నెమలికి నేర్పిన నడకలవి... - అచ్చంగా తెలుగు

నెమలికి నేర్పిన నడకలవి...

Share This
నెమలికి నేర్పిన నడకలవి...
-         కరణం కళ్యాణ్ కృష్ణకుమార్

భరతముని యొక్క నాట్యశాస్త్రము ప్రకారం గల భారతీయ నాట్య రీతులు మరియు భారతదేశానికి చెందిన సంగీత నాటక అకాడమీ చే గుర్తింపబడిన భారతీయ శాస్త్రీయ నాట్యరీతులు మొత్తం కలిపి ఎనిమిది రీతులు ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా భారతీయ నృత్యాలుగా పేరుగాంచాయి. అవి

భరతనాట్యం - తమిళ
ఒడిస్సీ - ఒరిస్సా
కూచిపూడి నాట్యం - తెలుగు
మణిపురి - మణిపూర్
మోహినీ అట్టం - మలయాళం
సత్త్రియ నృత్యం - అస్సామీ
కథాకళి - మలయాళం
కథక్ - ఉత్తర భారత్

తెలుగు నృత్యం కూచిపూడి - పుట్టు పూర్వోత్తరాలు : 


     ప్రసిద్ధి గాంచిన భరత నృత్యానికి ఏ మాత్రం తీసిపోని ప్రక్రియ కూచిపూడి అచ్చంగా తెలుగు నాట్య ప్రక్రియ. ఆంధ్రప్రదేశ్ , కృష్ణా జిల్లా లో మొవ్వ తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినదిక్రీ పూ 2వ శతాబ్దం లో ఆంధ్ర చారిత్రాత్మక నగరమైన శ్రీకాకుళం కు సుమారు 14 కిలోమీటరుల దూరంలో తీరప్రాతం  లోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించటంతో దక్షిణ భారతదేశం అంతటా పేరుగాంచినది.   భరతనాట్యం..కూచిపూడి నాట్యాలలో తేడా కేవలం అభినయం లోనే.   సొగసైన, లాస్యానికి ప్రాముఖ్యత అధికంగా గల కూచిపూడి లో వాక్యార్థ అభినయం ఉండగా, ప్రతి పదం ముద్ర ద్వారానే అభినయంచటానికి అధిక ప్రాముఖ్యత గల భరత నాట్యంలో పదార్థ అభినయం ఉంటుంది. కొన్ని కదలికలే కాక వాచిక అభినయ (పదాలు/సంభాషణలు) కూడా కూచిపూడికే ప్రత్యేకం.

భాగవత మేళ నాటకం  : 
          పురాతన నృత్యరీతి కూచిపూడి గా ఈ నాట్యం గురించి చెప్పవచ్చు.   3000 ఏళ్ళ క్రితం భరత ముని  నాట్యానికి సంబంధించిన వివిధ అంశాలని వివరించాడు. . వీటిలో దక్షిణ భారతానికి చెందిన దక్షిణ్త్య కూచిపూడికి  పూర్వ విధానమని తెలుస్తున్నది. క్రీ.పూ. 2 వ శతాబ్దంలో శాతవాహనులు ఈ కళను ఆరాధించడించటం తో ముందుతరాలైన మనం దర్శించుకోగలిగే భాగ్యం కలిగిందనటంలో సందేహం ఇంచుకైనా లేదు.     ఈ నాట్య ప్రదర్శనలు వైష్ణవారాధనకే  అంకితమవడంతో రూపాన్ని 'భాగవత మేళ నాటకం' అని కూడా అంటారు.

తొలిగా మగవారే...! 


