చైతన్య కుసుమం - కనుపర్తి వరలక్ష్మమ్మ
- కరణం రమాగాయత్రి , చీరాల
సాహిత్యంలో , సమాజంలో పురుషాధిక్యత చలామణి అవుతున్న రోజుల్లో అతి కొద్దిమంది రచయిత్రులు, కవయిత్రులు మాత్రమే కలాలు చేతబూని తమ సత్తా చాటారు.. మహిళా హక్కులకై, సాంఘిక దురాచారాల రూపుమాపుటకై శంఖం పూరించారు. అలాంటి మేథో సంపత్తికి కేరాఫ్ గా నిలిచిన మహిళా శిరోమణి శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ. తన సాహిత్యానికంటూ ఓ ప్రత్యేకత, సార్ధకత సంపాదించుకున్న చైతన్య కుసుమం కనుపర్తి వరలక్ష్మమ్మ (1896-1978). ఆమె గురించి ఓ నూలుపోగు: ప్రముఖ సంఘసేవా తత్పరురాలూ, రచయిత్రీ అయిన కనుపర్తి వరలక్ష్మమ్మగారు 1896, అక్టోబర్ 6న పాలపర్తి శేషయ్య, హనుమాయమ్మ దంపతులకు బాపట్లలో జన్మించారు. ఈమెకు ఐదుగురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు. 1909లో విద్యాధికుడు, హెల్త్ ఇన్స్పెక్టరుగా పనిచేసిన కనుపర్తి హనుమంతరావుతో వివాహం జరిగింది. కనుపర్తి వరలక్ష్మమ్మగారు దేశ దాశ్యశృంఖలాలు వీడేందుకు పోరాటం చేయడమే గాక , తన రచనల ద్వారా ప్రజలను జాగృత పరచేందుకు విస్తృతంగా కృషి చేసిన మహా మనీషి.. వీరేశలింగంగారు ప్రారంభించిన ఉద్యమాలూ, స్వాతంత్ర్య సమరమూ మంచి వూపు అందుకున్న సమయం అది. వరలక్ష్మమ్మగారిమీద ఆ ఉద్యమాలప్రభావం చాలా వుంది. గాంధీగారి నాయకత్వంలో విదేశీ వస్త్రబహిష్కరణలో పాల్గొని ఆమె ఖద్దరు ధరించడం ప్రారంభించారు. స్త్రీలని విద్యావంతులని చేయడానికీ, విజ్ఞానవంతులని చేయడానికి విశేష కృషి చేసిన ఈమె, వారి అభ్యున్నతికై బాపట్లలో ' స్త్రీహితైషిణీ మండలి' స్థాపించారు. రచనా వ్యాసాంగం : వరలక్ష్మమ్మ సామాజిక విలువలూ, వ్యక్తిత్వం..., ఆమె రచనల్లో ప్రస్ఫుటమౌతాయి. 1919 లో సౌదామిని అనే (ఆంగ్లానువాదం) కథ తో రచనలు చేయడం ప్రారంభించారు . ఆ తర్వాత స్వాతంత్రోద్యమం, మహిళా సాధికారత, బాల్యవివాహాలు, కన్యాశుల్కం, ముఢనమ్మకాలు, నిరక్షరాస్యత వంటి ఆనాటి సమస్యలను ఎత్తి చూపుతూ సాగిన వరలక్ష్మమ్మ సాహిత్య ప్రస్తానం అప్రతిహతంగా సాగింది. కనుపర్తి వరలక్ష్మమ్మ ప్రముఖ మాసపత్రిక 'గృహలక్ష్మి' లో 1929 నుంచి 1934 వరకు ధారావాహికంగా ''శారదలేఖలు' అన్న శీర్షకతో అనేక సమస్యలు చర్చిస్తూ రాసారు. తరువాత 'శారదలేఖలు' అన్న పేరుతో పుస్తకంగా ప్రచురించారు. ఆధునిక భావాలు గల 'శారద' పాత్ర ద్వారా స్త్రీలని చైతన్యవంతం చేయడానికి దోహదం చేసేయి. ఒక రచయిత్రి, ఒక ప్రముఖ పత్రికలో ఆరు సంవత్సరాల పాటు ఒక కాలమ్ నిర్వహించడం అదే ప్రథమంగా గణింపబడుతోంది. ఆనాటి సామాజిక పరిస్థితులకు గొడ్డలి పెట్టు ఈ శారదాలేఖలు. శారద పేరుతో తన స్నేహితురాలైన కల్పలత కు రాసినట్లు అనిపిస్తుంటుంది.. సంభోదన కుడా " సౌభాగ్యవతి కల్పలతకు, నెచ్చెలీ..!" అని లేఖా ప్రారంభం ఆ విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఈ లేఖల ప్రభావం