భారతీయ కాలగణన - పాశ్చాత్య కాలగణన
- చెరుకు రామమోహనరావు
దయ వుంచి మీ అమూల్య సమయమును కొంత వెచ్చించి మనసు పెట్టి ఈ రచన చదివి మీ అభిప్రాయమును తెలిపేది. నావయసుకు ఇది కష్టమైనా పనే . కేవలము మన పూర్వుల ఘనత తెలియ జెప్పుటకు నేను చేసిన చిన్న ప్రయత్నమును చదివి మీరు హర్షించితే ఇంకా ఏవైనా తెలిసినవి మీకు తెలియజేయాలని వుంటుంది. శర్మ గారు, నేను,నాకు తెలిసినంత వరకు 'like'ల కొరకు వ్రాయుట లేదు. మనసు పెట్టి చదివి అప్పుడు 'like' చేయండి.
భారతీయ కాలగణన
మన దేశమునకు వేదశాస్త్రేతిహాస పురాణములు ప్రమాణములు. ఇందులో పురాణములు సృష్ట్యాది మొదలు ఎన్నో విషయములు, వివరణలు, ఎంతో మంది రాజులు, మహాపురుషుల చరిత్రలు కలిగి వుంటాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ కాలం చెప్పేవాళ్ళు అక్కడక్కడున్నా వినేవాళ్ళు తగ్గిపోయినారు. మన సంస్కారమే మన సంస్కృతి. ఈ సంస్కృతే మన దేశపు ఆకృతి.
అసలు విషయానికొస్తే పురాణం పంచ లక్షణమన్నారు ఆర్యులు. ఆర్యులంటే అప్రాచ్యులు చెప్పినట్లుగా సుమేరియ నుండి దిగబడినవారు కారు. (అప్రాచ్యులు అంటే న + ప్రాచ్యులు ~ తూర్పు దేశస్తులు కానివారు. అంటే పడమటి దేశస్తులు లేక పాశ్చాత్యులు).
ఈశ్వర పుత్రాః ఆర్యాః అని యాస్కాచార్యులవారు 5000 సంవత్సరముల క్రితం తన ఋగ్వేద భాష్యంలోనూ; 600 సంవత్సరముల క్రితం విద్యారణ్యులవారు తమ వేదభాష్యం లోనూ వ్రాసి యున్నారు.
పురాణము యొక్క 5 లక్షణాలు ఏమిటి వంటే 1.సర్గ 2.ప్రతిసర్గ 3.మన్వంతర 4.రాజవంశ 5.అనువంశములు. మన చర్చలు మొదటి మూడు అవసరము .
1. సర్గ: సర్గయనగా సృష్టికి ఆది పునాది. పునాది అటులనే వున్నా ఆది కల్గినది అంతము కావలసినదే. పునాది ఆ నిరంజన నిరాకారుడే.
2. ప్రతిసర్గ: ప్రళయము వచ్చి ఈ సృష్టి అంతమైన తరువాత జరిగే పునఃసృష్టి మనకు తెలిసిన మత్సావతార కథ ప్రతిసర్గకు సంబంధించిందే. ఈ ఉదంతాన్ని బైబిల్ లో కుడా చూస్తాము. నోవా అనే నాయకుడు పడవలో జీవరాశిని మచ్చుకొకటి తీసుకొని క్రొత్త తీరమునకు వెళ్ళినట్లున్నది. మన పురాణ నిర్వచనము ప్రకారము ఇది ప్రతిసర్గయే. కాని వారందులో దీనిని నిర్వచించలేదు. ఇటువంటి ఉదంతములను గూడా మననుండి పాశ్చాత్యులు గ్రహించ్నట్లు తేట తెల్లమగుచున్నది. ఈ విధంగా సృష్ట్యాది మొదలు అనేక విషయములను తమ దివ్య దృష్టి చే పరీక్షించి పరిశీలించి పరిశోధించిన మన మహర్షులు శాస్త్రజ్ఞులు ఐన పూర్వీకులు పాశ్చాత్యులు చెప్పినట్లు ఆటవికులా! అనాగారికులా! పాశ్చాత్యుల ప్రకారము సృష్ట్యాది క్రీస్తుకుపూర్వము 2000 సంవత్సరముల క్రితం జరిగినది. కానీ మన ఖగోళ శాస్త్ర ప్రకారము సృష్టి జరిగి 195,58,85,115 సంవత్సరములు (2013 వరకు) ఐనవి. ఇది ప్రతి ఉగాదికి వచ్చే మన పంచాంగములలో ప్రతివర్షము తెలియజేస్తారు. “మిస్టీరియస్ యూనివర్స్” గ్రంధ కర్త మరియు ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త యైన ‘సర్ జేమ్స్ జీన్స్’ పై పుస్తకములో చేసిన అంచనా (ఇంచుమించు 200 కోట్లు). మన పూర్వీకుల ప్రమాణమునకు చేరువలోనున్నది. ఇప్పటి కలి యుగము వచ్చి 5115 సంవత్సరములైనది. ఇంత నిర్డుష్టముగా లెక్కలు కట్టి వ్రాయబడినదే “పంచాంగము”.
