ఒక సౌమ్య కధ - అచ్చంగా తెలుగు
ఒక సౌమ్య కధ
-       యలమర్తి చంద్రకళ
  
"అమ్మాయ్ ఎక్కడ చచ్చావే,,! ఆ చంటాళ్ళట్ట ఏడుస్తుంటే ఉలుకుపలుకు ఉండదేం..! అయ్యయ్యో.. ఎందుకమ్మ ఏడుస్తున్నారు..లొలొలొలొ "... సుందరమ్మ కూతురు సౌమ్యను కేకలేస్తోంది.. అమ్మ కేకలు ఎక్కడో లీలగా వినపడుతున్నట్లున్నా పరధ్యానంలోంచి బయటకి రాలేదు సౌమ్య. సౌమ్యకి ఏడాది క్రితం శ్రీధర్ తో అనుకోకుండా పెళ్ళైంది..  శ్రీధర్ ఒకమోస్తరు అందగాడే.. వారికి  లవ్ కుష్ అనే కవలలు.   పరధ్యానంలో పిల్లల సంగతి మర్చిపోయింది సౌమ్య. చంటాళ్ళలో ఎవరు ఎవర్ని కొట్టరో గానీ ఇద్దరూ  కేర్ మని ఏడుపు లంఘించుకున్నారు..లవ్ కుష్ ల ఏడుపు వంటింట్లో ఉన్న సుందరమ్మకు వినపడింది కానీ, దగ్గర్లోనే ఉన్న సౌమ్య మాత్రం ఈ లోకంలోకి రాలేదు . " అయ్యో అయ్యో ఇల్లంతా చిందరవందరగా ఉందే.. ఏంచేస్తున్నావే ఆ కిటికీ దగ్గర.. ఇల్లంతా గలీజ్ గా ఉంది చూడు.. ఆ పనిపిల్లకూడా ఈ పూట ఎగ్గొట్టింది.. సౌమ్య నిన్నేనే..!" సుందరమ్మ అరుస్తున్నా అవి సౌమ్య చెవులు చేరలేదు.. అప్పటి దాకా అమ్మకి ,నాన్న కి ముద్దులు పెట్టి టాటా చెబుతూ, అందమైన చూడీదార్ లో అంతకన్నా అందమైన స్కూటీ పై వెళ్తున్న తన స్కూల్ మేట్ విద్యని తదేకంగా చూస్తోంది సౌమ్య. ఆమె ఆలోచనలు సంవత్సరం వెనక్కి తీసుకెళ్ళాయి... విద్య ,సౌమ్య చిన్నప్పటి నుండీ కలిసి చదువు కున్నారు.  చదువైనా, మరేదైనా   పొటీలో ఎప్పుడూ విద్య కంటే సౌమ్యదే పై చేయి. అందం లో ,వినయంలో ,చదువులో ,ఆటల్లో సౌమ్యకి సమవుజ్జీ  వాళ్ళ కాలేజిలో కానీ ,చుట్టాల్లో కానీ, కాలనీలో  కానీ లేరు . చిన్నప్పటి నుండీ   డాక్టర్ కావాలనేదే   సౌమ్య కోరిక .  కాలేజీ , ఫ్రెండ్స్ , చదువు తో హాయిగా సాగిపోతున్న ఆమె జీవితం  శ్రీధర్ రాకతో తల్లకిందులయ్యింది. అదే వీధి లో నాలుగు ఇళ్ళ అవతలే శ్రీధర్ ఉంటారు. శ్రీధర్ తండ్రి కి బిస్కెట్ ఫ్యాక్టరీ వుంది. . డబ్బుకు కొదువలేని జీవితం శ్రీధర్ ది. తాను కావలనుకుంది తల్లిదండ్రులు తనముందుంచాల్సిందే. అలా గారాబంగా డబ్బులో పెరిగాడు శ్రీధర్. శ్రీధర్ కి తమ వీథిలో ఉండే అందాలభామ సౌమ్య అంటే మహా ఇష్టం.  రోజూ కాలేజీ కి వెళ్లి వస్తున్న సౌమ్యను  పని కట్టుకుని పలకరించే వాడు ."ఈరోజు ఈ డ్రెస్ లో చాలా అందంగా వున్నావ్" అనేవాడు, అయినా సౌమ్య పట్టించుకునేది కాదు.  ఆమె దృష్టి ఎప్పుడూ చదువు మీదే. డాక్టర్ కావాలని అందరూ "డాక్టరమ్మ..