నాకు ఇష్టమైన సినిమా – మాయాబజార్ - అచ్చంగా తెలుగు

నాకు ఇష్టమైన సినిమా – మాయాబజార్

Share This
నాకు ఇష్టమైన సినిమా – మాయాబజార్
(వ్యాసానికి బొమ్మ :పోడూరి శ్రీనివాసరావు )
-పోడూరి శ్రీనివాసరావు
  

 వందేళ్ళ సినిమా చరిత్రలో, సుమారు ఎనభై సంవత్సరాలు పైబడిన తెలుగు చలన చిత్ర చరిత్రలో - అన్నింటికన్నా మొదటిగా నిలబడే మహత్తర చిత్ర రాజం - మాయాబజార్.   నాకనే కాదు, తెలుగు వాడెవడైనప్పటికీ "మాయాబజార్" సినిమా ను కనీసం ఒక్కసారైనా చూడనివాడు గాని, చూసి హర్షించనివాడు గాని ఉండబోడంటే అతిశయోక్తి కాదు.   ఈ కళాఖండం విడుదలయి ఇప్పటికి 57 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ ఈ సినిమా ప్రదర్శించిన ప్రతీసారీ చూసే అభిమానులు కోకొల్లలు. ఎన్నితరాలు మారినా, చిన్నవయసు బాలలనుంచి, వృధ్ధులవరకూ, ఏ వయసు వాళ్ళైనా ఈ సినిమాను పదే పదే చూస్తూనే ఉంటారు. చూసి ఆనందిస్తూనే ఉంటారు.   అంతమంది హృదయాలను చూరగొన్న ఆ సినిమా కథ, మహాభారతం ఆధారంగా అల్లబడిన "శశిరేఖా పరిణయం" అనే అంశానికి సంబంధించిందైనప్పటికీ, ఈ కథ మూల కథలో లేదంటే అశ్చర్యకరమైన విషయమే కదా!   మూలకథైన "మహాభారతం" ప్రకారం అభిమన్యుని భార్య "ఉత్తర" కానీ, ఎక్కడా శశిరేఖ ప్రస్తావనన్నదే లేదు. అటువంటిది, ఒక పుక్కిటి పురాణం వంటి అంశం తీసుకుని, ఇంత రసవత్తరంగా కథను మలిచారంటే ఆ గొప్పతనమంతా రచయిత శ్రీ పింగళి నాగేంద్ర రావు గారిది.   మాయాబజార్ సినిమాకు రచన, సంభాషణల రచన, పాటర రచన - అన్నీ శ్రీ పింగళి నాగేంద్రరావు గారే!   మాయాబజార్ సినిమా విజయా వారి బ్యానర్ పై శ్రీయుతులు బొమ్మారెడ్డి నాగిరెడ్డి (బి. నాగిరెడ్డి) - ఆలూరి చక్రపాణి (చక్రపాణి) ద్వయం, శ్రీ కదిరి వేంకటరెడ్డి (కె.వి. రెడ్డి) గారి దర్శకత్వంలో నిర్మించారు.   ఈ సినిమా తొలుత 27 మార్చి 1957 వ తేదినాడు తెలుగు నాట విడుదలయింది. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి నిర్మించారు. మార్చ్ 27వ తేది తెలుగు లో విడుదల కాగా తమిళంలో 12 ఏప్రిల్ 1957 న ద్రవిడ దేశంలో విడుదలయింది. శ్రీయుతులు నందమూరి తారకరామారావు, సావిత్రి, యస్వీ రంగారావు, ఋష్యేంద్రమణి మొదలగు తారలు మాత్రం రెండు భాషలలోను నటించారు. అభిమన్యునిగా తెలుగులో శ్రీ అక్కినేని నాగేస్వరరావు నటించగా, తమిళంలో ఆ పాత్రను శ్రీ జెమినీ గణేశన్ నటించారు.   తరువాత తెలుగు వెర్షన్‌ను డబ్బింగ్ చేసి కన్నడ దేశంలో విడుదల చేశారు. ఏ భాషలో తీసినా, తెలుగైనా, తమిళమైనా, కన్నడమైనా - విడుదలైన ప్రతీ చోటా విజయదుంధుభి మ్రోగించింది.   ఇక తెలుగులో తారాగణం విషయానికొస్తే...  
