లాహిరి లాహిరి లాహిరిలో... - అచ్చంగా తెలుగు
లాహిరి లాహిరి లాహిరిలో...
-     పరవస్తు నాగసాయి సూరి ( చాణక్య )
( డిసెంబర్ 29న పింగళి వారి జయంతి )

తెలుగు సినీ చరిత్రలో మైలురాయిగా... నభూతో నభవిష్యత్ అన్న వాక్యానికి నిదర్శనంగా నిలిచిన చిత్రరాజం... మాయాబజార్. శ్రీకృష్ణుడిగా తెలుగు వారి గుండెల్లో కొలువు దీరిన ఎన్టీఆర్ ఈ సినిమాలో కృష్ణుడిగా నటించారు. ఆయన ఎప్పుడూ కృష్ణుడిగా కనిపించినా ఈ సినిమా ఆహార్యాన్నే కొనసాగించారు. ఆలాగే మాయబజార్ కథకి కీలకమైన వ్యక్తి శ్రీకృష్ణుడు, ఆయన మాయావిశేషంవల్లనే కథ అంతా నడుస్తుంది. ఈ చిత్రానికి మాటలు రాసిన పింగళి వారే పాటల్నీ అందించారు. ఎవరూ పుట్టించపోతే మాటలు ఎలా పుడతాయని ఘటోత్కచుని చేత పలికించిన ఆయన... ప్రేమ లాహిరిలో జగమంతా ఊగుతోంది, తూగుతోంది అంటూ.... సుభద్రార్జునులతో పలికించారు. తెలుగు సినిమా ఘనతకు మాయాబజార్ మచ్చుతునక అయితే.. ఇందులో లాహిరి లాహిరి లాహిరిలో అనే పాట మెచ్చుతునక. పింగళి వారు దీన్నో సినిమా పాటలాగా మాత్రమే రాయలేదు. శాస్త్రాలను, శాస్త్రీయతను గుదిగూర్చి...  ఒక్కో పదాన్ని చక్కగా పొదిగి ఓ అద్భుతాన్ని ఆవిష్కరించారు. పైకి వింటుంటే ఓ అర్థము... లోపల మరో అర్థంతో చక్కని నగిషి చెక్కారు.   ప్రేమంటే సంతోషం... ప్రేమంటే దుఃఖం... ప్రేమంటే ఆనందం... ప్రేమంటే విచారం... ప్రేమంటే ఇవ్వడం... ప్రేమంటే తీసుకోవడం... ప్రేమంటే అమృతం... ప్రేమంటే విషం.... ఇలా ఎందరో సినీ కవులు ప్రేమకు ఎన్నో అర్ధాలు చెప్పారు. చెబుతూనే ఉన్నారు. ఇప్పటి ఈ అర్థాలన్నీ చెప్పకముందే... అప్పుడెప్పుడో... 1957లోనే ప్రేమంటే మత్తు... ప్రేమంటే మాయ అని చెప్పేశారు పింగళినాగేంద్రరావు . ప్రేమ లాహిరిలో జగమంతా ఊగుతోంది... తూగుతోంది అంటూనే... ఇదంతా చల్లని దేవుని అల్లరే కదా అంటూ సమాధానం, ముగింపు సైతం ఇచ్చేశారు. మరో ఆసక్తికర అంశం ఏమిటంటే... ముందు సుభద్రార్జును పాట పాడడం, వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసి బలరాముడు సతీసమేతంగా రావడం... అంతలో శ్రీకృష్ణుడు, రుక్మిణి సమేతంగా అక్కడకు చేరి పాట పాడడం, వాళ్ళు వెళ్ళాక మళ్ళీ బలరాముడు సతీసమేతంగా పాడుకోవడం ఇదంతా పింగళి వారి సృష్టే. ఇక పాట సాహిత్యం విషయానికొస్తే....  
లాహిరి లాహిరి లాహిరిలో.. ఓహో జగమే ఊగెనుగా... ఊగెనుగా తూగెనుగా..
తారా చంద్రుల విలాసములతో... విరిసే వెన్నెల పరవడిలో.. ఉరవడిలో.. తారా చంద్రుల విలాసములతో ... విరిసే వెన్నెల పరవడిలో.. పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్ల వాయువుల లాలనలో..