పంచ + అంగము = పంచాంగము. ఐదు అంగములు కల్గినది. అవి ఏవన: 1.తిధి 2.వారము 3.నక్షత్రము 4.యోగము 5.కరణము.
1. తిధి: ప్రతి రోజు సూర్యుడు 1అంశ (1డిగ్రీ) చంద్రుడు 13 అంశలు ముందుకు నడుస్తారు. అంటే వారిరువురి భ్రమణములోగల అంతరము 12డిగ్రీలు. (సూర్యుని భ్రమణమును సాపేక్ష భ్రమణము అంటారు. నిజానికి తిరిగేది భూమి. కాని మనము భూమిపై నిలబడి ఖగోళమును గమనించెదము కావున సూర్యునిది సాపేక్ష భ్రమణము.) ఈ 12 డిగ్రీల అంతరమును తిధి అంటారు.
మొదటి రోజు 12 డిగ్రీలు ఐతే రెండవ రోజు 24 డిగ్రీలు ఇట్లు 180 డిగ్రీలు చంద్రుడు సుర్యునినుండి జరిగినపుడు పౌర్ణమి, తిరిగి సూర్యుని చేరినపుడు (360 డిగ్రీలు లేక ౦ డిగ్రీ) వరకు కృష్ణ పక్షమని ఈ చంద్రయానమునంటారు. ఒక సౌర దినము = 0.9483 చంద్ర తిధి. ఈ విధంగా ఒక చంద్రమానమునకు 29.53 రోజులుంటాయి.
2. వారము: “అర్క శుక్ర బుధశ్చంద్రః మందో జీవ కుజః పుమాన్
సార్ధ ద్వి ఘటికా హోరాః ఇత్యే తత్ హోర లక్షణం”
అన్నది జ్యోతిష శాస్త్రము. 2½ ఘడియల కాలము = 1హోర(hour). మొదటి హోర 'అర్క' అంటే సూర్యుడు అంటే ఆదిత్యుడు. మొదటి హోరతో మొదలయ్యే రోజు కావున మొదటి వారము ఆదివారమైనది. ఒక రోజుకు 24 హోరలు. అర్క తో మొదలుపెట్టి ఎంచితే 24 హోరల తో ఆ దినము పుర్తియౌతుంది. 25 వ హోర 'చంద్ర'హోర అంటే సోమవారము. ఈ ప్రకారముగా వరుసగా 7 వారాలు వస్తాయి. మన హోర నే పాశ్చాత్యులు hour గ ఉచ్చరించినారు. ఈ వారముల క్రమము ఈ విధముగా ఏర్పడినదని పాశ్చాత్యుల కెరుకలేదు. కాని ఈ వారముల క్రమమును యధా తధముగా తమ భాషలోనికి పేర్లను గూడా తర్జుమా చేసుకొని వాడుకొనుచున్నారు.
౩. నక్షత్రము: సాపేక్ష సౌర గమనమునకు ఒక ఏడాది కాలము పడితే, ఆ పథంలో ఆయనకు 12 మజితీలను (మజితీలను రాశులు అంటారు) ఆయన ప్రయాణాన్ని 27ప్రాంతాలు (నక్షత్రాలు) చుట్టునట్లు విభజించినారు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదములు. 4+4+1 పాదము కలిస్తే ఒక రాశి. అశ్వని,భరణి, కృత్తికాః పాదం మేషం. అంటె అశ్వని యొక్క 4 పాదాలు భరణి యొక్క నాలుగు పాదాలు కృత్తిక లోని 1 పాదము మేష రాసి ఔతుంది. అదే విధంగా 3వ నక్షత్రములోని మిగిలిన 3 పాదములు నాల్గవ నక్షత్రములోని 4 పాదములు 5 వ నక్షత్రములోని 2 పాదములు కలిస్తే 2 వ రాశి. అంటే (3+4+2=9) ఇది రెండవ రాశి. ఇట్లు 9 పాదములతో ప్రతి రాశి ఏర్పడుతుంది. కావున రాశికి 9 పాదముల చొప్పున 12*9=108 లేక 27 నక్షత్రములలోని 4+4 .. .. .. పాదములను కలిపితే 27*4=108 పాదములగును. మానవుని పేర్లు ఈ 108 పాదములలో (ఆడ గాని, మగ గాని) ఏదో ఒక దానికి చెందును గాన అందరు సుఖంగా ఉండాలనే అష్ట్తోతర శత నామార్చన (108 పేర్లు) దేవునికి చేస్తారు. నక్షత్రముల పేర్లు రాశుల పేర్లు ఈ క్రింద పొందు పరచబడినవి
1.అశ్వని, 2.భరణి, ౩.కృత్తిక, 4.రోహిణి, 5.మృగశిర, 6.ఆర్ద్ర, 7.పునర్వసు, 8.పుష్యమి, 9.ఆశ్లేష, 10.మఖ, 11.పుబ్బ, 12.ఉత్తర, 13.హస్త, 14.చిత్త, 15.స్వాతి, 16.విశాఖ, 17.అనురాధ, 18.జేష్ఠ, 19.మూల, 20.పూర్వాషాఢ, 21.ఉత్తరాషాఢ, 22.శ్రవణం, 23.ధనిష్ఠ, 24.శతభిషం, 25.పూర్వాభాద్ర, 26.ఉత్తరాభాద్ర, 27.రేవతి.