  • భగవాన్ శ్రీకృష్ణుడిగా - నందమూరి తారకరామారావు
  • అభిమన్యుడిగా - అక్కినేని నాగేశ్వరరావు
  • ఘటోత్కచుడిగా - యస్వీ రంగారావు
  • శశిరేఖగా - సావిత్రి
  • బలరాముడిగా - గుమ్మడి వేంకటేశ్వరరావు
  • లక్ష్మణ కుమారుడిగా - రేలంగి వేంకట్రామయ్య
  • రేవతిగా - చాయాదేవి
  • రుక్మిణిగా - సంధ్య
  • సుభద్రగా - ఋష్యేంద్రమణి
  • హిడింబిగా - సూర్యాకాంతం
  • దుర్యోధనునిగా - ముక్కామల కృష్ణమూర్తి
  • దుశ్శాసునిగా - ఆర్ నాగేశ్వరరావు
  • కర్ణునిగా - మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి
  • శకునిగా - సి.ఎస్.ఆర్ ఆంజనేయులు
  • చిన్నమయ్యగా - రమణారెడ్డి
  • లంబు, జంబులుగా - చదలవాడ కుటుంబరావు మరియు నల్ల రామ్మూర్తి
  • సాత్యకిగా - నాగభూషణం
  • శర్మగా - అల్లు రామలింగయ్య
  • శాస్త్రిగా - వంగర వేంకట సుబ్బయ్య
  • చారుకునిగా - ప్రముఖ నేపధ్య గాయకుడు మాధవపెద్ది సత్యం
  • లక్ష్మణకుమారుని స్నేహితుడు విదూషకుడుగా - బాలకృష్ణ
  • చిన్నారి శశిరేఖగా - తమిళనటి సచ్చు మొదలైనవారు తమ తమ పాత్రలను - "నభూతో న భవిష్యతి" అన్నట్లు పోషించారు.
  ఈ సినిమా విడుదలయ్యాక శ్రీకృష్ణ పాత్రధారి ఎన్ టీ రామారావు వాల్ పోస్టర్లను తరువాత విడుదల చేసిన కేలండర్లను తమ తమ పూజా మందిరంలో పెట్టుకుని, రామారావు చిత్రపటాలకు పూజలు చేసినవాళ్ళూ ఎన్నోవేలమంది - లక్షలమంది అంటే అతిశయోక్తి కాదు. ఆతని ఆహార్యం ఆ పాత్రకు అంతగా అమరింది మరి! ఇక అభిమన్యుడు - శశిరేఖ పాత్రల్లో అక్కినేని నాగేశ్వరరావు - సావిత్రి ఎంతలా ఒదిగిపోయారంటే, వారు ఆ వేషాల కోసమే పుట్టారనిపించింది. ముఖ్యంగా వారి అభినయం  - వర్ణనాతీతం.   అన్నింటినీ మించినది, యస్వీ రంగారావు విశ్వరూపం. ఘటోత్కచుడిగా యస్వీ నటన "న భూతో న భవిష్యతి" ఆ మహానుభావుడి ఆహార్యం, పదోచ్ఛారణ, డైలాగ్ డెలివరీ అనితర సాధ్యం.   అదేవిధంగా, మాయా శశిరేఖ వేషంలో సావిత్రి అభినయం. ఒకప్రక్క శశిరేఖగా ప్రవర్తిస్తూనే సహజ సిధ్ధమైన అలవాటు, ఘటోత్కచుని అలవాట్లు, చేతులు మగరాయుడిలా ఉంచుకోవటమన్నది, నడకలో మార్పులు, అన్నీ ప్రశంసించతగినవే! ముఖ్యంగా సావిత్రి అభినయం మాయ శశిరేఖగా అద్భుతం. అదే విధంగా అంతలోనే లాలిత్యం, సిగ్గు, అభినయించటం మరొకరు చేయలేరు, ఆ నటన.   కథ, కథనం, పాటలు - శ్రీ పింగళి నాగేంద్రరావు జోడు గుఱ్ఱాల స్వారీలో నడిపిస్తూనే నల్లేరుపై బండి నడకలా పండిత పామర జనుల హృదయాలను దోచుకునేలా అద్భుత రూపకల్పన చేశారు.   