అలల ఊపులో తియ్యని తలపులు... చెలరేగే ఈ కలకలలో.. మిలమిలలో.. అలల ఊపులో తియ్యని తలపులు... చెలరేగే ఈ కలకలలో.. మైమరపించే ప్రేమ నౌకలో.. హాయిగా చేసే విహరణలో..
రసమయ జగమును రాసక్రీడకు... ఉసిగొలిపే ఈ మధురిమలో.. మధురిమలో.. రసమయ జగమును రాసక్రీడకు... ఉసిగొలిపే ఈ మధురిమలో.. ఎల్లరి మనములు ఝల్లన జేసే చల్లని దేవుని అల్లరిలో...
చిత్రం : మాయాబజార్
సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు
సంగీతం : సాలూరి రాజేశ్వరరావు
ధ్వనిముద్రణ : ఘంటసాల గానం : ఘంటసాల, లత
  బహుశా ఈ పాట తెలియని తెలుగువారు ఉండరేమో. ఎప్పుడో పాత పాట అయినా... అన్నితరాలనూ అలరిస్తోందంటే అది పింగళివారి పదాల మాయే అని చెప్పుకోవాలి. లాహిరి అంటే మాయ, మత్తు అనే అర్థాలు ఉన్నాయి. ఆ అర్థం తెలియకపోయినా... లాహిరి అనేది ప్రేమకు పర్యాయపదమైంది. ఈ పేరుతో సినిమా కూడా వచ్చింది. ఈ పదంతో మరికొందరు సినీ రచయితలు పాటలు కూడా రాశారు. నిజానికి మాయాబజార్ కంటే ముందు వచ్చిన దేవదాసు సినిమాలో కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ పాటలో.... లాయిరి నండిసంద్రములోన లంగరుతో పని లేదోయ్ అంటూ.... ప్రతికూల అర్థంలో ఈ పదాన్ని వాడారు. లాహిరికి వికృతి లాయిరి అవుతుంది. మళ్ళీ వెంటనే పింగళి వారు దీన్ని ఓ సానుకూల పదంగా మార్చేయడం, ఈ పదం అంతకు ముందే వాడారన్న విషయాన్ని మరచిపోయాలా చేయడం విశేషమే మరి. లాహిరిలో జగమంతా ఊగడం, తూగడం ఆరోజుల్లో కొత్తగా, మత్తుగా వినిపించాయి అందరికీ. వింతగానూ కనిపించాయి. ఇదేంటి అన్నవారూ, బావుంది అన్నవారూ, అద్భుతం అన్నవారూ, అబ్బే అన్నవారూ... ఇలా అందరూ ఉన్నారు. అందులో ఇక్కడ ఒక్క లాహిరి వాడారా... మూడు లాహిరులు వాడారు. ఒక లాహిరి జగం ఊగింది, రెండో లాహిరిలో తూగింది, మూడో లాహిరిలో పాట మొత్తం ముందుకు సాగింది. అలా మూడు లాహిరులు వాడి ప్రేక్షకులందర్నీ మత్తులో ఊగించి, తూగించారు పింగళివారు.   తారా చంద్రుల విలాసములతో వెన్నెల విరుస్తోందట. ఇక్కడ విలాసం అనే పదానికి రెండు అర్థాలు కనిపిస్తాయి. ఒకటి చిరునామ, రెండోది శృంగార క్రీడ. ఆకాశంలో తళుకుమనే తారలు, మధ్యలో చంద్రుడి వల్ల వెన్నెల కాస్తోంది అనేది ఒక అర్థమైతే, తారాచంద్రుల రాస క్రీడల మధ్య వెన్నెల విరిసింది అనే మరో చమత్కారమైన అర్థాన్ని కూడా కవిగారు చొప్పించారు. రెండింటి అర్థం ఒకటే, ఒకటి శాస్త్రీయ అర్థమైతే, మరొకటి పురాణ అంతరార్థం. ఆ వెన్నెల కూడా ఎలా విస్తోందట పరవడిలో అంటూ అబ్బాయి అంటే కాదు ఉరవడిలో అని అమ్మాయి అంటోంది. పరవడి అంటే గంతులు వేయడం. పరవళ్ళు తొక్కిన నది ప్రవాహం వెన్నెల గంతులు