ఇలా ఎందరున్నారు ? - 3
- అంగులూరి అంజనీదేవి
(జరిగిన కధ : తన తండ్రి స్నేహితుడైన శివరామకృష్ణ గారి ఇంట్లో ఉంటూ ఇంజనీరింగ్ చదువుతూ ఉంటుంది సంకేత. ఆయన కొడుకు శ్రీహర్ష సంకేతకు సీనియర్. హిందూ, సంకేత, పల్లవి, శివాని స్నేహితురాళ్ళు. రాంగ్ కాల్ కి బలైపోయిన తన ఫ్రెండ్ కధ చెప్తుంది పల్లవి. అనాధైన తనను చేరదీసిన శివరామకృష్ణ తల్లి వరమ్మను కంటికి రెప్పలా కాపాడుతుంటుంది పనిమనిషి నీలిమ. సంకేత ఇంటికి వచ్చిన పల్లవి, శివాని, నీలిమను ఎద్దేవా చేస్తుంటారు. పదవ తరగతి చదివిన నీలిమ పేపర్ లో చదివిన అంశాలను వారితో చర్చిస్తూ ఉంటుంది ...) శివాని బరువుగా నిట్టూర్చి "ఇంత సేపు నిలబెట్టి పనికి రాని చెత్తంతా వినిపించటం అవసరమా నీకు ? దేశం ఎలా ఉంటే నీకెందుకు? ఈ కొంపలో నీకింత ముద్ద దొరుకుతుంది కదా! అది చాలదా? అయినా ఇవన్నీ ఇంట్లో పని చేసే దీనికెలా తెలుస్తాయే! అంది. వరమ్మ బామ్మ పక్కన చేరి పాత పేపర్లు చదువుతుంది. “ఇంట్లో పనేగా చేసేది అని దాన్ని తక్కువ అంచనా వేయకు. చదివింది టెంతే అయినా తన బుర్రను సాగదీసి ఆలోచించాలని చూస్తుంది", అంది పల్లవి. "అమ్మో! దీన్ని నమ్మకూడదు బాబూ! ఇక్కడే ఉంటే ఇంకా ఏం మాట్లాడుతుందో ఏమో! పద లోపలికి..." అంది శివాని. ముగ్గురూ లోపలికి వెళ్ళారు. వాళ్ళని చూస్తూ నిశ్చేష్టయై నిలబడింది నీలిమ. శివాని, పల్లవిల స్నేహం సంకేతకి అంత మంచిది కాదేమో అంపించింది నీలిమకు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా వాళ్ళు ఎక్కూగా సంకేతతో కనిపిస్తున్నారు. పల్లవిని పక్కకు పెడితే శివాని మాటలు నీలిమకు బొత్తిగా నచ్చటం లేదు. "కాలుష్యం పెరుగుతుందంటే చెట్లను పెంచమంటున్నారు...నీళ్ళు చాలీ చాలని చోట్ల సూక్ష్మ సేద్యాలు చెయ్యమంటున్నారు. తినే ధాన్యం పురుగు మందుల వల్ల విషపూరితం అవుతుందంటే సేంద్రీయ ఆహారం వైపు మళ్ళాంటున్నారు....మరి ఈ శివానిలాగా మాట్లాడే వాళ్ళను ఏం చేయాలి?" అని ఆలోచిస్తూ ఒక క్షణం అలాగే నిలబడి ఆ తర్వాత మేడ మీదికి వెళ్ళింది నీలిమ. శ్రీహర్ష ఎప్పుడైనా స్నేహితుని రూంలోనే ఉండి చదువూకుంటూవుంటాడు. తినటానికి మాత్రం ఇంటికి వస్తాడు....పడుకొనేది కూడా స్నేహితుని గదిలోనే...ప్రతి రోజూ ఇంట్లోనే స్నానం చేసి తయారై కాలేజీకి వెళ్తూవుంటాడు. ఆ రోజు శ్రీహర్ష కాలేజీ వదలగానే ఇంటికి రాలేదు. తను రావటం ఆలస్యం అవుతుందని, ప్రస్తుతం రక్తదాన శిబిరం దగ్గర వున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పాడు. అది విని హతాసురాలయింది తల్లి కాంచనమాల. తనకి తెలీకుండా తన కొడుకు రక్తాన్ని దానమిస్తున్నాడా! అదేమైనా చాక్లెట్టా ! కొని చేతిలో పెట్టటానికి...