డాక్టరమ్మా"  అని పిలుస్తుంటే  ఎంత బాగుంటుందో అని ఊహించు కుంటూ మురిసిపోయేది .   ఆ రోజు ఇంటర్ రిజల్ట్స్ వచ్చాయి సౌమ్య కాలేజ్  ఫస్ట్  వచ్చింది లెక్చరర్స్  అందరూ అభినందించారు ,ఆ అమ్మాయి తమ కాలేజీ లో చదవడం తమ  అదృష్టం అని పొగిడేశారు.   "కాబోయే డాక్టర్"  అని  అభినందించారు ,కొందరు "డాక్టర్ సౌమ్యా" అని కూడా అనేశారు. ఆమె కాలు నేల మీద నిలవడం లేదు. , మనసు గాల్లో తేలి పోతోంది ఇంటి ప్రక్కనే వున్న హొమియో డాక్టర్ మామయ్య దగ్గర సెతస్కోప్   తీసుకుని మెళ్ళో వేసుకుంది.  "నీ గుండె కొట్టు కుంటున్నదో  లేదో చూస్తాను.. మామయ్య"  అంటూ పరాచకాలాడింది , నవ్వుతూ తుళ్ళుతూ ఇంట్లో అడుగు పెట్టింది . అప్పుడే   "హిహి"  అంటూ ఎదురు పడ్డాడు శ్రీధర్ , "ఎన్టీ అంత హుషారుగా వున్నావ్" అని అడిగాడు   "నేను డాక్టర్ని అవుతా తెలుసా" అంది  , "ఓహో ,హిహి అలాగా..చూద్దాం లే మీ అమ్మ పిలుస్తోంది చూడు" అని వెకిలిగా   నవ్వుతూ వెళ్ళిపోయాడు ,అతని వంక వింతగా చూసి "అమ్మా వీడెందుకు వచ్చాడే    మనింటికి" అని అడిగింది.  "తప్పే అందర్నీ వాడూ, వీడూ  అనకూడదే" అంది సౌమ్య తల్లి సుందరమ్మ.. . " మరి ఎందుకె అస్తమానూ నన్ను చూసి  హిహిహి అని పళ్ళికిలిస్తుంటాడు" అని  నిలదీసింది . "ఉండవే మీనాన్న  శాస్త్రి గారింటికి వెళ్లాడు.. .నాకు వంటింట్లో పని కాలేదు నీ ప్రశ్నలకి సమాధానం చెబుతూ కూర్చోలేనే " అంటూ వంటింట్లోకి హడావుడిగా వెళ్ళిపోయింది సౌమ్య అమ్మ . "శాస్త్రి గారితో మాట్లాడానే త్వరలోనే మంచి ముహూర్తం ఉందట .. రేపు తాంబూలాలు తీసుకోవచ్చన్నారు" అని సౌమ్య తండ్రి రామారావు సుందరమ్మ కు చెబుతున్నాడు. ముహూర్తాలు ,మంచి రోజులు అని అమ్మ నాన్న మాట్లాడుకోవటం సౌమ్య చెవిన పడుతున్నాయి, కానీ ఎవరో సంగతి మనకెందుకులే అన్నట్లు పట్టించుకోలేదు. కనీసం వాళ్ళు తన గురించే చర్చించుకుంటున్నారన్న  అనుమానం కలగలేదు సౌమ్యకి. అంతలో ఇంటికొచ్చిన స్నేహితురాలు విద్యతో "మెడిసిన్ లో చేరితే అమ్మాని, నాన్నని, నిన్ను అందరినీ వదిలి వెళ్లడం ఎలాగో అర్ధం కావట్లేదే..! కాలేజిలో చేరేందుకు కొత్త బట్టలు కొనుక్కోవాలి", అని నవ్వుతూ త్రుళ్ళుతూ కబుర్లాడుకుంటున్నారు.  