ట్యూబ్ లైట్ - అచ్చంగా తెలుగు
ట్యూబ్ లైట్
- పెయ్యేటి శ్రీదేవి

సుజాతకి కొత్త ఇల్లు బాగా నచ్చేసింది.  అద్దె కొంచెం ఎక్కువే.  ఐతే ఏం?  అన్ని వసతులూ వున్నాయి.  ఎవరితోనూ ఏ గొడవా వుండదు.  ఇండిపెండెంట్ హౌస్.  కిచెన్ కూడా చాలా విశాలంగా వుంది.  పెద్ద హాలు, మూడు బెడ్ రూమ్స్, ఇంకా ఇదిగాక చిన్న సెపరేట్ రీడింగ్ రూమ్, డైనింగ్ రూమ్, సిటౌట్, కారు పార్కింగ్, కొత్తగా కట్టిన ఇల్లు.  పిల్లల చదువులకి ఇబ్బంది వుండదు.  ఎంతమంది చుట్టాలొచ్చినా బ్రహ్మాండంగా సరిపోతుంది.  ఇల్లు గలవాళ్ళు కొత్తగా ఈ ఇల్లు కట్టుకున్నాక అనుకోకుండా కొడుకు దగ్గరకి అమెరికా వెళ్ళిపోవలసి వచ్చింది  అందుకని ఎన్నాళ్ళైనా హాయిగా వుండచ్చు.  ముఖ్యంగా వాటర్ ప్రాబ్లెం లేదు.  ఇరుగు పొరుగుల బాధ లేదు.  అంతకు ముందరి ఇళ్ళలో వున్నప్పుడు నీళ్ళు సరిగ్గా రాక, ఇరుగు పొరుగు వాళ్ళు సరిగ్గా పట్టుకోనివ్వక, ఉత్తినే వాళ్ళు పెట్ఘ్టే గొడవలతో ఎన్నో కష్టాలు అనుభవించ వలసి వచ్చింది.  ఆ ఇళ్ళల్లో పడ్డ కష్టాలన్నీ క్షణకాలం గుర్తుకు తెచ్చుకుని, ఆ ఆలోచనల్ని తుడిచేసి, ఆనందంతో ఇల్లంతా కలయ దిరుగుతూ హాల్లోకొచ్చింది సుజాత.' ఏమండీ, ఇల్లు చాలా బాగుంది కదూ?' అని భర్తతో అంటూ చీకటి పడుతూండడంతో హాల్లో ట్యూబ్ లైట్ వేద్దామని స్విచ్ బోర్దు మీద స్విచ్ లన్నీ నొక్కడం మొదలుపెట్టింది.ఒక స్విచ్చికి బైటి లైటు వెలిగింది.  ఇంకో స్విచ్చాన్ చేసింది.  సిటవుట్ లో లైట్ వెలిగింది.  ఇంకో స్విచ్ కి ఫేను తిరగడం మొదలు పెట్టింది.  మరో స్విచ్చాన్ చేస్తే ఏదీ వెలగలేదు.  ఇంకో స్విచ్ కి ట్యూబ్ లైట్ వెలిగి మళ్ళీ ఆరిపోయింది.  మరో స్విచ్ కి ఇంటిచుట్టూ వున్న బల్బులు వెలిగాయి.  మరో స్విచ్చాన్ చేసింది.  దేనిదో తెలీలేదు.  ఇంతకీ ఇందాక వెలిగి ఆరిపోయిన ట్యూబ్ లైట్ స్విచ్ ఏదో తెలీలేదు సుజాతకి.  ఇది కాదు పనని, ఇంతదాకా వేసిన స్విచ్ లన్నీ ఆర్పేసింది.  మళ్ళీ అన్నీ వేసింది.  