వద్దని చెప్పేలోపలే శ్రీహర్ష కాల్ కట్ చేశాడు. కాంచనమాల ఉసూరుమంటూ ఓ చోట కూలబడి...దిగులుగా చూస్తూ.... "నా కొడుకు బి .టెక్., చదువుతున్నాడే కానీ ఇంత అమాయకుడనుకోలేదు. ఒంట్లో ఉన్న రక్తాన్ని శక్తిగా మార్చుకొని ...చదువుకోసం వాడుకోవాలి కానీ అదేదో పంచదార అయినాట్లు పంచిపెడతాడా? వాడు ఏది తింటాడో ఏది తినడో అడిగిమరీ వండి పెట్టేది ఇందుకేనా? ఇదేం బుద్ది? వాడి బుద్దిని నువ్వే మార్చాలి దేవుడా! లేకుంటే ఖర్చు పెట్టే కొద్దీ అకౌంట్లో డబ్బులు తరిగిపోయినట్లు ఒంట్లో రక్తాన్ని కొంచెం కొంచెం కాజేసుకుంటాడు. ఇంత వయస్సు వచ్చినా ఇంకా పిల్లతనమేనా!చిన్నప్పుడు కూడా అంతే! ఆటల పేరు తో దెబ్బలు తగిలించుకొని ఒంట్లో రక్తాన్నంతా పోగొట్టుకొనేవాడు. ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా రక్తం పట్టి ఒళ్ళు చేస్తున్నడని మురిసిపోతుంటే అది కూడా లేకుండా చేస్తున్నడు..." అని పైకే అంటుంటే అక్కడే ఉన్న సంకేత విని అర్ధం చేసుకుంది. ఎంత వాడైనా తల్లికి కొడుకే...ఎంత వయస్సు వచ్చినా ఒళ్ళో పిల్లాడే...అందుకే సంకేత కల్పించుకొని "మీరనేది నిజమే ఆంటీ!నేను నా రక్తం ఇవ్వకుండానే ఆ శిబిరాన్ని దాటుకొని వచ్చేసాను. నా స్నేహితురాలు హిందూ వెళ్ళింది ఇవ్వటానికి.... అదసలే బక్కది.అయినా వెళ్తుంది. ఎంత చెప్పినా వినదు. వినని వాళ్ళకి చెప్పలేం ఆంటీ! మీలాగే నాక్కూడా చెప్పిన మాట వినకపోతే బాధనిపిస్తుంది..."అంటూ వెళ్ళి ఆమె పక్కన కూర్చుంది. కాంచనమాల ముక్కుచీది "వాడిని నేనెలా పెంచుకున్నాను.చిన్న పని కూడా చెయ్యనిచ్చే దాన్ని కాదు. కోరిందల్ల ఇచ్చేదాన్ని....వాళ్ళ నాన్న గారికి తెలిస్తే ఒప్పుకోరని పక్కకి తీసుకెళ్ళి డబ్బులు కూడా ఇచ్చేదాన్ని....చివరికి నాకు తెలీకుండా రక్తాన్నిస్తాడా!అంటూ అడిగింది. సంకేత ఆమెనే చూస్తూ "ఆంటీ! ఏ స్ఫూర్తీ లేనిదే ఏదీ రాదంటారు. శ్రీహర్షకు చిన్న్నప్పుడు మీ ఒళ్ళో కూర్చో బెట్టుకొని విశేషమైన కబుర్లు లాంటివేమైనా చెప్పారా? అంటే ఐ మేన్ దేశం పట్ల గౌరవాన్ని, దేశభక్తిని పెంచుకోమని...రూల్స్, రెగులేషన్స్ పాటించమని ...క్లాసు పాఠాలే కాదు వ్యక్తిత్వం కూడ్డా కావాలని చెప్పేవాళ్ళా! నాకెందుకో శ్రీహర్ష చాలా మంది అబ్బయిలకన్న డిఫరెంట్ గా అనిపిస్తాడు" అని అంది. ఆమె వెంటనే సంకేత వైపు చూసి "అలాంటి ఏడుపులన్నీ అదిగో ఆ ముసలమ్మ ఏడ్చేది. నేను ఎన్ని చెప్పి ఏం లాభం? చివరకి నాకు చెప్పకుండా రక్తదాన శిబిరం దగ్గరకి వెళ్ళాడు. వెళ్ళినవాడు ఇవ్వకుండా వస్తాడా ? అదిగో వస్తున్నాడు చూడు...." అని ఆమె అంటుండగానే శ్రీహర్ష లోపలికి వచ్చి, చేతులు వాష్ చేసుకొని, ఎప్పటిలాగే వెళ్ళి డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు. కాంచనమాల, సంకేత కూడా వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చున్నారు....