పెళ్ళెందుకంటే ... - అచ్చంగా తెలుగు

పెళ్ళెందుకంటే ...

Share This
పెళ్ళెందుకంటే ...
- సూర్య కుకునూర్
  
ఏరా .. వోడ్కా లో స్ప్రైటా ? కోకా ?  టెర్రెస్ లో డ్రింక్స్ ఎరేంజ్ చేస్తూ అడిగాను. స్ప్రైట్  అన్నాడు అన్నయ్య  ఉయ్యాల లో కూర్చుంటూ. చీర్స్ రా .. బీన్ బ్యాగ్ లో కూర్చుంటూ మందు సెటప్ చూసి నాన్న లా మండిపడతావేమో అనుకున్నా .. అన్నాను . ఆ చెప్పారు .. చలిగా ఉంది అంటే బీర్ ఇచ్చావంట కదా నవ్వుతూ అన్నాడు . నేను బళ్ళో కెళ్ళి బొంగరాన్ని బొండాం సుబ్బయ్య బొటన వేలి పై తిప్పిన విషయం తో మొదలు పెట్టి గీత ని చదవరా, తెలుసుకోరా అంటే ఎదురింటి గీత వెనక తిరగటం వరకు కామా లేకుండా బీర్ అయ్యేవరకు నా లైఫ్ లో రివైండ్ రాగాలు వినిపిస్తూనే ఉన్నారు. తరువాత ఏంటి ప్లాన్ ? ఏం  చేద్దామనుకుంటున్నావ్ ? అడిగాడు. మధ్యాహ్నం బిర్యాని వేడి చేసుకుని తిని పడుకోవడం అన్నాను. ఇలా వేడి చేసుకుంటూ ఎన్నాళ్ళు? తోడు వస్తే వేడిగా వండి పెడుతుంది కదా అన్నాడు. ఈరోజు వంట అని జంట కోసం టెంప్ట్ అయ్యి లైఫ్ కి మంట పెట్టుకోవడం నా వల్ల కాదురా .. మంట అని ఎందుకు అనుకుంటున్నావ్ పంట కూడా కావచ్చు కదా.. ఆ పంట కి తెగులు పట్టకుండా ఉండదని గ్యారంటి లేదు గా .. వాడు పెగ్ ఫినిష్ చేసి , ఏ రిలేషన్ లో అయినా ప్రాబ్లెమ్స్ మన ఎమోషన్స్ ని బట్టే వస్తాయి. వోడ్కా ని Raw గా తాగకుండా స్ప్రైటో , కోకో ఎందుకు మిక్స్ చేస్తున్నాం ?అడిగాడు. మే బి టేస్ట్ కోసం .. బీర్ ఫినిష్ చేస్తూ అన్నాను. లైఫ్ లో ప్రేమ పెళ్లి రిలేషన్స్ కూడా అంతే . . ఇంతకి అమ్మాయి ఫోటో చూసావా? అడిగాడు . ఒవెన్ అలారం సౌండ్ చేయటం తో లోపలికెళ్ళి వేడెక్కిన చికెన్ తీసుకొచ్చాను. అమ్మ అయితే అమ్మాయి కుందనాల బొమ్మ లా ఉంది, చిన్నాడికి సరయిన జోడి, ఇంకా అమ్మాయికి వీడు నచ్చాడు కూడాను, వెంకన్నా వాడ్ని ఎలా అయినా ఒప్పించు నడిచి కొండకొస్తాను అంటూ మొక్కేసుకుంది. హ్హుం .. కుందనాలు, చందనాలు..  అనుకుంటూ నవ్వుకున్నాను. నీ గురించి అందరూ నువ్వు నాన్నలా ఉన్నావంటే ఆయనలా ప్రేమ అంటే ఇష్టం లేదు అనుకున్నాం కాని అసలు పెళ్ళే వద్దంటావని అనుకోలేదు. ఎందుకో పెళ్లి అంటే ఇంట్రెస్ట్ రావటం లేదురా అన్నాను. హ్హ హ్హ హ్హ హ్హ్హ్హ  …పెళ్ళంటే ఇంట్రెస్ట్ ఏంటిరా? అని నవ్వేసి అసలు పెళ్ళంటేనే ఇంటరెస్టింగ్ .. అంటూ టీపా పై పెట్టిన గ్లాస్ లో నేను వోడ్కా పోస్తుంటే చాలు అన్నట్లు ఆపి .., ఆ ఏం చెప్తున్నాను.. ఆ… అసలు పెళ్ళంటేనే ఇంటరెస్టింగ్.. చార్మిళ ని మర్చిపోలేక దేవదాసు లా అయిపోయిన నేను ఇంక లైఫ్ లో అమ్మాయే వద్దు అనుకున్నా, ఉద్యోగం వచ్చాక నాన్న కేదో పని ఉంది అంటే ఆయన ప్లేస్ లో పెద అమిరం పెళ్ళికి వెళ్లాను అక్కడ మీ వదిన్ని చూసాను. గోపాలం మావయ్య కొడుకు కుమార్ గాడు తెలుసుగా , వాడు చొరవ చేసి తన వివరాలు తీసుకొచ్చాడు. నాన్న తరువాత జరగాల్సినవి చూసుకుంటూ నా నిర్ణయం అడిగారు. మీ ఇష్టం అన్నాను. అంతే .. కొత్త అధ్యాయం మొదలైంది. చూపులంటూ వాళ్ళింటికి వెళ్ళటం, తన మన అనే పాతిక ముప్పై మంది ఉన్న రెండు కుటుంబాల మధ్య లో కూర్చుని దొంగ చూపులు..