కాల గమనమెరుగని శూన్యము
- వారణాసి రామబ్రహ్మం
ప్రణయిని నా మనసు
కనుమరుగైన ఈ వేళ
మనసు మనసులో లేదు
స్నేహాలు లేవు మోహాలు లేవు
హాసాలు సరసాలు హుళక్కి
తపనలు తాపములు వలపు తీపులు
గుండె చప్పుడులు సుడుల సడులు
సడుల సుడులు సవ్వడులు లేవు
ఆగిపోయె
ప్రియురాలితో ప్రణయ కలాపములు
సమసిపోయె
తరుణ రమణీ సౌందర్యోపాసనలు
లేవు భావమ్ముల రాకపోకలు
ఇంకి పోయె
సురుచిరానందాస్వాదనా ప్రవాహములు
చెవిటి నైతిని శ్రావ్య నాదములకు
గ్రుడ్డినైతిని కమనీయ దృశ్యములకు
మల్లెల ఘుమ ఘుమలు మధుర కటు రుచులు
మృదు స్పర్శల తమకములు తెలియనైతి
మనసు చాటు మాటైన నేడు
వెన్నెల విహారములు
అమవస నిశి ఒకటాయె
అనురాగ వీక్షణములు
విరాగ తీక్షణములు సమమాయె
విషయములు ఇంగితములు
అచ్చులు హల్లులు భాషలు
విజ్ఞానములు కళలు తత్త్వములు
అనుభవములు అర్థ స్పృహలు
చింతనలు స్మరణలు
తెలిపి నేర్పి జరిపించు
జీవన సహచరి నా మనసు
మోము చాటేసిన ఇప్పుడు
వేణువూదలేని కృష్ణుడను నేను
తాండవింపలేని నటరాజును నేను
నిలచిన గంగా ప్రవాహమును నేను
చెలిని బాసిన చిలికాడను నేను
కాల గమనమెరుగని శూన్యమును
No comments:
Post a Comment