కాంచనమాల కొడుకునే చూస్తోంది. ఆమె కడుపు రగిలిపోతోంది. సంకేత మాత్రం ఎప్పటిలాగే బుద్దిగా, ఒద్దికగా కూర్చుంది. ఆ ముగ్గురి ముందు ప్లేట్లు పెట్టి నీలిమ వడ్డిస్తోంది. కాంచనమాల కోపంగా "రక్తం ఇచ్చేముందు నాతో ఒక్క మాటైనా చెప్పొద్దా శ్రీహర్షా! నాన్నతో అయినా చెప్పావా? ముఖం చూడు అప్పుడే ఎలా పీక్కుపోయిందో! నువ్వు కోలుకోవాలంటే ఎన్ని రోజులు పట్టాలి?" అంది. ఆమె మాటల్లో కోపం కన్న బాధే ఎక్కువగా వింపిస్తోంది. శ్రీహర్ష తేలిగ్గా నవ్వి..."రక్తం ఇచ్చినంత మాత్రాన అంత ఎఫెక్టేం ఉండదు మమ్మీ! వెంటనే మామూలైపోతాము. పాత బ్లడ్ పోయి ఫ్రెష్ బ్లడ్ పట్టి ఇంకా హుషారుగా ఉంటుంది" అన్నాడు. సంకేత అన్నంలో కూర కలుపుకుంటూ వింటోంది. కాంచనమాలకు కొడుకు మాటలు నచ్చలేదు. వెంటనే నీలిమ కల్పించుకొని "సార్ చెప్పింది నిజమే మేడం! ఆరోగ్యంగా ఉండేవాళ్ళు 56 రోజులకి ఒక సారి రక్తదానం చెయ్యొచ్చట...అన్నదానం, విద్యాదానం లాగే రక్తదానం కూడా చాలా పుణ్యం, ఎందుకంటే ప్రతి రెండు సెకన్లకోసారి ఎవరికో ఒకరికి రక్తాన్ని ఎక్కించవలసి వస్తుందట...రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేరు కదా! దాతల నుండీ రావలసిందే...అంతే కాదు ఒక సారి రక్తదానం చేయడం వలన ముగ్గురి ప్రాణాలను కాపాడవచ్చుట..."అంది. కాంచనమాల నీలిమ వైపు ఉరిమి చూస్తూ "ఇదంతా నీకెలా తెలుసు? మార్కెట్ పని మీద బయటకెళ్ళినప్పుడు రక్తం అమ్ముకొని ఏమైనా వస్తున్నావా? ఈ మధ్యన కొంత మంది తాగుబోతులకు డబ్బుల్లేక రక్తం అమ్ముకొని తాగుతున్నారట....నువ్వు కూడా బయటకి వెళ్ళినప్పుడు చిరుతిళ్లకి అలవాటు పడి, రక్తాన్నేమైనా అమ్ముకుంటున్నావా?" అంది. నీలిమ ఏమాత్రం నొచ్చుకోకుండా శ్రీహర్ష ప్లేట్లో ఇంకాస్త అన్నం వడ్డిస్తూ "లేదు మేడం! ఇంత వరకూ నేను రక్తాన్ని ఇవ్వలేదు. అవకాశం కూడా రాలేదు. వస్తే అమ్ముకోను. ఉచితంగానే ఇస్తాను....నాకు ఇవన్నీ ఎలా తెలుసు అంటే ఒకప్పుడు మా అనాధ ఆశ్రమంలో దీని గురించి చెప్పేవాళ్ళు...అప్పుడప్పుడు రక్త నిధి వాళ్ళు వచ్చి 17 సంవత్సరాలు దాటిన వాళ్ళ దగ్గర రక్తం తీసుకొని వెళ్ళేవాళ్ళు..."అంది. నాకు బాగ తెలిసిన విషయాన్నే మీకు చెబుతున్నాను అన్న ఆత్మ విశ్వాసం, ఆత్మతృప్తి నీలిమ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. అది గమనించిన శ్రీహర్ష ఏం మాట్లాడలేదు. ఒక్క క్షణం నీలిమ వైపు చూసి, తిరిగి తన దృష్టిని ప్లేటు వైపుకి మళ్ళించాడు. కాంచనమాల నీలిమను వురిమి చూసి "చెప్పింది చాల్లే! నోరు మూసుకొని అవతలికి పో...." అంటూ కసిరింది. ....