మళ్ళీ అన్నీ ఆర్పింది.  మళ్ళీ అన్నీ వేసింది.  ఏ స్విచ్ కో ట్యూబ్ లైట్ వెలిగి ఆరిపోయింది.  ఈలోగా కరెంట్ పోయింది.  మళ్ళీ ఐదు నిముషాలకే కరెంటు వచ్చింది.  అన్ని లైట్లూ వెలిగాయి కాని, ట్యూబ్ లైటు వెలగలేదు. ఇక ఒక నిర్ధారణకి వచ్చేసి, ' ఏమండీ, ట్యూబ్ లైట్ స్విచ్ పని చేయటల్లేదు.  ఒకసారి ఎలక్ట్రీషియన్ ని పిలిపించండి ' అంటూ భర్త వీరేంద్రతో కంగారుగా అంది సుజాత. ' వచ్చి గంటన్నా కాలేదు, అప్పుడే కంప్లైంట్స్ కవుంటర్ తెరిచావా?  అసలే ట్యూబ్ లైట్ కదా?  వెలుగుతుందిలే, కాస్త ఓపిక పట్టు.  కొత్త ఇల్లు కనక ట్యూబ్ లైట్ స్విచ్ కనుక్కోవడానికి  కొంత టైం పడుతుందోయ్.  ఈలోగా స్విచ్ లన్నీ వేసి, తీసి, టైప్ చేస్తూండు.  ఏ స్విచ్ దేనికో తెలుస్తుంది.  ముందు కరెంట్ రానీ, టైప్ చేద్దూగాని.  ఈ సామాన్లన్నీ ముందర సర్దనీ.  తర్వాత నీ రచనా వ్యాసంగాన్ని ప్రారంభించ వచ్చు.  అప్పటికి కరెంట్ వచ్చి ట్యూబ్ లైట్ కూడా వెలుగుతుందిలే.  అవు సుజీ!  ఈ రోజు ఏదో కొత్త కథ ప్లాన్ చేస్తానన్నావు కదా?  ఏమా కథ?  అన్నట్టు మన శాస్త్రజ్ఞులు చెయ్యబోతున్న కొత్త రాకెట్ ప్రయోగం ఈ రోజే కదా?  టి.వి.లో అర్థరాత్రి పన్నెండు గంటలకి ప్రత్యక్ష ప్రసారం కూడా వుంది.  కేబుల్ కి డబ్బు కట్టి వస్తా.  వెంటనే కనెక్షనిచ్చేస్తాడు.  వంటేం చేయక్కర్లేదులే.  హోటల్లో భోంచేద్దాం.'
******************************
           ఘోర-8 నౌకని శాస్త్రజ్ఞులు అహర్నిశలు కష్టపడి తయారు చేసారు.  అంతరిక్షంలోకి పంపడానికి రంగం సిధ్ధం చేస్తున్నారు.  అన్నీ సరిగ్గా వున్నాయో, లేవో శాస్త్రజ్ఞులందదరూ జాగ్రత్తగా పరిశీలించి చూసారు.  ఇది కనక విజయవంతమైతే ప్రపంచ దేశాలన్నిటి లోకి భారతదేశానికి మంచిపేరు వస్తుంది.  ఇది చాలా శక్తివంతమైనది.  దాని ఉపయోగాలు ప్రపంచ దేశాల వారందరికీ టెలివిజన్ల ద్వారా తెలియజేస్తున్నారు.  ఇంతవరకు అంత గొప్ప నౌకని ఎవరూ తయారు చేయలేదు.
