కొత్త ప్రేమ
- సూర్య కుకునూర్
“నేనేం చేసినా మీకు అతిశయం గానే ఉంటుంది.ఈ ఏడేళ్ళలో ఎప్పుడైనా రమా,నువ్వు ఈ చీరలో బాగున్నావ్ .ఈ కూర బాగా చేసావ్ .అన్నదేమన్నాఉందా?ఆ అయినా నా కంత అదృష్టం కూడాను.అబ్బాయి బ్యాంకులో క్లర్క్ అంట అమ్మాయ్ అని అంటే పోన్లే లెక్కలు తెల్సిన మనిషిలే లైఫ్ బాగుంటుంది అనుకున్నా కాని మీతో ఉంటే లెక్క పెట్టుకోడానికి మీరు నేను తప్ప ఈ ఇంట్లో ఇంకేం ఉండదని తెలుసుకోలేకపోయాను”నాకు క్యారియర్ సర్దుతున్న నా భార్య రమ ప్రతి రోజులానే దీర్ఘం తీస్తూ అంది.! “మాకు పెళ్లై మొన్న వైశాఖానికి ఏడేళ్ళయింది.మాకు అన్ని ఉన్నాయి. సొంత ఇల్లు,కారు,హోదా తో పాటు ఒకటే ఇంట్లో ఉంటూ ఇద్దరి మధ్య దగ్గర కాలేనంత దూరం కూడా ఉంది. తనతో కలిసి నడక పడక పంచుకున్నపుడు రాని దూరం మా ఇద్దరి మధ్యకు ఎప్పుడు వచ్చిందో తెలియలేదు కాని చూస్తుండగానే మా బెడ్ రూమ్ లో డబుల్ కాట్ రెండు గా విడిపోయింది”. “ఈ వెధవ తల పోటు ఒకటి కూర్చోనివ్వదు,కుదురు ఉండనివ్వదు”వంట గదిలో విసుక్కుంటూ పని చేసుకుంటున్న రమ మాట విని,హాల్ లో టీపాయ్ పై సర్ది పెట్టి ఉన్నలంచ్ బ్యాగ్ ని తీసుకుని నేను బ్యాంక్ కి బయలుదేరాను. రామవరప్పాడు రింగ్ దాటి బెంజి సర్కిల్ వైపు వెళ్తూ ఉండగా ఒక కుర్రాడు కారుకు అడ్డు వచ్చి ఆపుతున్నాడు. వయసు 25లోపు ఉంటుంది, జీన్స్ టీ షర్ట్ వేసుకున్నాడు.“సార్..సార్..నా వైఫ్ కి సివియర్ గా ఉంది,రాత్రి నుండి ఒకటే కడుపు నొప్పి,ఏవో యూనియన్ ల మధ్య గొడవలంట సార్,బస్ లు ఆటోలు రావట్లేదు, ప్లీజ్ సర్ కొంచెం గవెర్నమెంట్ హాస్పటల్ వరకు లిఫ్ట్ ఇస్తారా”ఆదుర్దా గా అడుగుతున్నాడు.రండి అని అనటం పూర్తి కాకుండానే అతను బస్ షెల్టర్ వైపు పరిగెత్తాడు.షెల్టర్ నుండి ఒక అమ్మాయిని ఎంతో జాగ్రత్తగా తీసుకుని వస్తున్నాడు.చాలా అందంగా ఉంది,ఎవరో పెద్దింటి అమ్మాయనుకుంట ఆ సుకుమారం కొట్టొచ్చినట్లు కనబడుతుంది.బహుశా పెద్దవాళ్ళని కాదనుకుని చేసుకున్నపెళ్లి అనుకుంట..వెనక సీట్ నుండి సార్ వెళదామా అని అడిగిన ఆ కుర్రాడి మాట విని కార్ ని కదిలించాను. నువ్వేం తినలేదు అని ఆమె అనటం తో హాస్పిటల్ లో పని అయిపోయాక ఇద్దరం కలిసి తిందాం..సరేనా అంటున్నాడు. రేర్ వ్యూ మిర్రర్ లో ఇద్దర్నీచూసిన నాకు రమ కళ్ళ ముందు మెదిలింది.”రమా..కడుపునొప్పిగా ఉంది, కాస్త జావ పెడతావా అంటే..బయట ఏ గడ్డో తినొచ్చి ఉంటారు,అయినా ఇంట్లో ఒకత్తి ఉంది దానికి తీసికెళ్దాం అని లేకుండా తింటే అరుగుతుందా ఏంటి? అనుభవించండి” అని దెప్పుతూ అన్నది గుర్తొచ్చింది.