నీలిమ ముఖం గంటుపెట్టుకొని పక్కకెళ్ళింది. కాంచనమాల తత్వం తెలియనిది కాదు. సందర్భం ఏదైనా కోప్పడుతూనే వుంతుంది...తను అనుకున్న స్థాయిలో బాధ పడుతుందా లేదా అని మధ్య మధ్య లో ముఖం లోకి చూస్తూ కోప్పడుతుంది. ఇది మరీ ఇబ్బందిగా వుంటుంది నీలిమకు....అయినా తప్పదు. ఈ ఇంటిని మించిన రక్షణ బయట ప్రపంచంలో తనకి దొరకదు. ఇది శ్రీహర్షకు తెలుసు. శివరామకృష్ణకు కూడా తెలుసు. నీలిమ పట్ల కాంచనమాల ప్రవర్తన వాళ్ళకి నచ్చకపోయినా వాళ్ళు ఏమీ అనలేరు. అంటే నీలిమను ఏ క్షణంలోనైనా కాంచనమాల తరిమేస్తూందన్న భయం....కానీతన వయసే వున్న సంకేత ముందు నీలిమను అలా కసురుకోవడం, నీలిమ పక్కకు వెళ్ళాకా కూడా వదలకుండా అదే విషయమై మాటలు కొనసాగించడం శ్రీహర్షకి విసుగనిపించి తింటున్న ప్లేటును పక్కకి జరిపి మధ్యలోనే లేచి.... " దీన్నెందుకింత పెద్దగా చేస్తున్నావో అర్ధం కావటం లేదు ..." అంటూ ఒక్క క్షణం తల్లి వైపు చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలాంటి సందర్భాల్లోనే తల్లి మీద కోపం వస్తుంది శ్రీహర్షకి. కోపం కన్న ఎక్కువగా తనేంచేసినా తల్లి అర్ధం చేసుకోదన్న బాధనే అధికంగా వుంటుంది అతనికి. అవాక్కయింది కాంచనమాల. సంకేత స్థాణువై - వెళ్తున్న శ్రీహర్ష వైపే చూసింది. కొడుకు తినకుండా వెళ్ళినందుకు కాంచనమాల కన్నీళ్ళు పెట్టుకుంది. నివ్వెరపోయింది సంకేత....ఈ కన్నీళ్ళు ఎందుకొస్తాయి? వీటిని నియంత్రించే మార్గమే లేదా? ప్రపంచ్చంలో ఇంత మంది శాస్త్రవేత్తలు వున్నారు. ఆసాక్తిగా అనిపించిన ప్రతి అంశంపై పరిశోధనలు చేస్తున్నారు. ఈ కన్నీళ్ళ మీద ఎందుకు చెయ్యరు. దీనికో మంచి మందును కనిపెట్టి ఈ కన్నీళ్ళను అరికట్తవచ్చు కదా! వెంటనే కాంచనమాల తలను తన భుజంపై పెట్టుకొని ఓదార్చింది సంకేత. ఆ ఓదార్పు హాయిగా అనిపించి, దుఃఖం ఇంకా ఉదృతమైంది. ఆ దుఃఖాన్ని తమాయించుకుంటూ..."కొడుకు పుడితే అదృష్టం అని అందరూ అంటుంటే నమ్మి ఆనందించాను సంకేతా! నీ లాంటి కూతురు లేనందుకు ఇప్పుడు బాధ పడుతున్నాను". అంది "బాధ పడకండి ఆంటీ! దేన్నైనా తేలిగ్గా తీసుకోవాలి". అంది సంకేత. తేలిగ్గా ఎలా తీసుకుంటాం సంకెతా! అదే నువ్వు చూడుమీ అమ్మ, నాన్న దూరంగా ఉన్నా ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలిసినదానిలా రక్తం ఇవ్వకుండానే వచ్చావు...అదే శ్రీహర్ష అలా రాగలిగాడా!