స్నేహం
- పోడూరి శ్రీనివాసరావు
రెండక్షరాల మధురమైన పదం - ‘స్నేహం’. రెండు మనసుల ఏకీకృత భావాల ఆనందమైన స్పందన – స్నేహం. ఒకరి భావాలు మరొకరితో ఆత్మీయంగా పంచుకునే అనుభవం – స్నేహం. స్నేహమన్నది – అనేక రూపాలుగా, అనేక భావాలుగా – ప్రస్ఫుటితమౌతున్నా, ప్రధాన ఉద్దేశ్యం – స్వచ్చంగా, ఆత్మీయంగా ఒకరి భావాలు మరొకరితో పంచుకోవడమే. చిన్నతనంలో, స్కూలు విద్యార్ధిగా ఉన్నప్పుడు చిగురించే స్నేహం, ఎంతో స్వచ్చంగా, అరవిరిసిన గులాబీలా, మల్లెలా సుగంధాలు వెదజల్లుతూ పరిమలభారిటంగా ఉంటుంది. స్వచ్చమైన తెల్ల కాగితంలా ఉంటుంది. ఆ వయసు పిల్లలకు అరమరికలు తెలియవు. ఆర్భాటాలు తెలియవు. కుత్సితాలు తెలియవు, మోసాలు తెలియవు. వాళ్లకు తెలిసిందల్లా ఒక్కటే - నిష్కల్మష ప్రేమ. తమ దగ్గరున్న ప్రేమాభిమానాలను స్వార్ధరహితంగా నలుగురికీ పంచిపెట్టండి. అందుకే బాల్యంలో ఏర్పడిన స్నేహం కలకాలం ఉంటుంది. ఆ స్నేహితుడ్ని జీవితాంతం గుర్తుంచుకుంటాం. కాస్త వయసు పెరిగాక, పిల్లల్లో సుమారు 16-18 సంవత్సరాల వయసు వచ్చేసరికి, ‘స్నేహం’ కొత్తపుంతలు త్రొక్కుతుంది. పిల్లల మనస్సులో స్నేహం స్థానంలో ‘ప్రేమ’ అన్నది మొదలవుతుంది. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఆకర్షణ మాత్రమె. పూర్తిగా ప్రేమ అని చెప్పలేం. ప్రేమ అనే మాటకు అర్ధం కూడా తెలియని వయసది. ఫక్తు కేవలం ఆకర్షణ. మంచి ఏదో, చెడు ఏదో తెలియని వయసు. ఈ ప్రపంచం అంటా వర్నభారిటంగా, ఆకర్షణీయంగా, అందంగా కనిపిస్తుంది. ప్రతీ ఆడపిల్లకు, ఎదుటి మగపిలవాడు అందంగా మంచిగా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ప్రతీ ఆడపిల్లకు, ఎదుటి మగపిల్లవాడు అందంగా, మంచిగా, ఆకర్షణీయంగా కనిపిస్తాడు. అదే విధంగా ప్రతీ మగపిల్లవానికి ఎదుటి ఆడపిల్ల రంభాలాగో, ఊర్వసిలాగో కనిపిస్తుంది. తానో రాజకుమారుడి లాగ, ఆ అమ్మాయి రాజకుమార్తె లాగ కనిపిస్తుంది. మనం చిన్నప్పుడు పురాణాల్లో, కథల్లో చదువుకున్నాము. శ్రీ కృష్ణునికి కుచేలుదని బాల్య స్నేహితుడుండే వాడని, ఇద్దరూ సాందీపముని వద్ద విద్యాబుద్ధులు నేర్చుకున్నారానీ, కృష్ణుని కలవడానికి వచ్చినప్పుడు దరిద్రంతో బాధపడుతున్న కుచేలుడు, స్నేహితునికేమీ తెలీక చిరుగుచెంగులో కొద్దిగా అటుకులు తీసికొని వస్తే దాన్ని తృప్తిగా ఆరగించిన ఆ కృష్ణ భగవానుడు, కుచేలుడికి అష్టైశ్వర్యాలు ప్రసాదించాడని చదువుకున్నాము. ఇక్కడ మనకు తెలియ వలసినది. కుచేలుడు ఏం తెచ్చాడు. శ్రీ కృష్ణుడేం ఇచ్చాడు అన్నది కాదు. వారిది బాల్య స్నేహం – కల్లా కపటం తెలియని వయసు, ఒకే గురువు