      కృష్ణాజిల్లా ఘంటశాల  తాలూకా లోని శ్రీకాకుళం లో గల అత్యంత పురాతన దేవాలయమైన ఆంధ్ర విష్ణు దేవాలయం ఆవరణలో లభ్యమైన శాసనాల ప్రకారం దాదాపుగా మూడు వందల మంది దేవదాసీ లు రాచమర్యాదలందుకునే వారంటే   కళలకు శ్రీకాకుళం కాణాచి అని ఇట్టే అర్ధమౌతుందిఆ రోజుల్లో కేవలం కొద్ది దేవాలయాలలో మాత్రమే ప్రదర్శించే ఈ కూచిపూడి  తరువాత ప్రపంచ ప్రసిద్ధి గాంచింది. సంప్రదాయం ప్రకారం, పూర్వం బ్రాహ్మణ కులానికి చెందిన మగవారే కూచిపూడి నృత్యాన్ని చేసేవారు. అందుకే వీరిని కూచిపూడి భాగవతులు అంటారుఇది భరతుని 'నాట్య శాస్త్రాన్ని' అనుసరిస్తుంది. అనాది కాలం నుండి కూచిపూడి నృత్య శైలి ప్రామాణిక గ్రంథాలైన అభినయ దర్పణ మరియు నందికేశ్వర భరతర్ణవ ల పై ఆధారితం.

    స్త్రీకి అవకాశం కోసం సిద్దేంద్రయోగి కృషి .. 
      
పురుషులకే అవకాశంగా భావిస్తూ వసున్న కూచిపూడి నృత్యంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు సిద్దేంద్రయోగి.  15 వ శతాబ్దంలో సిద్ధేంద్ర యోగి, కూచిపూడి నాట్యంలో ఆడవారు నాట్యం చేయడానికి అనుగుణంగా, కొన్ని మార్పులు చేసి కూచిపూడికి కొత్త కళ సంతరింపజేసి స్త్రీలలకు కూచిపూడి నేర్పడంలో సఫలీకృతులైయ్యారు. అతని అనుచరులైన బ్రాహ్మణులు కూచిపూడి లో స్థిరపడి ఈ నాట్యాన్ని అభ్యసించటం తో ఆ ఊరి పేరే ఈ నాట్యానికి సిద్ధించినది. వేదాంతం లక్ష్మీనారాయణ శాస్త్రి, చింతా కృష్ణమూర్తి, తాడేపల్లి పేరయ్య వంటి కూచిపూడి నృత్య కళాకారులు దీనిని విస్తరించి, సంస్కరించారు.

నృత్యంతోనే తొలిపలుకు... 
         కూచిపూడి నృత్యప్రదర్శన గణేశ స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీస్తుతి, పరాశక్తి స్తోత్రాలతో మొదలవుతుంది. ఆ పై ఒక్కొక్క పాత్ర వేదిక పై అడుగిడి  ఒక చిన్న సంగీత మరియు నాట్య రూపం తో స్వీయపరిచయం చేసుకొంటారు. దీనినే ' ధారువు ' అంటారు. అనంతరం అసలు  కథ మొదలౌతుంది. ప్రక్కన ఒక గాయకుడు, కర్ణాటక సంగీతశైలి లో కీర్తనలను పాడతాడు. దీనినే 'నట్టువాంగం' అంటారు. ఇందులో మృదంగం, వయొలిన్, వేణువు మరియు తంబూరా వంటి వాద్యపరికరాలను ఉపయోగిస్తారు. 
       చకచక చురుగ్గా లయబద్ధంగా కదిలే పాదాలు, శిల్పసదృశమైన దేహభంగిమలు, హస్తాలు, కళ్ళతో చేసే కదలికలు, ముఖంలో చూపించే భావాలు, ముఖాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడంలో ఉద్దండులు. నృత్యకారులు ధరించే ఆభరణాలు తేలికగా ఉండే 'బూరుగు' అనబడు చెక్కతో చేస్తారు. 


          కూచిపూడి భరత నాట్యానికి దగ్గరగా ఉంటుంది. ఒకే పాత్ర గల నృత్యాల గాత్రాలలో 'జాతిస్వరం' మరియు 'తిల్లానా' లు ఉంటాయి.