వేస్తోంది అని ఆయన అంటుంటే... కాదు కాదు అతి వేగంగా వెన్నెల వస్తోంది అని శశిరేఖ అంటోంది. ఈ మాటల్లో పింగళి వారికి ఉన్న శాస్త్ర పరిజ్ఞానం అర్థమౌతుంది. ( కామశాస్త్రం ప్రకారం శృంగారం విషయంలో అబ్బాయి చిలిపిగా ఉంటే, అమ్మాయి వేగంగా ఉంటుంది. అంటే పురుషుడు పరవళ్ళు తొక్కుతాడు, స్త్రీ విజృంభిస్తుంది. అదే ఈ పదాల్లోని అసలు అర్థం పరవడి, ఉరవడి అనే రెండు మాటల అర్థాన్ని పింగళి వారు ఎంత గాఢంగా వాడారో లోతుగా చూసిన వారికే అర్థమౌతుంది. అందుకే పాటను కూడా లాహిరి అంటూ మొదలు పెట్టారు. ఆ మత్తులో ఇది ఎవరికీ అర్థం కాదనుకోండి అది వేరే విషయం. )   మరి వెన్నెల పరవళ్ళు తొక్కుతూ వేగంగా కదలి వస్తోంది. మరి అంత మాత్రానికి మత్తు వచ్చేసి ఊగి, తూగుతారా అంటే... పూల వలపుతో ఘుమఘుమలాడుతున్న పిల్ల వాయువుల లాలనలో అంటూ అసలు విషయాన్ని చెప్పారు. ఇక్కడ వలపు అంటే సైతం రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి వాసన అయితే, రెండోది కోరిక. పూల నుంచి వస్తున్న చక్కని పరిమళం తనలో కలిసి ఈ గాలులు ఊరట కలిగిస్తున్నాయి అందుకే ఈ ఊగడం, తూడగం అనేది ఒక అర్థమైతే... పూల కోరిక అంటే స్వపరాగ సంపర్గంలో గాలి పాత్ర కీలకమైంది. ఆ పూల కోరిక కలిసిన గాలి వీస్తుండడం వల్ల మనలో కూడా మత్తు ఆవరిస్తోంది అని మరో అర్థం. చూడండి పింగళి వారి మెలికెలు ఏ స్థాయిలో ఉన్నాయో. పూలగాలులు అయిపోయాయి. మళ్ళీ మరో కారణాన్ని పింగళి వారు వెదుకుతున్నారు. వీళ్ళిద్దరు పడవలో విహారం చేస్తున్నారు. చక్కగా నీటి అలలు పడవను ఊగిస్తున్నాయి. అలలతో పాటే పడవ, పడవతో పాటు వీళ్ళిద్దరు ఊగుతున్నారు. దాని వల్ల తియ్యని తలపుల ( కోర్కెల ) కలకల చెలరేగుతోందని అబ్బాయి అంటుంటే... కాదు కాదు మిలమిల అని అమ్మాయి అంటోంది. కలకల అంటే బాధ అనే అర్థం ఉంది. అంటే ఆ పడవ ఊగిసలాటలో ఓ తియ్యని బాధ మొదలౌతోంది అని ఆయన అంటూ ఉన్నాడు. మిలమిల అంటే అధిక కాంతి అనే అర్థము ఉంది. అంటే వెన్నెల్లో ఉన్నాము ఈ కాంతిలో కాస్త మిమ్మల్ని మీర కట్టేసుకోండి. ఇంకాస్తం సమయం ఉదంటూ అతగాణ్ని వారిస్తోంది ఆమె. సినిమాలో పాటలో జరుగుతున్న సన్నివేశంలోనూ దీనికి ఓ అర్థం ఉంది. సన్నివేశాన్ని కల్పించింది పింగళి వారే గనుక, సమయానుకూలంగా పదాలు వాడారు. ఈ అమ్మాయి మిలమిల అంటుండగానే ఓ భటుడు వీళ్ళిద్దరినీ చూసి.... బలరాముడికి చెప్పడానికి పోతాడు. అంతలో పడవలో వారు మారిపోతారు. ( ఇక్కడ కూడా కామశాస్త్రంలోని ఓ విశేషం కనపడుతుంది. శృంగారం విషయంలో అబ్బాయి అమ్మాయినే తప్ప పరిసరాలను అసలు గమనించడు. కానీ స్త్రీ విషయంలో మాత్రం ఒకే సారి పరిసరాలను, పురుషుణ్ని