మోస్కుంటూ పోవాలి. ఈ చదూలు అయ్యే సరికి మనకి ఉజ్జోగాలు ఏమో కాని, గూని వచ్చి, రోజు కూలీల కింద మాత్రం పనికొస్తాం. ఎన్ని చూసుకుంటే స్కూల్ కి వేల్తామో మన బాదలు ఈ పెద్దవాళ్ళకు తెలీవు కదా ! ఏం. అంచేత నేను ఇవాళ గట్టి తీర్మానం చేసాను. ఏ జోడు లేని మేజోడు వల్ల నాకు ఇవాల ఇన్ని కషతాలు వచ్చాయో, ఈ మేజోడు లోనే, నత్తగుల్లలో నత్త దాక్కున్నట్టు దాక్కుని, తపస్సు చేస్తా. బెమ్మ గారు రాంగానే, ‘ వెంటనే నన్ను విద్యా శాఖా మంత్రినిని ‘ చేసేయమంతా. అలా అవగానే ఈ బెల్ట్, ఉనిఫోరం, మేజోళ్ళు, షూస్, స్కూల్ కు వెళ్ళే పిల్లలకి అన్నీ కాన్సిల్ చేసేస్తా. స్కూల్ లో ఒక్క చదువు చెప్తే చాలు. జోళ్ళు, మేజోళ్ళు చెప్పక్కర్లా... ఇక పిల్లలెవరూ వెతుక్కోవక్కర్లా... ఇదిగో బుడుగూ, నేను స్కూల్ కు వెళ్ళాకా... మా పద్మ దుప్పటీ దులుపుతుంటే, అక్కడ దొరికిందట మేజోడు జోడు. నువ్వు కూడా అందులో కూర్చుని తపస్సు చెయ్యి. ఇద్దరు తపస్సు చేస్తే, బెమ్మ గారు ఇంకా తొందరగా వస్తార్ట. పైగా ఇందులో కూర్చుంటే, పొద్దున్నే లేచి స్కూల్ కి వెళ్ళక్కర్లేదు. మనల్ని ఎవరూ కనిపెట్టలేరు. ఏం ?
‘ఓం బెమ్మ గారాయనమః...’ **************************************************************************************************
బుడిగి కబుర్లు – 8
రచన : భావరాజు పద్మిని

“పెట్టాసనం “
చిట్టి బుడుగులూ... బుడిగిలూ... ఇవాళ మీకు అనగానగానగానగా... అమ్మమ్మ చెప్పిన ఖధ చెప్తానే ! మలిప్పుడు మీరు టీవీ లో బోలెడన్ని ఆసనాలు చూసి నేర్చేసుకు వేసేస్తున్నారు కదా ! అలాగే మీ స్కూల్ లో కూడా యోగా నేర్పిస్తారు కదా ! మరి మా అమ్మమ్మకు అది తెలీదట. వాళ్ళ బళ్ళో వేరే ఆసనాలు వేయించేసే వాల్లుట మాష్టార్లు... అప్పుడో మర్నాడో పాఠాలు , పజ్జాలు అప్పచేప్పకపోతే “గోడ కుర్చీ “ ఆసనం వేయిన్చేవాళ్ళు. ఏం. అంటే... ఇక్కడ గోడకి హానుకుని ఉన్న కుర్చీలో కూర్చోడం కాదు... మనమే గోడకి కుర్చీలా అంటుకుపోవడం అని అమ్మమ్మ చెప్పింది. తర్వాత బెంచీ ఎక్కి నిల్చునే ఆసనం... ఇందులో... అల్లరి వాళ్ళను అందరికీ కన్పించేలా బెంచీ మీద నిల్చోపెడతారట... ఇంకా గంపెడు గుంజీళ్ళ ఆసనం... దీంట్లో ఎడాపెడా గుంజీలు తీసి, తీసి... కాళ్ళు గుంజేవట పాపం. ఇంకా చెవి మెలి పెట్టే సిచ్చ, మొట్టికాయ, జెల్లకాయ సిచ్చ... ఇలా నరకంలో యములోరి శిచ్చల్లా వాళ్ళ సిచ్చలు వేరే  ఉండేవన్నమాట. ఇప్పుడు మరేమో పిల్లల మీద చెయ్యేస్తే... టీచర్ లకు పడుతుంది