కన్నీటి విలువ - అచ్చంగా తెలుగు
కన్నీటి విలువ
- పోడూరి శ్రీనివాసరావు

భగవంతుడు నాకో అపురూపమైన వరమిచ్చాడు
కష్టాలనైనా, సుఖాలనైనా ఒకేలా చూడమన్నాడు
అందుకే కష్టాలకు కన్నీళ్లిచ్చాడు...
సుఖాలకు కూడా కన్నీళ్ళే ఇచ్చాడు...
కానీ, కనుల నుండి తొణికిన
ఆ కన్నీళ్లు.. కష్టానివో.. సుఖానివో
తెలుసుకోలేడు, ఏ మానవమాత్రుడూ!...
కన్నీరు చాలా ఖరీదయినది
అందుకే నా కన్నీరు వృధా చేయను
సుఖంలో వచ్చే... ఆనంద భాష్పాలను
కంటి కొనల్లోనే తుడిచేస్తాను ఆరంభంలోనే...
కానీ... దుఃఖాశృవులు
గట్టు తెగిన, గేట్లు తెరచిన
ఆనకట్ట లాంటివి...
ఆనందభాష్పాల్లా కాదు...
తుడిచేయడానికి...
అందుకే అతికష్టం మీద
అదిమి పడతాను
అదీ.. కొంత ప్రవాహం
బయటకు వచ్చాక!
దుఃఖాశృవులతో
నా చెక్కిలి తడిసాక!!
కన్నీరు విలువ తెలిసినవాడవయితే
ఏ ఒక్కరి మనసూ బాధించకు...
వారి వదనాలలో ఎప్పుడూ
నవ్వులు పూయించు...
ఆనందంతో జీవన సరాగాలు వెలయించు!
స్త్రీ కంట కన్నీరొలికితే
ప్రళయాలె సంభవిస్తాయి
మన పురాణ కాలం నుంచీ
ఈ విషయం మనకనుభవమేగా?
కనుల నుండి స్రవించే కన్నీరు
చిన్న బిందువుగా మొదలయి
ధారగా మారి, పాయగా పెరిగి
నదిలా ప్రవహించి, సాగరంలా కల్లోలించితే
సమస్త సునామీలూ... బలాదూరే...
చివరకు...
కళ్ళలోని నీళ్లన్నీ ఇంకిపోతే
ఏ భావం వ్యక్తపరచలేని
శూన్యమైన తటాకం...
మనిషి మనోభావాన!
మిగిలిపోయిన వేదన!!!

No comments:

Post a Comment

Pages