స్వాతంత్రోద్యమంలో స్త్రీల హక్కుల పరిరక్షణ లో ఎంతగానో దోహదమైనట్లు అర్ధమౌతుంది. గృహలక్ష్మి మాసపత్రికలో వచ్చిన ఆ లేఖలను స్త్రీలు చదివించుకొని , మరీ వినేవారట. అంతగా స్త్రీల పై ప్రభావం చూపిన శారదాలేఖల్లో, ప్రతి మహిళా తనని తాను 'కల్పలత' లా ఊహించుకునే వారట.. అంతటి గొప్ప సాహితీ వేత్త శ్రీమతి వరలక్ష్క్మి. తొలి నవలా - ప్రస్థానం : వరలక్ష్మమ్మగారి తొలి నవల 'వసుమతి'. ఆనాటి సామాజిక నేపథ్యం, వీరేశలింగం గారి వంటి వైతాళికులు, మహిళా అభ్యున్నతికై చేసిన కృషి ఫలితంగా.. మహిళా లోకంలో ఆ భావనల సువాసనలు ఏవిధంగా వున్నాయో కళ్ళకు కట్టిన నవల "వసుమతి". వరలక్ష్మమ్మ కు కథా రచనకు బీజం పడ్డ ఒక ఉత్కృష్టమైన సంఘటన ఆమె 14 ఏట జరిగింది. వరలక్ష్మమ్మ తల్లి గారైన హనుమాయమ్మ తో ఓ దీనురాలు చెప్పుకున్న వ్యధని .. విని ఆ కన్నీటిని దర్శించి.. కథ రాయాలనుకున్నారట.. ఆ దీనురాలి కథే వసుమతి. పందొమ్మిదవ ఏట ' వసుమతి ' వ్రాసినా 1925 వరకూ అచ్చుకు నోచుకోలేదా నవల. ఇక వసుమతి నవల గురించి ఒక్క మాటలో చెప్పడం అలవి గాని పని.. సమాజంలోని కుళ్ళుని బట్టబయలు చేయడం ద్వారా.. కొంతవరకైనా మార్పు సంభవిస్తుందన్న కసి వరలక్ష్మమ్మ కథాగమనంలో కనిపిస్తుంది.. 'పుస్తకాలూ మనిషిని మారుస్తాయ్' అని ఆమె 'వసుమతి' లో తెలిపే ప్రయత్నం చేశారు. సర్వ సాధారణమైన కథే వసుమతి. కానీ కథా గమనం, అందులోని ఆనాటి జాతీయాలు.. ,వసుమతి అందాన్ని వరలక్ష్మమ్మ వర్ణించే తీరు.. చదువరులను కట్టి పడేస్తాయి. తనకు సమాజంలో నచ్చని అంశాన్ని తెగనాడుతూ, సమాజ వృద్ధికి పనికి వచ్చే విషయాన్ని స్పష్టంగా బల్లగుద్దినట్లు చెప్పడం వరలక్ష్మమ్మ విధానం. అదే ఆమె సాహిత్యం గొప్పదనం. అమాయకురాలు అయిన అయిన వసుమతికి ఆనాటి ఆచారాల ప్రకారం చిన్నతనంలోనే పెళ్లి చేశారు. భర్త ఆనందరావు చెడుసావాసాలకి లోనై, నాగమణి అన్న ఒక వేశ్యతో సంబంధం పెట్టుకుని వసుమతిని హింసిస్తూ వుంటాడు. నాగమణి ప్రోత్సాహంతోనే భార్యని వదిలి, రంగూను వెళ్లిపోతాడు. అక్కడ నాగమణి అతడిని చులకన చేసి, తన తెగువతో ఇతరులతో సంబంధాలు పెట్టుకుంటుంది. రంగూనులోనే పరిచయమయిన ఒక తెలుగు పుస్తక ప్రచురణ కర్త సుందరరావు సాహచర్యంలో ఆనందరావుకి జ్ఞానోదయమయి. అతను తిరిగి స్వగ్రామం వచ్చి వసుమతితో చక్కగా సంసారం చేసుకుంటాడు. ఇక్కడ ఆనందరరావు మారేందుకు సుందరావు వద్ద చదివిన ఓ పుస్తకం “హరిదాసి” ఒక కారణం అని ఆమె తన నవలలో విద్యా ఆవశ్యకతను చెప్తారు. వరలక్ష్మమ్మగారు ఆనాటి సాహితీక్షేత్రం కూడా నిశితంగా పరిశీలిస్తూనే వుండేవారు అనడానికి తార్కాణం ఆమె 1940వ దశకంలో ప్రచురించిన “కథ ఎట్లా వుండాలె” అన్న చిన్నకథ.ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయనం – అన్న పద్ధతిలో సమీక్షలు రాసి ప్రచురిస్తున్నారన్న వ్యాఖ్యానం కనిపిస్తుంది. దాదాపు దెబ్బై ఏళ్లక్రితం ఆమె వర్ణించిన ధోరణి ఈనాటి పరిస్థితులలో కుడా చాలా చోట్ల కనిపిస్తుంది. వరలక్ష్మమ్మగారు రచించిన మరొక వచన కావ్యం విశ్వామిత్ర. (1963). విశ్వామిత్రుడు కోపిష్టి అని ప్రజలలో ఉన్న భావన. అందుకు భిన్నంగా వరలక్ష్మమ్మగారు ఆయనని ధర్మనిష్ఠాగరిష్ఠునిగా, బ్రహ్మర్షి పదవి సాధించిన దీక్షాపరునిగా చిత్రిస్తారు. మానవుడు పుట్టుకచేత కాక గుణకర్మలచేత ఔన్నత్యం సాధించగలడనీ, దానికి విశ్వామిత్రుడే సాక్షి అనీ ప్రతిపాదిస్తారు ఆమె. ఇతర రచనలు: వరలక్ష్మమ్మగారు రచించిన ఇతర కథల్లో విశేషంగా ఆదరణ పొందినకథ 'పెన్షను పుచ్చుకున్ననాటి రాత్రి'.. ఆమె రాసిన మరొక గ్రంథం ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు. లేడీస్ క్లబ్ , రాణి మల్లమ్మ , మహిళా మహోదయం , పునః ప్రతిష్ట వంటి నాటికలు , ‘ద్రౌపది వస్త్ర సంరక్షణ ‘ అనే ద్విపద కావ్యం , ‘సత్యా ద్రౌపది సంవాదం’’ , నాదు మాట’ మొదలైన పద్య రచనలు చేసారు . ‘నమో ఆంధ్ర మాతా’ పేరుతో గేయాలు రాసారు స్వాతంత్రోద్యమ నేపథ్యంలో 'గాంధీ (మీద) దండకం' కూడా రచించారు . ఇవే కాకుండా పిల్లల పాటలు , నవలలు , పిట్ట కథలు , జీవిత చరిత్రలు ,కథలు అనేక ప్రక్రియలలో రచనలు చేసారు . వరలక్ష్మమ్మ కథలు కొన్ని తమిళ , కన్నడ , హిందీ భాషలలోకి అనువాదమయ్యాయి . మహిళా అభ్య్దయానికి విశేషంగా వరలక్ష్మమ్మ గారి కృషిని గుర్తిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆమె శారద లేఖలని తొమ్మిదవ తరగతి ప్రస్తుతం తొమ్మిదివ తరగతి పాఠ్యాంశం గా చేర్చారు. మద్రాసు , విజయవాడ ఆకాశవాణి కార్యక్రమాలలో పాల్గొన్న మొదటి మహిళ వరలక్ష్మమ్మ. 1921లో విజయవాడలో గాంధీని కలిసి జాతీయోద్యమంలో నేరుగా పాల్గొన్న మహిళా ధీశాలి వరలక్ష్మమ్మ. వరలక్ష్మమ్మ పొందిన సత్కారాలు బిరుదులు : గృహలక్ష్మీ స్వర్ణకంకణం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ రచయిత్రి పురస్కారం, గుడివాడ పౌరుల నుండి 'కవితా ప్రవీణ' బిరుదు. ప్రపంచ తెలుగు మహాసభలో సన్మానం పొందిన రచయిత్రి . చివరిక్షణాలు... మహిళా లోకానికి చిరుదివ్వై చివరిక్షణాల వరకూ వారిని చైతన్య పరుస్తూ, వారి అభ్యున్నతికై విశేష కృషి చేసిన సాహితీ సౌరభం వరలక్ష్మమ్మ 1978 లో తన 92 ఏళ్ల సుధీర్ఘ జీవన ప్రస్థానానికి శెలవు ప్రకటించారు. స్త్రీ రూపాలైన ధనం ప్రసాదించే లక్ష్మీ, చదువుల తల్లి సరస్వతి పూజలందుకుంటున్నా సమాజంలో స్త్రీకి మాత్రం అందాల్సిన స్థాయిలో గౌరవం అందడం లేదనేది ఆమె భావన. “ నా జీవము ధర్మము , నా మతము నీతి , నా లక్ష్యము సతీ శ్రేయము . ఈ మూడింటిని సమర్ధించుటకే నేను కలము బూనితిని “ అని చెప్పుకున్న రచయిత్రి వరలక్ష్మమ్మ కాలధర్మం చేయడంతో మహిళా (సాహితీ) ఉద్యమంలో ఒక శకం ముగిసిందనే చెప్పవచ్చు. - ఉపకరించిన వ్యాసాలు: నిడదవోలు మాలతి (తెలుగు తూలికా బ్లాగ్) గారి వ్యాసం,' వరలక్ష్మమ్మ విశిష్ట వ్యక్తిత్వం' , విక్కీ పీడియా ,
No comments:
Post a Comment