కూచిపూడి రీతుల్లో ప్రఖ్యాతి : 
కృష్ణుని భార్య, సత్యభామ ను అనుకరిస్తూ చేసే నాట్యం, 'భామాకలాపం' .
ఒక ఇత్తడి పళ్ళెంపై పాదాల నుంచి, రెండు చేతుల్లోనూ వెలిగించిన దీపాలని ఉంచి, శిరసు పై నీరు నింపిన ఒక పాత్రనుంచి నాట్యం చేసే 'తరంగం'
తరంగానికి చేసే గాత్రాన్ని కృష్ణ భగవానుని జీవిత ఘట్టాలని క్రోడీకరించే ' కృష్ణ లీలా తరంగిణి' వంటీ ఎన్నో నృత్య రూపాలు రూపుదిద్దుకున్నాయి.
           కూచిపూడి కి పునాది అయిన నాట్య మాల పురుష సమూహం చేసే నృత్య రూపకం. ఇందులో స్త్రీ పాత్రలు కూడా పురుషులే అభినయిస్తారు. ఇది మూడు రకాలుగా చెబుతారు.
సాంప్రదాయిక నృత్యం: దేవతలకై ఉద్దేశింపబడ్డది
కాళికా నృత్యం: మేధావులకై ఉద్దేశింపబడ్డది
సాధారణ నృత్యంభాగవతం

ప్రపంచానికి పరిచయం చేసిన వెంపటి : 
 సిద్దేంద్రయోగి తదనంతరం అనేకమంది ఈ నాట్యాన్ని అభ్యసించి ముందుతరాలకందించారు. పురాతన కాలం అనంతరం వర్తమాన శతాబ్దంలో ఈ కళకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన వారిలో ప్రముఖులు వెంపటి చిన సత్యం.. కూచిపూడి గురించి తెలుసుకోవాలనుకునే వారు ఆకాలంలో సిద్దేంద్రయోగిని, ఆధునిక కాలంలో వెంపటిని తెలుకోవాల్సిందే..! అంతటి కృషి చేశారు వెంపటి చినసత్యం..

  వెంపటి వారి గురించి .. 


       వెంపటి చిన సత్యం ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ది చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు. ఈయన కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కూచిపూడి అగ్రహారంలో 1929 అక్టోబరు 25న వరలక్ష్మమ్మ, చలమయ్య దంపతులకు జన్మించారు. కూచిపూడి నాట్యాన్ని దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, వెంపటి పెదసత్యంల వద్ద అభ్యసించారు. సినీ నృత్య దర్శకులైన అన్న పెదసత్యం వద్ద 15 ఏళ్లపాటు నాట్యంలో మెలవకులు నేర్చుకున్నారు. చెన్నై లో భరతనాట్యమే విరాజిల్లుతున్న తరుణంలో కూచిపూడి నృత్య సంప్రదాయాన్ని చెన్నై కళాభిమానులకు పరిచయం చేసి, భరతనాట్యం చెంతన కూచిపూడికి దీటైన స్థానాన్ని సంపాదించి పెట్టడంలో వెంపటి చిన సత్యం కృషి అభినందించదగ్గది.

వెంపటి కాలం లో పూర్వ వైభవం:      