12 రాశుల పేర్లు : 1.మేషం(Aries), 2.వృషభం(Taurus), 3.మిథునం(Jamini), 4.కర్కాటకం(Cancer), 5.సింహం(Leo), 6.కన్య(Virgo), 7.తుల(Libra), 8.వృశ్చికం(Scorpio), 9.ధనుస్సు(Sagitarius), 10.మకరం(Capricorn), 11.కుంభం(Acquarious), 12.మీనం(Pisces). ఈ సంస్కృత రాశుల పేర్లకు లాటిన్ ప్రతి నామాలు బ్రాకెట్లో ఇవ్వబడినవి. గ్రీకు, బాబిలోనియన్ ఇత్యాది భాషలలో కుడా రాశులకు వారు వారుపయోగించిన పేర్లు ఇంచుమించుగా ఇవే సంస్కృతార్ధములు కలిగియున్నవి.
4.యోగము: యోగమంటే కలయిక. దైనిక చంద్ర గతి, సాపేక్ష సూర్య గతి కలిపితే (13.20’) యోగమంటారు. ఈ యోగములు 27. అవి: 1.విష్కంభము, 2.ప్రీతి, 3.ఆయుష్మాన్, 4.సౌభాగ్య, 5.శోభన, 6.అతిగండ, 7.సుకర్మ , 8.ధృతి, 9.శూల, 10.గంధ, 11.వృద్ధి,12.ధృవ, 13.వ్యాఘాత, 14.హర్షణ, 15.వజ, 16.సిద్ధి, 17.వ్యతిపాత, 18వరియన్ (వరిష్ట), 19.పరిఘ, 20.శివ, 21.సిద్ధ, 22.సాధ్య, 23.శుభ, 24.శుక్ల, 25.బ్రహ్మ, 26.ఇంద్ర, 27.నైద్రుతి. ఈ యోగము ప్రభావము మానవ శరీరము ఆరోగ్యముపైనుం టంది.
5.కరణము: చంద్రుడు రోజుకు 12 డిగ్రీల వంతున సుర్యునినుండి దూరమౌతూ వస్తాడు. పాడ్యమికి 12 దిగ్రీలయితే విదియకు 24 డిగ్రీలు ఆ ప్రకారంగా 180 డిగ్రీలకు పున్నమి, 360(౦) డిగ్రీలకు అమావాస్య అని తెలుసుకొన్నాము. అర్ధ తిధిని కరణము అంటారు (అంటే 12/2=6) అంటే ఏ అర్ధ తిధియైన 6 చేత నిశ్శేషముగా భాగింపబడుతుంది. ఈ కరణములు 11 అవి: 1.భవ, 2.బాలవ, 3.కౌలవ, 4.తైతుల, 5.ఖర జి, 6.వణిజి,7.విష్టి, 8.చతుష్పద, 93శకుని, 10.నగ, 11.కింస్తుఘ్నము. మొదటి 7 ఒక చంద్ర మాసములో 8 మార్లు వస్తాయి. అంటే 28 రోజులు. చివరి 4 కరణములు వరుసగాను స్థిరముగాను వస్తాయి. సూర్య చంద్ర భూ చలనములను ఇంత నిశితముగా పరిశీలించి గ్రహచారములనధ్యయనముచేసి భూమి పై వాని ప్రభావమును గూర్చి తెలిపినదీప్రపంచములో ఈ దేశము తప్ప వేరు దేశము లేదంటే అతిశయోక్తి కాదు.
పంచ అంగముల తరువాత మాసములను గూర్చి ముచ్చటిద్దాము. చంద్రుడు తన గమనమున పౌర్ణమి రోజు ఏ నక్షత్రమునకు దగ్గరగా ఉన్నాడో ఆ నక్షత్రము పేరుతో ఆ మాసము ఏర్పడింది. అంటే పున్నమి రోజున చిత్ర నక్షత్రము వద్దకొస్తే చైత్ర మాసము, విశాఖ నక్షత్రము వద్దకొస్తే వైశాఖ మాసము ఆ ప్రకారంగా 12 మాసములు ఏర్పడినవి కాని నిరర్ధకమైన పేర్లను ఉపయోగించలేదు. ఈ 12 మాసముల పేర్లు ఈ దిగువన ఇవ్వబడినవి
1.చైత్రము, 2.వైశాఖము, 3.జ్యేష్టము, 4.ఆషాఢము, 5.శ్రావణము, 6.భాద్రపదము, 7.ఆశ్వయుజము, 8.కార్తీకము, 9.మార్గశిరము, 10.పుష్యము, 11.మాఘము, 12.పాల్గుణము
ప్రతి నేలలోను సూర్యుడు 12 రాశులలోని ఒక రాశి లో ప్రవేశిస్తే అది నిజ మాసమౌతుంది. లేకుంటే శూన్య/అధిక మాసమౌతుంది. అదే ఒక నెలలో రెండు సంక్రమణములొస్తే అది క్షయ మాసమౌతుంది. ఇది 141 సంవత్సరములకొకసారి వస్తుంది. ఒక సారి వచ్చిన తరువాత తిరిగీ 19 సంవత్సరములకే వచ్చే అవకాశమున్నది. ఈ విధంగా కాల గణన ఎక్కడికక్కడ సవరించుకొంటూ దోష రహితంగాను నిరాఘాటంగానూ సాగిపోతూంటుంది.
