శ్రీధరమాధురి – 9 - అచ్చంగా తెలుగు

శ్రీధరమాధురి – 9

Share This
శ్రీధరమాధురి – 9
(ప్రేమ గురించి, ప్రేమించుకునే వారి గురించి, పూజ్య గురుదేవులు శ్రీ వి.వి.శ్రీధర్ గురూజి అమృత వాక్కులు )

  • దైవానికి మీరంటే ఎంతో ప్రేమ. ఆయనకు మీపట్ల అపరిమితమైన, బెషరతైన ప్రేమ ఉంది. ఆయన మీతో ఆడతారు, మిమ్మల్ని ముద్దడతారు, కౌగిలించుకుంటారు, ఆ పారవశ్యంలో మిమ్మల్ని అల్లరిపెడతారు. మీ కాలు లాగుతారు, మీ చుట్టూ హాస్యోక్తులు వేస్తారు. ఆయన మర్యాదలకు అతీతులు. మీ ప్రార్ధనల సమయంలో ఆయనకు మీరిచ్చే గౌరవాన్ని ఆయన మన్నిస్తారు. కాని ఆయన ఎటువంటి మర్యాదలూ ఇష్టపడరు. అటువంటి వాటితో ఆయన మీనుంచి తనను దూరం చేసుకోరు. కృష్ణ భగవానుడు గోపగోపికలతో ఎలా ఉన్నారో మీకు గుర్తుందా ? ఆయన వారితో నాట్యమాడారు, జంతువులు, పక్షులు, చెట్ల కోసం వేణువూదారు. ప్రకృతిలోని ప్రతి ఒక్క అంశం దైవం యొక్క గానాన్ని వినేందుకు చెవులు రిక్కించుకుని, సిద్ధంగా  ఉండేది. ఆయన వారిలో ఒకరిగా కలిసిపోయారు. ఆయన తన సృష్టిలోని ప్రతిఒక్క అంశంతో ఆడారు. సృష్టి మొత్తం సృష్టికర్త చేతనే సృష్టించబడినా, సృష్టికర్త తన సృష్టిని రంజింపచేసారు. ఆయన అన్నింటితో ఉత్సాహంగా గడిపి, మనకు ఉల్లాసం కలుగజేసారు. దైవంతో ఆడుతూ, పాడుతూ ఆనందంగా నాట్యం చెయ్యండి. అదే... సత్... చిత్ ... ఆనందం... అంతా దైవానుగ్రహం.
  • నిజంగా ప్రేమలో ఉన్నవారికి స్వేచ్చ యొక్క విలువ తెలుసు. బెషరతైన ప్రేమ పేరుతో బానిసలు కాకండి. ప్రేమ అంటే బానిసత్వం కాదు. ప్రేమ భారమైనది కాదు. ప్రేమ ఒక గేయం. ప్రేమంటే, హృదయం యొక్క స్వచ్చమైన పరిమళాన్ని అనుభూతి చెందడం. ప్రేమంటే గులాముగా మారడం కాదు. ప్రేమలో మీరు ఎదగాలి, పడిపోకూడదు. ప్రేమలో మీరొక చక్రవర్తి... బిచ్చగాడు కాదు. ప్రేమ స్వచ్చమైనది, దైవికమైనది. దానికి ఎల్లలు లేవు. అటువంటి ప్రేమ దైవంతో సాధ్యం. ఒకవేళ ప్రకృతి లోని ఏ ఇతర వస్తువు పట్లనైనా మీకు అటువంటి ప్రేమ ఉన్నట్లయితే, అది దైవత్వమే !
  • ఈరోజుల్లో యువతీయువకులకు ‘ప్రేమ’ యొక్క విలువ, లోతు తెలియవు. వారు ఊరికే యాంత్రికంగా ‘లవ్ యు, లవ్ యు, లవ్ యు’... అంటూ పదేపదే అంటూ ఉంటారు. లేక ప్రేమకు సంబంధించిన కొన్ని గుర్తులు పంపుతారు. ఇవన్నీ ప్రేమ అయిపోవు, కాని ఇలా పదేపదే జపిస్తూ ఉండడం వల్ల, చెప్పేవారి మనసుకు శాంతి కలుగుతుంది, అందువల్ల చెప్పేవారి మెదడు దాన్ని ప్రేమ అని నమ్ముతుంది. ఇదే మైండ్ గేమ్స్ వల్ల వచ్చే నష్టం! వాస్తవం తెలిసిన తరువాత ఇది డిప్రెషన్ కు దారి తీస్తుంది. అందుకే, అప్రమత్తంగా ఉండండి...
  • ఎందువల్లో, ఇప్పటివరకూ నేను గమనించిన యువతలో చాలామంది ‘ప్రేమ’ అనేదాన్ని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తారు. ఈ ప్రక్రియలో వారు అత్యంత ఒత్తిడికి గురౌతారు. ఉద్విగ్నతకు లోనౌతారు. కొన్నిసార్లు నిరాశగా కనిపిస్తారు. మరింత దగ్గరాగా పరిశీలించగా, నేను గమనించింది ఏమిటంటే... అటువంటి వారు బైటికి దాన్ని “ప్రేమ” గా ముద్రించుకున్నా లోలోన తాము ప్రేమించినవారిని  “స్వాధీనంలో” ఉంచుకోవాలన్న ఆలోచన వల్ల కలత పడుతుంటారు. ఒక ఇంటినో, కార్ నొ, డబ్బునో కలిగి ఉండడం సాధ్యమే, కాని ఒక వ్యక్తి మీకే సొంతం కావాలనుకుంటే అది సాధ్యం కాదు. సాధ్యమైతే,  దైవం యొక్క దయవల్ల, ఆ వ్యక్తిని మీరు బేషరతుగా ప్రేమించగలరు. ప్రేమలో షరతులు విధించడం స్వార్ధానికి దారి తీస్తుంది. ప్రేమ అనేది స్వేచ్చ, బానిసత్వం కాదు. స్వార్ధమనే పదం తన సోదరి అయిన అసూయ తో పాటుగా కలిసి వస్తుంది...
