భైరవకోన -9 (జానపద నవల )
-భావరాజు పద్మిని
(జరిగిన కధ : సదానందమహర్షి ఆశ్రమంలో విద్యాభ్యాసం పూర్తి చేసుకుంటాడు భైరవపురం రాకుమారుడు విజయుడు. గురువు ఆదేశానుసారం భైరవారాధన చేసి, ఒక దివ్య ఖడ్గాన్ని, వశీకరణ శక్తిని, పొంది తిరిగి వెళ్ళే దారిలో కుంతల దేశపు రాకుమారి ప్రియంవదను కలిసి, ఆమెతో ప్రేమలో పడతాడు. వంశపారంపర్యంగా విజయుడికి సంక్రమించిన చంద్రకాంత మణిని స్వాధీనం చేసుకుని, 6 శుభలక్షణాలు కల స్వాతి నక్షత్ర సంజాత అయిన రాకుమారిని బలిచ్చి, విశ్వవిజేత కావాలని ప్రయత్నిస్తుంటాడు కరాళ మాంత్రికుడు. విజయుడి చెల్లెలైన చిత్రలేఖ వివాహం, అతని మిత్రుడు, మంత్రి కుమారుడైన చంద్రసేనుడితో నిశ్చయం అవుతుంది. చిత్రలేఖ తాను వెదుకుతున్న స్వాతీ నక్షత్ర సంజాత అని తెలుసుకున్న కరాళుడు రాజగురువు రూపంలో వచ్చి, ఆమెను అపహరించుకు పోతుంటాడు. వారికి తెలియకుండా, గగన మార్గంలో వారిని అనుసరిస్తున్న చిత్రలేఖ పెంపుడు చిలక సురస, విజయుడికి విషయం వివరించేందుకు వెనక్కి మళ్ళుతుంది.....) యాగశాలలోకి ప్రవేశించారు రాజగురువు ప్రజ్ఞాశర్మ. “చిత్రలేఖ ఏదీ ఎక్కడా కనిపించదే...” అని అడిగారు అంతా నివ్వెరపోతుండగా... ఇంతలో వేగంగా వచ్చి వాలిన సురస... “స్వామీ ! పెద్ద ఘోరం జరిగిపోయింది. మన చిత్రలేఖను కరాళుడు అనే మాంత్రికుడు మీ రూపంలో వచ్చి, మారువేషంతో అపహరించుకుని పోయాడు...” అంది. వెంటనే అప్రమత్తం అయిన ప్రజ్ఞాశర్మ, ‘నాయనా విజయా ! చంద్రసేనా ! ఇక జాగు చెయ్యవద్దు. భైరవపురం రాకుమారి ఇప్పుడు ఆపదలో ఉంది. మన రాజ్యం పరువూ, ప్రతిష్ట కాపాడవలసిన సమయం ఆసన్నమయ్యింది, ఆ దుర్గమ్మ తల్లి దీవెనలు మీకు రక్ష ! ఆ కరాళుడి గుహ 3 సముద్రాల ఆవల, మన రాజ్యానికి ఉత్తర దిశగా ఉందని విన్నాను. వెంటనే ఉత్తర దిశగా బయలుదేరండి.’ అంటూ ఆజ్ఞాపించారు. శ్వేతాశ్వంపై విజయుడు, పంచకళ్యాణి పై చంద్రసేనుడు భైరవపురానికి ఉత్తర దిశగా పయనించసాగారు. కొండలు, గుట్టలు, సెలయేళ్ళు, దాటి రెండు రోజులు ప్రయాణించాకా, ఒక ప్రదేశానికి చేరుకొని, అక్కడి చెట్టుక్రింద విశ్రమించ సాగారు. అర్ధరాత్రి సమీపిస్తుండగా, వారికి వినవచ్చాయి “ వద్దు, ఇంక కొట్టకు, తట్టుకోలేను, ప్రాణాలు