విద్య వెళ్ళి పోగానే పరిగెత్తుకుని రామారావు దగ్గరకి వచ్చి  మెడ చుట్టూ చెయ్యి వేసింది సౌమ్య. " నాన్నా , కాలేజీలో జరిగిన సంగతులన్నీ నీతో చెబుదామని పొద్దుట్నించి చూస్తున్నా తెలుసా..! మరే కాలేజీ లో అందరూ నన్ను డాక్టర్ అవుతావ్" అన్నారు.. అంటూ గారాలు పోతూ తండ్రికి  కాలేజీ సంగతులు చెప్పింది   ,అందరూ ఎంతగా మెచ్చు కున్నారో వర్ణించి, వర్ణించి   చెప్పింది, " డాక్టర్ చదివి మన ఊళ్లోనే  ప్రాక్టీ స్ పెడతాను   మిమ్మల్ని విడచి వెళ్ళను  .. నువ్వు ,అమ్మా ఇద్దరూ నాకు రెండు కళ్ళు " చెప్పుకుపోతోంది సౌమ్య ఆమె మాటలని మధ్యలోనే ఆపి,   "రేపు తాతయ్య  ,మామయ్యా , బాబాయ్ వాళ్ళు   వస్తున్నారు తొందరగా వెళ్ళి పడుకో, మళ్ళీ రేపుదయాన్నే నీకు బోలెడు పని వుంది " అన్నాడు రామారావు. .. "అరె  అందరూ ఒక్కసారే వస్తున్నారా అయితే బోలెడు కబుర్లు చెప్పుకోవచ్చు"  అంటూ వెళ్ళి బెడ్ ఎక్కింది. డాక్టర్ అయినట్లు  కలలు కంటూ నిద్రలోకి జారుకుంది.. కలలు తెల్లని రంగు పులుముకుని కిరణాలు వెదజల్లుతూ ఒంటిని వెచ్చగా స్పర్శిస్తుంటే మెలుకువ వచ్చి, నిద్ర లేచిన సౌమ్యకి  గలగల నవ్వులు, పెద్దగా మాటలూ వినబడ్డయ్. వెంటనే దుప్పటి తొలిగించి లేచి హాల్లో కి వచ్చింది సౌమ్య. " అమ్మమ్మా ,తాతయ్య, అంటూ పరిగెత్తి కౌగిలించుకుంది.   మామయ్యా బాగున్నావా? అత్తా ఎలావున్నావ్? పిన్ని.. బాబాయ్ ఎలావున్నారు? అంటూ అందరినీ పేరు పేరున పలకరించింది. వాళ్ళ పిల్లలు ,అందరూ సౌమ్య ను చూసి ఆమె చుట్టూ చేరి అల్లరి చేశారు.  పెద్దవాళ్లంతా పొగడటం మొదలు పెట్టారు సౌమ్య " నువ్వు చాలా అదృష్ట వంతురాలివి" అని అన్నారు.  ఇప్పుడే రెడీ అయ్యి వస్తా ఓకే ".., అంటూ ఒక్క  పరుగులో అక్కడి నుండి వెళ్తూ.." చిటికెలో వచ్చేస్తా.!  ఎవ్వరూ కబుర్లు చెప్పుకోకండీ " అంటూ  అరుస్తూ లోపలికి పరిగెత్తింది సౌమ్య.  బాత్రూంలోకి వెళ్ళి రెడీ అయి వచ్చిన  సౌమ్య తెల్ల బోయింది.   తాతయ్య, నాయనమ్మ,బాబాయ్ ,పిన్ని, మామయ్య , అత్తయ్య చాపలేసుకుని కూర్చొని వున్నారు. వీరితో కబుర్లు చెబుతూ అదే వీథిలోని కొందరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా చేరారు.  అంతలో  బయట గేటు శబ్దం తో అటు చూసిన సౌమ్యను ఏవరో వెక్కిరిస్తున్నట్లు గేటు తీసుకుని శ్రీధర్,  శ్రీధర్ వాళ్ళ అమ్మ ,ఇంకెవరో కొందరు పళ్ళాల్లో పూలు , పళ్ళు ఇంకేవో పెట్టుకుని వస్తూ కనబడ్డారు . ఇల్లంతా సందడిగా మారింది.. అసలేం జరుగుతోందో సౌమ్య కి అర్ధం కావటం లేదు. అంతా గందరగోళంగా చిరాకుగా అనిపించింది తనకి. అంతలో... సౌమ్యని అంతదూరం  చూసిన శ్రీధర్  మళ్ళీ  హిహి అంటూ మెలికలు తిరగడం మొదలు పెట్టాడు,  చిరాగ్గా చూసి చూపు తిప్పుకుంది సౌమ్య . అందరూ హాల్లో చెరో వైపూ  చాపలు వేసుకుని  అచ్చంగా సినిమాలో కూర్చున్నట్లే కూర్చున్నారు . మధ్యలో శ్రీధర్   కూర్చుని సౌమ్య వంకే తొంగి చూస్తూ చూస్తూ హిహిహి అంటూనే వున్నాడు. తెల్ల బట్టల్లో రోజూ కంటే నల్లగా ఎలుగుబంటి  లాగే వున్నాడు అనుకోకుండా ఉండలేకపోయింది . పురోహితుడు శాస్త్రి గారు వచ్చారు. "ఏంజరుగుతోందమ్మా..! " అన్న సౌమ్యను సుందరమ్మ "ఆ.. పిచ్చి డ్రస్ ఏంటే.. ఇదిగో ఈ పట్టు చీరె కట్టుకో.. అమ్మాయ్ దీనికి పట్టుచీరె కాస్త కట్టూ.".అంటూ మరదలిని పురమాయించింది . ఎక్కడో అనుమానం మొదలై గుండె వేగంగా కొట్టూకోవటం మొదలైంది సౌమ్యకి. "అత్తా నువ్వైనా చెప్పు ఏం జరుగుతోందిక్కడ"..కొంత ఖంగారు ధ్వనించింది సౌమ్య గొంతులో... "నాకు చీరెందుకు అసహ్యంగా " అంటున్న సౌమ్యకు సమాధానం చెప్పకుండా.. "ఎంతందంగా ఉన్నావో అంటూ చీరెకట్టాక" మెటికలిరిచి వెళ్ళి పోయింది సౌమ్య అత్త.  అంతలో రామారావు పిలిచాడు సౌమ్య ఇలారా..! వచ్చి ఇక్కడ కూర్చో అన్నాడు. " నేనెందుకు నాన్న " అడుగుతోంది.. సౌమ్య.. సౌమ్యప్రశ్నలన్నీ శాస్తి  కంచు  కంఠం ముందు నీటిమూటలయ్యాయి. అక్కడెవ్వరూ సౌమ్యకు సమాధానం చెప్పేవాళ్ళు కనబడటం లేదు.. సౌమ్య కళ్ళల్లో నీరు సుడులు తిరగటం ప్రారంభించింది. శాస్త్రి రామారావుని,  శ్రీధర్ తండ్రిని.. లేచి ఇద్దర్నీ తాంబూలాలు మార్చుకోమన్నారు .  తన అనుమానం బలపడ్డ సౌమ్య .." నాన్న  ఏం జరుగుతోంది" అని తండ్రిని గద్దించింది. " నీకు శ్రీధర్ బాబుకి   పెళ్ళి నిశ్చయించాం... తాంబూలాలు  తీసుకుంటున్నాము.." అని కొద్దిగా దబాయింపుగా చెప్పాడు రామారావు.  మళ్ళీ "హిహి" అన్నాడు శ్రీధర్ సౌమ్య చూపుల్ని కలుపుతూ.    సౌమ్య తనకి తాను బలికి తీసుకెళ్తున్న మేకలా కనబడింది.  "ఎందుకిలా నాన్న చెప్పపెట్టకుండా ఇలా? నేను చదువుకుంటా నాతో ఒక్క మాటకుడా చెప్పకుండా " ధైర్యం తెచ్చుకుని ఒకింత స్వరం పెంచి మాట్లాడింది.    "అన్నీ వింటూనే వున్నావుగా  అలా అడుగుతావెం?   నీకు శ్రీధర్ బాబుకి పెళ్ళి ఫిక్స్ అయ్యింది.." అంటూనే  తాంబూలాలు మార్చేసుకున్నారు రామారావు, శ్రీధర్ తండ్రి. .  తండ్రి జవాబు, జరుగుతున్న తంతు చూసి  ఆమెకు తలగిర్రున తిరిగినట్లయ్యింది , కళ్ళల్లోంచి నీళ్ళు   జల, జలా వరదలైపోతున్నాయి  "అదేంటి  నాకు పెళ్ళేంటి..? నేను చదువు కుంటాను" అంటున్న   ఆమె మాట   ఎవ్వరూ వినడం లేదు .  అక్కడి కార్యక్రమం జరిగి పోయింది .               