సార్.. హాస్పిటల్ వచ్చేసింది అన్నమాట విని ఆలోచన నుండి బయకొచ్చాను. కారు నుండి కిందకు దింపుతుంటే ఆ అమ్మాయి నొప్పితో తట్టుకోలేకపోతుంది.అమ్మాయికి ధైర్యం చెప్తూ ఆమెను రెండు చేతులపై ఎత్తుకుని హాస్పిటల్ లోపలికి తీసుకెళ్ళాడు.వాళ్ళని చూసి నేను కార్ స్టార్ట్ చేయలేక వాళ్ళ వెనకే లోపలికి వెళ్లాను.రిసెప్షన్ దగ్గర అతను అమ్మాయిని చేర్చుకొమ్మని డబ్బులు తీసుకొస్తా అని బ్రతిమాలుకుంటూ కనిపించాడు. వాళ్ళు మాండేటరి అని రూల్స్ మాట్లాడుతుంటే నేను వాళ్ళతో మాట్లాడి డబ్బులు కట్టడంతో అమ్మాయిని టెస్ట్ లకి తీసుకెళ్ళారు. చాలా థాంక్స్ సార్..అని చేతులు జోడించబోతే అతన్నివారించి, రా టీ తాగుదాం అని క్యాంటీన్ కి వెళ్ళాం.లవ్ మ్యారేజా అని అడిగాను,”అవును సార్,ఇద్దరం ఏడేళ్ళ నుండి ప్రేమించుకున్నాం,వాళ్ళ ఫ్యామిలీ తో పోల్చుకుంటే మాది మిడిల్ క్లాస్ అని వాళ్ళింట్లో ,మా వాళ్లకి అవమానం జరిగిందని మా ఇంట్లో ను పెళ్ళికి ఒప్పుకోలేదు.మీ ప్రేమా?మా ప్రేమా? రెండింటిలో దేనికో ఒకదానికే వోట్ వేయమన్నారు. మేం మా ప్రేమనే కోరుకుని దూరంగా వచ్చేసి నచ్చినట్లు బ్రతుకుతున్నాం”.చెప్పటం ఆపాడు. కష్టంగా అనిపించట్లేదా? రెట్టించాను.ఇష్టపడి మాతో ట్రావెల్ చేయటానికి కష్టం,సుఖం,బాధ,ఆనందం అంటూ ఏమొచ్చినా పంచుకోడానికి నాతో నా ప్రేముంది గా సార్”అన్నాడు. అలా అనటం లో అతని భార్య పై అతనికి ఉన్న ప్రేమ, గౌరవం తెలుస్తున్నాయి.సార్ మీ నంబర్ ఇస్తారా..నేను ఆఫీస్ లో డబ్బులు తీసుకుని కాల్ చేస్తాను అన్నాడు.డబ్బులు గురించి కాదు కాని ఏ సాయం కావాలన్నా కాల్ చెయ్ అని నంబర్ ని చెప్పినాకు టైం అవ్వటం తో బ్యాంక్ కి వెళ్ళిపోయాను. బ్యాంక్ లో ఉన్నంత సేపు నాకు రఘు మాటలే గుర్తొచ్చాయి.”ఏం జరిగినా పంచుకోటానికి నాతో నా ప్రేముంది గా”అని ఎంత నమ్మకంగా చెప్పాడు.”అతనికి అతని భార్యకి మధ్యలో ఉన్నది..నాకు రమకు మధ్య లేనిది ఏమిటో అర్ధమైంది”. ఇద్దరూ ఎంత ముచ్చటగా ఉన్నారు.మనసులో ఎంత బాధ ఉన్నా పైకి ఒకరిపై ఒకరు ప్రేమనే చూపించుకుంటున్నారు. ఇద్దరినీ చూడాలనిపించింది.అతని నంబర్ తీసుకోనందుకు తిట్టుకున్నాను.లంచ్ టైం లో కొత్త నంబర్ నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేసాను,సార్ నేను రఘు మీ పనయ్యాక ఒకసారి హాస్పటల్ కి వస్తారా అడిగాడు, తప్పకుండా అని చెప్పిబ్యాంక్ అయిపోగానే హాస్పటల్ కి వెళ్లాను.లోపలికి వెళుతున్ననన్ను చూసిన రిసెప్షనిస్టు సార్ అంటూ పిలిచింది.