వెర్రి మనసు
- కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్
28.10.2014
బుజ్జగించేలోపు
లొల్లి చేసేనమ్మ
గిలిగింత బెట్టేనమ్మ
వెర్రి మనసు
*******
నవ్వుల సెలయేటిలో
గువ్వలా అయినా మారి
నువ్వలా ఉండంటు
సువ్వలా గుచ్చెనే
వెర్రిమనసు
**********
అటు ఇటు చూచేను
అల్లరి చేసేను
వద్దని అన్నానో
వెక్కెక్కి ఏడ్చేను
వెర్రిమనసు
************
మనుషులతో ఆడేను
మొండిగ మారేను
మొత్తుకున్నా గాని
రాను పొమ్మంటుంది
వెర్రిమనసు
************
ఎవ్వరేని ఊరడిస్తే చాలు
ఆగకుండా ఉరికేను
ఆగాగంటు ఆగ్రహించామా
మౌనమై అలకబూనేను
వెర్రిమనసు
************
నీవుంటే చాలంటూ
నీవెంటే నేనంటు
నీవులేక లేనంటూ
నీధ్యానమే చేసె
వెర్రిమనసు
************
కల్లలయ్యే కలలు
కలదు వలదన్న..
కాదు కాదంటుంది
కాకిలా వాలిపోతుంది
వెర్రిమనసు
*************
పగలు కనే కలలు
వగలమారివంటూ
పొగలు కమ్మునంటు
మొత్తుకున్నా వినదు
వెర్రిమనసు
**************
సుష నుంచి సుషుప్తి దాక
వేరు లోకాన విహరించె..,
వెనకకు పిలిచామా
వెర్రిగా అరిచేను
వెర్రిమనసు
**************
మదము కాదు ముదము..ఆ
మోదముకానె కాదని
మొఖమున చెప్పినగాని
మారనని మారాము చేసేను
వెర్రిమనసు
**************
శరములెన్ని గాయపరచినా
మచ్చుకు కనిపించనీదు
తనలోనె తాను కుమిలి
కన్నీరై కరిగిపోయేటి
వెర్రిమనసు
**************
అంతరాన లావాలు పొంగినా
అనంత భావాలు నొక్కిపట్టేటి
ఆకాశమంత దొడ్డ రా
వింత చేష్టలు చేసేటి
వెర్రిమనసు
**************
నీ చేతిలోనె బ్రతుకు
నీ రాతలోనె నడత
నీ మాటలోనె మమత
నీ శాంతమె రక్షయన్న ...
మురిసి పోయేను ..
నింగికెగరేను..
నేలకూలేను
చిందులేసేను
చిత్తడి చేసేను...
వెర్రి మనసు !!
No comments:
Post a Comment