జైలు సిచ్చ. అందుకే మన జోలికి రారనుకో. ఇంకా మా అమ్మమ్మ దగ్గర ఓ గొప్ప పెట్టె ఉండేదిట. దాని పేరే సీనారేకు పెట్టె. గట్టిగా ఉండే ఇందిలో  పుస్తకాలు పెట్టుకుని వేల్తార్త... మనం బాగులో పెట్టుకుని వెళ్లినట్టు. ఈ పెట్టె మీద మా అమ్మమ్మ ఓ పాట రాసిన్దిలే... విను. అందమైన సీనారేకు పెట్టె... నా బుక్స్ అన్నీ ఇందులో పెట్టా... అవన్నీ ఇందులో పట్టకపోతే ఎట్టెట్టా ? అందుకే ఒక కొత్త అవిడియా కనిపెట్టా... పెట్టె పైనెక్కి కూర్చుని తొక్కి పట్టా, మూత పట్టింది కాని పడింది సొట్ట సొట్ట తీసి, మళ్ళి గొళ్ళెం బిగపట్టా.. అది ఊడకుండా చిన్న పుల్ల అడ్దేట్టా ఊడింది పెట్టె వెనుక నట్టు అతుకిట్టా నేల మీద పడింది పుస్తకాల గుట్ట నట్టులో దూర్చాను ఇనుపతీగిట్టా యేమని చెప్పను ఈ పెట్టె భోగట్టా, ఇదంటే నాకు అంతులేని ఇష్టమంట.   చూసారా... అమ్మమ్మకి ఈ పెట్టంటే ఉన్న ఇష్టం తోటి దాని కోసం ఎన్నో ఆసనాలు వేసేసింది. పెట్టె మీద మూత పట్టించేందుకు వేసిన ఆసనం “పెట్టాసనం “ అన్నమాట ! మీరూ వెయ్యండి... ఎవరికి మాత్తరం తెలుసు... ఏ పెట్టెలో ఏ మహిమ ఉందో !
***********************************************************************************************************
 
బుడిగి కబుర్లు- 9
భావరాజు పద్మిని

"పిల్లల రధం " 
నిన్నో మర్నాడో నాకో కలొచ్చింది... నేను రయ్యిరయ్యిన సైకిల్ తొక్కేసినట్టు... రేపో ఇంకాసేపటికో నా వార ఫలాలలో రాసుంది... నాకు వాహన యోగం ఉందేమో అని వాళ్లకు అవమానంగా ఉందట... వార ఫలాలు అంటే నేను తినేవేమో అనుకున్నా ! పిన్ని చెప్పింది.. మనం వాటిని తినడం కాదే, అవే మన బుర్ర సుబ్భరంగా తింటాయని ! ఏం. దేవుడికైతే వాహనం అంటే ఒఖలాంటి పెద్ద రధం ఉంటుంది... మరి పిల్లలకు పిల్ల రధం ఉంటుంది... దాన్నే సైకిల్ అంటార్ట ! అంచేత వెంఠనే ఆరున్నొక్క రాగం మొదలెట్టా, నాక్కూడా ఒక పిల్ల వాహనం ఖావాలి అని ! మా ప్రసాదు మొదట్లో నాలుగు మొట్టికాయలు వేసినా, చివరికి ఖంగారు పడిపోయి కొనిచ్చేసారు... నువ్వు సైకిల్ తొక్కడం కాదే, తొక్కి నారతీస్తావ్... అంది పిన్ని. పాఫం పోన్లే అని సైకిల్ తననే నేర్పమన్నా...   