భక్తిమాల -2
- మల్లాది వేంకట సత్యనారాయణ మూర్తి
6. ఆటవెలది : ఈశ్వరస్తుతి
సకల సృష్టి నెల్ల జగదీశ్వరుండవై
లయమొనర్చు దేవ ! లలిత హృదయ !
మోక్ష మొసగునట్టి ముక్కంటి నిన్నెట్లు
విస్మరింతురయ్య ! విశ్వజనులు .
భావం : లోకమున గల సమస్త ప్రాణి కోటికీ ముక్తిని ప్రసాదించి, విశ్వనాయకునిగా అంతమొందించి, నీలో చేర్చుకొను దయాహృదయుడా ! ఓ మూడు కన్నుల పరమశివా ! ఈ విశ్వమందలి ప్రజలు నిన్నెట్లు మరువగలరు ?
7. ఆటవెలది : శ్రీమహాలక్ష్మి స్తుతి
సర్వసంపదలకు సామ్రాజ్ఞిగా యెంచి
భక్తి నిన్ను గొల్చువారలకున్
సకలసిరుల నొసగు సౌభాగ్యలక్ష్మిరో !
నీకు నీవే సాటి నిఖిల జగతి !
భావం : అన్ని సంపదలకూ నిన్ను రాణిగా భావించి, భక్తితో నిన్నారాధించు వారికి, సమస్త సంపదలను ఇచ్చే సౌభాగ్యలక్ష్మి ! ఈ సర్వప్రపంచంలో నీకు నీవే సాటి !
8. ఆటవెలది : పార్వతీ స్తుతి
మంగళప్రదమగు మాంగల్యమును గోరి
మగువలమిత భక్తి నగజ ! నిన్ను
మదిని తలచినంత మంగళగౌరిరో !
శుభములొసగె దీవు శుభగుణ యుత !
భావం : శుభమునకు చిహ్నమగు మాంగాల్యమును ఆశించి, స్త్రీలు ఎంతో భక్తితో మనసులో తలచినచో , ఓ పార్వతీదేవి ! ఓ మంగళ గౌరీ ! ఓ శుభగుణములు కల దేవీ ! నీవు శుభ ఫలముల నిచ్చెదవు.
9. ఆటవెలది : సుబ్రహ్మణ్య స్తుతి
కార్తికేయ ! వరద ! కళ్యాణ దోషమ్ము
బాపుటకును నిన్ను భక్తితో గొలువ
శుభఫలమ్ము లొసగు సుబ్బరాయా
నీవు పార్వతీశివులకు గర్వప్రదము !
భావం : వరముల నొసగే ఓ కార్తికేయా ! వివాహపరమగు దోషములు నివారించుటకు నిన్ను భక్తితో ఆరాధించినచో శుభ ఫలముల నొసగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామీ ! నీవు పార్వతీ శివులకు గర్వకారణం .
10. ఆటవెలది : వేంకటేశ్వర స్తుతి
కలియుగమ్మునందు కామితార్ధములిచ్చు
వేంకటేశ ! నిన్ను విశ్వమంతా
కులమతమ్ములనెడు తలపదియె లేక
కొల్తురయ్య భక్తి కూర్మితోడ !
భావం : కలియుగంలో కోరిన ధన, ధాన్యాదులనిచ్చు వేంకటేశ్వరా ! ఈ ప్రపంచమంతా నిన్ను కులము, మతము అనే వ్యత్యాసం లేక, ప్రేమతో పూజించుచున్నారు.
No comments:
Post a Comment