వదిలేస్తాను, చాలించు... ఎవరైనా కాపాడండి, రక్షించండి...” అన్న ఆర్తనాదాలు. వెంటనే వద్దనున్న కాగడా వెలిగించి , అరుపులు వినవచ్చిన దిశగా వెళ్తూ, తేరిపారా చూసారు. ఒక చెట్టుకు తల్లక్రిందులుగా వెళ్లాడ దీసిన ఇక మునిని, కొరడాతో చావగొడుతున్నాడు ఒక రాక్షసుడు. వెంటనే ముందుకు దూకిన చంద్రసేనుడు...” ఏవిటీ ఘోరం... సాధు జనులను హింసిస్తావా ? ఎందుకిలా చేస్తున్నావ్... అసలు నీకు ఏం కావాలి ?” అని ఆడిగాడు ఆగ్రహంగా ! “మర్యాదగా నీ దారిన నువ్వు పో, లేకుంటే, నువ్వు కూడా ఇంతకు ముందు వచ్చిన వారిలాగే, ఆ చెట్టుకు గబ్బిలమై వెళ్ళాడతావ్... “ అన్నాడు చెట్టు పైకి చూపిస్తూ ! అక్కడి కొమ్మలకు అసాధారణంగా కనిపిస్తున్న కొన్ని గబ్బిలాలు ఉన్నాయి. “ శరణు కోరిన వారిని ప్రాణాలకు తెగించైనా కాపాడడం క్షాత్ర ధర్మం. నీ బెదిరింపులకు భయపడను. చెప్పు, ఈ మునిని ఎందుకలా హింసిస్తున్నావ్ ? నీకు ఏం కావాలి ?” “ అంతటి మొనగాడివా ? అయితే విను, ఈ ముని, సమీపంలో ఉన్న చెరువులో సంధ్యానుష్టానం చేసుకుంటూ ఉండగా, అందులో నివసించే జలకన్య ఈదుతూ, పొరపాటున ఈయన్ను తాకి, ధ్యానభంగం చేసింది. వెంటనే కోపించిన ఈ ముని, ఆమెను మరణించమని శపించాడు. ఆ జలకన్య, ఒక యక్షరాజు ఒక్కగానొక్క కూతురు. కూతురి మరణాన్ని తట్టుకోలేని యక్షరాజు, ‘పొరపాటున జరిగిన దానికి, నా కుమార్తెకు ఇంతటి కఠిన శాపమిచ్చావు. నా మనసు పడే హింస, నువ్వు కూడా రోజూ రాత్రి బ్రహ్మరాక్షసుడి చేతిలో దెబ్బలు తింటూ శారీరకంగా పడు. ఇదే నా శాపం!’ అన్నాడు. వెంటనే తన తప్పును తెలుసుకున్న ముని, యక్షరాజును శాపవిముక్తికై వేడుకున్నాడు. అప్పుడు యక్షుడు ఇలా అన్నాడు, ‘ స్వార్ధరహితంగా, ఏ యువకుడైనా నీ క్షేమం కోరి, భయరహితుడై ,ఈ చెరువు వద్ద తన శిరస్సు ఖండించి, చెరువు గట్టున ఉన్న అమ్మవారికి సమర్పిస్తే, వెంటనే ఆమె ప్రసన్నమై, నీకు విముక్తి కలిగిస్తుంది.’ అని, తన కుమార్తె శవాన్ని తీసుకుని, అదృశ్యమయ్యాడు. ఆ రోజు నుంచి వచ్చిన యువకులంతా, బలిచ్చే ముందు వణికి, ఇలా గబ్బిలాలుగా మారారు. నువ్వా పని చెయ్యగలిగితే, వాళ్లకు, ఈ మునికి శాపవిమోచనం అవుతుంది. నాకు ఈయన్ను కొట్టే బాధ తప్పుతుంది. ఏం నీకంత దమ్ముందా ? “ అన్నాడు సవాలు విసురుతూ. వెంటనే