౩౦ ఏళ్ళు టీవీ, రంగస్థల, చలనచిత్ర నటనానుభవం కలిగి, తన అభినయంతో ఎవరినైనా చటుక్కున నవ్వించే అచ్చ తెలుగు నవ్వుల రేడు – గుండు హనుంతరావు గారితో ప్రత్యేక ముఖాముఖి... మీ కోసం...
మీ స్వగ్రామం, మీ బాల్యం గురించిన సంగతులు చెబుతారా ?
నేను పుట్టింది(1956) , పెరిగింది, చదివింది, ఆడింది, పాడింది, నాటకాలు వేసింది అంతా విజయవాడే ! అమ్మ పేరు సరోజిని, నాన్న కాంతారావు. మా పెదనాన్న కృష్ణబ్రహ్మం గారు మంచి గాయకులు, నటులు. అప్పట్లో ఆయన్ను అపర ఘంటసాల అనేవారు. వారి నాటకాల్ని నేను చాలా చిన్నప్పుడు చూసాను. చిన్నప్పటి నుంచి నాటకాలు చూసి, నాకు కూడా నటించే అవకాశం వస్తే బాగుండునని అనుకునేవాడిని. అలా 1974 నుంచి, అంటే నా 18 వ సంవత్సరం నుంచి నాటకాలు వెయ్యడం మొదలు పెట్టాను. నేను మొట్టమొదట వేసిన వేషం రావణ బ్రహ్మ వేషం.
సినిమా రంగానికి వస్తానని ఎప్పుడైనా అనుకున్నారా ?
లేదండి . ఒకసారి మద్రాస్ లో నేను వేసిన నాటకాన్ని చూసిన జంధ్యాల గారు, నన్ను స్టేజి మీదకు వచ్చి, అభినందించి, తన తర్వాతి చిత్రంలో నాకు వేషం ఇస్తానని చెప్పారు. తర్వాత ‘అహ నా పెళ్ళంట’ సినిమాలో వేషం ఇచ్చాకా, నేను సినిమాల్లో కూడా బాగా నటించగలను అని తెలిసింది. తర్వాత ఒక 50 సినిమాల వరకూ విజయవాడ నుంచే షటిల్ చేస్తూ, నటించాను.
మీ నటనకు మీ కుటుంబసభ్యుల ప్రోత్సాహం ఎలా ఉండేది ?
నాటకాల రిహార్సిల్ వేసి, నేను తెల్లవారుఝామున 3 గంటలకు ఇంటికి వస్తే, అమ్మ తలుపు తీస్తూ... ఎందుకొచ్చిన నాటకాలురా ? కూటికొచ్చేనా ? గుడ్డకొచ్చేనా ? అని అడిగేది. మరి అదే నాకు ఈ రోజు వరకూ కూటికొచ్చింది, గుడ్డకొచ్చింది, గూడుకొచ్చింది... (అన్నారు నవ్వుతూ)
మీ దృష్టిలో హాస్యం అంటే ఎలా ఉండాలి ?
హాస్యానికి నిర్వచనం చెప్పాలంటే, సూరేకాంతమ్మ గారి హాస్యంలా ఉండాలి. అన్ని తరాలు ఆస్వాదించేలా, సహజంగా ఉండాలి. సున్నితంగా, సన్నిహితంగా ఉండాలి, అని పెద్దలు ఎంతోమంది సినిమా పరంగా గాని, వేదికలపై గాని, నిరూపించారు.
మీ అభిమాన హాస్య నటులు ఎవరండి ?
సూరేకాంతమ్మ గారేనండి. ఆవిడంటే నాకు వల్లమాలిన ఇష్టం. గయ్యాళి అత్తపాత్రలు చేసినా ఆవిడ పాత్రోచిత నటన, డైలాగ్ లు, మాడ్యులేషన్, డిక్షన్, ఎక్కడో మన దూరపు చుట్టం అన్నట్లుగా, అనిపిస్తుంది. ముఖ్యంగా ‘గుండమ్మ ‘ పాత్ర, అన్నపూర్ణ పిక్చర్స్ లో చేసిన -వెలుగునీడలు, డా. చక్రవర్తి, ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ లో చేసిన కులగోత్రాలు, విజయా వారి మాయాబజార్ (ఘటోత్కచుడి తల్లి పాత్ర ) మొదలైన చిత్రాలు అన్నింటిలోనూ ఆవిడ నటన సహజంగా ఉండి, ఎన్ని సార్లు చూసినా విసుగుపుట్టకుండా ఉండే చక్కటి సినిమాలు.
