చీకటి పూలు – పుస్తక పరిచయం - అచ్చంగా తెలుగు

చీకటి పూలు – పుస్తక పరిచయం

Share This
చీకటి పూలు – పుస్తక పరిచయం
-      రమాదేవి

కవి పరిచయం: సీమ సాహిత్య చరిత్రకు ఒక రూపును ఊపును ఇచ్చిన సుప్రసిద్ధ కథా రచయిత 'చిలుకూరి దేవపుత్ర'. 1952లో అనంతపురం జిల్లా వడ్డుపల్లి గ్రామంలో జన్మించారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన దేవపుత్ర చాలా కష్టపడి 12వ తరగతి వరకు చదువుకున్నారు. తరువాత 1983లో జైళ్ల శాఖలో ఉద్యోగిగా చేరారు. అటుతరువాత రెవెన్యూ శాఖలో పనిచేసి డిప్యూటి తహసీల్దారుగా పదవీ విరమణ చేశారు. దేవపుత్ర 'పంచమం' నవలకు 'ఆటా' పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 'ధర్మ నిధి' పురస్కారం. 'ఛాసో స్పూర్తి' అవార్డు, మధురాంతకం కథా కోకిల పురస్కారం, రాచకొండ పురస్కారం...ఇలా లెక్కలేనన్నీ అవార్డులు అందుకున్నారు. 'అద్దంలో చందమామ', 'పంచమం', 'చీకటి పూలు', 'కక్షశిల' మొదలనైన నవలలు మానవత్వం బందీ, గురుదక్షిణ, ఆయుధం, మన్ను తిన్నమనిషి మొదలైన కథలు దేవపుత్ర, ప్రతిభకు అద్దం పడుతాయి. అతను రాసిన ఆరు గాస్లుల కథనలు తెలుగు సాహిత్యంలో సంచలనం సృష్టించాయి చీకటిపూలు గురించి ఏమన్నారంటే: ‘భద్రం కొడుకో..’ సినిమా తీసే రోజుల్లో వీధి బాలలతో నేను చాలా స్నేహం చేశాను. వాళ్ళంతా ఇపుడు పెద్దవాళ్ళయి పోయారు. ఆ సినిమాలో కొంత ప్రాధాన్యం గల పాత్రలో నటించిన పిల్లవాడు – సినిమా తీసిన తర్వాత రెండు మూడు నెలలకు బోస్టన్ స్కూల్లో పడ్డాడు. ఒకసారి వెళ్లి చూశాం గానీ, ఆ తర్వాత కుదరలేదు. ఈ నవల చదువుతున్నంత సేపూ వాడి ముఖమే గుర్తొచ్చి చాలా ఏడుపొచ్చింది, వాడు ఇపుడు ఏమి చేస్తున్నాడో, ఎలా తయారయ్యాడో ననే ఆలోచనతో ఏమీ తోచడంలేదు . ఈ పిల్లల కోసం ఏదైనా –ఎవరైనా చేయగలిగితే బాగుండు...! అక్కినేని కుటుంబరావు... ‘ చీకటిపూలు’ చదివినప్పుడు నేను నా చిన్నతనంలో చదువుకున్న చార్లెస్ డికెన్స్ నవల ‘డేవిడ్ కాపర్ ఫీల్డ్’ , విక్టర్ హ్యూగో నవల ‘లే మిజరబ్లే (Le Miserbles) (తెలుగులో ‘బీదలపాట్లు’ పేరుతొ సినిమాగా వచ్చింది) వంటివి జ్ఞాపకం వచ్చాయి. కె.ఆర్.కె. మోహన్ దాదాపు 20 రోజులపాటూ నవల రాశాను. నవలలోని పిల్లలతో నేను మానసికంగా ఒక కొత్త ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. ఈ నవల  పూర్తి చేసి ‘స్వాతి మంత్లీ’ కి గానూపోస్ట్ చేసి వచ్చాను. నా చుట్టూ ఉన్న నా పిల్లల్ని, అప్పటి వరకు నావాళ్ళు గా పెంచుకున్నవాళ్ళని ఎక్కడికో సుదూర తీరాలకు పంపెసినట్లుగా అనిపించింది. అంతే – ఇంటికొచ్చి ఏడ్చేస్తూ కూర్చున్నా.. చిలుకూరి దేవపుత్ర   కథ పరిచయం: దేవపుత్ర బాలనేరస్థుల కష్టాలను వారి బాధలను 'చీకటి పూలు' నవలలో హృదయ విదారకంగా దృశ్యీకరించారు. నవలలోని కథంతా బాలనేరస్థులను ఉంచే ఓ సర్టిఫైడ్ స్కూల్లో జరుగుతుంది. బాల నేరస్థులను సంస్కరించటం కోసం భారతదేశంలో ఏర్పాటైన పాఠశాలలు ఎలా తయారయ్యాయో, వాటిలోని పిల్లలు ఎన్ని బాధలు పడుతున్నారో ఈ నవల చెబుతుంది. చిరంజీవి డాన్సులు చేసే రంగా, వాడి డాన్సులు ఇష్టపడే ప్రతాప్, నాయకత్వ లక్షణాలున్న రాంబాబు, ‘పురుగుల బిర్యానిరోయ్‘ అని ఉన్నదానిలో ఆనందం అందుకునే వెంకటేసులు, ఇంకా చదువు తప్ప లోకం తెలియని రఘు, తల్లి లేని చెల్లి, తమ్ముడు