ఇక సంవత్సరముల విషయానికొస్తే సాపేక్ష సూర్య భ్రమణమును వర్తులాకారముగా తీసుకొన్నాము కావున ఆ భ్రమణము 360 డిగ్రీలు కలిగి వుంటుంది. సూర్యుడు రోజుకు ఒక అంశ (డిగ్రీ) ముందుకు జరుగుతాడని ఇదివరకే చెప్పుకొన్నాము. కావున ఒక సౌర సంవత్సరానికి 360 రోజులు. ఈ విధమైన సంవత్సరములు ప్రభవ విభవ మొదలు 60 పేర్లతో గడచిన తరువాత తిరిగి ప్రభవతో పునరావృత్తమౌతాయి. ఈ 60 పేర్లు ఈ క్రింది విధముగా వున్నాయి:
1.ప్రభవ, 2.విభవ, 3.శుక్ల, 4.ప్రమోదూత, 5.ప్రజోత్పత్తి, 6.ఆంగీరస, 7.శ్రీముఖ, 8.భవ, 9.యువ, 10.ధాతు, 11.ఈశ్వర,12.బహుధాన్య, 13.ప్రమాది, 14.విక్రమ, 15.విషు, 16.చిత్రభాను, 17.స్వభాను, 18.తారణ, 19.పార్ధివ, 20.వ్యయ , 21.సర్వజిత్తు, 22.సర్వధారి, 23.విరోధి, 24.వికృతి, 25.ఖర, 26.నందన, 27.విజయ, 28.జయ, 29.మన్మధ, ౩౦.దుర్ముఖి, 31.హేవళంబి, 32.విళంబి, ౩౩.వికారి, 34.శార్వరి, 35.ప్లవ, 36.శుభకృతు, 37.శోభకృతు, 38.క్రోధి, 39.విశ్వావసు, 40.పరాభవ, 41.ప్లవంగ, 42.కీలక, 43.సౌమ్య, 44.సాధారణ, 45.విరోధికృతు, 46.పరీధావి, 47. ప్రమాదీచ, 48.ఆనంద, 49.రాక్షస, 50.నళ, 51.పింగళ, 52.కాళయుక్తి, 53.సిద్ధార్ధి, 54.రౌద్ర, 55.దుర్మతి, 56.దుందుభి, 57.రుధిరోద్గారి, 58. రక్తాక్షి, 59.క్రోధన, 60.అక్షయ.
ఈ సంవత్సర సమూహమును ‘60’గా ఎందుకు ఏర్పరచినారు అన్నది తెలుసుకొనుటకు ముందు మన వాళ్ళు గ్రహములకాయా పేర్లు ఎందుకు పెట్టినారో చూస్తాము. సాపేక్షముగా భూమిపై నిలబడి గ్రహ గతిని పరిశీలించితే, దూరమునుండి చేరువరకు గ్రహ భ్రమణమీవిధంగా వుంటుంది.
“మంద అమరేఢ్య భూపుత్ర అర్క శుక్ర బుధ ఇందవః”
శని బృహస్పతి అంగారక సూర్య శుక్ర బుధ చంద్ర, ఇది గ్రహముల వరుస.
మంద అన్నా శని అన్నా అత్యంత నెమ్మదిగా నడిచేది. అన్ని గ్రహములకన్నా ఈ గ్రహము ఒక భ్రమణమునకు ఎక్కువ సమయం తీసుకొంటుంది. ఇది ఒక భ్రమణమునకు 30 సంవత్సరములు తీసుకొంటుంది. బృహత్ అంటే పెద్దది. బృహత్ + పతి =బృహస్పతి. అతి పెద్ద గ్రహములకు రాజు అంటే మన సౌర మండలములో అత్యంత పెద్ద గ్రహము. అంగారము అంటే అగ్ని. ఈ గ్రహము ఆరంగులో మనకు కనిపిస్తుంది కావున అది అంగారకమైనది.