దగ్గర విద్యాభ్యాసం చేసారు. అందుకే, అన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నప్పుడు కూడా బాల్యావస్థలోని విశేషాలు గుర్తుకు తెచ్చుకున్నారు. మనసులు విప్పి మాట్లాడుకున్నారు. తదుపరి దశలోని స్నేహం – కాస్త లోకజ్ఞానంతో ముడివడిన కొద్దిపాటి కల్తీ స్నేహం. ఆకర్షణో, స్నేహమో, ప్రేమో ఏదో తెలియని అపరిపక్వ దాస. ఈదశలోని పిల్లలకు స్నేహానికున్న విలువ సరిగా తెలియదు. వారికి తెలిసినదే, వారు ఆచరిస్తున్నదే – స్నేహం అనుకుంటారు. ఆకర్షణనే స్నేహం అనుకుంటారు. అదే ప్రేమ అనుకుంటారు. నిజానికి స్నేహానికీ ప్రేమకు ఉన్న తేడా ఏమిటో తెలియదు. తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు స్నేహంగా మొదలయిన పరిచయం ప్రేమగా మారుతుంది. అపరిపక్వ దశలో వున్నారు కాబట్టి తాము చేసేదే నిజమనుకుంటారు. తాము ఎదుటి మనిషిని ప్రేమిస్తున్నామంటే ఎదుటి మనిషి కూడా తమని ప్రేమించాలనుకుంటారు. ఆ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా భరించలేరు, తట్టుకోలేరు. అందుకే ఇటువంటి వయసులోనే, ఆత్మహత్యలు, హత్యా ప్రయత్నాలు, ఆసిడ్ దాడులు, మానభంగ ప్రయత్నాలు – ఇలా ఎన్నో అకృత్యాలు, దుశ్చర్యలూ జరుగుతున్నాయి. ప్రేమకున్న విలువ, ప్రాముఖ్యత తెలియకపోవడం – తమ మాట ఎదుటి మనిషి వినలేదనో, తన ప్రేమను అంగీకరించలేదనో – మూర్ఖపు ఆలోచన – తన పంతం గెలవాలనే మొండి పట్టుదల ఆ చిన్నారి చేత ఇలాంటి అఘాయిత్యం చేయిస్తుంది. కల్లాకపటం లేని బాల్య స్నేహంలో ఇటువంటి వాటికి తావు లేదు కదా! వయసుకు చిన్న వారయినా, వాళ్లకు తెలిసిన స్నేహం విలువ, కాస్త ఎదిగిన పిల్లలకు తెలియదేమో అనిపిస్తోంది. మరి కాస్త పెద్ద వాళ్ళయిన వాళ్ళను చూస్తె, సుమారు 30-40 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళ స్నేహ బంధం గురించి ఆలోచిస్తే – ఒక విధంగా స్నేహం గురించి వాళ్లకు ఆలోచించడానికి టైముండదేమో అనిపిస్తుంది. ఆ వయసు వాళ్లకు, ఎంతసేపూ వాళ్ళ ఆఫీసు వ్యవహారాలూ, పని భారం, ఇంటిలో చికాకులు, బాధ్యతలు, భార్యాపిల్లలూ, ముసలి తల్లిదండ్రులూ... ఇలా చెప్పుకుంటూ పొతే ఈ చిక్కుల చట్రాల మధ్య చిక్కుకుపోయి ‘స్నేహం’ అనే మధురమైన పదంకేసే దృష్టి మరల్చరు. అథవా... ఆ విషయంకేసి అపుడపుడూ వీలు చేసుకుని దృష్టి పెడదామని కొందరు ప్రయత్నించినా... అది కాస్తా వ్యాపారమైన, ఆర్ధిక పరమైన స్నేహంగా రూపొందుతుంది. తప్పితే నిష్కల్మష స్నేహంగా, స్నేహపూరిత స్నేహంగా మాత్రం ఎత్తి పరిస్థితుల్లోనూ ఉండదు. కనీసం శని, ఆదివారాల్లోనైనా సెలవుదినాల్లోనైనా కనీస