          అంతరిక్షంలోకి రాకెట్ ప్రయోగించే రోజున అర్థరాత్రి పన్నెండు గంటలకు ప్రత్యక్ష ప్రసారం వీక్షించడానికి అందరూ ఎంతో ఆసక్తిగా టెలివిజన్ల ముందర కూచున్నారు.  అంతరిక్షంలోకి వెళ్ళే ముగ్గురు శాస్త్రజ్ఞులు వారానికి సరిపడ మంచినీళ్ళు, ఆహార పదార్థాలు కూడా తీసికెడుతున్నారు.  బంధువులు, స్నేహితులు, శాస్త్రజ్ఞులు అందరూ వాళ్లకి బొకేలు ఇచ్చి, మెడలో దండలు వేసి, నుదుట కుంకుమ దిద్ది వీడ్కోలు చెబుతున్నారు.  అందరూ వారికి శుభాకాంక్షలు తెలియజేసారు.  ఆఖరిసారిగా ఆ శాస్త్రజ్ఞులు ముగ్గురూ అందరికీ చేతులూపి దర్పంగా అంతరిక్షనౌక ఘోర-8 లోకి ప్రవేశించారు.  తలుపులు మూత పడ్డాయి.టి.వి. ఛానెళ్ళలో అన్నీ కనబడుతున్నాయి.  అన్ని దేశాలవారు, దేశ విదేశాల పెద్ద శాస్త్రజ్ఞులు ఘోర-8 ని టి.వి.లో దీక్షగా చూస్తున్నారు.  ఇది గనక విజయవంతమైతే భూలోకం, స్వర్గలోకం, నరకలోకం, నక్షత్రమండలం, నక్షత్రమండలంలో పెళ్ళిళ్ళలో వధూవరుల చేత కనిపించక పోయినా, కనిపించిందని చెప్పించి, పురోహితుడు చూపించే అరుంధతీ నక్షత్రంతో సహా నవగ్రహాలు, సూర్యచంద్రులు, నక్షత్రాలు - వాటి విధి నిర్వహణా విశేషాలు ఎప్పుడు ఎలా వుంటాయో, భూకంపాలు ఎప్పుడు వస్తాయో, వర్షాలు ఎప్పుడెప్పుడు, ఎక్కడ ఎలా పడతాయో, సునామీలు కూడా ఎప్పుడొస్తాయో - ఇలా అన్ని వివరాలూ చూడచ్చు.  ఇంకో విచిత్రం ఏమిటంటే మన అటేడు తరాల పూర్వీకులు, పితృదేవతలు కూడా కనిపిస్తారు!  వారి ఆత్మలతో మాట్లాడవచ్చు.  అందుకే అంతటి మహాద్భుత శక్తివంతమైన ఈ ఘోర-8 క్షిపణిని చూడటానికి ప్రపంచం యావత్తు ఉత్కంఠతో ఎదురు చూస్తోంది.ఘోర-8 అంతరిక్షనౌక మీట నొక్కారు.  పెద్ద శబ్దం చేసుకుంటూ, పొగలు చిమ్ముతూ వాయువేగంతో పైకి దూసుకు పోయింది. ఇంకాసేపట్లో సూర్య చంద్ర నక్షత్ర మండలాలు, స్వర్గ నరకాలు, తమ పితృదేవతలను చూడవచ్చని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  అంతే కాదు, చంద్రమండలంలో స్థలాలు కూడా కొంటున్నారని ఆ మధ్య వార్తలొచ్చాయి.  ఈ వెళ్ళిన వాళ్ళు చూసి చెబుతే, దాన్ని బట్టి ముందరే స్థలాలు కొని ముందు తరాల వారికి ఇళ్ళు కట్టించచవచ్చు.  అసలే భూమి మీద చీమ కూడా దూరే సందులేని ఈ భాగ్యనగరంలో అపార్ట్ మెంట్లు కట్టేస్తున్నారు.  రాకెట్ లో ఆ ముగ్గురూ ప్రయాణిస్తూ అద్దంలోంచి దీక్షగా కిందకి చూస్తున్నారు.  ప్రతి విషయం ఎప్పటికప్పుడు సంకేతాల ద్వారా అందజేస్తున్నారు.  తరవాతేం జరగబోతోందో అని అందరూ టి.వి.ల ద్వారా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.  ఇంతలో వాళ్లలో ఒకడు ఒక మీట నొక్కాడు.  అంతే, ఒక్కసారిగా చీకటి అలుముకుంది.  ఉరుములు, మెరుపులు, పిడుగులు పడ్డ శబ్దాలు!  భయంకర వాతావరణం నెలకొంది.  ఏం జరగబోతోందో టి.వి. చూద్దామంటే అసలు కరెంటే లేదు! అందరిలో నిరాశ, నిస్పృహ, మంచి దృశ్యాలని చూడలేక పోయామనే బాధ!  పాడు కరెంటు, ఇప్పుడే పోవాలా? ఇండియాలో కరెంటు పోయినందువల్ల అంతరిక్షంలో పరిస్థితి ఏమై వుంటుందా అని పెద్ద పెద్ద శాస్త్రజ్ఞులు తలలు పట్టుకుని తీవ్రంగా ఆలోచించేస్తున్నారు.