ఇక 'అర్క' అంటే సూర్యుడు. సూర్యుని గూర్చి ఒక్క సారి మన దేవాలయాలలోని నవగ్రహ మంటపం గమనించితే సూర్యుని గ్రహమండలంలోని నట్ట నడుమన ప్రతిష్టించివుంటారు అంటే సూర్యుని కేంద్రముగా గొని మిగతా గ్రహములన్నియు భూమితోకుడా వర్తులాకారములో చుట్టుచున్నవనియే కదా! వరాహమిహురుడు, ఆర్యభట్టు, భట్టోత్పలుడు, భాస్కరుడు ఆదిగాగల భారతీయ ఖగోళ వైజ్ఞానికులు కోపర్నికస్ వంటి పాశ్చాత్య వైజ్ఞానికులకన్నా ఎన్నో శతాబ్దాల పూర్వమే తమ వేద విజ్ఞానముతో భూమి గుండ్రముగానున్నదని, భూమి సూర్యుని చుట్టూ తిరుగుచున్నదని, గ్రహ భ్రమణమునకు సూర్యుడు కేంద్రమని, తమ గ్రంధములలో రచించియున్నారు. కాణాదుని వంటి మహర్షులు సూర్యకిరణములు వక్రగతిన ప్రయాణము చేయుననియు సూర్య కిరణములో 7 రంగులున్నవనియు కుడా చెప్పినారు. మన పూర్వులు సూర్యుని గూర్చి తెల్పుచూ అయన రథానికి ఒకటే చక్రమనియు (కాల చక్రము) అయన రథ సారధికి నడుము మాత్రమే వుంది తొడలు లేవని (ఆయన పేరు అణూరుడు) అంటే రథము లో కదలకుండా ఎప్పుడూ
నడుపుతూనే వుంటాడనియు, రథమునకు పూన్చిన గుఱ్ఱములు 7 అనియు (7 రంగులు) పగ్గములు పాములనియు (సూర్య కిరణములు వంకరటింకరగా వుంటాయి నిగూఢముగా తెల్పినారు.ఈ విషయాన్ని తమ స్వంతము చేసుకొని తమ పరిశొధనగా ప్రకటించుకొన్నారు అరిస్టాటిల్ లాంటి గ్రీకు దేశస్తులు. మన గ్రంథాలు చదవ లేక పొడవడం వల్ల గ్రీకు గ్రంథాలు చదవగలగడం వల్ల డచ్చిదేశస్థుడైన క్రిస్టియన్ హుయిన్స్ ( Christiaan Huygens) ఆ సిద్దాంతాని బలపరచటం జరిగింది. గమనించితే ఈ వేద విజ్ఞానమెంత గొప్పదో అర్థమౌతుంది.
ఇక శుక్ర గ్రహము: శుక్రము అంటే తెలుపు, కాంతివంతము అని అర్ధం సాయం సమయమున ఆకాశం పరిశీలించితే ఈ వాస్తవం తెలుస్తుంది.
బుధగ్రహము: బుధుని సౌమ్యుడు అని అంటారు. అంటే చూడ ముచటైన చందన వర్ణములో ఉంటాడని అర్థం.
చంద్ర గ్రహము: చంద్రము అంటే బంగారము. చంద్రుడు ఆ వర్ణములో వుంటూ చల్లని కిరణాలను ప్రసరింప చేస్తాడు కావున ఆయనను చంద్రుడని శీత కిరణుడని అన్నారు.
ఈ విధంగా పేర్లుంచుట యందు కూడా ఎంతో యోచించి అర్ధవంతంగా పెట్టినారు కాని, స్వోత్కర్షతో తమ పేర్లను ఎక్కడా ఉపయోగించుకోలేదు.
ఇక 60 సంవత్సరములెందుకు అన్న అసలు విషయనికి వస్తాము; భూమికి అతి దూరముగా వున్న గురు గ్రహము యొక్క భ్రమణకాలము 12 సంవత్సరములు. అదే అత్యంత దూరములో వున్న శని గ్రహము 30 సంవత్సరములు తీసుకొంటుంది. అంటే బయలుదేరిన బిందువు నుండి తిరిగి ఈగ్రహములు ఒకే సరళ రేఖ మీదికి వచ్చుటకు 60 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే గురువు (12 x 5 = 60) ఐదు మార్లు, శని (30 x 2 = 60) రెండు మార్లు, తిరుగవలెనన్నమాట. అంటే 60 సంవత్సరముల కాలం ముగియగానే మరులా ప్రభవ నుండి 60 సంవత్సరముల కాలం మొదలౌతుందన్నమాట.
ఇక కాలగణన విషయానికొస్తే, సూర్య సిద్ధాంతము ప్రకారము
తృటి – వాడి సూది మొన తామరాకును తాకేకాలం (1/33750 Sec.,) నుండి మొదలు పెట్టినా ప్రాణము అన్న కొలమానము నుండి ఎవరైననూ సాధారణ కాలగణన చేయవచ్చును.