ఏం చెయ్యను చెప్పు?" అంటూ ఆమె లోని అసంతృప్తిని బయటపెట్టింది. సంకేత మౌనంగా ఉంది. కాంచనమాల మాటల్ని వినగానే శ్రీహర్ష గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. డైనింగ్ టేబుల్ దగ్గర శ్రీహర్ష ఉన్నంత సేపూ సంకేత వైపు చూడలేదు. పలకరించలేదు. హడావిడిగా వచ్చాడు. అలాగే వెళ్లాడు. ఎప్పుడైనా తామిద్దరు తటస్థపడేది ఒక్క డైనింగ్ టేబుల్ దగ్గరే....అయినా అప్పుడప్పుడు తనే విష్ చేస్తుంది. అతను చెయ్యడు, ఎందుకని? ...అహంకారమా! లేక తను వాళ్ళ ఇంట్లో తింటూ డబ్బూ ఇవ్వకుండా చదువుకుంటుందన్న చులకన భావమా! లేక అతన్ని మించిన అందగాడు, అతన్ని మించిన సంపన్నుడు లేడనా! తను కూడా అతని లాగే బి.టెక్ చదువుతోంది, అంతో, ఇంతో అందంగా ఉంది. ఇలాగే చదివితే మంచి ఉద్యోగం కూడా వస్తుంది. ఈ అర్హతలు చాలవాతనతో మాట్లాడడానికి...ఏది ఏమైనా అతనలా ఉండడం మనస్సును చీరేసినంత బాధగా ఉంది. ఎందుకంటే అతను ఇప్పటికీ తనలో పేదరికాన్నే చూస్తున్నాడు....అదేదో అంటరానితనం అయినట్లుదూరంగా పెడుతుంటాడు. పేదరికం అనేది కుటుంబ నేపథ్యం వల్లనో, అశక్తులైన తల్లి, దండ్రులవల్లనో వస్తుంది. అదేదో మహాపాపమో! నేరమో!అయినట్లు కనిపించిన ప్రతీ సారీ 'నువ్వెవరో నేనెవరో' అన్నట్లు ప్రవర్తించటం దేనికి? పేదరికం అనేది నేరమే అయితే ! పాపమే అయితే ఇండియా లో ఎంతమంది పేదవాళ్ళు లేరు! పేదవాళ్ల మనసుకు పేదతనం ఉంటుందా? చదువుకు పేదర్తనం ఉంటుందా? వ్యక్తిత్వానికి పేదతనం ఉంటుందా? మరి శ్రీహర్ష ఎందుకలా ప్రావర్తిస్తున్నాడు? ఖరీదైన డ్రస్ వేసుకోనంత మాత్రాన, ఖరీదైన జీవితాన్ని అనుభవించనంత మాత్రాన అంత చిన్న చూపు అవసరమా! ఇప్పుడే కాదు అతను తనతో పాటు ఎనిమిదవ తరగతి చదువుతున్న రోజుల్లో వేసవి సెలవుల్లో తమ ఊరు వచ్చినప్పుడు కూడా ఎగతాళిగా మాట్లాడాడు....ముఖం మీదే "సంకేతా! మీ ఊరిలో ఈ చింత తోపు, మామిడి వనం, కంది చేలు ఆడుకోడానికి బాగున్నాయి. కానీ మీ ఊరు నాకు నచ్చ లేదు. ఊరి నిండా చిన్న చిన్న 'హట్'లే ఉన్నాయి. అందులో మీ హౌస్ మరీ చిన్నది. చూడడానికి అస్స్సలు బాగాలేదు...మీ అమ్మా, నాన్న ఒక్క రోజు కూడా నీతో గడపకుండా పొలం పనులకి వెళ్ళడం ఇంకా బాగా లేదు... మా ఇంట్లో మా నాన్న ఆఫీసుకి వెళ్ళినా మా అమ్మ ఇంట్లో ఉంటుంది. ఒక వేళ మా అమ్మ మా అమ్మమ్మ వాళ్ల ఊరెళ్ళినప్పుడు మా నానమ్మ నాకు కధలు చెబుతుంది. నీక చాన్స్ లేదు" అన్నాడు. తనకి కన్నీళ్ళొచ్చాయి. తనకి కూడా మంచి సంపాదన పరుడైన తండ్రి, కధలు చెప్పే నానమ్మ ఉంటే బావుండనిపించింది. తనకు లేని నానమ్మ శ్రీహర్షకు ఉన్నందుకు పైకి చెప్పుకోలేని వ్యధగా ఉంది. ఈ నానమ్మలు ఎక్కడ ఉన్నా కధలే చెబుతారా? అవి తప్ప ఇంకేఅం రావా వాళ్లకి...?