************************
అంతరిక్షనౌక ఘోర-8 చుట్టూ రౌండ్లు కొట్టుకుంటూ ఉదయాన్నే ఒకచోట ఢామ్మని పెద్ద శబ్దంతో పడింది.  ఆ నౌకలోంచి ఇద్దరు బైటికి చూసారు.' ఒరే బోసూ!  తెల్లవారిందిరా.  తొందరగా లే.'' ఏమిటీ, అప్పుడే తెల్లారిందా చక్రీ?  ఇప్పుడు మనం ఏ లోకంలో వున్నాం?  చంద్రమండలం లోనా, ఇంద్రలోకం లోనా?  ఆ వెళ్ళే వాళ్లందరూ రంభ, ఊర్వశి, మేనకలా?  అచ్చం మన భూలోకవాసుల్లాగే వున్నారే?' అన్నాడు చక్రధర్. ' అబ్బ, ఇక్కడ కూడా ఎంత జనమో!  ఇక్కడా మనూళ్ళో లాగే పచ్చటి వరిచేలు తివాచీ పరిచినట్లు లేదూ?  బహుశ ఇది చంద్రమండలం అయి వుండవచ్చు.  చంద్రమండలంలో మన భూలోక వాసులు స్థలాలు కొని ఇళ్ళు నిర్మిస్తున్నారుగా?  అంటే మెల్ల మెల్లగా ఇక్కడ కూడా డెవలప్ అవుతోందన్న మాట!  ఐతే మనం కూడా వెళ్తూ స్థలాలు కొనుక్కునే వెళదాం.  తరవాత ఇక్కడా రేట్లు పెరిగిపోతాయి.  ఇల్లు ఎప్పుడో తరవాత కట్టుకోవచ్చు.' అన్నాడు ఫెర్నాండెజ్. అంతరిక్ష క్షిపణి శబ్దం విని కంగారుగా అందరూ అక్కడికి చేరుకున్నారు. ' ఏం బాబూ, ఏమన్నా దెబ్బలు తగిల్నయ్యా?' ' నో....నో.... మాకు దెబ్బలేంటీ, మేం అంతరిక్షంలో వుంటేనూ?  ఇంతకీ మీరెవరూ?' చేతికి దెబ్బ తగిలినా చెయ్యి వెనక్కి దాచుకుంటూ అన్నాడు చక్రధర్. ' మేం ఈ పొలాల్లో పన్లు చేసుకునేటోళ్ళం బాబూ!  కూలి, నాలి చేసుకుని బతుకుతుండాం.  ఇంతకీ ఇదేటి బాబూ, ఇందులో వచ్చారు?  ఎలికాప్టరా?  అందుకే కూలిపోయుంటాది.  రైళ్ళు, బస్సులు వస్తాయిగా?  సుబ్బరంగా అందట్లో రావచ్చుగా బాబూ?  ఒకవేళ రైళ్ళు, బస్సులు గుద్దుకుని ఏక్సిెెడెంట్లు అవుతుండయ్యని ఇందులో వచ్చినారా?' అంటోంది ఒక మామ్మ సానుభూతిగా. ' ఏమిటి మీరంటున్నది?  అంతరిక్షంలో కూడా బస్సులు, రైళ్ళు తిరుగుతున్నాయా?  అప్పుడే అవెవరు కనిపెట్టారు?  ఏ దేశం వారు వేసారు?' అడిగాడు బోసు. ' అంతరిచ్చమేటి బాబూ?  ఈ ఊరి పేరు ఈరాసరం.  మేం కూలిపన్లు చేసుకోడానికెడుతూ పొలంలో ఏదో పెద్ద చప్పుడినిపిచ్చి, ఏదో పడిందని చూసి బయంతో ఇటొచ్చినాం.' అన్నారక్కడి కూలిజనం. ' ఏమిటీ, ఇది వీరవాసరమా?  ఐతే మీరు ఇంద్రులవారి దగ్గర వుండే రంభ, ఊర్వశి, మేనకలు కారా?' ' ఆ...అవును.  మీరన్నది కరకట్టే.  