గమనించడం జరుగుతుంది. ఇందులో ఆ విషయాన్ని పింగళి వారు జొప్పించారు. )ఇంతలో బలరాముడు సతీసమేతంగా అక్కడకు రావడం, అంతలో రుక్మిణి, కృష్ణులు పాటపాడుతూ విహరించడం కనిపిస్తుంది. ఇప్పటి దాకా పెళ్లి కాని జంట పాట పాడుకున్నారు. ఇప్పుడు పెళ్ళైన జంట అందునా... జగన్నాటక సూత్ర ధారి అయిన కృష్ణుడు పాడుతున్నాడు. మరి అప్పుడు పాట ఎలా ఉండారో పింగళి వారికి బాగా తెలుసు. అందుకే రసమయమైన ఈ జగాన్ని రాసక్రీడకు ఉసిగొలిపేలా ఈ వాతావరం ఎంతో మాధుర్యంగా ఉందని అంటున్నాడు. అంతలో ఆమె కూడా కృష్ణుడన్న మధురిమ అనే అంటుంది. ఇప్పటి వరకూ అతడు ఒకటి చెబితే ఆమె మరొకటి చెప్పింది. కానీ మూడో చరణంలో మాత్రం ఇద్దరూ ఒకటే చెప్పారు. జగన్నాటక సూత్రధారి సహధర్మ చారిణి ఆమె, అంతా కృష్ణుడి మాయే అని ఆమెకు తెలుసు. ఆయన మాటలో తప్పొప్పులు చెప్పడానికి ఏముంటుంది. ఆయన మధురిమ అంటే మధురమే, కాదంటే కాదు. అంతే కదా. అందుకే ఆమె కూడా మధురిమలో అంటూ... చివరగా అందరి మనసులు ఇలా రాసక్రీడకు ఉసిగొలిపేలా ఝల్లన చేసేది ఆ చల్లని దేవుడే కదా. ఇది ఆయన అల్లరే కదా అంటూ ముగించారు. నిజమే కదా... ఇదంతా ఆ దేవదేవుని మాయానాటకమే కదా. ఇక్కడ ఓ అన్నమయ్య కీర్తనలోని విశేషం కూడా కనిపిస్తుంది. నారాయణ నీనామమెగతి యిక కోరికలు నాకు కొనసాగుటకు పైపై ముందట భవజలధి దాపు వెనక చింతాజలధి చాపలము నడుమ సంసారజలధి తేపయేది యిది తెగనీదుటకు ఈ పాటలో చివరి వాక్యానికి ఈ అన్నమయ్య కీర్తనకు దగ్గరి పోలికలు కనిపిస్తాయి. అందరి మనసులు ఏ కోరికల వెంట పరిగెత్తినా, ఏ మాయలో మునిగి పోయినా అదంతా విష్ణుమాయే. ఆ విష్ణుడు అవతారమైన కృష్ణుడి మాయే అన్నది ఇక్కడి మాటల్లోని అంతరార్థం. సినిమా మొత్తం కూడా కృష్ణుడి మాయావిలాసంగానే నడుస్తుంది. ఆ ప్రకారం చూసినా... మాయాబజార్ కథ మొత్తం ఈ ఒక్క పాటలోనే ఆవిష్కరించారు పింగళి వారు. వెన్నెల వరవడి, పూలవలపు, అలల ఊపు, పిల్ల వాయువుల లాలన లాంటి అచ్చతెలుగు పదాల్ని తనలో దాచుకున్న ఈ గీతం... ఎప్పటికీ ప్రేక్షకుల్ని లాహిరో ఊగించి, తూగిస్తూనే ఉంటుంది.   మాయాబజార్ లో ఉన్న పాటలు అన్నీ అద్భుతమైన బాణీలే. అందులో లాహిరి లాహిరి లాహిరితో కలిపి నాలుగు పాటలకు సాలూరి రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. మిగిలిన పాటలకు స్వరాలతో పాటు ధ్వనిముద్రణ ఘంటసాల చేశారు. అంటే ఈ పాటకు స్వరరచన సాలూరిది అయితే ధ్వనిముద్రణ ఘంటసాలది. శుద్ధ మోహన రాగంలో స్వరాలు తప్ప మరే స్వరాలు ఉపయోగించకుండా... సంగీతం సమకూరిస్తే, అదే విధంగా ధ్వని ముద్రణ ఇంకా అద్భుతంగా కుదిరింది. ఇద్దరి ప్రతిభ వల్ల పాట అద్భుతంగా వచ్చింది. ఇక ఘంటసాల, లత గాత్రంలో తడిసిన ఈ గీతం విన్న ప్రేక్షకుల్ని నిజంగా మత్తులో ముంచెత్తింది. మాయాబజార్ విడుదలైంది మొదలు ఇప్పటి వరకూ శ్రోతల్ని రసమయ జగత్తులో రస విహారం చేయిస్తూనే ఉంది.   