తనకి కూడా ఒక నానమ్మ ఉంటే బావుండు కదా. శ్రీహర్షకి ఉన్నవన్నీ తనకి ఎందుకు లేవు? ఉన్నట్టుండి ఒక రోజు శ్రీహర్ష "సంకేతా! మీరు బాగా పేదవాళ్ళట కదా! అందుకే మీ అమ్మ నాన్న రోజూ కూలి పనికి వెళ్తారట ....నిజమేనా!" అన్నాడు. అన్నీ తెలుసుకోవలన్న ఆరటం ఉంటే మంచిదే కానీ ఇవి అంత తెలుసుకో తగిన విషయాలా? అతనికి ఎల ఉందో తెలియదు కానీ తనకి మాత్రం తనని ఎద్దేవా చేస్తున్నట్లు అనిపించింది. ఎవరికి చెప్పుకోవాలి తన బాధని? తను మాట్లాడకపోవడంతో...."ఇవన్నీ నాకెలా తెలుసు అనూంటున్నావా. నాది మీ ఊరు కాకపోయినా మీ ఊరి దాస్ నా క్లాస్ మేట్! వాడు నీ గురించి చెబుతుంటాడు. మన ముగ్గురం ఒకే హైస్కూల్లో చదువుతున్నాం కాబట్టి నేను కూడా ఆసక్తిగా వింటుంటాను. నువ్వు హైస్కూల్కి రావాలంటే మీ ప్రక్క ఊరికి రావాలి. నేను అలా కాదు. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వస్తున్నాను. దాసు, నువ్వూ కలిసే వస్తుంటారు కాబట్టి వాడికి నీ గురించి బాగా తెలుసు. అవునూ!నిన్ను మీ వాళ్ళు పక్క ఊరికి తీసుకెళ్ళాలన్నా బస్ లో తీసుకెళ్ళరట కదా! చార్జీలకి డబ్బుల్లేక ఇసుక లారీ లో ఎక్కించుకెళతారుట.....నిజమేనా!ఇది కూడా వాడే చెప్పాడు. అవునూ..."మీ ఇంట్లో ఆడుకోవడానికి ఒక్క బొమ్మ కూడా లేదేం? నీకు పుట్టినరోజు పండుగలు చెయ్యరా మీ వాళ్ళు...? మీ బంధువులు కాని, తెలిసినవాళ్ళు కాని నీకు బొమ్మలు కొనివ్వరా?" అన్నాడు. "నేనేమైనా చిన్న పిల్లనా బొమ్మలతో ఆడుకోవటానికి..పుట్టిన రోజులాంటి పండుగలు మా ఇంట్లో జరుపుకోం! అలాంటివి మాకు ఇష్టం ఉండదు. దాస్ ఏం చెప్పినా అది నమ్మటమేనా! వినేవాళ్ళుంటే ఏమైనా చెబుతారని తెలియదా?" అంది కన్నీళ్ళాపుకుంటూ. "దాస్ నీగురించే ఎక్కువగా మాట్లాడుతాడు. నేను కూడా ఇష్టంగానే వింటాను. అది తప్పా...!"అనేవాడు. "ఒక వ్యక్తి గురించి ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం ఎంత వరకూ ఒప్పో నాకు తెలియదు...అంత అవసరమేంటో మీకే తెలియాలి.అయినా నా గురించి మీ ఇద్దరు అలా మాట్లాడుకోవడం నాకు నచ్చలేదు."అని అనగానే శ్రీహర్ష మాటలు ఆపేశాడు. ఇక అప్పటినుండి మాట్లాడటమే మానేశాడు. తను తొమ్మిదవ తరగతికి రాగానే దాస్ ఒక రోజు తనకి దగారగా వచ్చి "ఐ లవ్ యు సంకేత!" అన్నాడు. ఆకాశం ఊడి మీదపడినట్లు అదిరిపడింది. ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఎవరికి చెప్పినా అర్ధం చేసుకోరు. పైగా తననే తప్పు పడతారు. అందుకే నేరుగా హెచ్.ఎం., దగారకి వెళ్ళి ఫిర్యాదు చేసింది. హెచ్.