     వెంపటి చిన సత్యం కాలం కూచిపూడికి పూర్వ వైభవం సిద్దించిందనే చెప్పవచ్చుఆయన తన దగ్గర నృత్యం అభ్యసించే శిష్యుల వద్ద రుసుము సైతం వసూలు చేయకుండా నర్తనశాలను నిర్వహించారు. కూచిపూడి నాట్యంలో నృత్యనాటికలను ఎన్నిటినో రూపొందించి దేశ విదేశాలలో ప్రదర్శించి వాటికి విశేష పేరు ప్రఖ్యాతులు వచ్చేలా చేసాడు.
       1963లో చెన్నైలో కూచిపూడి ఆర్ట్ అకాడమిని స్థాఫించారు. ప్రముఖ నటీమణులు.. నర్తకీమణులైన  వైజయంతిమాల, హెమమాలిని, మంజుభార్గవి, రాజసులోచన, ప్రభ, చంద్రకళ, రత్నపాప, పద్మామీనన్, వాణిశ్రీ, ఎన్టీఆర్కుమార్తెలు పురంధేశ్వరి, భువనేశ్వరి వారి శిష్యులే. 1947లో మద్రాసుకు చేరుకున్న చినసత్యం తన సోదరుడు వెంపటి పెదసత్యం వద్ద సినిమాలో నృత్య నిర్దేశకత్వంలో సహాయకుడిగా పనిచేశారు. అనంతరం సొంతంగా అనేక తెలుగు చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. నర్తనశాల, దానవీరశూర కర్ణ, 'రోజులు మారాయి', 'దేవదాసు', 'అమెరికా అమ్మాయి', 'శ్రీకృష్ణవిజయం', 'సంపూర్ణ రామాయణం', 'లవకుశ' తదితర ఎన్నో చిత్రాలకు నృత్య దర్శకత్వం వహించారు. చినసత్యం వేదాంతం రాఘవయ్య, వెంపటి పెదసత్యంల పర్యవేక్షణలో చలన చిత్రాల్లో కూడా నటించారు.

ప్రపంచ రికార్డు :   
       1976లో తితిదే ఆస్థాన నాట్యాచార్యునిగా నియమితులయ్యారు. 1984లో అమెరికా పిట్స్బర్గ్లోని వేంకటేశ్వరస్వామి దేవస్థానం ఆస్థాన నాట్యాచార్యునిగా పనిచేశారు. 2011లో హైదరాబాదులో 2,800 మంది కళాకారులతో ఏకకాలంలో నిర్వహించిన అంతర్జాతీయ కూచిపూడి నృత్య కార్యక్రమానికి గిన్నిస్రికార్డు వచ్చింది.  29.7.2012 న ఆయన చెన్నై లోని నృత్య క్షేత్రం 'కూచిపూడి ఆర్ట్అకాడమీ'లో  దివంగతులైయ్యారు.
  
అవార్డులు- రివార్డులు : 
1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేటు, కళాప్రపూర్ణ, నాట్యకళాసాగర్
1967లో సంగీత నాటక అకాడమీచే ఫెలోషిప్
1982లో భరత కళాప్రపూర్ణ
1992లో కాళిదాసు సమ్మాన్‌, సర్సింగర్అవార్డు, సప్తగిరి సంగీత విద్యాన్మణి, నాట్య కళాతపస్వి, నాట్య కళాభూషణ, కళైమామణి
1998లో పద్మభూషణ్పురస్కారం
2011, 12లో జీవన సాఫల్య పురస్కారం 

ఎందరో కళాకారుల సేవనొందిన కూచిపూడి 


 ఇప్పుడు వేలమంది  మంది కళాకారులు కూచిపూడి నాట్యాన్ని అభ్యసించి, అభినయించి జగద్విదితం చేస్తూ మారుమూల పల్లెలో ఉద్భవించిన ఈ కళకు కీర్తి తెచ్చిపెడుతున్నారు. వెంపటి చినసత్యం కి ముందుతరం   దివంగత నాట్యాచార్యులైన వేదాంతం లక్ష్మీనారాయణశాస్త్రి, తాడేపల్లి పేరయ్యశాస్త్రి, వెంపటి పెదసత్యంలను ఈ సంధర్భంలో గుర్తుచేసుకుని తీరాల్సిందే.! ఎందరో మహాను భావులు కూచిపూడికళను దశదిశలా వ్యాపీంపజేసి తెలుగు కీర్తి పతాకను ఎగురవేసిన.. ఎగుర వేస్తున్న  అందరికీ కళాభివందనం. 

( ఉపకరించిన విషయ ప్రభోధాలుకూచిపూడి.కామ్  చంద్రకాంత.కామ్


వెంకట శివరావు, దిగవల్లి (1944). లలితా సింధూరి, మరియు వికీపీడియా  వారికి కృతజ్ఞతలతో....)

No comments:

Post a Comment

Pages