అసలు ఈ సైకిల్ నేర్చుఖోటం చాలా బోల్డు కష్టం ఠ... అస్సలు పిన్నిచిన్నప్పుడు ఆడ రధాలు, పిల్ల రధాలు లేవుట ! మగ రధం సైకిల్ ఒక్కటే ఉండేదిట ! అప్పుడు పిల్లలు దానికి స్టాండ్ వేసి ఉత్తినే అందని పెడల్స్ ని కడ్డీ మజ్జలోంచి కాళ్ళు దూర్చి తొక్కేవార్ట. పరిఖినీలు వేసుకున్న రెండుజల్ల సీతలు, దీని కడ్డీ మధ్యలోంచి కాలు పెట్టి అడ్డదిడ్డంగా తొక్కడం కనిపెట్తారట... దాన్ని పంగ తొక్కుడు అనేవార్ట ! ఏం తర్వాత ఆ కడ్డీ మీద ఖోపం వచ్చిన ఓ ఖాంతమ్మ దాన్ని పీకి పాకం పెట్టిందిట ! అది చూసి వెంటనే అవిడియా వచ్చేసి, ఆడ రధాలు పుట్టాయ్ట !తర్వాత పిల్ల రాధాలూనూ... ఏం. ఆదర్రా పిల్ల రధాల కధాకమామిషభిషు... అంటే ఏంటో నాకు తెలీదు. ఎవలికైనా మనం గానం పంచితే, ఇలా అనాల్ట ! అమ్మమ్మ చెప్పింది. ఆలాగు నాకు సైకిల్ నేర్పే బలే చాన్సు పిన్నికి ఇచ్చి పారేసా ! పిన్ని వెనక సైకిల్ పుచ్చుకు వస్తోంది... నేను ముందు తొక్కుతున్నా... అంతే... అంతే... అలాగే తొక్కు... తేలికే... వచ్చేసింది... అంటూ వస్తోంది. అప్పుడు నాకు బయం పోయి వెళ్తున్నాన్నా ... పిన్ని ఖాసేపు తర్వాత ఎప్పుడో వెనుక నుంచి వదిలేసింది... నేను నేరుగా వెళ్ళు, పొడుగాటి ఎదురింటి మీసాల బాబాయ్ కాళ్ళ మధ్య గుద్దేసా ! పిన్ని ఓలాగ నవ్వింది ...అంతే ! ఆయన ఖోపంగా చూసాడు. నాకు ఏడుపొచ్చింది... ఆయన చటుక్కున నన్ను ఎత్తుకుని, పోన్లే పాపా... దెబ్బ తగల్లెదులే ... అంటూ బుర్ర మీసాలు గుచ్చుకునేలా బుగ్గ మీద గాట్టిగా ముద్దు పెట్టేసాడు. నాకు చిరాకు వచ్చిందనుకో ! పెద్దవాడు ఖదా అని వదిలేసా !   హప్పట్నుంచీ సైకిల్ తోక్కుతూనే ఉన్నా ! ఓ సారి ఎడ్ల బండిని, ఇంఖో సారి చెట్టుని, ముందు లారీని గుద్దాను... లారి వాడు బయపడి ఆపేసాడనుకో! ఓ సారి గేదె ముందు వైపు గుద్ది పారిపోతే... అది వెనగ్గా ఒస్తున్న బుడుగ్గాడిని తోకిచ్చుకు చాచి కొట్టింది... వాడికి దడుపు జరం పట్టుకుంది. అంచేత ఎందుఖో మొదట్లో సైకిల్ నన్ను చూసి గజగజా వణికేది ... అటూ ఇటూ పడి పోయేది. నాకు మోచేతులు, మోకాళ్ళు దోక్కుపోయేవి. సైకిల్ కు నన్ను చూస్తే బయంతో గాలి పోయేది , టైరు అరిగిపోయేది... దాని అద్దాలు, చువ్వలు, స్టాండు, అన్నీ వంకర్లు పోయేవి. కొన్ని ఊడగోట్టుకునేది... మా ప్రసాదు మజ్జలో కోప్పడి... నీ సైకిల్ రిపేర్ ఖర్చుతో ఇంఖో సైకిల్ కొనచ్చు అంటారు ! ఏం చేస్తాం . నేనేమైనా చిన్న దానినా చితక దానినా ? పెద్దాళ్ళు ఖోప్పడ్డారని వదిలేస్తే, ఆ వార ఫలం రాసే వాడు పరీక్ష తప్పుతాడు. అందుకే పాపం ఇంకా తొక్కుతున్నా... మీరూ నా పిల్ల రధం చూడాలంటే నాతో రండి... కాని ముందూ, వెనుకా నడవకండే ! నా సైకిల్ కు కొత్త వాళ్ళని చూస్తే బయం ! చేతికింద కొస్తే చెయ్యి దెబ్బ ! కాలికింద కొస్తే కాలి దెబ్బ ! అధన్నమాట !