ముహూర్తాలు కుడా ఫిక్స్ అయ్యాయి. శ్రావణమాసంలో పెళ్ళికి లగ్నాలు పెట్టేశారు. మళ్ళీ "హిహి" అని విని పించింది , సౌమ్య కళ్ళు అవమానంతో ఎరుపెక్కాయి అక్కడి నుండి లేచి వెళ్లి తన గదిలో   తలగడలో తల దూర్చి వెక్కి, వెక్కి ఏడ్చింది.  అలా ఏడుస్తూ ఎంతసేపు ఉందో తనకి తెలియలేదు. మెల్లగా సృహ లోకి వస్తున్న సౌమ్య కు, , తల బరువుగా అనిపిస్తోంది మెల్లగా కళ్ళు  తెరచి చూసింది. తను హాస్పిటల్ లో వున్నట్లు గ్రహించింది. చెయ్యి నొప్పిగా అనిపించి పక్కకు తిరిగి చూసింది చేతికి సూది గ్రుచ్చారు  పైనుండి గొట్టంలో నుండి సెలైన్ నీళ్ళు చుక్క చుక్క కారు తున్నాయి . "అదేమిటే..! అలా వళ్ళు తెలియకుండా పడిపోయావు , 24  గంటలుగా నీకు స్పృహ లేదు తెలుసా..?" తల్లి సూందరమ్మ కళ్ళు వత్తుకుంటోంది , తండ్రి రామారావు పక్కనే వున్నాడు. దూరంగా  తలుపు దగ్గర ఎవరు తెలిసిన వాడిలా  వున్నాడే అనుకుంటూ చూసింది   హిహి అనబోయి ఆగిపోయాడు శ్రీధర్ . నిట్టూర్చింది సౌమ్య   విపరీతమయిన నీరసం, తల్లిని   ఎదో అడగాలని ప్రయత్నించింది కాని నోట మాట రావడం లేదు  డాక్టర్ వచ్చాడు " షాక్ వల్ల  అలా జరిగుండొచ్చు. ఇంక భయం లేదు తెలివి వచ్చింది గా ఇంటికి తీసుకు వెళ్ళండి " అన్నాడు   "బీ బ్రేవ్  మై గర్ల్ " అని సౌమ్య భుజం తట్టి వెళ్లి పోయాడు. సౌమ్య ఏడ్చింది ,పెళ్ళి వద్దంది  చదువుకుంటాను అని బ్రతిమాలింది..   రామారావు తేలికగా నవ్వేసాడు. " పిచ్చిపిల్లా ఇలాంటి సంబంధం ఎక్కడ దొరుకుతుంది   నేను, మీ అమ్మ, నీ ఎదురుగా నే ఉంటాము కాణీ కట్నం వద్దని చేసుకుంటున్నాడు ,కోరి వచ్చిన సంబంధం   కాదనుకుంటే ఎట్లాగమ్మా..? , పైగా బుద్ధి మంతుడు ఏ చెడు అలవాట్లూ లేవు ,కోటీశ్వరుడు నా మాట విను తల్లీ ,నువ్వు డాక్టర్ చదివినా కట్నం ఇచ్చే పెళ్ళి చెయ్యాలి   నాకా అంతా స్తోమత లేదు ,ఇలాంటి సంబందం నేను జీవితంలో తేలేను.. తప్పదు. " అని తాను చెప్పదలుచుకుంది టపీమని చెప్పి బయటికెళ్ళాడు రామారావు.    తల్లి అన్నం తినడం మానేసి నిరాహార దీక్ష చేసింది.. పట్టుపట్టి  శ్రీధర్ ని చేసుకోకుంటే గంగలో దూకుతానని బెదించింది. " తాను కదా బెదిరించాల్సింది.. వీళ్లేంటి తనని బెదిరిస్తారనుకున్నా.. చేయగలిగేదేం లేక తలూపింది. "పెళ్ళి అయ్యాక చదువుకోలే " అన్నాడు   శ్రీధర్. ఎక్కడో ఆశ మిణుకుమంటుండగా  ఏమీ చెయ్యలేని పరిస్తితి లో పెళ్ళికి ఒప్పుకుంది సౌమ్య.  