జీవి ఇన్ని ప్రాణముల కాలము బ్రతకవలెనని నిర్ణయించ, బ్రహ్మ ఆ జీవిలో అన్ని ప్రాణములనూది భూమి పైకి పంపుతాడన్నది పెద్దలమాట. ఆరోగ్యవంతుడు శ్వాస తీసుకొని వదులుటకు పట్టు కాలము ప్రాణము. ఇంచుమించు 4 Sec., = 1 ప్రాణము
6 ప్రాణములు = 1 వినాడి ( విఘడియ)
60 వినాడు లు = 1 నాడి (ఘడియ)
60 నాడులు = 1 అహో రాత్రము (1 రోజు)
360 రోజులు (24 హోరలు) = 1 సౌర వర్షము
(దేవతలకు ) 1 దివ్య వర్షము = 360 సౌర వర్షములు
కృతయుగము = 4800 దివ్య వర్షములు = 17,28,౦౦౦ (4 పాదములు)
త్రేతాయుగము = 3600 దివ్య వర్షములు = 12,96,000 (౩ పాదములు)
ద్వాపరయుగము = 2400 దివ్య వర్షములు = 8,64,000 (2 పాదములు)
కలియుగము = 1200 దివ్య వర్షములు = 4,32,000 (1పాదము)
మహాయుగము = 12000 దివ్య వర్షములు = 42,20,000 (10 పాదములు)
ఒక మన్వంతరము = 71 మహాయుగములు
ఈ మనువులు 14గురు. ఇపుడు జరిగేది వైవస్వతమన్వంతరము
కల్పము = 14 మన్వంతరములు + 15 సంధులు = (71 x 14) + 6 (మహాయుగములు)=994+6=1000మహాయుగములు
15 సందులెట్లంటే ఒక మన్వంతరము ముగిసి వేరొక మన్వంతరము వచ్చుటకు మధ్య కాలము సంధి. అంటే పగటికి రాత్రికి, రాత్రికి పగటికి మధ్య సంధి వున్నట్లు. ఆవిధంగా 14 సంధులు గడిచిన తరువాత ఒక మహామన్వంతరమునకు(14 మన్వంతరముల కాలము మరొక మహామన్వంతరమునకు మధ్య కాలము 1 సంధి. వెరసి 15 మన్వంతరములు.
1 సంధి కాలము = 4800 దివ్యవర్షములు. 15 సంధులు = 4800 x 15=7200 ది.వ. = 6 మహాయుగములు
2 కల్పములు : బ్రహ్మకు ఓకే అహోరాత్రము = 1 రోజు
ఇట్టి 360 రోజులు ఒక బ్రహ్మవర్షము.
బ్రహ్మ ఆయుర్దాయము : 100 బ్రహ్మ వర్షములు
ఇది సూక్ష్మముగా మన కాల చరిత్ర. ఇంతటి సునిశిత శాస్త్ర జ్ఞానము కల్గిన ప్రపంచములోని ఏకైక దేశమైన ఈ భారతదేశంలో జన్మించినందుకు ఆ పరమాత్మకు కృతజ్ఞతలు చెప్పుకొని గర్విద్దాం.
కాల గణన (పాశ్చాత్య శైలి)
అనంతమైన కాలాన్ని గణించడం అంత సులభం కాదు. ఐనా దానిని ఎంత నిర్దుష్టంగా మన పూర్వీకులు గణించారో తెలుసుకొనుటకు ముందు పాశ్చాత్యుల క్యాలెండరు ను పరిశీలించుదాము.
క్యాలెండరు అన్నమాట లాటిన్ భాషలోని క్యాలండీ నుండి పుట్టినది ఇచ్చిన అప్పులు మొదటి రోజున వసూలు చేసుకొనుటకు అది ఏర్పరుపబడినది. తరువాత పౌర అనుశాసనమునకు ప్రజా ప్రయోజన కార్యాచరణమునకు ఇది పాశ్చాత్యుల చేత ఉపయోగింప బడినది. దీనిని వీరు కాల క్రమేణ Almanec అని గూడా అన్నారు. నిజానికిది Al – manakh అంటే వాతావరణ సూచిక అని అన్వయించుకొనవచ్చును. ఈ పదము Spanish Arabic భాషలకు చెందినది.
నేడు మనముపయోగించే క్యాలాండరు రోము, ఈజిప్టు గ్రెగొరీ విధానాల కలయిక. రోము రాజ్యాన్ని పాలించిన రోములస్ కాలంలో ఏడాదికి 304 రోజులుండేవి. సంవత్సరానికి 10 నెలలుండేవి. మార్చి నుండి కొత్త సంవత్సరం మొదలయ్యేది. తరువాత కాలంలో దీనిని 10 నుండి 12 నెలలకు మార్చి, సంవత్సరమునకు 354 రోజులుగా నిర్ధారించినారు. పంపీలయస్ చక్రవర్తి క్రీ ||పూ|| 7వ శతాబ్దంలో తిరిగి సరి సంఖ్య మంచిదికాదనుకొని 355 రోజులు చేసినారు.
ప్రపంచమంతటా నూతన సంవత్సరము మొదలయ్యేది వసంత ఋతువు(spring) లో అంటే మార్చ్ నెలలో. ‘Spring’ అప్పుడే కదా వచ్చేది. తరువులు చివురులు తొడుగుట అప్పుడే కదా. అంటే అది పుట్టుకతో పోల్చవచ్చు కదా! పండువారి పోవడము, మట్టిలో కలవడము శిశిరము (autumn) కాదా! కాని పాశ్చాత్యులు వేడుకలు spring (March) లో కాదని శిశిరం (autumn) అంటే జనవరి లో చేయ మొదలిడినారు.. క్రీ ||పూ|| 153 లో సంవత్సరాన్ని జనవరికి మార్చటం జరిగింది. మరుల దానిని ఎందుకనో మార్చికి మార్చినారు.