బాధ్యతగా, భార్యాపిల్లలకైనా సమయం కేటాయిద్దామనిగాని, స్నేహితులను నిస్వార్ధంగా కలుసుకుందామనిగానీ, వాళ్ళ కోసం సమయం వెచ్చిద్దామనిగాని ఎంతమందికి ఆలోచన ఉంటుంది, నిజానికి. శలవు రోజు వచ్చింది, లేదా ఆదివారమొచ్చింది, ఇవాళ ఆఫీసు హడావిడి లేదు. మరి కాసేపు ప్రక్క మీదే దొర్లుదాము లేకపోతె ఫలానా ప్రోగ్రాం ఇవాళ టీవీలో ఉంది, మిస్ అవకూడదనో, లేక లేస్తూనే టీవీ కి అతుక్కుపోవడం ప్రధాన విషయంగా చేసుకుంటారు గాని – భార్యా పిల్లలకు టైము కేతాయిద్దామని గానీ, వారితో స్పెండ్ చేద్దామని గానీ, భార్యకు సహాయం చేద్దామని గాని, పిల్లలకు హోం వర్క్ లోనో లేక వాళ్ళ ఏక్టివిటీస్లోనో సహాయం చేయడమో, వాళ్ళతో కబుర్లు చెబుతామనుకుని ఆలోచించే మగమహారాజులు ఎందరున్నారు? ముందు ఇంట్లో స్నేహ వాతావరణాన్ని సృష్టించుకోలేని వారు, బయట వీధిలో, సమాజంలో స్నేహ వాతావరణంలో ఎలా సృష్టించుకోగలరు. నలుగురితో ఆత్మీయంగా, అభిమానంగా, స్నేహంగా ఎలా ఉండగలరు? స్నేహానికున్న విలువగారు ఎలా గుర్తించగలరు? చిన్నప్పుడు ఫారాల్లో, స్కూల్లో చదువుకున్నారు కదా! ‘మానవుడు సంఘజీవి’ అని. మరి అది ఆచరించడానికి ఆలోచనెందుకు? ఆలస్యమెందుకు. మరీ కాస్త పెద్ద వయసు వాళ్ళ విషయానికి వస్తే... వీరికి ఒకరి ఆలంబన, అవసరం, మిత్ర వాక్యం, వాళ్ళ కష్ట సుఖాలూ, మంచి చెడ్డలూ చెప్తే వినేవాల్లూ, వాళ్ళ కష్ట సుఖాల్లో పాలు పంచుకోవడానికి మనుష్యులు కావాలి. అందుకే ఈ పెద్ద వాళ్లకి, 60-70 ఏళ్ళ వాళ్లకు సాయంత్రాలు లైబ్రరీకి వెళ్ళే వాళ్ళు పార్కులకెళ్ళే వాళ్ళూ, ఉదయం పూవులు కోసుకుంటూ మార్నింగ్ వాక్ కి వెళ్ళే వాళ్ళూ, గుంపులుగా కనిపిస్తారు. వీరికీ స్నేహం విలువ తెలుసు. తమతోటి మిత్రులతో చిన్ననాటి అనుభవాలు నెమరేసుకుంటూ ఉంటారు. ఏదో అనారోగ్య సమస్యలతో బాధ పాడేవాళ్ళు తప్పితే, ఈ పెద్దవాళ్ళను చూడండి – సాధారణంగా మిత్రులతో ముచ్చట్లాడుతూ కనిపిస్తూనే ఉంటారు. మొత్తానికి మనకర్థమయినదేమిటంటే అటు బాల్యావస్థలోనూ, ముసలి వయసు వాళ్ళూ మాత్రమే స్నేహామృతాన్ని గ్రోలుతున్నారు తప్పితే మధ్య వయసువారికి దీని మాధుర్యం తెలియడం లేదేమో అనిపిస్తోంది. మనిషి జీవితంలో సుహృద్భావంతో, అటెంషన్లు, చికాకులు ఏమీ లేకుండా ఉండాలంటే, మనసు ప్రశాంతంగా ఉండాలంటే – మన భావాలు పంచుకోవడానికి మన అభిప్రాయాలు వినడానికి ఒక మనిషి ఉండాలి... ఒక శ్రోత ఉండాలి... ఒక స్నేహితుడుందాలి. ఆత్రేయగారన్నారు కదా! ‘మనసున మనసై... తోడొకరుండిన అదే భాగ్యమూ... అదే స్వర్గమూ..’ అని! ఆ భాగ్యవంతులం... మనమందరమూ... ఎందుకు.. కాకూడదు?
No comments:
Post a Comment