మా నాన్న పేరు ఇందరబాబు.  నా పేరు రంభే బాబూ.  సినేమా యాకటేరు రంబలాగ వుంటానని ఊళ్ళో అందరూ నన్ను రంబా, రంబా అని పిలుత్తా వుంటే, సుక్కమ్మ పేరు మార్చి, మా అమ్మ నాకు ఆ హీరోయిను పేరు పెట్టినాది.  మా అక్క పేరు మేనక్క.  అది ఇంటికాడుండాది.  ఊరోసికి ఇయాల జొరమొచ్చినాది.  అందికే పని కాడికి రానేదు.  ఐతే మా పేర్లన్నీ సెబుతుండారు, మేం మీకు ఎట్టా తెలుసు బాబూ?' ' బోసూ!  ఏమిటిదందా?  ఐతే మన ఘోర-8 ఫెయిలయిందా?  ఇది నిజంగా వీరవాసరమా?  అంతరిక్షమైతే భూమ్యాకర్షణ శక్తి లేక మనం గాల్లో తేలుతూ వుండాలిగా?  ఇలా కింద పడున్నామేమిటి?' అడిగాడు ఫెర్నాండెజ్. ' లెగండి బాబూ!  సానా గోర పెమాదం నుండి బైట పడ్డారు.  బతికుంటే బలుసాకు తినచ్చు.  ఇట్టాటి సేతకాని పన్లు సెయ్య బోకండి.  అంత పెద్ద మిసన్లో పొరబాట్న ఒక మీట నొక్కబోయి ఇంకో మీట నొక్కినా, తెలీక అదమరసి ఏ మీట నొక్కక పోయినా గోరం జరిగిపోతది.  ఇంతకీ తమరిదే వూరు బాబూ, సెందరమండలమా?' ' కాదు, ఢిల్లీ!' ' అమ్మో, డిల్లీయా?  ఏమే మాలచ్చిమీ, ఈరమ్మా, మావుళ్ళమ్మా, రత్తమ్మా!  రండే.  మనూరికి ఢిల్లీబాబులొచ్చినారు!  డిల్లీ అంటే ఏటనుకుంటున్నారు?   ఈ దేశాన్ని పాలించే పెదానమంత్రి గారు వుండే పెద్ద ఊరన్న మాట!  ఇదుగో మాలచ్చిమీ!  ఈల్లనింటికాడికి తీసికెల్లి ముందర కాసింత పెలారాలు పెట్టు.  పాపం, ఎప్పుడనగా తిన్నారో ఏటో!' అన్నాడు ఒక ముసలయ్య. ' బాబూ!  తవరు డిల్లీ ఎల్లినాక పెదానమంతిరిగారితో సెప్పండి.  ఈ ఏడు పంటలస్సలు బాగా పండనేదు.  చేతికొచ్చిన కాస్త పంటా వర్షాలకి కొట్టుకు పోనాది.  మల్లా అప్పుచేసి పత్తి పంటేసినాం.  అదీ పండక బాగా నష్టపోయినాం.  చేసినప్పు తీరనేదు.  ఆ బాద బరించనేక మా తమ్ముడు పురుగుమందు తాగి సచ్చిపోనాడు.  ఏటో పిచ్చి గాని, సెందరమండలాలు, సూరయ్య మండలాలు, అయ్యేటో ఉల్కలు, ఇంకా ఏటో పెయోగాలు సేత్తే మా కడుపులు నిండతయ్యా బాబూ?  మా బతుకులు బాగు పడతయ్యా?' అంటూ ఒక ముసలమ్మ తన ఆవేదన వెళ్ళగక్కింది. ' పేదోల్లకి ఇల్లు కట్టిత్తామంటరు.  పదేళ్ళలో పేదరికాన్ని రూపు మాపుతామని మా అమ్మమ్మ కాడ్నించి అంటా వుండారు.  కాని అప్పట్నించి మేమిట్టాగే వుండాం.  