ఇటు అమ్మా నాన్న బాధ్యతా ,తీరుతుంది ,అటు చదువూ కొనసాగించవచ్చు అనుకుని మనసుకి సర్ది చెప్పుకుంది ,   పెళ్ళి వైభవం గా జరిగిపోయింది .పెళ్ళికి వచ్చి న ఫ్రెండ్స్ ,లెక్చరర్స్  అదేంటి పెళ్ళి చేసుకుంటున్నావు  ,అని అడిగితే చదువు కొనసాగిస్తాను అనే చెప్పింది  .అందరూ శ్రీధర్ని పొగిడారు అందమయిన ,తెలివయిన భార్య దొరికింది అదృష్ట వంతుడివి అన్నారు. సౌమ్య తల్లి మా అమ్మాయి కూడా  అదృష్ట వంతురాలే అంత  ధనవంతుల కోడలు అయ్యింది అని చెప్పుకుని మురిసి పోయింది. తర్వాతి కార్యక్రమాలు అన్నీ ఆమె ప్రమేయం లేకుండానే జరిగి పోయాయి అత్తారింటికి వచ్చింది పగలంతా అత్తగారికి వంటలో సాయం చెయ్యడంతోటే గడిచిపోయేది. పొరబాటున  చదువుకుంటాను అంటే అత్తగారు నవ్వేది , ఉండబట్టలేక ఒక రోజు శ్రీధర్ని అడిగింది మళ్ళీ హిహి అంటూ  "ఇంకా చదువేంటి   పెళ్ళి అయ్యాక"   అన్నాడు. ఆ మాటలకు షాక్ కు గురైన సౌమ్య తేరుకోకముందే.. " అంటే నువ్వు పెళ్ళికి ఒప్పుకోవని అలా అన్నాను అంతే  ఈ యింటి కోడళ్ళు బయటికి వెళ్లరు ,అది మా కుటుంబానికి గౌరవం కాదు" అన్నాడు.  సౌమ్య తాను  మోసపోయాను అని తెలుసుకుంది. కళ్ళు నీలాలయ్యాయి. వర్షించే ముందు మబ్బు రూపు దాల్చాయి ఆమెకళ్ళు.  ఆమె నిర్మించుకున్న ఆశల సౌధం కూలిపోయింది. కలల సామ్రాజ్యం మాయమైంది. ఎవరో వెక్కిరిస్తున్నట్లు తోస్తుండటంతో  తల తిరిగి పడిపోయింది. పడిపోయిన  సౌమ్యను మంచం పై పడుకో బెట్టారు  డాక్టర్ ని ఇంటికి పిలిపించారు. డాక్టర్ నీరసంగా ఉన్న   సౌమ్యను పరీక్షించి   కంగ్రాట్స్   చెప్పింది తల్లివి కాబోతున్నావు అని చెప్పింది. " ఏడవలేక నవ్వింది సౌమ్య .  అందరూ ఏంతో  సంతోషపడ్డారు సౌమ్య నిర్లిప్తంగా ఎందుకు బ్రతుకుతోందో తెలియకుండా 10 నెలలు గడి చాయి ఆపరేషన్ అనంతరం కవలల్ని కన్నది  సౌమ్య.   సౌమ్యని మళ్ళి అందరూ పొగడ్తతో నీరాజనం పట్టారు. ఒకే కానుపులో ఇద్దరు మగ పిల్లల్ని కనడంతో  అత్త మామ సంబరపడ్డారు. "సౌమ్యా..! నీలాగా అదృష్ట వంతులు ఎక్కడుంటారు కట్నం లేకుండా పెళ్ళి ,అంతలోనే ఇద్దరు మగ పిల్లలూ.." అంటూ అందరినోటా అదే మాట ,సౌమ్య మససుకి  మాత్రం సమాధానం చెప్పుకోలేక పోతోంది  ,  చదువు కోలేకపోయిన తను దురదృష్టవంతురాలినే అని మధన పడుతూనే   వుంది . అంతలో ఎవరో అగాధం లోకి తోస్తున్నట్లు భయపడింది సౌమ్య. "ఏం ఇందాకటి నుంచి పిలుస్తుంటే చీమకుట్టీనట్లైనా లేదేమే.." అంటూ అమ్మ, తన జబ్బ పట్టుకుని ఊపిన ఊపుకు వర్తమానంలోకి వచ్చింది సౌమ్య. " పిల్లల్ని చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా ? పట్టపగలు నిద్రమొఖం ఏందే" అంటూ  తల్లి తనను నిలదీయడం సౌమ్యకు నచ్చలేదు "ఏది బాధ్యత?   