కోసం జైలు పాలయిన  సూరి, ఎన్ని కష్టాలు కన్నీళ్లు ఉన్నా ఉన్నచోటే ఆనందం వెతుక్కునే పిల్లలు వీరంతా. ఇలా ఎందరో దారి తప్పిన చిన్నారి పిల్లలకు నిలయమైన సర్టిఫైడ్ స్కూల్. కానీ ఆ ఆనందం కూడా ఓర్వలేని పెద్దలు కాపలా ఉండేది కూడా ఇక్కడే.. ఇందులోని ప్రతీ ఒక్కరిది ఒక దయనీయమైన కథ. నాలుగవ సంతానాన్ని పెంచే స్థోమతలేక అబార్షన్ చేయించుకుంటే అది వికటించి చనిపోతే, దిక్కులేని చెల్లి , తమ్ముణ్ణి పెంచడానికి రైల్వే ప్లాట్ ఫాం పై అడుక్కుంటూ, ఏమి దొరకని ఒకరోజు ఒక మిలటరీ ఆఫిసర్ ట్రాన్సిస్టర్ లాక్కుని పారిపోతుంటే, ఆయన తన ధర్మంగా వాణ్ని పట్టించి మీకు తోచిన కేసు పెట్టుకోండి, గొడవలొద్దు అని తన ట్రాన్సిస్టర్ తో రైలు ఎక్కిన ఆ ఆఫీసరు పుణ్యమా అని లోకం తెలియని చెల్లి తమ్ముణ్ణి ఆ ప్లాట్ ఫాం పై వదిలి నగల దొంగ కేసు గా జైలు చేరిన సూరి, తల్లీ తండ్రీ తెలియదు, బుద్దోచ్చేసరికి ఫ్లాట్ ఫాం మీద అడుక్కుతిని – డబ్బులు సంపాయించి ‘మామయ్యా’ అనే వాడి చేతిలో పెట్టేవాడు. తనకు కనీస అవసరాలకి కూడా డబ్బు ఇవ్వడం లేదని, డబ్బులు ఇవ్వడం మానేస్తే, టెలిఫోన్ల వైర్ల దొంగతనం మోపితే వచ్చినవాడు రంగా. పదవతరగతి చదువుతున్న రఘు ఇంటిపై కప్పు కూలి ఇంట్లో అందరు చనిపోతే ప్లాట్ ఫాం పాలయ్యి బ్రతకడం తెలీని వాడిపై ఓ శుభ ముహూర్తాన పదివేల చోరీ కేసు మోపి తన్ని మరీ ఒప్పించి రిమాండుకు పంపితే, మేజిస్ట్రేట్ దయ కలిగి ఈ స్కూల్లో వచ్చి పడ్డాడు. రాంబాబుది మరొక కథ, అయినవాళ్ళు తమ గుట్టు కాపాడుకోడం కోసం ఇంటి నుండి తరిమితే సైకిళ్ళ దొంగతనం తో జైలు పాలయ్యాడు. రాంబాబు తలలో ఏవేవో ఆలోచనలు! తామంతా తెలిసో తెలియకో.. తెలీని వయసులో తప్పులు చేశారు. ఆ నేరాలు చేసినందుకు ఈ స్కూల్లో పడేశారు. ఇలా స్కూల్లో వేయడం శిక్ష కాదు... గవర్నమెంట్ శిక్షగా భావించి ఉంటె తమకు ఏ సౌకర్యాలు కలిపించేది కాదు. కానీ తమకు కనీస సౌకర్యాలు అందకుండా అన్యాయం జరుగుతుంది.... తిరుగుబాటు చేయాలి .. ఇలాంటి ఆలోచనలతో ఉన్న ప్రధానపాత్ర ఈ రాంబాబు ప్రతీసారీ చిన్న పాటి తిరుగుబాటు చేయడం , అక్కడి సూపరిడెంట్ తో అర్ధరాత్రి తన్నులు తినడం లో నాయకుడు మన రాంబాబు. ఒకసారి జైలు ఇన్స్పెక్షన్ కి వచ్చిన ఎం.ఎల్.ఎ  ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి అని అనగానే దెబ్బ భయం రుచి చూడని లోకం తెలియని కొత్తగా వచ్చిన రఘు మాకు ఇవ్వవలసినవి ఇస్తే చాలని చెప్పడం తో ఆ రాత్రి దెబ్బల రుచి చూపడానికి వచ్చిన సూపరిడెంట్ కర్ర వేటు తన వంటిని చేరేలోపే భయంతో ప్రాణం పోగొట్టుకోవడం పిల్లల మనసుపై గాఢమైన ముద్ర వేసింది. ఆ రాక్షస దండు నుండి పారిపోవాలనుకున్నారు. బాలనేరస్థుల పాఠశాలలో అవినీతిని నిలదీసి ప్రశ్నిస్తే దాని పర్యవసానం ఏమిటి? రాంబాబు తో కలసి పిల్లలు ఎంచుకున్న స్వేచ్చ ఏమిటి? బాలనేరస్థుల పాఠశాల నుంచి పారిపోయిన పిల్లలు తిరిగి జైలుకి వచ్చారా? ఇలాంటి కథలకు కారణం పిల్లలా.. సమాజమా.. ఆశక్తి లేని అధికారులా.. కారణం ఎవరైనా బలియిపోయేది మాత్రం పిల్లలు... పసివాడని పిల్లలు... http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=2254&PHPSESSID= ప్రతులకు సంప్రదించండి... 12-170/A1,Sai Nagar ANANTAPUR AP 515001

No comments:

Post a Comment

Pages