నవతరం యువత!
- పోతినేని రవిరాజా
నేనే ఉజ్వల అగ్గిజ్వాలనై
నేనే భావి భారతానికి వెలిగే దివ్వెనై
నేనే యువ ఉక్కు పిడికిలినై
దౌష్ఠిత్వాన్ని బద్దలుకొట్టగా
వెల్లివిరిసే సత్యకణాలే వెలుగగా...
నేనే శాంతి కపోతమునై
నే భావి భారతానికి అహింసాబాటనై
నేనే యువ కంటికి చూపునై
హింసను ఖండించగా వికసించే
శాంతిపూలు పరిమళించగా...
నేనే శ్రమజీవుల కష్టమునై
నేనే భావి భారతానికి అభివృద్ధి మెట్టునై
నేనే అలుపెరగని ప్రశ్నించే యువగళమునై
పేదరికాన్ని కరిగించగా పుట్టే
తొలి ఆనందాల రాగం వినిపించగా...
నేనే వనితల చిరునవ్వునై
నేనే భావి భారతానికి అబల శక్తినై
నేనే యువ మరిగే రక్తమునై
మదపుటేనుగుల చండాడగా
కనుజారే కన్నీరే ఆనంద భాష్పాలుగా...
నేనే మెరిసే అక్షరమునై
నేనే భావి భారతానికి దిక్సూచినై
నేనే యువ హస్తరాతనై
నిరక్షరాస్యతని తొలగించగా
రాసెను ప్రతి చేయే భారత తలరాతగా...
నేనే భరతమాత నొసట తిలకమునై
నేనే భావి భారతానికి నిజ సంస్కృతినై
నేనే యువ ఐక్యత నడకనై
మువ్వన్నె జెండా పిడికిలిన పట్టగా
నడిచే మార్గం సశ్యశ్యామలమవ్వగా...
నేనే భారత భారం భుజ స్కందాలపై మోయగా
ఆ నేనే ఈ తరం నవతరం యువశక్తినిగా.. దివ్వెనుగా!
No comments:
Post a Comment