ఇప్పుడు కొత్త పెదానమంతిరి గారు వచ్చారంటగా?  మంతురులందరూ అదేదో సొచ్చ బారత్తు సేత్తారంట కదా?  ఆ పనేదో ఇక్కడే సెయ్యమనండి బాబూ!  రోడ్డు మీద ఎక్కడ సెత్త అక్కడే వుంటోంది.  రోడ్డూడ్చే మునిసిపాలిటీ వోల్లు రాడమే మానేసారు.  దసరా పండక్కి వచ్చి, కాస్త ఊడిసినట్టు నాటకమాడి, దసరా మామూల్లడుక్కు పోతారు.  సొచ్చ బారత్ లో అందరూ ఒకే సోట ఊడవమాకండని సెప్పండి.  రోడ్డు మీద గతుకులుండయ్యి.  రోడ్లేయించమని సెప్పండి.  దరలు బాగా పెంచేసినారయ్యా.  కొంచెం తగ్గించమని సెప్పండయ్యా.  ఇంకా ఏటే రంబా, మంతురులొస్తే నువ్వేదో సెప్పాల, సెప్పాల, నిలేసి అడిగేయాల, కడిగేయాల అని అంటా వుంటావు గదటే?  సెప్పు.  అట్టా బెదిరిపోతావేమే?' ' ఆడోల్లకి బొత్తిగా రచ్చన నేకోకుండగా వుంది.  బయట తిరగాలంటే బయపడతా వున్నారయ్యా.  అల్లప్పుడెప్పుడో సోనియమ్మ వున్నప్పుడు, డిల్లీలో ఒక అమ్మాయి మీద అగాయిత్తెం సేసినారు కదయ్యా?  హోలు దేశమంతా ఆ దుర్మార్గులని కటినంగా సిచ్చించాలని గొడవలు సేసినా, ఎంటనే సోనియమ్మ ఏటీ సెయ్యనేక పోయింది.  ఆమెని అందుకే ఓడించేసారు అందరూ.  కొత్త పెబుత్వం వోల్లొచ్చినా ఇంకా రేపులూ, మాపులూ జరుగుతానే వుండయ్యి.  కటినంగా సిచ్చించక పోడంతో ఇంకా ఇంకా సానామంది దొమ్మరి సచ్చినోల్లు నేర్చుకుంటున్నారు.  పోలీసోల్లంటే బొత్తిగా బయమే నేదు.  మంత్రులు అది సేత్తాం, ఇది సేత్తాం అంటరు.  కాని ఏటీ సెయ్యరయ్యా.  ఆడోల్లనేడిపిత్తే కబడ్దార్ అన్నాడో ముక్యమంత్రి గారు.  కాని, ఇంకా ఇంకా ఆడోల్లమీద అగాయిత్తేలు జరుగుతానే వుండయ్యి.  మా ఇల్లల్లో బడికి పోవాలంటే బయంగా వుందయ్యా.  ఇలా సెప్పాలంటే సాలా వున్నాయి సెప్పడానికి.  సిన్న పిల్లల్ని ఇంగలీసు బాగా వత్తాదని, బోలెడు డబ్బులు పోసి ఎక్కడో పెద్ద కాన్మెంటులో చేరిపిస్తే, పాపం ఇస్కూలు బస్సు రైలు పట్టాల దగ్గర ఏక్సిడెంటయి సానామంది పిల్లలు సచ్చిపోనారయ్యా. ఆల్లందరూ నాతో ఆడుకునే వోళ్ళు.' ఇంతలో వాళ్ళు ముగ్గురూ టిఫిన్లు చేస్తుండగా, భీమవరంలో చదువుతున్న వెంకటపతిరాజు వీళ్ళ హెల్మెట్లు, నల్ల కళ్ళద్దాలు చూసి గుర్తు పట్టాడు. ఏరా ట్యూబ్ లైట్లూ!  ఏవో అంతరిక్ష ప్రయోగలు చేస్తామని చెప్పి, ఇక్కడ కబుర్లు వింటూ, కూచుని మింగుతున్నారా?' ' ఏమే రంభా!  