ముద్దులు మోమున ముంచగను
(అన్నమయ్య కీర్తనకు వివరణ )
-డా.తాడేపల్లి పతంజలి
(ముద్దులొలికే చిన్ని కృష్ణుని అన్నమయ్య ఈ కీర్తనలో ముద్దులు గొలిపే మాటలతో మన ఎదుట కనబడేటట్లు చేస్తున్నాడు.సంపుటము 05-303)
పల్లవి | ముద్దులు మోమున ముంచగను | అందాలు తన మొగాన్ని ముంచేస్తుండగా |
నిద్దపు గూరిమి నించీని | స్వచ్చమైన ప్రేమని శ్రీ కృష్ణ మూర్తిభక్తుల హృదయాలలో నింపుతున్నాడు |
01వ చరణం | మొలచిరుగంటలుమువ్వలుగజ్జెలు | నడుముకు ఉన్న మొలతాడులో ఉన్న చిన్న గంటలు, మొనలో మూడు సందులు ఉండే గజ్జెలు, మాములు గజ్జెలు |
ఘలఘలమనగాకదలగను | శ్రీ కృష్ణ మూర్తి కదులుతున్నప్పుడు ఘల్లు ఘల్లుమని మోగుతున్నాయి. |
ఎలనవ్వులతో నీతడు వచ్చి జలజపు చేతులు చాచీనీ | చిరునవ్వులతో ఈ చిన్ని కృష్ణుడు వచ్చి పద్మాల్లాంటి తన చేతులను చాస్తున్నాడు. |
02వ చరణం | అచ్చపు గుచ్చు ముత్యాల హారములు | స్పష్టంగా , ఒత్తుగా ఉండే ముత్యాల హారాలుపచ్చ రాళ్లతో ఉండే చంద్రాభరణాల కాంతితో |
పచ్చల చంద్రాభరణములు తచ్చిన చేతుల తానె దైవమని | మెరుగు పెట్టిన తన బుల్లి చేతులతో తానే దేవుడినని చెబుతూ |
అచ్చట నిచ్చట ఆడీని | అక్కడ , ఇక్కడ ఆడుతున్నాడు. |
| |
03వ చరణం | బాలుడు కృష్ణుడు పరమపురుషుడు | ఈ కనిపించే బాలుడు పరమాత్మ. |
| నేలకు నింగికి నెరి బొడవై | నేలకు, నింగికి ఒక పద్ధతిలో పొడవై, (అనగా వామనావతారములో నింగి, నేలను ఆక్రమించి) |
| చాల వేంకటాచలపతి తానై | అందరికంటే అధికుడైన వేంకటేశునిగా తానే ఈ కలియుగములో అవతరించి |
| మేలిమి సేతల మించీని | చక్కటి శుభాలను అనుగ్రహించే చేతలతో భక్తుల హృదయాలలో మెరుస్తున్నాడు. |
విశేషాలు ముద్దులు మోమున ముంచగను అన్నమయ్య ఒకచోట చేసిన ఊహ ఇంకొక చోట చేయడు. అది అతనికి మాత్రమే సాధ్యమయిన కవితాపద్ధతి. ‘ముద్దుగారే యశోద’ అని ఒక కీర్తనలో కృష్ణుడు ముద్దులు గారేటట్లు అందంగా ఉన్నాడని చెప్పాడు.ఈ కీర్తనలో అందాలు తన మొగాన్ని ముంచేస్తుండగా స్వచ్చమైన ప్రేమని శ్రీ కృష్ణ మూర్తి భక్తుల హృదయాలలో నింపుతున్నాడని అపురూపంగా చెప్పాడు. కృష్ణమూర్తి మోములోనే కాదు. ఆయనను భక్తితో దర్శించినవారి మోము కూడా అందంగా తేజోవంతమవుతుంది. కేవలము మోము ఒక్కటే కాదు- హృదయము కూడా స్వచ్చతతో నిండుతుంది.అన్నమయ్య చెప్పిన ఈ సార్వకాలిక సత్యము అనుభవైక వేద్యము. బాలకృష్ణుడు అని అంటారు కాని, బాల రాముడు అనరు.అది చిరునవ్వుల బాలకృష్ణుని ప్రత్యేకత. మొల చిరుగంటలు మువ్వలు గజ్జెలు గౌరమ్మ గౌరమ్మ ఉయ్యాలో.. బంగారు గౌరమ్మ ఉయ్యాలో.. అనే దసరా పాటలో ''సీత ముందుకు ఎవర్ని తెద్దాం తీగ నాగన్నుయ్యాలో..సీత ముందుకు గజ్జెలు కట్టిన పాపని తెద్దాం తీగ నాగన్నుయ్యాలో.. అను పంక్తులు వస్తాయి. చిన్నపిల్లల మొలతాళ్లకు గంటలు, గజ్జెలు కట్టే అలవాటు ఈ జాతిలో ఒక సత్సంప్రదాయము. గంటలు, గజ్జెలు లేకుండా పాపలను, అందులో చిన్ని కృష్ణుని అసలు ఊహించలేము. చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ బంగరు మొలత్రాడు పట్టుదట్టి సంది తాయెతులను సరిమువ్వ గజ్జెలు చిన్నికృష్ణ ! నిన్ను చేరి కొలుతు ’’ అని తాను వ్రాసిన శతకములో కూడా అన్నమయ్య సరిమువ్వ గజ్జెల ప్రసక్తి తెచ్చాడు. ఎలనవ్వులతో నీతడు వచ్చి/జలజపు చేతులు చాచీనీ “చిరునవ్వులతో ఈ చిన్ని కృష్ణుడు వచ్చి,పద్మాల్లాంటి తన చేతులను చాస్తున్నాడు’’అని చదివిన వెంటనే అందమైన నవ్వుతున్న కృష్ణుడు, చేతులు చాస్తున్న విధానము అంతా కళ్లముందు కనబడుతుంది. మనస్సులో అలౌకికానందం ప్రతి ఫలిస్తుంది. ‘చొక్కుచు సోలుచువచ్చి సుదతులు ఎత్తుకుంటే/పక్కన నవ్వులు నవ్వీ బాలకృష్ణుడు’అని ఇంకొక కీర్తనపు చరణములో (బడి బడి తిరిగాడీ బాలకృష్ణుడు/ఎడయని జాణగదే ఈ బాలకృష్ణుడు అని కీర్తన) బాలకృష్ణుని నవ్వులను అందంగా పఠితల హృదయాలకు హత్తించాడు అన్నమయ్య. బాలుడు కృష్ణుడు పరమపురుషుడు పరమపురుషుడు అను పదం అన్నమయ్యకు ఇష్టమైన పదాలలో ఒకటి. ‘’పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు/మురహరుడు ఎదుట ముద్దులాడీనిదివో’’అని ఒక కీర్తనను ఈ పదంతో అన్నమయ్య ప్రారంభించాడు. బ్రహ్మ సూత్రాలలో ఉన్న ‘శబ్దాదేవ ప్రమితః’ అను సూత్రములో ఈ పరమ పురుష ప్రస్తావన ఉంది. బొటన వేలు పరిమాణముతో ఉండే ఈ పరమ పురుషుడు శరీర మధ్య భాగములో అంటే హృదయములో ఉంటాడు. హృదయములో ఉండే ఆ పరమ పురుషుడు బాలకృష్ణునిగా అన్నమయ్య కీర్తనల్లో పారాడుతున్నాడు.భక్తితో దర్శించి పరవశిద్దాం. ***
No comments:
Post a Comment