ఉచ్చారణలో మీకు అంత స్పష్టత ఎలా వచ్చింది ?
మంచి మంచి నటుల సాహచర్యం వల్ల, వారితో నటించడం వల్ల, ప్రభావం వల్ల, వాళ్ళను చూసి, స్పష్టత అలవడింది. వారి సాంగత్య ప్రభావం వల్ల, సాధన, నటన పట్ల మక్కువ, భావంలో స్పష్టత , అర్ధమయ్యేలా డైలాగ్ చెప్పాలి అనే తపన వల్ల, చాలా నేర్చుకున్నాను. చూసిన- చేసిన నాటకాలు, సినిమాలు, కలిసి తిరిగిన మాహానటులు వీరి ప్రభావం నాపై ఉంది.
మీకు బాగా తృప్తిని కలిగించిన పాత్ర ఏది ?
సినిమా పరంగా ఇంకా మంచి పాత్రలు చెయ్యాలని నాకు అనిపిస్తూ ఉంటుంది. కృష్ణారెడ్డి గారి రాజేంద్రుడు- గజేంద్రుడు, మాయలోడు, యమలీల ; అన్నమయ్య, పేకాట పాపారావు, పెళ్ళానికి ప్రేమలేఖ- ప్రియురాలికి శుభలేఖ, అమ్మదొంగా, గౌతమ్ s.s.c, వంటి సినిమాల్లో నేను చేసిన పాత్రలు నాకు సంతోషాన్ని ఇచ్చాయి.
అమృతం సీరియల్ అంటే మా అందరికీ చాలా ఇష్టం. మరి దాని గురించిన విశేషాలు చెప్తారా ?
క్రెడిట్ అంతా అమృతం నిర్మాత గుణ్ణం గంగరాజు గారే స్క్రిప్ట్ రాసేవారు. ఆయన ఆలోచనా విధానం, డైలాగ్ కు రాసే పంచ్ వల్ల, ఏడాది అనుకున్న సీరియల్ ఆరేళ్ళు వచ్చింది. మొత్తం 313 ఎపిసోడ్ లు తీసారు. స్క్రిప్ట్ లేక ఇక సీరియల్ ఆపేసారు. తెలుగులో హాస్య సీరియల్స్ ఎందుకు పెరగరు ? ప్రొడ్యూసర్ లు కూడా కొంతమంది నన్ను మంచి హాస్య స్క్రిప్ట్ ల కోసం అడుగుతూ ఉంటారు. వాళ్లకు నేను ఏం చెప్తానంటే – సీరియల్స్ రాయటం అనేది రైటర్ బాధ్యత. మంచి రైటర్ ను వెతకాలి. రాసిన వాటిని వాసిగా తియ్యాలి. “రాసేందుకు ఏదైనా ఉంటేనే తీసేందుకు ఉంది... తీసేందుకు ఏదైనా ఉంటేనే చేసేందుకు ఉంది... చేసేందుకు ఏదైనా ఉంటేనే చూసేందుకు ఉంది... చూసేందుకు ఏదైనా ఉంటేనే చెప్పుకునేందుకు ఉంది...” అంటూ ఉంటాను నేను. నా దృష్టిలో రచయతే గొప్పవాడు.
మీరు టీవీ సీరియల్స్ కు గాను మూడు నంది అవార్డులు గెల్చుకున్నారు కదా. ఆ వివరాలు చెబుతారా ?
అమృతం సీరియల్, ఈ టీవీ లో వచ్చిన ప్రమేషియా అనే ఒక సీరియల్, మిష్టర్ అండ్ మిస్సెస్ సుబ్రహ్మణ్యం సీరియల్స్ కు గాను 3 సార్లు హాస్యనటుడిగా నంది అవార్డులు అందుకున్నాను. సినిమాల పరంగా నాకు అందిన అవార్డులు అన్నీ ప్రైవేటు సంస్థలవే.
మా ‘అచ్చంగా తెలుగు ‘ చదువరుల కోసం సరదాగా మంచి హాస్య డైలాగ్ లు చెబుతారా ?