కళ్ళతోనే పలకరింపులు..ఖాయం అనుకోగానే కాంటాక్ట్ నంబర్ తీసుకోడానికి రాయబారాలు..కలిసుకోవాలని కబుర్లాడాలని కలవరింపులు..ముహూర్తం దగ్గర పడే కొద్దీ మనసులో ముందుకొచ్చే ఆలోచనలు..ముడి పడిపోయాక లైఫ్ ఎలా ఉంటుందో అనే భయాలు.. వీటన్నింటిని దాటుకుంటూ సమయం వచ్చేస్తుంది..కాశి యాత్రలు..బావ మరిది బుజ్జగింపులు..బుట్టలో అమ్మాయిని తీసుకొచ్చి ఎదురుగా కుర్చోపెట్టినపుడు తెర చాటు నుండి ముసి ముసి గా సిగ్గుపడే ముద్దు గుమ్మ ను చూడటానికి పడే అవస్థలు..నెత్తిన జీలకర్ర బెల్లం పెట్టి నువ్వే నా జట్టు అని కొంటె చూపులతో పెట్టుకునే ఒట్లు..మూడు ముళ్ళు వేస్తూ ఇది కలా నిజమా అనే కలవరం తో తన మెడ మీద వేసిన నా గిల్లుడి ప్రశ్నకి కి నా పాదాల మీద తన గిచ్చుళ్ళు సమాధానాలు..కలకాలం కలిసి ఉండండి అంటూ దంపతులపై ఆత్మీయిలు చల్లే ఆశీస్సుల అక్షింతలు..నా  ప్రపంచం లో కి స్వాగతం అంటూ ఒకరి పై ఒకరు ఆనందంగా పోసుకునే తలంబ్రాలు..అడుగుకో బాస చేసుకుంటూ ఏడు జన్మల తోడు తో హోమం చుట్టూ చేసే ప్రదక్షిణలు..బిందెల్లో ఉంగరాలు .. కంటి జల్లుల మధ్య అప్పగింతలు..పేర్లు చెప్తే గాని ఇంటి లోపలి రానివ్వని మరదళ్ల అల్లర్లు..తొలి పడకలో బంతులాటలు ..సగ పాలు..మురిపాలు..కలిసి చేయబోయే జీవిత ప్రయాణం కోసం ప్లానింగ్ లు..ఒంటరిని జంటగా మార్చిన జన్మ తోడుతో సంసార సాగర శోధన మొదలు..ఆ పై ఒకరినొకరు అర్ధం చేసుకోవడం లో దొర్లే పొరపాట్లు..వాటిని తీర్చుకోవటం లో అగచాట్లు..పిసరంత అపార్దానికి కొండంత బుజ్జగింపులు..పడక గది పదనిసలు..చిలకలు..బుంగ మూతి అలకలు.. వంట గది విరుపులు..ముద్దు చేసే మురిపాలు..దొర్లిపోతున్న సమయానికి మరి మేమో అనుకుంటూ వచ్చే మన సాక్ష్యాలు..   సాక్షాత్తూ ఏడుకొండల వెంకన్న ఆ సుఖమెరుగని బ్రతుకు సున్నం పూయని తాంబూలం లాంటిది అన్నాడంటే ఆలోచించు..ఆ ఆహ్లాదం ఆనందం అనుభవిస్తేనే గాని అక్కరకు రాదు..బ్రతుకు పండాలంటే బంధమనే సున్నం కావాలి. కాని పెళ్ళంటే కాంప్రమైజ్ కదా ? బ్రతకటం లో నెగ్గటం కోసం అవసరమైన చోట తగ్గుతూ లైఫ్ ని నేట్టుకొచ్చేస్తాం కాని అదే ఈక్వేషన్ ని పెళ్లి కి వచ్చేసరికి అప్లై చెయ్యం..ఏం అని అడిగితే నా ప్రపంచం..నా స్వాతంత్ర్యం అంటాం..ఎవ్వరితోను పంచుకోలేని ఆ ప్రపంచం ఎవ్వరు గుర్తించని ఆ స్వాతంత్ర్యం ఎంత అందంగా ఉన్నా విశాలంగా ఉన్నా ఏం ఉపయోగం? నీకు నచ్చినట్లు విశాలమైన ఫ్లాట్ ఉండటం కాదు రా ఆ ఫ్లాట్ లో నీదైన నిండైన కుటుంబం ఉండాలి..అంటూ ఉయ్యాల లో పడుకుండిపోయాడు లెక్కల మాష్టారుMr.దుర్గా ప్రసాద్ మై బిగ్ బ్రదర్ ! వాట్స్ ఆప్ ఆన్ చేసి అమ్మాయి ఫోటో చూసాను..దానిని ప్రేమ అంటారో ఇష్టం అంటారో ఆకర్షణ అంటారో తెలియదు కాని తనతో ఒక కొత్త అధ్యాయం కావాలి అని మాత్రం అనిపించింది. ఆలోచించలేదు..వెంటనే నాన్న పంపించిన ఆ అమ్మాయి నంబర్ కి కాల్ చేసాను..ఆ టైం లో ఏంటి అని కూడా తట్టలేదు..అదే టైం అనిపించింది.. రింగ్ అయ్యింది.. హలో అంది ... హాయ్.. ఎవరు? అడిగింది విల్ యు మ్యారీ మీ ? అడిగాను.. ఆ కార్తీక వెన్నెల్లోనిండు గా ఉన్న చందమామ లో తననే చూస్తూ ..

No comments:

Post a Comment

Pages