పాటల విషయానికొస్తే, అన్నీ పాటలు ఆణిముత్యాలే! పాటల జాబితా ఈ విధంగా ఉంది.   1-నీవేనా నను తలచినది, నీవేనా నను పిలిచినది 2-లాహిరి లాహిరి లాహిర్లో, ఓహో జగమే ఊగెనుగా 3-అల్లిబిల్లి అమ్మాయికి చకచక్కని జోస్యం చెబుతాము 4-శ్రీకరులు జయకరులు శుభమస్తు అనగా చిన్నారి శశిరేఖ వర్ధిల్లవమ్మా! 5-సుందరి, ఓహో సుందరి 6-నీకోసమే నే జీవించునది 7-చూపులు కలసిన శుభవేళ, ఎందుకు నీకీ కలవరము 8-అహ నా పెళ్ళి అంట 9-వివాహ భోజనంబు వింతైన వంటకంబు 10-విన్నావ యశోదమ్మా! నీ చిన్ని కృష్ణుడు చేసినట్టి అల్లరి చిల్లర పనులు 11-దయచేయండి, దయచేయండి, తమంతవారిక లేరండీ 12-భళి భళీ భళి భళి దేవా, బాగున్నదయా నీ మాయ 13-మోహినీ భస్మాసుర నాట్య రూపకం - ఇంకా ఘటోత్కచుని నోటివెంట శకుని నోటివెంట, ఇతర పాత్రధారుల నోటివెంట వెలువడ్డ కొన్ని పద్య రత్నాలు.   ప్రతీ పాటా అజరామరమే! ఆ సాహిత్యం దానికి కూర్చిన బాణీ, సమకూర్చిన సంగీతం - ఒక దానికొకటి తీసిపోని రీతిలో ఉన్నాయి. అంతటి చక్కటి సంగీతాన్నందించిన శ్రీ ఘంటసాల-శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారలు నిజంగా ధన్యులు. ఈ నాటికి కూడా ఆ పాటల మాధుర్యం, లాలిత్యం, పదాల కూర్పు వర్ణించ వీలుకానివి.   మరో విచిత్రమైన విషయమేమిటంటే పైన ఉదహరించిన 13 పాటలలో నాలుగు పల్లవుల పేర్లతో తరువాత సినిమాలు విడుదలయ్యాయి. అవేమిటంటే:   1- లాహిరి లాహిరి లాహిరిలో; 2- చూపులు కలసిన శుభవేళ; 3- అహ, నా పెళ్ళంట; 4-వివాహ భోజనంబు.   అంతేకాదు, పై నాలుగు సినిమాలు కూడా మంచి విజయాల్ని మూటగట్టుకున్నాయి.   ఇవన్ని చెప్పి, ఛాయాగ్రహణం గురించి మౌనం వహించానంటే ఎంతో అన్యాయం చేసినవాడనౌతాను. ఈ మహత్తర చిత్రానికి ఛాయాగ్రాహకుడు శ్రీ మార్కస్ బార్‌ట్లే. చాలా గొప్ప కెమేరామాన్.   ఆయన గొప్పతనమంతా, లాహిరి లాహిరి లాహిరిలో పాట చిత్రీకరణలోనే కనిపిస్తుంది.  పండువెన్నెలలో..పుర్ణమి చంద్రుని కిరణాలు నావపై..నీటిపై ప్రసరించడం.. తోటలో అభిమన్యుడు, శశిరేఖ పొదల మధ్య దాక్కున్నప్పుడు.. ఆ పొదలపై ప్రసరించిన ఆ వెలుగు..నీటిపై ప్రకాశాలు.. ఎంత గొప్పగా.. తన కెమేరాలో చిత్రీకరించాడో..ఆ మహానుభావుడు. అతనేం టెక్నిక్ వినియోగించాడో, అంతగా సాంకేతిక పరిజ్ఞాం అభివృధ్ధి చెందని ఆ రోజుల్లో.. ఈ చిత్రీకరణ ఎలా జరిపాడో, నిజంగా ఆ రోజుల్లో ఎవరికీ కొరుకుడు పడని విషయం.   