*****************************************************************************************************************************************
 
బుడిగి కబుర్లు- 10
 భావరాజు పద్మిని 


"నెయిల్ స్టిక్ లీఫ్"
  అంచేత నేను నిన్నో మర్నాడో నెయిల్ స్టిక్ లీఫ్ పెట్టుకున్నా ! అంటే ఏమిటంటే... గోరుని అంటుకుని ఉండే ఆకు... గోరింటాకు. ఏం .ఇది పెట్టుకోడం చాలా డేంజర్ అన్నమాట ! ఎందుకంటే... ఇది పండాకా దాని రంగు చూసి, మన చిన్నప్పుడే... రేపో మర్నాడో ఎలాంటి  ముగుడు వస్తాడో చెప్పేస్తారు. అలాగని బయపడి మన చేతులు ఎవరికీ చూపించం ఖదా ! అందుకే వీళ్ళు మనం  పసి పిల్లలుగా ఉన్నప్పుడే మన చేతుల్లో గోరింటాకు పెట్టేసి, కవర్ లు కట్టేస్తారు. అప్పుడే అంతా కనిపెట్టేస్తారు ! అంతే కాక, మంచి డిసైన్ వస్తుందని, మైనం చుక్కలు, ఆకులు వేసి పెట్టేసి, తియ్యకుండా కాపలా కాసేస్తారు. మనం నిద్దట్లో వాళ్ళ బుగ్గలకో, మెడకో రాసేస్తే... మర్నాడు, ‘హారి భడవా !’ అంటూ నవ్వేస్తారు. నాకలా ఖోపం వేస్తుంది. అందుకే నన్ను నవ్వించాలని, బామ్మ నాకు గోరింటాకు ఖద చెప్పింది.   అనగనగా ఓ బ్రిటిష్ దొర మన దేశంలో తలా ,కాళ్ళు దాచుకున్నప్పుడు ఆ ఊరి వాళ్ళు ‘ఏదో పెద్ద ధోర గారు కధా ,అని మర్యాద పడిపోయి... రుబ్బిన గోరింటాకు తీసుకెళ్ళి, ఆయనకు ఇచ్చార్ట ! ఆయన కుంచెం దాచుకున్న తల బాదుకుని, ఏం చెయ్యాలా అని ఆలోచించేసి,  ఆకుపచ్చ బొట్టు కాబోలు అని, ఆయన విబూది రాసుకున్నట్టు , చేత్తో తీసుకుని, 3 అడ్డగీతలు రాసుకున్నాట్ట ! ఇంతలో పేద్ద గాలోచ్చి, ఆయన తెల్ల జుట్టు యెగిరి నుదిటి గోరింటాక్కి ఘబుక్కున అటుక్కుపోయిందిట. ఇంకేముంది... మర్నాడు... ముందు యెర్ర జుట్టు, వెనుక తెల్ల జుట్టు ఉన్న ఆ దొర గార్ని...’ మొక్కజొన్న పొత్తు పీచు దొర” గారని పిలవడం మొదలెట్టారట. పాపం. ఆయనకేం తెల్సు... పీచ్ దొర... అంటే... పీచ్ పండులా ఉన్నాడని, తన్ను చూసి, అందరూ హాచ్చర్య పడిపోయేస్తున్నారని ఖాయం చేసుకుని, మల్లా గోరింటాకు తెప్పించుకుని, నెత్తంతా రాసుకున్నాట్ట ! హలా మొదలైంది... గోరింటాకు నెత్తికి రాసుకోవడం... మొక్కజొన్న పొత్తు పీచుల్లాంటి జుట్టేసుకు తిరగడం ... హవ్వ... అంతా నవ్విపోరూ !   గోరింటాకు కావాలని అందరూ అడగ్గానే ఇవ్వరు కదా ! అందుకే ఇందులో రఖాలు పుట్టుకొచ్చాయి. ఒకావిడ కాస్త చనివిడి పాకం పడుతోందిట !