మీకు  నచ్చింది మీరు చేసారు... మీ బాధ్యత   తీరిపోయింది గా ఇంక నన్ను విసిగించ వద్దు" అని బదులిచ్చింది . అంతలో ఇంటిలోకి వచ్చిన తండ్రి రామారావు  "అవును తల్లీ నువ్వు అలా పిల్లల్ని నిర్లక్ష్యం చెయ్య కూడదు" అంటూ  నచ్చచెప్పబోయాడు , విసురు గా అక్కడ నుండి లేచింది, అంతలో తన బిస్కెట్ ఫ్యాక్టరీకెళ్తూ శ్రీధర్ కూడా మామగారింటికి వచ్చాడు. వస్తూనే వాళ్ళ మాటలు విన్న శ్రీధర్ " మీ అమ్మాయికి ఇంకా చదువుకోవాలి అనే ఆశ   చావలేదు అందర్నీ నిర్లక్ష్యం చేస్తోంది మా అమ్మ ఒక్కతే పాపం కష్టపడుతుంది." అని భార్య పై అత్తమామకు ఫిర్యాదు చేశాడు. అంతలో పిల్లల్ని చూసేందుకు అక్కడికొచ్చిన అత్తగారు "అవును ఎన్ని సార్లు చెప్పినా ,ఇంతకాలమైనా ఎప్పుడూ అలా బాధ పడుతూ కూర్చుంటుంది కొంచం గట్టిగా బుద్ధి చెప్పండి మీ అమ్మాయికి.. ఇట్టా అయితే కాపురం కష్టం " అని దురుసుగా మాటలు విసిరింది. ," అదేంటమ్మా నీ గురించి ఇలా వింటామను కోలేదు" అన్న తండ్రితో " ఇంక ఎవ్వరూ ఇంకోసారి ఇలా అనుకోకుండా ఉండేలా నేను ఏదో ఒకటి ఆలోచించి గట్టి నిర్ణయం తీసుకుంటా" అంటూ విసురుగా లోపలికెళ్ళింది. ఆమె మాటల్లో అంతరార్ధం గ్రహించని అందరూ తమ పనుల్లోకి వెళ్ళిపోయారు. చాలా పొద్దుపోయింది  పిల్లలకి పాలు త్రాపుతూ ఉన్న కూతుర్ని చూసుకుని ఇకనైనా బాధ్యతా గా వుంటుంది అనుకుని సౌమ్య తల్లిదండ్రులు  నిశ్చింతగా నిద్ర పోయారు ,  ప్రొద్దుటే  ఫోన్   గణ, గణామ్రోగింది   ఫోన్ తీసి హలో అన్న సౌమ్య తల్లి అటు వైపు  మాట విని వెర్రి కేక వేసింది , చేతిలో ఫోన్ జారిపోయింది గబగబా తల్లీ ,తండ్రీ  బయటకు పరిగెత్తారు. ఇంట్లో పిల్లల  దగ్గర ఉండాల్సిన కూతురు అల్లుడి గుమ్మం లో విగతజీవిలా పడి  ఉంది. కూతురి శవం పై   పడి  భోరున విలపించారు ఇద్దరూ..,గుండెలు బాదుకున్నారు ఇంత అన్యాయం ఎందుకు చేసిందో అని విలపించారు . " నాలాంటి వాళ్లకెవరికీ ఇలా అన్యాయంగా పెళ్ళిళ్ళు చెయ్యొద్దు " అని సౌమ్య రాసిన లేఖ చూసి వాళ్ళు చేసిన తప్పు తెలుసుకున్నారు. తల్లిదండ్రులుగా  వాళ్ళు  మిగుల్చుకున్న నోట్ల కట్టలు వాళ్ళని వెక్కిరించసాగాయి . శ్రీధర్ కి మాత్రం హిహి అంటూ తనని సౌమ్య వెక్కిరించినట్లనిపించి మౌనంగా తలదించుకున్నాడు.  

No comments:

Post a Comment

Pages