1957 వ సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా ఆ రోజుల్లోనే, విజయవాడ దుర్గా కళామందిర్‌లో విజయవంతంగా 175 రోజులు ప్రదర్శింపబడటమే కాకుండా 15 సెంటర్లలో వంద రోజులకు పైగా ప్రదర్శింపబడింది.   చిత్రం విడుదలై యాభై సంవత్సరాలు పూర్తయిన సంధర్భంగా "స్వర్ణోత్సవ వేడుకల"లో భాగంగా 7 ఏప్రిల్ 2007 వ తేదినాడు హైదరాబాదులోని లలితా కళాతోరణంలో ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేశారు.   * ఈ చిత్రం పొందిన పురస్కారలెన్నెన్నో..1957 వ సంవత్సరంలో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా లోనూ; * ఇండోనేషియా ఫిల్మ్ ఫెస్టివల్‌లోనూ ప్రదర్శింపబడింది. * సి ఎన్ ఎన్- ఐ బి ఎన్ వారు జరిపిన సర్వేలో ఈ చిత్రం ఇప్పటివరకు విడుదలైన, ప్రదర్శింపబడిన చిత్రాల్లోకెల్లా "అతి గొప్ప చిత్రం" గా ఎంపికయింది. * 1957 లో విడుదలైన "బెస్ట్ తెలుగు సినిమా" గా ఫిలంఫేర్ అవార్డ్‌ను కైవసం చేసుకుంది.   ఇంత గొప్ప కళాఖండం, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో గొప్ప ప్రాభవం చూపించినది, రంగుల్లో అయితే మరెంత బాగుంటుందో అని కొందరు ఔత్సాహికులు ఈ చిత్రానికి రంగులద్దారు.   డిజితల్ విధానంలో రంగులద్దటమే కాకుండా, స్కోప్ సినిమా గా దీన్ని రూపొందించి, ఫుల్‌స్కోప్ మూవీగా విడుదల చేశారు. 30-01-2010వ తేదిన.   కానీ, ఫిల్మ్ నెగిటివె, వీరనుకున్న ప్రమాణాలకు చేరువ కాకపోవడంతో, చిత్రంలో రంగీకరణ సమయంలో కొంత భాగం, కొన్ని పాటలు కత్తిరింపులకు నోచుకున్నాయి. దాంతో సినిమా నిడివి కూడా తగ్గింది.   బాల్యంలోని అభిమన్యుని విలువిద్యా పారంగత్వం, భళి భళి భళి దేవా అన్న పాట, విన్నావా యశోదమ్మా అన్న పాట, మరి కొన్ని భాగాలు కత్తిరింపబడ్డాయి.   ఈ రంగుల మాయాబాజారు హైదరాబాదులో ప్రసాద్ మల్టీప్లెక్స్ థియేటర్‌లో విడుదలయి శతదినోత్సవం జరుపుకుంది.   ఇటువంటి మహత్తర చిత్ర రాజం, కళాఖండం, మన తెలుగులో తీసినందుకు నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులే కాక ఆ చిత్రం చూడాటానికి అవకాశం కల్గిన మనందరమూ కూడా ఎంతో ధన్యులం. ఎంత సాంకేతికత వృధ్ధి చెందినా కూడా, ఇలాంటి సినిమా మరలా తీయలేరు. నటించటానికి, అటువంటి పాత్రధారులూ లేరన్నది ఘంటాపథంగా చెప్పవచ్చు.    

No comments:

Post a Comment

Pages