తరువాత క్రీ ||పూ|| 46 వ సంవత్సరములో అప్పటి రోమన్ చక్రవర్తి యగు జూలియస్ సీజరు ఈజిప్ట్ వెళ్ళినపుడు అక్కడి క్యాలెండరు విధానాలను గమనించి ఖగోళ శాస్త్రజ్ఞుడైన సోసీజెనాస్ అనునతని సహయంతో రోమను సంవత్సరానికి 365.25 రోజులుగా నిర్ణయించి, ఫిబ్రవరి (అప్పుడు సంవత్సరానికి చివరి నెల) నుండి 30 రోజులలో ఒక రోజును తీసి మార్చి నుండి 5 వ నెలయైన పెంటలిస్ (పెంట=5) కు చేర్చి, ఏప్రిల్, జూన్, ఆగష్టు, సెప్టెంబరు, నవంబరు నెలలకు 30 రోజులనుంచి, ఫిబ్రవరి కి 29 రోజులు చేసి, సంవత్సరమును తిరిగి జనవరికి మార్చి, పెంటలిస్ పేరును తన పేరుతో జులై గా మార్చుకొని సంవత్సరారంభం జనవరి తో చేయ ప్రారంభించినారు. 0.25 తేడాను, 4 సంవత్సరములకు ఒక రోజు ఔతుంది కాబట్టి దానిని ఫిబ్రవరి నెలకు కలిపి (29+1) 30 రోజులు చేయటం జరిగింది. దీనిని leap year అన్నారు.
సీజరు మేనల్లుని కొడుకైన ఆగస్టస్స్ సీజరు 27 B.C. లో రోము చక్రవర్తియైన పిమ్మట సెక్ష్టలిస్ అను నెలకు (సెక్స్ట్టట =6) తన పేరుతో ఆగస్ట్ అని పెట్టి దానికి ఫిబ్రవరి నుండి ఒక రోజు తీసి, అంటే దానిని 28 రోజులుగా చేసి, ఆగష్టుకు కలిపి దానిని కుడా 31 రోజుల నెలగా చేసినాడు. లీపియరును ౩ సంవత్సరములకు మార్పు చేసి , ఫిబ్రవరి కి కలిపేవారు.
తరువాత కాలంలో రోజుల లెక్కలో కచ్చితత్వము పెరిగి సంవత్సరానికి 365.242199 రోజులు చేసినారు. ఇందువల్ల ఏడాదికి 11 ని||14సె|| తేడావస్తుంది. దీనిని 13 వ పోపు గ్రెగొరీVIII కొందరు ఖగోళ శాస్త్రజ్ఞుల కూటమిని ఏర్పరచి , క్రీ ||శ|| 1582 లో గ్రెగోరియన్ క్యాలెండరు పేరుతో క్రొత్త క్యాలెండరును ప్రవేశ పెడుతూ లీపియర్ ను తిరిగి 4 సంవత్సరములకొకసారి చేస్తూ ఫిబ్రవరి కి ఆ ఒక రోజును కలిపేవారు. అట్లు చేయుటవలన ఒక వర్షమునకు .007801 రోజు ఎక్కువగా వచ్చేది. దీనిని చక్కబరచుటకు 400 తో భాగింపబడే శతాబ్ది సంవత్సరములు మాత్రమె లీపు సంవత్సరములుగా తీసుకొని 4చేత భాగింపబడినవి తీసుకొనకుండా వదిలి పెట్టినారు. ఈ మార్పును చెయుటకుగనూ october 4, 1582 తరువాత, అక్టోబరు 15, 1582 గా ప్రకటింపబడినది. ఆ 10 రోజులు, కాలముతో ఆడిన క్యాలెండరు ఆటకు,బలియైపోయినాయి. అందువల్ల వారి పండుగ తేదీలకు వారు పండుగ చేసుకొను సందర్భములకు పొంతన లేదని వారి శాస్త్రజ్ఞులే వాక్కణించుచున్నారు. క్రీ ||శ|| 1582 వారికి సరియైన కాలగణనా విధానమే లేకుంటే వారి పండుగలకు వాణి తేదీలకు పొంతన రాదు కదా.
ఇక వారు నెలలకు పెట్టిన పేర్లను గూర్చి తెలుసుకొందాము.
జనవరి: జానస్ అన్న రెండుతలల దేవుడు స్వర్గంలో ప్రధాన ద్వారం వద్ద వుంటూ ఒక తలతో జరిగిన వర్షమును ఒక తలతో జరగబోయే వర్షమును చూస్తూఉంటాడట. ఆయన పేరుతో ఈ నెల ఏర్పడింది. 29 రోజులు కల్గిన ఈ నెల 31 రోజుల నేలగా జూలియస్ సీజరు చేసినాడు.
ఫిబ్రవరి: రోమన్ల పండుగ ఫిబ్రువా అన్నది లూపర్కాస్ అన్న దేవుని పేరుతో పునీతుడగుటకు (to get purified) జరుపుకుంటారు. దీనికి కొంతకాలం 23, 24 రోజులుండేవి. తరువాత 30 రోజులై ఆతరువాత జూలియస్ సీజరు, అగస్తస్ సీజరు ల వల్ల 28 రోజులై కూర్చుంది.
మార్చి: మార్స్ రోమనుల యుధ్ధ దేవత. ఈయన ఒక చేతితో శూలం మరొక చేతితో డాలును ధరించి రెండు గుర్రాలమీద వస్తాడు. ఈయన పేరుతో ఈ నెల ఏర్పడింది.