ఇక ఈ పాటను తెరకెక్కించడం ఉన్న మరో విశేషాన్ని చెప్పకపోతే... సంపూర్ణం కాదేమో. ఈ సినిమాకు రచయిత అయిన పింగళి వారు ఈ పాట సందర్భాన్ని రాసి, దర్శకుడు కె.వి.రెడ్డికి చెప్పారు. తన మనసులో సన్నివేశాన్ని ఊహించి.... వీళ్ళిద్దరూ ఎవరికీ తెలియకుండా రావడం.... పండు వెన్నెల్లో పాడుకోవడం.... ఈ విషయం బలరామ దంపతులకు తెలియడం.... వాళ్ళు వచ్చి చూస్తే, శ్రీకృష్ణుడి రుక్మిణితో కలిసి పాడుతుండడం... ఆ తర్వాత బలరామ దంపతులు కూడా అలానే విహరించడం... ఇలా సన్నివేశం మొత్తాన్ని చెప్పగానే కె.వి.రెడ్డికి బాగా నచ్చేసింది. అలానే చేద్దాం అనేశారు కూడా. అయితే రచయిత ఊహను తెరమీద చూపించాలంటే... సినిమాటోగ్రాఫర్ కు కత్తిమీద సామే. ఈ పాట ఆయన చెప్పినట్టు వెన్నెల్లో తీయాలంటే కొద్ది రోజులు ఆగాలి. అప్పటికీ కావలసినంత వెన్నెల ఉంటుందో లేదో తెలియదు. ఆ పరిస్థితుల్లో మాయాబజార్ సినిమాటోగ్రాఫర్ మార్కస్ బార్ ట్లే... చక్కని ఆలోచన చేశారు. షూటింగ్ వాయిదా పడకుండా, నటీనటుల డేట్స్ కి సమస్య రాకుండా, సినిమా ఖర్చు పెరగకుండా, ఎంతో కష్టపడి కాదు కాదు... ఇష్టపడి ఈ చిత్రీకరణను చేశారు. అవసరం, ఆవిష్కరణకు తల్లి లాంటిది అన్నట్టు... తీవ్రంగా ఆలోచించగా ఆయనకో అద్భుతమైన ఆలోచన తట్టింది. వెంటనే మిట్ట మధ్యాహ్నం షూటింగ్ మొదలు పెట్టారు. కె.వి.రెడ్డి గారికి ఆశ్చర్యం, పింగళి వారికి అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. మిగిలిన యూనిట్ మాత్రం మధ్యాహ్నపు పడవషీకారేమో అనుకున్నారు. మార్కస్ బార్ ట్లే తన సహాయకులను అప్రమత్తం చేశారు. సన్నివేశం కనిపించే ప్రదేశమంతా గుడ్డలు కట్టి, అవన్నీ నెమ్మదిగా కదిలేలా... కనిపించకుండా రెండో వైపున ఫ్యాన్లు పెట్టారు. అలా చిత్రీకరణ ముగించారు. ల్యాబ్ లో రష్ చూసిన దర్శకుడు, రచయిత ముక్కు మీద వేలేసుకున్నారు. పండువెన్నెల్లో హాయిగా పాడుకుంటున్న సన్నివేశం వచ్చింది. మిట్టమధ్యాహ్నం ఆ సన్నివేశం తెరకెక్కించింది తామే అన్న విషయాన్ని నమ్మలేకపోయారు. అలా మిట్టమధ్యాహ్నం పండువెన్నెల కురింపించి... ఈ పాటను చిత్రీకరించారు. ఈ ఆలోచన కూడా పింగళి వారిదే గనకు... ఈ పాటకు సంబంధించినంత వరకూ పూర్తి ఘనత ఆయనకే చెందుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ( తెలుగు వెలుగు మాస పత్రిక కోసం రచయిత రాసిన వ్యాసం)  

No comments:

Post a Comment

Pages