ముందుకు దూకబోయిన చంద్రసేనుడిని వారిస్తూ, విజయుడు, ‘మిత్రమా, నువ్వాగు, నేను ఈ ముని కోసం బలి అవుతాను, ‘అన్నాడు. చంద్రుడు సన్నగా నవ్వి, ‘మిత్రమా! ఇంత మందికి విముక్తి కలిగించే అవకాశం నాకు ఇవ్వు. నువ్వు కాబోయే రాజువి, నువ్వు లేకపోతే రాజ్య ప్రజలు అనాధలు అవుతారు. అదే నేను లేకపోతే, పెద్దగా వచ్చే నష్టం లేదు. పైగా చిత్రలేఖను కాపాడవలసిన బాధ్యత కూడా నీపై ఉంది. నన్ను వీరమరణం పొందనీ !’ అన్నాడు. కన్నీటితో కడసారిగా మిత్రుడిని హత్తుకుని, వీడ్కోలు పలికి, అక్కడే అసహాయంగా కూలబడ్డాడు విజయుడు. చంద్రుడు శరవేగంతో ముందుకు దూసుకువెళ్ళి, ఆ చెరువులో స్నానం చేసి, జంకకుండా కరవాలం దూసి, అమ్మవారి ముందు తన శిరస్సు ఖండించుకున్నాడు. వెంటనే ప్రసన్నమైన అమ్మవారు మునికి, మిగిలిన వారికి విముక్తి కలిగించడమే కాక, చంద్రుడిని మరలా బ్రతికించింది. ‘నాయనా చంద్రా ! నిస్వార్ధ బుద్ధితో నీవు చేసిన త్యాగం నా మనసు కరిగించింది. నీకు దివ్యదృష్టిని, శక్తి స్వరూపమైన ఈ దివ్యఖడ్గాన్ని ప్రసాదిస్తున్నాను. అఖండ కీర్తిమంతుడివై వర్ధిల్లు,’ అంటూ దీవించి అంతర్ధానమయ్యింది. చేజారిన పెన్నిధి తిరిగి లభించినట్టు, అమితానందంతో మిత్రుడిని ఆలింగనం చేసుకున్నాడు విజయుడు. “చిరంజీవులారా ! నాకు గొప్ప ఉపకారం చేసారు. ప్రతిగా నా తపః శక్తితో మీరు బయలుదేరిన కార్యానికి, నేనూ సాయం చేస్తాను. నిర్జన కీకీరణ్యం దాటి, మూడు సముద్రాలకు ఆవల ఉన్న కరాళ మాంత్రికుడి గుహను మానవమాత్రులు చేరుకోవడం అత్యంత దుర్లభం ! ఇక్కడి నుంచి మీరు వంద యోజనాల దూరం ప్రయాణిస్తే, అక్కడ భాగమతి నది వస్తుంది. ఆ నదీ తీరంలోని పెద్ద వృక్షంపై , నా అధీనంలో ఉండే రెండు గండభేరుండ పక్షులు నివసిస్తుంటాయి. మీరు అక్కడికి వెళ్లి, మనసులో నన్ను స్మరించండి. ఆ పక్షులు మిమ్మల్ని తమ వీపుపై ఎక్కించుకుని, కరాళుడు ఉండే ద్వీపం ఒడ్డుకు చేరుస్తాయి. ఇక అక్కడి నుంచి ఎదురయ్యే క్షణక్షణ గండాలను ఎదుర్కోవాలంటే... మీకు ఆ భైరవుడే రక్ష ! క్షేమంగా వెళ్ళిరండి...”, అన్నాడు ముని. మిత్రులిద్దరూ మునికి సాష్టాంగనమస్కారం చేసి, తమ గుర్రాల మీద వాయువేగంతో బయలుదేరారు... (సశేషం...)
No comments:
Post a Comment