కుమతీ శతకము - రాళ్ళబండి రాజయ్యకవి
- దేవరకొండ సుబ్రహ్మణ్యం
కుమతీ శతకకర్త బ్రహ్మశ్రీ రాళ్ళబండి రాజయ్యకవి. వీరు నైజాము తాలూకా నలగొండజిల్ల హుజూరునగరు తాలూకాలోని చింతపల్లి గ్రామానికి చెందిన వారు. వీరు ఆగ్రామానికి మునసబు దారునిగా పనిచేసారు. తనను గురించి తను ఈశతకంలో తెలియచేసిన విషయాలు ఇలా ఉన్నాయి:
కం. భారద్వాజస గోత్రుడ
కూరిమినరసింహ యాఖ్యు కొమరుడనై సీ
తారమణికి పిచ్చమకున్
నేరమణూడనైతి ధారుణీస్థలి కుమతీ!
కం. క్షితి వెంకట లక్ష్మంబా
సుతవర్గమునందు నగ్రజుడనై జన్మిం
చితి శ్రద్దదోపగా జె
ప్పితి నీకీనీతులెల్ల వినరా కుమతీ!
కం: నైజాము రాష్ట్రమందున
భూజననుత చింతరేల పురిమునసబుగా
రాజాజ్ఞా బద్ధుడనై
నేజరిపితినలుబదేండ్లు నిష్ఠన్ కుమతీ!
క్రీ. శ.1938 సంవత్సరంలో వ్రాసి ప్రచురించిన ఈ శతకం ప్రధానంగా నీతిశతకం. "కుమతీ" అనే మకుటంతో 102 కందపద్యాలతో రచించిన ఈ శతకం చక్కని నీతిపద్యలతో మాత్రమే కాక వేదాంత విషయాలను ప్రతివారికి అర్థమయ్యే భాషలో రచింపబడినది. ఈశతక సంపూర్తి
కం. స్థిరలీల నిలువగానీ
శ్వరవత్సర చైత్రకృష్ణ సపమిశశి వా
సరమందున యీశతకము
పరిపూర్తియొనర్చినాడ భక్తిన్ కుమతీ
అని కవి చెప్పుకొన్నాడు
ఈ కవి ఈశతకమే కాక మరికొన్ని వేదాంతగ్రంధములు కూడా రచించినట్లు తెలుస్తున్నది. ఐతే ఇంతకంటె మరే వివరాలు దొరకటం లేదు.
శతక పరిచయం:
ముందుగా చెప్పుకొన్నట్లు ఈ శతకము సుమతీ శతకము వలనే నీతిశతకము"కుమతీ" అనే మకుటం వాడటానికి కారణం కూడా ముందుగానే తెలియచేసారు.
కం. సుమతియను శతకమున్నది
కుమతిశతకమెచట లేమి గూర్చితినిటులన్
గమనింపతగును దీనిని
కుమతియేమియనెడు శంక గోరక కుమతీ!
కం. సుమతికి యేటికి నీతులు
కుమతికి జెప్పవలెగాని క్షోణిస్థలిలో
కుమతిని బాగొనరించిన
సముదంచత్పుణ్యమబ్బు చయ్యనకుమతీ!
కం. కనుకనెచెప్పెద నీకిటు
వినుమా యీనీతులెల్ల విశదముగాగన్
జనియించు జ్ఞానసంపద
దినదినమభివృద్ధియగును దీనన్ కుమతీ!
ఈశతకంలో నీతులు ధారాళం. చక్కటి సులభమైన తెలుగులో అందరికి అర్ధమయ్యేట్లుగా వ్రాసినవి. అనేక శకునాలు, సామెతలు, జాతీయాలు ఈ పద్యాలలో మనకి దొరుకుతాయి. క్రింది పద్యాలలో శకునాలగురించి ఏమి చెప్పారో చూడండి.
కం. పిల్లి ఎదురైన బోకుము
మళ్లుము నీవింటికపుడె మఱియొకనాడున్
వెళ్లగదలచినచో మూ
ణ్ణాళ్లుండియునాపయిజనందగు కుమతీ
కం. ఎప్పుడూ శ్వానము లేడ్చిన
తప్పకతద్గ్రామమున కొదవుకీడెంతో
ముప్పగును గృహమందున
గొప్పగజగడంబు రోజుగూడదు కుమతీ
కం. తుమ్మినపయనము గాకుము
నెమ్మదిగానొక్కనాడు నెలకొనియింటన్
సమ్మతిగ మరుదినంబున
బొమ్మనివచియింత్రు సర్వబుధులిల కుమతీ
మరిన్ని పద్యాలను చూద్దాం.
కం. గురుశుశ్రూష యొనర్పక
మరచియు మంత్రంబు జేర మరియొకగురువున్
నరునకుతప్పదు నరకము
మరియెన్నడు జేయకిట్లు మహిలో కుమతీ
కం. నొసటన్ వ్రాసిన వ్రాలది
మసిబొట్టేయయినకాక మఱియొకటైనన్
వెసదుడిచివేయ వచ్చునె
మసిగాదది బ్రహ్మరాత మారదు కుమతీ
కం. క్షితిలోన మంచిపనికై
జతగూడరు రమ్మటన్న జగడంబనినన్
ప్రతిమనుజుడు కాల్దువ్వున్
అతులితముగ నెల్లవేళ లందునకుమతీ
కం. ఆకలి యుడిగిన కడుపును
పాకమ్మొనరింపలేని పడతులబ్రతుకున్
పోకిరివారల నటనలు
లోకములోజూడచాల లోపముకుమతీ
ఇటువంటి మంచి శతకము పెద్దా చిన్న భేదములేక అందరు చదివి నేర్చుకోవలసినదే. మీరు చదవండి, చదివించండి.
No comments:
Post a Comment