ఎం., దాస్ ను గట్టిగా మందలించాడు. అంతే కాదు లోగడ డయాస్ మీద జరిగిన అల్లరిని, ఆటస్థలం దగ్గర జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకొని వెంటనే దాస్ ను సస్పెండ్ చేశాడు. పీడ వదిలిందని సంబరపడింది. కానీ దాస్ ఇంట్లో చెప్పకుండా ఆ ఊరినుండి వెళ్ళిపోయాడు. మళ్ళీ కనిపించలేదు. ఒక్క శ్రీహర్షకు తప్ప మిగిలిన స్నేహితులెవ్వరికి అతను అందుబాటులో లేడు. దాస్ ఎడబాటు శ్రీహర్ష కు పెద్ద లోటు అయింది. దాస్ ను గుర్తుచేసుకుంటూ అప్పుడప్పుడు ఒంటరిగా ఓచోటు కూర్చుని ఆలోచించేవాడు. ఆ వయసులో స్నేహితుని ఎడబాటు అనుభవిస్తేనే అర్ధమవుతుంది. ఒక్కో సారి 'ఏంటి శ్రీహర్షా! అలా ఉన్నావు?" అని ఎవరైనా అడిగితే 'దాస్ ఉంటే బావుండేదీ అని చెప్పేవాడు. శక్తి సరిపోవటం లేదు కానీ దాస్ కోసం ఏదైనా చెయ్యాలన్న ఆవేశం కూడా వచ్చేది అతనికి. కొద్ది రోజులు గడిచాకా శ్రీహర్ష తన పక్కనే నడుస్తూ కోపంగా "నువ్వు చేసిన పని రైటనుకుంటున్నావా? వాడేదో ఆవేశంలో వాగాడు....వాడు మాట్లాడింది తపే. తరువాత వాడు కూడా తనది తప్పని ఒప్పుకున్నాడు. నీకంత తొందరపాటు దేనికి? వాడలా అన్నప్పుడు నీవు కూడా ఏదో ఒకటి చెప్పాల్సింది. లేకుంటే మాతో చెప్పల్సింది. అదేంచెయ్యకుండా నేరుగా హెచ్.ఎం. దగ్గరకి వెళ్ళటమేనా! నీ ఒక్క కంప్లయింట్ తో చూడు వాడి జీవితమెలా గాడి తప్పిందో ! ఇంటికి దూరమయ్యడూ. చదువుకి దూరమయ్యడు. ఇప్పుడు వాడేం చేస్తున్నాడో తెలుసా! హైదరాబాదులో ఇటుకలు మోస్తున్నాడు.,,దీన్ని బట్టి నీకు చాలా దూరంగా ఉండాలని మా క్లాసు అబ్బాయిలంతా అనుకుంటున్నారు. నువ్వేదో మా నాన్నగారి స్నేహితుని కూతురివని చెబుతున్నా...నెకంత బిల్డప్ అవసరం లేదు." అన్నడు గట్టిగా. ఆశ్చర్య పోతూ "నాది బిల్డప్పా!!పదవతరగతి కూడా పూర్తి చెయ్యని అతను నన్ను ప్రేమిస్తానని చెప్పి అల్లరి చెయ్యడం బాగుందా? ఐ లవ్ యు అంటే అర్ధం కూడా తెలియదు నా తల్లిదండ్రులకి. వాళ్ళకి దాని అర్ధం చెప్పి బాధ పెట్టమంటావా? హెచ్.ఎం కి చెప్పకుండా దాస్ ఎలా చెబితే అలా విని నన్ను నేను బాధ పెట్టుకోమంటావా!ఎలాగూ నేను పేదదాన్నని, మా ఇల్లు చిన్నదని, నా దగ్గర బొమ్మలు లేవని, నా పుస్తకాలు సెకండ్ హ్యాండ్ వని, స్కూల్ సెలవుల్లో నేను కూడా కూలి పనికి వెళ్తానని నువ్వూ దాస్ నవ్వుతూనే వున్నారు...ఇంకా నవ్వించుకోవటం ఎందుకు?నాకెందుకో ఎవ్వరు నన్ను చూసి నవ్వినా రోషంగా ఉంటోంది...నన్ను ఏడ్పించడం కోసమే నవ్వుతున్నారని అర్ధమవుతోంది. నా ఏడ్పులో ఏం కనిపించి అంత ఆనంద పడుతున్నారో నాకు తెలియటం లేదు...ఇప్పటికే నేను గట్టిగా రెండు గంటలు చదివితే మిగతా గంటలన్నీ దాస్ నా వెంట పడటం గురించి, నన్ను ఎగతాళి చేస్తున్నవాళ్ళగురించీఅలోచించటానికే సరిపోతుంది. నా ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేస్తారు...