  • ఒక అమ్మాయి, అబ్బాయి గత 6 సం. గా ప్రేమలో ఉన్నారు. కాని ఆ అమ్మాయి ‘అహానికి’ అత్యంత ప్రాధాన్యతను ఇస్తుంది. వారిద్దరూ హోటల్ కు వెళ్తారు. చాట్, పావ్ భాజీ వంటివి తింటారు. అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది, వారు అంగీకరించారు. కాని, అబ్బాయి తల్లిదండ్రులకు ఇంకా విషయం తెలియదనుకుంటా. అమ్మాయి అబ్బాయిని, తన తల్లిదండ్రులను పెళ్ళికి ఒప్పించమని కోరింది. అబ్బాయి, తన ఇంట్లోని ఆర్ధిక ఇబ్బందుల వల్ల వెంటనే చెప్పి, నిర్ణయం తీసుకోవడం కష్టమని అన్నాడు. చాలా విచిత్రమైన పిల్లలు. ఇది ఇంకా కొనసాగుతుందని మీరు భావిస్తున్నారా ? 
  • అహం మరియు ప్రేమ ఒకేచోట ఉండలేవు...
అహం అనేది దురహంకారం గల బుద్ధి(మెదడు) యొక్క భాష ... ప్రేమ అనేది నిష్కల్మషమైన హృదయం యొక్క భాష...
  • ప్రేమకు, అనుబంధానికి మధ్య వ్యత్యాసం ఉందని తెలుసుకోండి. మీరు ఎవరైనా దగ్గర లేని లోటును అనుభూతి చెందుతుంటే, అది కేవలం అనుబంధం మాత్రమే ! స్వచ్చమైన బెషరతైన దైవీకమైన ప్రేమలో మీరు వారిని మిస్ కారు, ఎందుకంటే... ఆ ప్రేమ వారి సమక్షాన్ని అనుభూతి చెందేలా చేస్తుంది. ఒకవేళ మీ ప్రేమ ఈ అద్భుతాన్ని చెయ్యకపోతే, అది ప్రేమ కాదు... కేవలం ఒక అనుబంధం మాత్రమే ! 
  • అనుబంధం అనే క్రింది స్థాయి నుంచీ బేషరతైన ప్రేమ అనే పైస్థాయికి ఎదగండి... 
  • కారణాలు వెతక్కుండా ప్రేమించడం నేర్చుకోండి. మీరు చాలా ఆనందంగా ఉంటారు. ఒకరి అందం చూసి ప్రేమించకండి. మేధస్సు చూసి ప్రేమించకండి. ఐశ్వర్యం చూసి ప్రేమించకండి. కారణాలు వెతుక్కుని ప్రేమిస్తే అది మీకు విషాదాన్నే మిగులుస్తుంది. ఒక రోజున మీ తర్కము/కారణాలు అన్నీ చెయ్యి జారిపోతాయి. తర్కం అనేది కేవలం ఒకరకమైన  ముసుగు. మీరు వాస్తవాన్ని అనుభూతి చెందాలంటే దాన్ని తీసెయ్యండి. ప్రేమ అనేది కారణాలకు అందని గొప్ప సత్యం. నిజం మిమ్మల్ని తేరిపారా చూసినప్పుడు,  మీ తర్కం అంతా అబద్ధమని మీరు తెలుసుకుంటారు.
    • బేషరతైన ప్రేమను అందించేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. ఒకవేళ మీకు అటువంటి వ్యక్తి కనిపిస్తే, ఆమెను/అతన్ని నా వద్దకు తీసుకురండి. నేను వారి కాళ్ళు కడిగి, వినమ్రంగా నమస్కరిస్తాను. ఎందుకంటే అటువంటి వారు నా గురువులు...
     
  • మీరు నిజంగా ప్రేమలో ఉంటే... కేవలం ఇస్తూ ఉండండి. బదులుగా ఏమీ ఆశించకండి. మీరు అత్యంత స్వార్ధాన్ని కలిగి ఉంటే, కేవలం తీసుకుంటారు, కానీ ఇవ్వరు. మీరు అందించే ‘ప్రేమ’ అనబడే దానికి బదులుగా షరతులు విధిస్తారు. స్వార్ధం అనేది దుఃఖ కారకం, అది ఎవరూ అనుభవించకూడదు.

No comments:

Post a Comment

Pages