ఈల్లతో కూడా నీ సోది మొదలెట్టావా?' ' తాతా!  అసలు మీకే లేక పస్తులుంటా వుంటే, ఈళ్ళతో ఊసులాడుతూ టిఫిన్లు మింగ బెడుతున్నావేంటి?  ఈళ్ళెవరో తెలుసా?' ' ఎవరో అంటావేంట్రా?  అంతరిచ్చంలో పెయోగాలు సేసే గొప్పోల్లు, డిల్లీబాబులు!' ' చాల్చాల్లే, ఊరుకో తాతా!  ఈళ్ళు మనూరి చివర మునసబుగారి పాడుబడ్డ బంగళా వుంది కదా?  అందులో కూచుని ఏటో ప్రయోగాలు చేస్తామని అందరి దదగ్గరా చందాలు వసూలు చేసారు.  ఆళ్ళే ఈళ్ళు!  బోసు, చక్రధర్, ఫెర్నాండెజ్.  ఏరా బోసుగా!  నా దగ్గిర ఐదు వందలు గుంజావు.  నా బాబు లెక్కడుగుతున్నాడు.  నా డబ్బు నాకియ్యరా.  లేకపోతే పోలీసోల్లకి చెబుతా.'
*********************
          ఇంతలో హాల్లొ ట్యూబ్ లైటు వెలిగింది.  సుజాత పగలబడి నవ్వుతోంది.' సుజా!  అర్థరాత్రి అంతరిక్ష ప్రయోగం చూస్తూ మధ్యలో నిద్ర పోయావేమిటి?  పూర్తిగా చూడలేదేం?  అన్నట్లు హాల్లో ట్యూబ్ లైటు వెలిగింది, గమనించావా?  ఎలక్ట్రీషియన్ వచ్చాడు.  అతను చోక్ సరిచేస్తే వెలిగింది.  ఈ మాత్రానికి వందరూపాయలు తీసుకున్నాడు.  ఏ స్విచ్ కి ట్యూబ్ లైటు వెలుగుతోందో మళ్ళీ టైప్ చేసి కనుక్కో.  ఏమిటీ, అంతలా నవ్వుతున్నావు?'' ట్యూబ్ లైట్ వెలిగేలోగా నాకు ఒక కథకి ఆలోచన వచ్చింది.  ఇదివరకు మా ఊళ్ళో ముగ్గురు బడుధ్ధాయిలుండే వారు.  వాళ్ళని మంచి మార్గంలో పెడదామని మా నాన్నగారు వాళ్ళకి చదువు చెబుతుండే వారు.  వాళ్ళు గొప్పవాళ్ళయినట్లు ఊహల్లో తేలుతుండే వాళ్ళు.  అందుకే వినే వాళ్ళుంటే, అవతల వాళ్ళు నమ్మేసేటంతగా వాళ్ళ మాటలు కోటలు దాటతాయి.  వాళ్ళు ముగ్గుర్నీ అందరూ ట్యూబ్ లైట్స్ అని పిలిచేవాళ్ళు. ఒకసారి వాళ్ళని నేను అడిగాను పెద్దయ్యాక మీరేం చేస్తారని.  వాళ్ళు పెద్ద సైంటిస్టులమై చంద్ర్రమండలం లోకి వెళతామన్నారు. ఇప్పుడు రాకెట్ ప్రయోగానికి వాళ్ళు చంద్రమండలం లోకి వెళ్తున్నట్టుగా ఊహించుకున్నాను.  అందుకే నవ్వొచ్చింది.  ఈలోగా ట్యూబ్ లైట్ వెలిగింది.' మర్నాడు శ్రీహరికోట నించి ఉపగ్రహం ప్రయోగించబడి, విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశించింది.
*************** 

No comments:

Post a Comment

Pages