ఎంత ఇష్టం - అచ్చంగా తెలుగు
ఎంత ఇష్టం
---  డా. జాస్తి శివ రామ కృష్ణ

ప్రియా! సఖీ! చెలీ!
ఎంత ఇష్టం నీవంటే
ఎంత ఇష్టం, ఎంత ఇష్టం!
చందమామ నగుమోము
నుదుటి మీద ఎర్రబొట్టు
ముక్కుపైన సన్నపుడక
గంతులేసే చెవిపోగూ
కంటిలోని కాంతి మెరుపు
ముఖం మీద వింత వెలుగూ
చెక్కిలిపై పుట్టుమచ్చ
ఎంత ఇష్టం, ఎంత ఇష్టం!
పలుకరించే చిలిపి నవ్వు
పెదవులిచ్చే తీపి ముద్దు
వెలుగుచూపే నీదు మాటా
తరచయిన చిరుకోపం
లాలిపాడే తీపి గొంతూ
జోలకొట్టే నిర్మల హస్తం
కవ్వించే ఓర చూపూ
ఎంత ఇష్టం, ఎంత ఇష్టం!
ఘల్లు ఘల్లూ కాళ్ళ గజ్జె
గాలి కెగిరే నల్ల జుత్తూ
పాములాంటి వాలు జడ
జడలోని జాజి మల్లె
మల్లెలు జిమ్మే కమ్మని గంధం
పాటలాంటి హంస నడకా
ఎంత ఇష్టం, ఎంత ఇష్టం!
బంగారపు వంటి రంగూ
పట్టు కుచ్చులా మేని నునుపూ
స్వచ్చమైన వెన్న మనసూ
బాధ మరిపే చల్లని వడి
గుండె నింపే నిండు శోభా
ఎంత ఇష్టం, ఎంత ఇష్టం!
హాయి గొలిపే వయసు హొయలూ
మధువు వోలె మధుర స్మృతి
సేద తీర్చే మృదువు స్పర్శ
ఎంత ఇష్టం, ఎంత ఇష్టం!
నిర్మల కోమల రమ్య కమనీయ
సౌరభ సరళ సౌందర్య
ప్రియా! సఖీ! చెలీ!
ఎంత ఇష్టం నీవంటే
ఎంత ఇష్టం, ఎంత ఇష్టం!

No comments:

Post a Comment

Pages