ఏప్రిల్: రోమన్ల వసంత దేవత పేరు అమ్నియో ఏప్రిట్. ఈమెను రోమన్లు ఎంతో అందమైనదిగా, పునరుజ్జీవనకు నాందిగా భావించుతారు.
మే: భూగోళాన్ని తన భుజస్కంధాలపై మోసే అట్లాసు యొక్క ఏడుగురు కూతుళ్ళలో మేయో ఒకటి. అట్లాసు ఈ ఏడు మందిని ఏడు నక్షత్రములుగా మార్చివేసినాడు (మన సప్తర్షి మండలం) దీనిని అంటే ఈ నెలను వయసులో పెద్దవాళ్ళకు (maiores) అంకితమిచ్చినారు.
జూన్: జూపిటర్ భార్య జూనో ఈ జూన్ మాస స్థానానికి ఈవిడ జూనియస్ అన్న దేవునితో పోరాడుతుంది. వారిరువురి పేర్లతో జూన్ వచ్చింది. దీనిని యువతకు (juniores) అంకితమిచ్చినారు.
తరువాత నెలల పేర్లు పెంటలిస్, సేక్స్టలిస్, సెప్టంబర్,అక్టోబర్, నవంబర్, డిసెంబర్ గ ఉండేవి. 5, 6 నెలలైన పెంటలిస్, సేక్స్టలిస్ లను జూలై, ఆగష్టులుగా తమ పేర్లతో జూలియస్, అగస్టస్ సీజర్లు మార్చుకొన్నట్లు మనము చెప్పుకొన్నాము. 7వ నెలనుండి 10వ నెలవరకు పేర్లు అట్లే వుండిపోయినాయి.
సెప్టెంబర్ – సెప్ట్ అంటే సప్త 7వ నెల
అక్టోబర్ – అక్ట్ అంటే అష్ట 8వ నెల
నవంబర్ – నవ అంటే నవ 9వ నెల
డిసెంబర్ – డెస్సి అంటే దశ 10వ నెల
దీనిని బట్టి ఈ మార్పులకు ముందు 11వ నెలగా జనవరి, 12వ నెలగా ఫిబ్రవరి వున్నట్లు రూఢియై పోయింది.
ఇక వారములైన సండే, మండే .. .. .. .. సాటర్ డేలను మన వారముల పేర్లను వారు వారి భాషలలోనికి మర్చుకొన్నావే.
ఇన్ని మార్పులు చేర్పులు కూర్పులు జరిగిన తరువాత కుడా వారి కాలమానము భూభ్రమణముతో పోల్చిన 26 సెకన్ల తేడా వున్నది. ఆ సెకన్లు 3323 సంవత్సరములకు ఒకరోజు ఔతుంది. దానిని ఆ సంవత్సరములోని ఒక నెలకు (బహుశ ఫిబ్రవరికేనేమో) కలుపుకొన వస్తుంది.
వాస్తవ కాల గణన కొరకు తమ తప్పులు తాము తెలుసు కొనుచూ కృషి చేసిన శాస్త్రజ్ఞులు కల్గిన ఈ రోమన్ క్యాలెండరు తప్ప, ప్రాచీన నాగరికత కలవని చెప్పుకొనెడు ఎన్నోపాశ్చాత్య దేశములు వారి వారి దేశ కాలానుకూలంగా తయారు చేసి వాడుకొన్నానూ, కాలానికి కాలొడ్డి నిలువలేకపోయినవి. మయుల క్యాలెండరు లోని చివరి దినమైన 21 డిసెంబరు 2012 న యుగాంతము కాలేదు కదా!
చివరిగా ఒక మాట చెప్పి ముగించుతాను. మనకు రోజు అనేది ఉదయం (ఇంచుమించు) 6గం. లకు ఔతుంది. ఈ విషయాన్ని పాశ్చాత్యులు తమ కేలెండరునకు అనుకూలముగా మార్చుకోలేక యదా తధంగా తీసుకొన్నారు. మరి వాళ్ళకు రోజు రాత్రి 12 కు గదా మొదలయ్యేది అంటారేమో. వాళ్ళకు మనకు కాల వ్యత్యాసము ఇంచుమించు 6 గంటలు. మనకు 6గం. ఉదయమైతే వాళ్ళకు అర్ధరాత్రి 12గం. కదా.
డిసెంబర్ 25 న క్రీస్తు పుట్టుక జరుగలేదు. జనవరి 1 క్రొత్త సంవత్సరము కాదు. ఇప్పటికైనా మనసు పెట్టి ఆలోచించితే మన పూర్వీకుల ప్రతిభను పునరుజ్జీవింప జేయ గలము.ఇకనైనా క్రొత్త సంవత్సరము ఉగాదితో మొదలౌతుందన్న వాస్తవాన్ని భాతీయ కాలగణన చదివిన తరువాత ఆకళింపు చేసుకొని ఆప్రకారంగానే మొదలు పెడతారని ఆశిస్తున్నాను.
మాటలలో ఏదన్నా చొరవ తీసుకోనివుంటే తప్పుగా తలవరని ఆశిస్తాను.
ఓం తత్సత్
No comments:
Post a Comment