అయినా నాకూ టైమొస్తుంది. అప్పుడు నా వెంట పడినవాళ్ళు, నన్ను గేలి చేసిన వాళ్ళు తప్పకుండా పశ్చాత్తాపపడతారు." అంది. శ్రీహర్ష కోపంగా వెళ్ళిపోయాడు. తొమ్మిదవ తరగతి నుండే తనకి పెళ్ళి సంబంధాలు వచ్చాయి. ఒక్క సంబంధం కూడా తన తల్లిదండ్రులకి నచ్చలేదు. నచ్చక పోవడానికి కారాణం వాళ్ళుకూడా తమలాంటి పేదవాళే... ఆ సంబంధాలతో సంబంధం కలుపుకుంటే తను కూడా వాళ్ళ లాగా పొలం పనులకి వెళ్ళి బ్రతకాల్సి వస్తుందని గ్రహించి, వద్దనుకున్నారు. అదీకాక ఈ మధ్యన తమతో కలిసి కూలి పనులు చేసుకుంటున్న వాళ్ళ పిల్లలు కొందరు తాము తమ తల్లిదండ్రుల్లా కాకూడదని కసితో చదివి సాఫ్ట్ వేర్ రంగాల్లోకీ, ఐ.ఎ.ఎస్, ఐ.పి.ఎస్ రంగాల్లోకి ప్రవేశిస్తున్నారట.దాని స్ఫూర్తిగా తీసుకొని తను కూడ ఏదో ఒక రంగంలో రాణించాలని వాళ్ళ కోరిక. ఆ తర్వాతే పెళ్ళి. అయినా పెళ్ళిదేముంది. అమ్మాయి తన కాళ్ళ మీద తను నిలబడితే ఏ అబ్బయి అయినా వస్తాడు. పెళ్ళి చేసుకుంటాడు అన్నదే వాళ్ళ అభిప్రాయం. ...తన పట్ల తల్లి దండ్రుల అభిప్రాయం ఒక వైపు, శ్రీహర్ష మౌనం మరోవైపు చేరి తనను మొండిగా తయారు చేశాయి. కష్టపడి చదివేలా చేశాయి. పోటీ తత్వాన్ని పెంచాయి... రోజులు గడుస్తున్నాయి. ఎంసెట్ లో శ్రీహర్ష కన్న తనే మంచి ర్యాంక్ సాధించింది. బి.టెక్ లో లో ఫ్రీ సీటు సంపాయించుకుంది... శ్రీహర్షకి జూనియర్ గా అతను చదువుతున్న కాలేజీ లోనే చదువుతోంది. ..అతను తనతో ఇంట్లో ఎలా ఉంటాడో కాలేజీలో కూడా అలాగే ఉంటున్నాడు. ఫష్టియర్ లో ర్యాగింగ్ కూడా చెయ్యలేదు...ఫ్రెషర్స్ పార్టీలో కూడా అంతే ! వెరీ నార్మల్! ఆఫ్ట్రాల్ నువ్వెంత? అన్నట్లే చూస్తున్నాడనిపిస్తోంది. అతనిలో మార్పు రావాలి. అందరమ్మాయిలతో మాట్లాడినట్లే తనతో మాట్లాడాలి, తననూ గుర్తించాలి...అందుకోసం తనేమైనా చెయ్యాలి. ఏమైనా అంటే ఐ మీన్ ఇంకా బాగా చదవాలి. శ్రీహర్ష ను మించి పోవాలి. చదువులో, ఉద్యోగంలో, జీవితంలో ...ఇదే తపన, ఇదే ధ్యాస... జీవితంలో ఎప్పుడైనా దాస్ తటస్తపడితే, 'నేను ఆ రోజు సంకేతకి అలా చెప్పి ఉండాల్సింది కాదు. అలా చెప్పటం వల్లనే నా జీవితం అదఃపాతాళానికి పోయింది. ఆమె ఉన్నత శిఖరాలకి చేరింది.'అని అనుకోవాలి. శ్రీహర్ష అలా అనుకోక పోయినా మనస్ఫూర్తిగా మాట్లాడగలగాలి..చదువుతో దేన్నైనా సాధించవచ్చట... దేన్నైనా అధిగమించవచ్చట... దేన్నైనా చేరుకోవచ్చట... అందుకే చదువును మించింది లేదు. చదువుల దారిని మించిన దారి లేదు. ఇప్పుడు తన ధ్యేయం, లక్ష్యం అంతా చదువే. (సశేషం...)
No comments:
Post a Comment