నేను రెండు మాటల్లో అర్ధాలు మారేలా సరదాగా కొన్ని హాస్య వాక్యాలు రాస్తుంటాను. అవే వినిపిస్తాను... ‘మనిషిని నడిపించేది నవగ్రహాలే కాదు, నవ్వూ- ఆగ్రహాలు కూడా !’ ‘ఏ పుట్టలో ఏ పాముందో... ఏ పొట్టలో ఏం ఫార్మ్ అయ్యిందో ఎవరికి తెలుసు ?’ ‘అతని మాటలు వింటే ఒళ్ళు జలదరిస్తుంది. అతన్ని చూస్తే కళ్ళు జల ధరిస్తాయి !’ ‘ ఈ మధ్య అతనికి గర్వం బాగా పెరిగింది. అతనికి ఎలాగైనా గర్వ స్రావం చెయ్యాలి.’ ‘ సాధారణంగా నటుల మధ్య జెలసి ఉంటుంది... కాని నేను ఆ జెలసి అనే జలాన్ని సీ లో వదిలి పెట్టాను...’ ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావిడి ...’ అనే సామెత ఉంది. దాన్ని నేను కొంచెం మార్చి, ‘ఊళ్ళో పెళ్ళికి కుక్కుల హడావిడి...’ అన్నాను. ఒకసారి భరణి గారికి ఇవి వినిపిస్తూ ఉంటే, ఆయన ‘బాగా రాసావురా...’ అని మెచ్చుకుంటున్నారు. కాని పక్కన కూర్చున్న ఒకాయన, నేను చెప్పేవి నచ్చినా, మౌనంగా ఉన్నారు. అప్పుడు ఆయన మీద కూడా ఒకటి రాసాను... ‘ పంచ్ నచ్చి కూడా నవ్వకపోతే... పంచ్ మహాపాతకాలు చుట్టుకుంటాయి...’ ఇలా సరదాగా ఇప్పటికి ఒక 60, 70 వరకూ రాసుకున్నాను. ఇవే వేదికలపై వినిపిస్తూ ఉంటాను. 100 అయ్యాకా చిన్న పుస్తకంలా ప్రచురించాలని ఒక కోరిక.
నటనాపరంగా మీరు అందుకున్న ఉత్తమ ప్రశంస ?
అమృతం సీరియల్ కి నాకు మంచి పేరు, గుర్తింపు వచ్చింది. అదే నాకు అందిన మంచి ప్రశంస.
నటన కాక మీ ఇతర హాబీ లు ఏవిటి ?
మ్యూజిక్ అంటే బాగా ఇష్టమండి. పాత పాటలు, వినాలి అనిపించే తెలుగు, తమిళ్, హిందీ పాటలు అన్నీ వింటాను.
సినీ రంగలో ఒడిదుడుకులు ఎలా ఉంటాయండి ?
సినీ రంగంలో ఒడిదుడుకులు చాలా ఉంటాయి. ప్రతి ఆర్టిస్ట్ ఇవన్నీ ఎదుర్కోవాల్సిందే, అలవాటు పడాల్సిందే !అందుకే నేను ప్రతి రోజూ ఉదయాన్నే ‘ నేను ఇవాళే హైదరాబాద్ వచ్చాను ,’ అనే అనుకుంటాను.
భావి నటులకు మీరిచ్చే సందేశం...
భావి నటులు ముందే బాగా శిక్షణ పొంది వస్తున్నారు. వారికి నేను ఇచ్చే సందేశం ఏమీ లేదు. చెప్పాల్సిన పనీ లేదు. ఇంత పెద్ద ప్రపంచంలో, ఇన్ని అవకాశాలు చెయ్యగలిగాను అని మనం సంతోషపడాలి. అల్లు రామలింగయ్య గారు, సూరేకాంతం గారిలా కలకాలం వెలిగే ‘గోల్డెన్ ఇరా’ అప్పుడు ఉండేది. గొప్ప పాత్రలు, రచయతలు, దర్శకులు వారికి అందారు. ఇవాళ ప్రూవ్ చేసుకోవడం చాలా కష్టం. అందుకే నేను అందరికీ చెబుతూ ఉంటాను...’ ప్రూవ్ చేసుకుంటే సరిపోదు, ఇంప్రూవ్ చేసుకోవాలి...’ అని. వైవిధ్య భరితమైన పాత్రల్లో అందరినీ మెప్పించే గుండు హనుమంతరావు గారు మరిన్ని గొప్ప పాత్రలు చేసి, తెలుగింట నవ్వుల పూలు పూయించాలని ఆశిస్తున్నాము. భావరాజు పద్మిని తో టెలిఫోన్ లో వారితో జరిపిన సంభాషణ ను క్రింది లింక్ లో వినండి.
No comments:
Post a Comment