సీరియస్ అయ్యి అమ్మాయి కన్ను మూసిందని అది తట్టుకోలేక ప్రాణాలు వదిలేసాడని ఆమె చెప్తుంటే నా చెవుల్నినేనే నమ్మలేక పోయాను.అదంతా అబద్ధం అయితే బాగుండు అని అనుకుంటుండగా ఆమె పేపర్ చుట్టి ఉన్నడబ్బుకట్టని నాకు ఇచ్చింది. పేపర్ ని ఓపెన్ చేసి అందులో “సార్.. నేను పిరికి వాడిని కాదు,నా ప్రేమ తోడు లేని ప్రయాణం లో నేనంటూ చేరవలసిన గమ్యాలు ఏమి లేవు సార్,అందుకే జంటగా మొదలు పెట్టిన ప్రయాణాన్నిజంటగానే ముగిస్తున్నాం.చివరిగా ఒక మాట సార్ మేం ఏ తప్పు చెయ్యలేదు సార్ ప్రేమించుకున్నాం అంతే“అని రాసి ఉన్నది చదివి గుండె అంతా భారమయిపోయింది. అంత ధైర్యంగా మాట్లాడిన వాడు ఎందుకు ఈ పని చేసాడు అని అతనిపై కోపం వచ్చింది.ఆలోచిస్తే ఒకరికోసం చనిపోయేంత ధైర్యం అతని ప్రేమలో కనిపించింది.అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయమని చెప్పినేను ఇంటికి బయలుదేరాను. కార్ హార్న్ విని బయటకొచ్చిన రమ ఇంతసేపు రాచకార్యాలు ఏమిటో అంటూ సాగదీస్తూ గేట్ తీసింది.కార్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్తూ తల నొప్పి తగ్గిందా? అడిగాను.రమ ఏ సమాధానం ఇవ్వకుండా బెడ్ రూంకి వెళ్ళింది.నాకు అది అలవాటే అన్నట్లుగా తన వెనకే వెళ్ళి “పాపం..ఈ తలకెన్నో పనులు, ఎన్నో ఆలోచనలు కదా మరి నొప్పిరాకుండా ఉంటుందా చెప్పు”అని తన తలకి బామ్ ని రాస్తుంటే,నా చేతిని పట్టుకుని అయ్యో ఏంటిది ? ఏం చేస్తున్నారు? అని లేచి నా చేతిని పట్టుకుని కూర్చుంది. "ప్రేమ..నా ప్రేమని ఇస్తున్నాను” నేను చెప్పాను. “తన కళ్ళ నుండి జారిన నీళ్ళు..ఆ కళ్ళు తుడుస్తున్ననా మునివేళ్ళు పరస్పరం ఐ లవ్ యు చెప్పుకున్నాయి”.అంతే, మా ప్రేమ ప్రయాణం మొదలయింది ఏడేళ్ళ తరువాత కొత్తగా.. "ప్రేమంటే ఒకరికి గాయమయితే నొప్పిఇంకొకరికి కలగటం కాదు ఒకరికి గాయమయితే ఇంకొకరు మెడిసిన్ అవ్వటం అని తెలియటానికి ఏడేళ్ళు పట్టింది". తరువాత రోజు ఉదయించిన కొత్త ఉదయంలో ఇద్దరం గుడికి బయలుదేరాం..దారిలో ఒక ప్రేమ జంట కార్ ని ఆపి లిఫ్ట్ ని అడిగారు..ప్రేమికులు మారారు..ప్రేమ అదే.. ప్రేమికులు పుడుతుంటారు..చస్తుంటారు.. కాని ప్రేమ కొత్తగా పుట్టదు..ఎందుకంటే ప్రేమకు చావు లేదు .. ప్రేమ ఒక అద్భుతం .. లేకపోతే 22 సంవత్సరాలు ఒకటే కట్టడాన్నికట్టించటానికి షాజహాన్ కి ఎంత పిచ్చి.. సారి సారి ఎంత ప్రేమ కావాలి..! మీకో సీక్రెట్ చెప్పనా ఇపుడు మా బెడ్ రూమ్ లో సింగిల్ కాట్..అది కూడా ఒకటే..ష్..ఎవ్వరికి చెప్పకండే.. !
No comments:
Post a Comment