హింతలో చెమటకి, ఆవిడ పది రూపాయిల బిళ్ళంత (ఇదివరకు రూపాయి కాసు అనేవార్లే!) నుదుటి బొట్టు కారి, పాకంలో పడిపోయిందిట. ఏం. వెంటనే ఆవిడ కంగారుగా అది తీద్దామని, వేలు పెట్టగానే, ఆవిడ వేలు పందిపోయిందిట !అలా కుంకం గోరింటాకు పుట్టింది. ఇది 3 రోజులు పోయాకా పెచ్చులు పెచ్చులుగా ఊడిపోతుంది. డాన్సులు ఆడేవాళ్ళ కోసం “అల్తా” అనే గోరింటాకు పుట్టింది. అలా తయారుగా వేసేస్కోవచ్చు కాబట్టి దీన్ని అల్... తా అంటారేమో ! మరి ఆకు ఎండబెట్టిన పొడి, మళ్లి నీళ్ళలో కలిపి, చేతులకు పెట్టుకోవడం వచ్చేసింది. దీన్ని చేతుల పొడవునా కాళ్ళ పొడవునా పెట్టుకుంటారు... అది పెద్దగా పండదనుకో. అందుకే, అందులో ఏవేవో కలుపుతారు. మందుల వాసనొచ్చి, ఇది కూడా మూడు రోజులకి అసయ్యంగా కనిపిస్తుందనుకో. అయినా... దీని పున్నేమా అని వాకిట్లో ముగ్గులు పెట్టినట్టు, ఆడాళ్ళ చేతులు, కాళ్ళు పట్టుకు ముగ్గులు పెట్టేసి, బోల్డు మంది బతికేస్తున్నారు. సంక్రాంతి రధం ముగ్గులా ,యెంత పెద్దగా పెడితే, అంత గొప్ప !   మరి ఎక్కడ పడితే అక్కడ పెట్టుకునే గోరింటాకును ఏమంటారు ? టాటూ అంటార్ట ! పిన్ని చెప్పింది. దీన్ని క్రికెట్ మాచ్ లో బుగ్గల మీద, కండలు పెంచిన వాళ్ళు బుజాల మీద, అలా వేసుకుంటార్ట. కొన్ని తుడిచేస్తే పోతాయి, కొన్ని పచ్చబొట్టులా  ఉండిపోయి పోవు. రేపో మర్నాడో ఎవడైనా బుజమ్మీద కపాలం వేయించుకున్నాడనుకో. ఇక వాడు కపాల మాంత్రికుడిలా అలా తిరగాల్సిందే ! వాడు “హుష్ మాంకాలి “ అనకుండానే అంతా పారిపోతారు.   ఎన్నొచ్చినా... మన నెయిల్ స్టిక్ లీఫ్ కు పోటీ ఏదీ రాదని బామ్మ చెప్పింది. ఎందుకంటే...   మూడు) మాంచి వాసనొస్తుంది. ఒఖటి)ఇంఖా ఇది పండాకా రోజు రోజుకూ రంగు తగ్గుతుంది కాని, పెచ్చులు, గొగ్గులు రాదుగా... ఆరు) కాలి పగుళ్ళకు, దెబ్బలకు మందులా పని చేస్తుందట ! డెభై )గోళ్ళను అంటుకుని, పుచ్చకుండా రచ్చిస్తుందట !   అన్నట్టు, నా గోరింటాకు మందార పువ్వు రంగులో ఉందని, బామ్మ నాకు మంచి ముగుడు వస్తాడని చెప్పింది. అందుకే నేనూ ఇంధాకే సిగ్గుపడిపోయేసి , అలాగైతే ఎంతైనా అల్లరి చేయ్యచ్చని ఖాయం చేసుకుని, ఇప్పుడే పార్క్ లో ఉయ్యాల ఊగడానికి వెళ్తున్నా ! మరి మీరూ పెట్టుకొండే.  

No comments:

Post a Comment

Pages